17, సెప్టెంబర్ 2023, ఆదివారం

శివమానసపూజ

 శ్రీ శంకరాచార్య విరచిత    

                  శివమానసపూజ      

( రత్నైః కల్పిత మాసనం ... మహాదేవ శంభో ) 


                   


భాసుర రత్న పీఠికయు 

         భవ్య తుషారపు మజ్జనంబుయున్ 

భూషిత దివ్య వస్త్రములు 

        భూరి విభాసిత రత్నభూషలున్ 

వాసిత చందనాగరులు 

        వాసన కస్తురి లేపనంబు సద్

వాసన జాజి బిల్వములు 

       వ్యాపకగంధపుధూప దీపముల్ 

భాసిత శంకరా ! మదిని 

          భక్తి సమర్పణసేతు నిచ్చలున్ 01



కాంచన రత్న పాత్రముల 

            కమ్మని యాజ్యపు పాయసంబులున్ 

పంచవిధంబులైన పలు 

           భక్ష్య పయో దధి యుక్త పాకముల్ 

సంచయపాత్రపూరిత ర

          సన్మయ శర్కర పానకంబులున్        

సంచిత శాకముల్ మధుర 

            సత్ఫల వీడ్య పటీరముల్ , శివా ! 

ఆంచిత భావమందు భవ

            దర్పణ సేతును మానసంబునన్ 02



చక్కని చామరద్వయము 

           ఛత్రము నద్దము తాళ వృంతముల్

మిక్కిలి మేలుగూర్చు పలు 

            మేలగు వీణ మృదంగ వాద్యముల్ 

చక్కని నృత్య రీతులును  

          శ్రావ్యపు గానవిశేషముల్ స్తుతుల్ 

మక్కువతోడ సాంగముగ 

           మానసమందున వందనంబులన్ 

పెక్కగు పూజ లర్పితము 

          ప్రేమగ జేయుచు నుంటి శంకరా !  

దిక్కువు నీవె వేడెదను 

           తీరుగ చేకొను నాదు పూజలన్ . 03



సత్యమ నీవె యాత్మ మతి

          శాంభవి నీ ప్రమథాళి ప్రాణముల్ 

నిత్యముగాని కాయమిది

          నిక్కము గేహము భుక్త భోగమే

నిత్యసుపూజ నిద్దురయె

          నిత్యసమాధి పద ద్వయంబులన్

నిత్యమొనర్చు చాలనము 

          నీకు ప్రదక్షిణ పల్కు వాక్కులే

నిత్యనుతుల్ ప్రభూ ! యనయ

          మెయ్యెవి కర్మము లాచరింతునో ,

నిత్య విభాస ! యో యభవ !

          నిన్నిల గొల్చుటయే సదాశివా ! 04



కరచరణంబులన్ నయన 

           కర్ణ యుగంబుల కర్మ వాక్కులన్ 

నిరతము మానసంబునను 

           నే నొనరించెడి కర్మలందునన్ 

సరియును కానిచర్యలను 

          స్వాంతము నందు క్షమించి స

త్కరుణను జూపి నన్నెపుడు 

          కావుము శంకర ! పార్వతీ పతీ ! 05


ఆంధ్రానుసరణ..

✍️గోపాలుని మధుసూదన రావు శర్మ 🙏

కామెంట్‌లు లేవు: