13, ఆగస్టు 2023, ఆదివారం

బసవ పురాణం- 3 వ భాగము

 బసవ పురాణం- 3 వ భాగము


🕉🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️


‘‘నాయనా! నందికేశా! నీకు నాతత్వాన్ని గూర్చి లోగడ ప్రబోధించాను. పార్వతీదేవికన్నా ప్రమథగణం కన్నా కూడా నా గూర్చి నీకే ఎక్కువ తెలుసు. అందుకే నీకు సర్వజ్ఞుడనే పేరు.

‘ఈ తత్వం వేదస్మృతులకు మూలము. ఇదే ధర్మశీలము. ఇదే విమలాచారము. తత్వసారము. సుమహాతత్వము. దీనివల్లనే కృతార్థత్వం పొందవచ్చును. ఇదే ఆదిపథము అని నా భక్తి తత్వం నీవల్లనే భూలోకంలో ప్రచారం చెందవలసి వుంది. అందువల్ల నీవు మానవలోకానికి వెళ్లు. అక్కడ ద్వితీయ శంభుడనే పేర నీవు ప్రసిద్ధి చెందు. లోక శ్రేయస్సు కొరకు, భక్త శ్రేయస్సు కొరకు, మా కోరిక నెరవేరునట్టు నీవు మానవ రూపంలో పుడమిని పావనం చేయడానికై ‘బసవడు’ అను పేర వెళ్లు’’

నందికేశుడు ఈ మాటలు విని ఇలా అన్నాడు. ‘‘స్వామీ! మీ ఆజ్ఞ ఎట్టిదైనా శిరసావహించి నేను చేస్తాను. దానికింత దూరం చెప్పలా? భూలోకానికి మాత్రం మీరే కర్త గదా! అలాంటప్పుడు కైలాసమయితేనేమి? భూలోకమయితేనేమి? ఇందున్నా అందున్నా ఎందున్నా మీ యందే నేనున్నట్టు!’’

నందికేశుని ఈ వినయ వాక్యాలు విని ప్రభువు ఇలా అన్నాడు.

‘‘నాయనా! నందికేశా! నేను మాత్రం నీకు దూరంగా ఉంటానా? గురులింగ రూపంలో వచ్చి పరమతత్వార్థాలన్నీ బోధిస్తాను. ప్రాణలింగ రూపంలో నీ శరీరాన్ని ప్రాణాన్ని వదలకుండా వుంటాను. జంగమ రూపం దాల్చి వేడుకతో నీతోబాటు కలిసి వుంటాను. నీ తనువు మనమూ ధనమూ వ్యర్థం కాకుండా నాకే చెందునట్లు చేసుకుంటాను. నాకు ప్రమథులు ప్రాణ సమానులు. ఆ సమస్త ప్రమథ గణానికీ నీవు ప్రాణానివి. అటువంటి నీకూ నాకూ దూరం ఒక్క క్షణంకూడా ఎన్నడూ ఎక్కడా ఉండదు’’.

అని ఈ విధంగా పలికిన పరమేశ్వరుని మాటలు విని నందీశ్వరుడు తనువెల్ల చేతులైనట్లుగా ఆ ప్రభువుకు నమస్కరించి భూలోకానికి ప్రయాణం కట్టాడు.

సరిగ్గా అదే కాలంలో ఇక్కడ భూమి మీద శ్రీశైలానికి పశ్చిమ దిక్కున కర్ణాట దేశంలో హింగుళేశ్వర భాగవాటి అనే అగ్రహారం ఉండేది. అందులో మండెగ మాదిరాజు అనే ఆయన వుండేవాడు. అతని భార్య మాదాంబ. మహాసాధ్వి! నిరంతరం శివాచారంలోనే జీవితాన్ని గడిపే ధన్య! ధర్మం రూపు చెందినట్లు కనపడే ఉత్తమురాలామె. అయితే సమస్త ఐశ్వర్యాలూ ఉన్నా కొడుకులు లేకపోవడంతో ఆమె విచారగ్రస్తురాలయి వుండేది. ఎన్నో నోములు నోచి నోచి విసిగిపోయింది. చివరకు శైవోత్తములు ‘‘కామ్యార్థసిద్ధికి నందికేశ్వర వ్రతం సర్వోత్తమమైనది’’ అని చెప్పడంతో ఆమె గుడికిపోయి అక్కడ నందీశ్వరునికి సాష్టాంగ ప్రణామం చేసి ‘‘సర్వజ్ఞా! దయాంబోధీ! నందీశ్వరా!’’ అని స్వామిని పొగిడి నందీశ్వరుని వ్రతాన్ని ప్రారంభించింది.

సోమవారంతో ప్రారంభించి వరుసగా తొమ్మిది దినాలు వ్రతం సాగించింది. ఆ తర్వాత నందికి మజ్జనం చేయించి గంధ పుష్పాలతో పూజ చేసి వస్త్రాలు కప్పి, గజ్జెలు, అందెలు, గంటలు మొదలైన ఆభరణాలతో అలంకరించి ముఖాన పట్టమూ, బంగారు కొమ్ములు పెట్టి ధూప దీపాదులతో అర్చించి పంభక్ష్యాలు పెట్టింది. తర్వాత పులగం నందికి ఆరగింపజేసి కలకండ నెయ్యి కలిపి స్వామికి తినబెట్టింది. ఇలా నందికి అర్చన చేసి, పరమ మహేశ్వరులకు సపర్యలు చేసింది. ‘‘నందీశ్వరా! నవనందినాథా! ఇందుకళాధరుని వాహనానివి నీవు! నీ వంటి సద్భక్తుడు నీ దయతో నాకు కొడుకుగా పుడితే నీ పేరు పెట్టి పిలుచుకొంటాను’’ అని నందికి మనవి చేసింది. అప్పుడు సమస్త జనులు చూస్తుండగా నంది మాదాంబకు ప్రసాదాన్ని అందించింది. మాదాంబ ఆశ్చర్యమూ ఆనందము పొంది ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికిపోయింది.

మాదాంబకు నందీశ్వరానుగ్రహంవల్ల పూర్వముకన్నా ఎక్కువ శుభాలు కలిగాయి. శుభశకునాలు కనపడ్డాయి. ఈలోగా నందీశ్వరుడు భూలోకానికి వచ్చాడు. వచ్చి మాదాంబ వ్రత విధానం గమనించాడు. ‘నేను వస్తున్న పనికి అనుగుణంగానే మాదాంబ నన్ను కొడుకు కావాలని కోరుకున్నది. ఏమి చిత్రమిది? తలచిన పనికి తగిన అవకాశం లభించింది’ అనుకొని నందికేశుడు మాదాంబ గర్భంలో ప్రవేశించాడు.

తక్షణమే మాదాంబకు గర్భ చిహ్నాలు కనబడ్డాయి. అమృతాంశుడగు పుత్రుడు మాదాంబ గర్భంలో ఉన్న కారణంవల్లనా అన్నట్లు ఆమెకు ఆకలి మందగించింది. సద్భక్తి రుచిలోపల ఉన్నందుకా అన్నట్లు రుచులు ఆమెకు అరుచులు ఐనాయి. పాండురంగనిమూర్తి పడతి గర్భంలో ఉన్నందువల్లనా అన్నట్లు ఆమె శరీరం పాలిపోయింది.

మాదాంబ సదాచారం భవి వంచనలకు లొంగదు అనడానికి చిహ్నమా అన్నట్లు ఆమెకు వేవిళ్ళు ప్రారంభమైనాయి. కొడుకు రాకతో నోరు తెరుచుకొని చూస్తున్నదా అన్నట్లు ఆవలింతలు పుట్టాయి. శివమూర్తి తనలో వుండినందువల్ల శివయోగనిద్ర వచ్చిందా అన్నట్లు ఆమెకు నిద్ర ఎక్కువైంది. నీలకంఠుడు ఆమె గర్భంలో ఉన్నందువల్లనా అన్నట్లు ఆమె చనుమొనలు నలుపెక్కాయి. పరమేశ్వరుడు గర్భంలో ఉన్నందువల్లనా అన్నట్లు ఆమె నడుము విశాలమైనది. యోగీంద్ర హంసుడు గర్భస్థుడు కావడంవల్లనేమో ఆమెకు హంసనడక అలవడి వేగం తగ్గింది.


🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

కామెంట్‌లు లేవు: