🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *28వ అధ్యాయం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*పురాణ పఠనం ప్రారంభం*
*కుజగ్రహ జననం - 1*
నిశ్శబ్దం తాండవిస్తున్న కైలాసం నారదుడికి ఆశ్చర్యం కలిగించింది. సతి యోగాగ్నిలో దగ్ధమైనప్పటికీ , ఇతర కైలాసవాసులు ఉండాలి కదా ! కైలాస ప్రాంతంలో సంచరిస్తున్న నారదుడికి ఒక ఏకాంత ప్రదేశంలో తపోదీక్షలో ఉన్న పరమశివుడు కనిపించాడు. తామర పువ్వులాగా ఎర్రబారిన శివుడి శరీరం ఆయన తపస్సు తీక్షణతను కళ్ళకు కట్టుతోంది.
మహోగ్ర తపోనిష్ఠలో ఉన్న రుద్రదేవుణ్ణి పలకరించే సాహసం చేయలేకపోయిన నారదుడు ఆయన ఉగ్రసౌందర్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ , తనను తాను మరిచిపోయాడు. అలా నిలుచుండి పోయాడు.
లేత తామర పువ్వు రంగులో ప్రకాశిస్తున్న శరీరం. ధ్యాన ముద్రలో కూర్చోవడం వల్ల ఇనుమడిస్తున్న సౌందర్యం. శరీరం కాంతితో కలిసి , కలవకుండా చూపుల్ని లాగుతున్న రాగిరంగు జటాజూటం. ఓహ్ ! పరమశివుడి 'నిష్టా సౌందర్యం' అమోఘం ! నారదుడు అప్రయత్నంగా తనలో అనుకున్నాడు.
పరమేశ్వరుడి ముఖ సౌందర్యాన్ని తదేకంగా చూడసాగిన నారదుడి కళ్ళు ఆశ్చర్యంతో మరింత విచ్చుకున్నాయి. ఎందుకో... అగ్ని నేత్రం నెలకొన్న శివుడి ఫాలభాగం మెల్లగా ముదురు ఎరుపు రంగుకు మారుతోంది. క్షణంలో మందార పుష్ప వర్ణాన్ని సంతరించుకున్న పరమశివుడి నెన్నుదురు ఇంకా ఎర్రబారి కణకణ మండే అగ్ని వర్ణాన్ని అంది పుచ్చుకుంది.
ఆయన ఉగ్ర తపస్సులోని తీక్షణత కారణంగా , అందమైన 'అగ్ని ఫలకం'లా ఉన్న నుదురు మీద స్వేద బిందువు ఉబికింది. నిప్పు మీద నీటి బిందువు ! ఓహ్ ! నారదుడు అబ్బురపడిపోయి అలాగే చూస్తుండిపోయాడు.
ముక్కంటి మూడవ కంటిమీదుగా , అధోముఖంగా జారుతోంది ఆ పావన స్వేదం.
నుదురు మీద నుంచి నాజుకైన నాసిక మీదుగా జారుతూ , క్షణకాలం ముక్కుకొన మీద
ముత్యంలా ఆగిన శివస్వేదం - ఆయన ముందు నేల మీద పడింది.
స్వేదబిందువును వెంటాడుతూ ఉండిపోయిన నారదుడి చూపులు - అది వాలిన స్థానం మీదే నాటుకు పోయాయి. అతణ్ణి ఆశ్చర్యంలో ముంచేస్తూ - ఆ స్థానంలో ఒక పురుష శిశువు ఆవిర్భవించాడు.
అగ్ని వర్ణంలో , నాలుగు భుజాలతో ఆ శిశువు చూడచక్కగా , చూపరులను , అబ్బుర పరిచేలా ఉన్నాడు. నారదుడి చూపులు శిశువు మీద నుండి శివుడి ముఖం వైపు ఎగబ్రాకుతూ వెళ్లాయి. శివుడు తన ధ్యాన లోకంలో తానున్నాడు !
ఉన్నట్టుండి శిశువు బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. దగ్గరగా వెళ్ళి , ఎత్తుకుని , అక్కున జేర్చుకుని ఓదార్చాలన్న కోరికను బలవంతంగా నిగ్రహించుకుంటూ , చలన రహితంగా నిలుచుండి పోయాడు నారదుడు. శిశువు రోదన సాగుతూనే ఉంది.
నారదుణ్ణి మరోసారి నివ్వెరపాటుకు గురిచేస్తూ ఒక స్త్రీ మూర్తి బాలుడి ముందు ప్రత్యక్షమైంది. ఆమెను నారదుడు క్షణంలో పోల్చుకున్నాడు. భూదేవి !
భూదేవి , రోదిస్తున్న బాలుణ్ణి జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకొని , సున్నితంగా తన వక్షానికి హత్తుకుంది.
భూదేవి లేచి నిల్చుని , ధ్యాన నిష్ఠలో నిమగ్నుడైపోయిన పరమేశ్వరుణ్ణి తదేకంగా చూసింది.
*"పరమేశ్వరా !"* ధైర్యంగా శివుణ్ని పిలిచిందామె.
శివుడి విశాల నేత్రాలను అర్ధనిమీలితాలుగా చేస్తూ , కిందికి వాలి ఉన్న రెప్పలు నెమ్మదిగా పేకిలేచాయి. ఎదురుగా నిలుచున్న భూకాంతనూ , ఆమె చేతుల్లోని శిశువునూ , నిర్వికారంగా చూశాయి , త్రినేత్రుడి రెండు కళ్ళు.
*"పరమేశ్వరా ! ఈ శిశువు మీ పుత్రుడు. మీ పావన స్వేదజలం నా మీద పడి , శిశువుగా మారింది. స్వీకరించండి"* శిశువును ముందుకు చూపుతూ అంది భూదేవి.
శివుడి ముఖం మీద చిరునవ్వు మెల్లగా మెరిసింది. *"దేవీ ! నీ ఒడిలో పడిన ఈ బాలుణ్ణి నీ పుత్రుడిగానే భావించు. నేను సతీరహితుణ్ని కదా ! బాలుని ఆలనాపాలనా చూడడానికి అశక్తుణ్ణి. బాలకుడు నీ పుత్రుడే అని నేను అనుశాసిస్తున్నాను. పుడమితల్లి ఈ పుత్రుడికి తల్లి !"*
*"స్వామీ... !"*
*"ఔను తల్లీ ! నువ్వు అక్కున చేర్చుకోగానే ఏడుపు మాని వేశాడు కదా ! భూపుత్రుడైన కారణాన బాలుడు 'భౌముడు' అనీ , 'కుజుడు' అనీ పిలువబడతాడు. అగ్నివర్ణుడైన కారణంగా 'అంగారకుడు'గా కూడా ప్రసిద్ధుడవుతాడు. ఈ క్షణం నుండి బాలకుడి పోషణ భారం నీదేనమ్మా. మహా బలవర్థకమైన నీ స్తన్యమిచ్చి ప్రయోజకుడ్ని చేయి.”*
*"మహా భాగ్యం !"* అంటూ భూదేవి బాలుణ్ణి తనకు హత్తుకుంది.
*"ఆది శంకరులకు అభివాదాలు !"* అంటూ లక్ష్మీ విష్ణువులూ , సరస్వతీ బ్రహ్మలూ ప్రత్యక్షమయ్యారు.
*"నవగ్రహాలలో తృతీయ గ్రహ దేవతను ఆవిర్భవింపజేసిన మీ దివ్యదృష్టికి అభినందనలు !"* బ్రహ్మ , విష్ణువులు అన్నారు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి