17, సెప్టెంబర్ 2023, ఆదివారం

రామాయణమ్ 327

 రామాయణమ్ 327

...

తన పాదములపై దీనముగా  వ్రాలిన దధిముఖుని చూసి సుగ్రీవుడు ,ఏమి జరిగినది ఎందులకు నాపాదములపై వ్రాలినావు అని అడిగినాడు.

.

అప్పుడు అంగదుడు ,హనుమంతుడు తదితర వానరులొనరించిన మధువన విధ్వంసము గురించి  అడ్డువచ్చిన తమను బెదిరించి తన్నిన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు.

.

అది వినడముతోడనే సుగ్రీవుని ముఖము విచ్చుకొని లక్ష్మణునితో ఓ మహాబాహూ సీతమ్మ జాడతెలిసినది అని అమితానందముగా పలికినాడు ..

.

అవును ఇది సత్యము సీతమ్మ జాడతెలియకున్న వారందరూ అచట చేరి మధుభక్షణము చేయరు .

.

, నీవు శీఘ్రమే వెళ్ళి నా ఆజ్ఞగా చెప్పి వారిని వెంటనే ఇటకు పంపు ,వారు చేసిన వన విధ్వంసమును నేను క్షమించినాను అని దధిముఖునితోసుగ్రీవుడు పలికినాడు.

.

రామ,లక్ష్మణ,సుగ్రీవుల అనుజ్ఞతీసుకొని దధిముఖుడు మధువనమునకు తిరిగి వచ్చెను.

.

సుగ్రీవాజ్ఞను వారికి ఎరిగించగా వానరులందరూ వెంటనే పయనమయ్యి సుగ్రీవుని సమక్షములో నిలిచారు.

.

వారిని చూడగనే వాలము ఎత్తి సంతోషముతో సుగ్రీవుడు నిలుచున్నాడు.

.

అప్పుడు హనుమంతుడు ,

శ్రీరామా! సీతాదేవి కనపడినది ,ఆమె పాతివ్రత్యమును కాపాడుకొనుచూ ఆరోగ్యముగా ఉన్నది అని రామచంద్రునికి విన్నవించెను.

.

ఆ వాక్కులు శ్రీరామహృదయమునకు అమృతపు జల్లువలె చేరెను .

.

అటుపిమ్మట జరిగిన విషయములన్నీ విన్నవించి ,కాకాసురవృత్తాంతము కూడా రామునికి తెలిపి సీతమ్మ ఇచ్చిన చూడామణిని భద్రముగా రామునకు అందించినాడు .

.

ఆమణిని చూడగనే ఆయన హృదయము కరిగి కన్నీరై జలజల ప్రవహించెను.

.

సీతామాత సందేహములు‌తీర్చి ఆమెకు ధైర్యము కలిగించినాను. ఆమె హృదయములో శాంతినిపొందినది  అని హనుమంతుడు సవినయముగా రామునికి తెలియచేసినాడు.

.

(సుందరకాండ సమాప్తము)

.

వూటుకూరు జానకిరామారావు 


.

కామెంట్‌లు లేవు: