13, ఆగస్టు 2023, ఆదివారం

చామకూర సంభాషణా చాతుర్యం !

 శుభోదయం🙏


చామకూర  సంభాషణా  చాతుర్యం !

------------------------------------------------------- 

         

   ఉ: "  కన్నియఁగాని  వేరొకతెఁ గాను , మనోహర రూప!   నీకు నే


                     జన్నియ  పట్టియుంటి  నెల జవ్వన  మంతయు  నేఁటిదాఁక,  నా


                    కన్నులయాన ,  నా వలపు  కస్తురి  నామముతోడు;   నమ్ము ;  కా


                     దన్నను  నీదుమోవి   మధురామృత  మానిట  బాసఁజేసెజన్!  


                       విజయవిలాసము- ప్రథమాశ్వాసం- 179 పద్యం;;  చామకూర వేంకట కవి;


                                     అర్జునిని  మొదటి మజిలీ  గంగాతీరం.  అక్కడ  అతని  సౌందర్యం చూచి  మోహించింది  నాగ కన్య  ఉలూచి. మాయచేసి నాగలోకానికి  తీసికెళ్ళింది. మోజుపడిన యతనిని  అనేక విధములైన  మాటలతో  తన వలపు నంగీకరించేలా

                              ప్రయత్నించింది.

    ఇక్కడ చామకూర తన సంభాషణా చాతుర్యాన్ని ప్రదర్శించినాడు.


                      ఉలూచిని  జూచి  క్రీడి  కూడా  మోజుపడినాడు. కానీ వ్రత భంగ శంక కొంత పీడించినది.దానితరువాత  ఈమె  యన్య

యేమో  నను శంక గలిగినది. అన్య  ఇతరుల భార్య. పరస్త్రీ సంగమము   మహాదోషము. దానిని తొలగించుటకై ఉలూచి యిట్లు పలుకు చున్నది.


                        అర్జునా!  నేను  కన్యనే!   అన్యను గాను.  అన్నది. ఋజువులు కావలెనుగదా! ఆఋజువులను  జూపుచున్నది.


          "ఓమనోహరాకారా! నేను కన్యనే  యన్యను గాను. నేఁటివరకు  నాలేత  వయస్సంతా   నీకొఱకే  ముడుపుకట్టి  యుంచాను.

నాకన్నులపైయాన, నా వలపులీను( సువాసనలువీచు) బొట్టుపై నొట్టు. నమ్ము.ము. అదీ  కాదన్నావా? ఇక ఉన్నదొక్కటేదారి. అదిప్రమాణము. నీమధురమైన  అధరామృత పానము చేసి  నేకన్యనే యని ప్రమాణింతును  అపుడు నమ్మకుండుటకు నీకు వేరు దారిలేదనుచున్నది'"


                      లోకంలో  మన మెరిగినదే

దోషారోపణనెదురుకొనేవారే  ప్రమాణాలు చేస్తూఉంటారు." నేను తప్పుచేసినట్లయితే ,

నాకళ్ళేపోతాయి. నాబొట్టే చెదరిపోతుంది. వీటికీ ఒప్పకపోతే  విషంతాగుతా  అప్పుడైనా  ఒప్పుకుంటారా  నాదోషంలేదనీ"- అంటూ ప్రమాణాలు చెయ్యటం  మనకు వినిపిస్తూ ఉంటుంది) కవి  ఆవ్యవహారాన్ని  యిక్కడ వాడుకొన్నాడు.


                        వలపు కస్తురి నామము-- కస్తురి బొట్టు నల్లగా ఉంటుంది. పెళ్ళికాని పిల్లలకు అదోగుర్తు . కన్య  యనటానికి. ఉలూచి కస్తురితో  తిలక ధారణచేసింది.  మాచిన్నట  పెళ్శికాని  ఆడపిల్లలకు  చాదు  అని   నల్లని బొట్టును వాడేవారు.యిప్పుడు

దాన్ని పాటించేవారు తక్కువయ్యారు కాబట్టి యెవరెవరో  తెలియకుండా పోతోంది. పాములు విషయుక్తములే  కాబట్టివిషంకాక,అమృతపానంతో ప్రమాణంచేస్తానని  నాయికచే  చెప్పించాడు.


                  ఈవిధంగా  లౌకిక ప్రమాణాచారాలను  కావ్యంలో  నిపుణంగా చొప్పించి  ఉలూచిచే  చెప్పించి,అతనిని మెప్పించియతనివలపును పంచుకొన్న నాయికగా కవి  ఉలూచిని తీర్చి దిద్దినాడు. 


                                                    స్వస్తి!

కామెంట్‌లు లేవు: