17, అక్టోబర్ 2023, మంగళవారం

శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 66*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 66*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*భగవంతుడు ఏం చేశాడు!*


భగవంతుని పట్ల ఒక వ్యక్తి సంతరించుకొన్న విశ్వాస ప్రగాఢతా, నిశ్చలతా అగ్నిపరీక్షలు ఎదురైనప్పుడు తేలిపోతుంది. "నేను ఇంతగా దుఃఖిస్తున్నానే, ఈ భగవంతునికి కళ్లు లేవా? అని ప్రశ్నించని సామాన్య వ్యక్తులు ఉండజాలరు. 


"కృష్ణా! నువ్వు దుష్టుడవు. నీ కొకటి చెబుతాను. నువ్వు నన్ను కౌగిలించుకొని నీ పాదపద్మాల మ్రోల శరణు ఒసగినా సరే, లేక నా చూపులకు అందకుండా నిలబడి ఆవేదన కలిగించినా సరే! నువ్వు నన్ను ఏం చేసినా నువ్వే నా సర్వస్వం. నువ్వు తప్ప నా కెవరూ లేరు!" అని చైతన్య మహాప్రభువు చెప్పినట్లు, భగవంతుణ్ణి దూషించినా ఆయననే విశ్వసించి జీవించడం సామాన్యమైన విషయం కాదు. 


నరేంద్రుడు ఏం చేశాడు? ఆయన మాటల్లోనే విందాం:......


"ఇన్ని కష్టాలూ, పరీక్షలు ఎదురైనప్పటికీ నా ఆస్తికత చెక్కుచెదరలేదు. 'భగవంతుడు మంచే చేస్తాడు' అనే భావనలో కించిత్తూ సందేహం జనించలేదు. ఉదయం లేవగానే భగవంతుణ్ణి స్మరించి, ఆయన దివ్యనామాన్ని ఉచ్చరిస్తూనే పడక నుండి లేస్తాను. ఆ తరువాత పరిపూర్ణ విశ్వాసంతో ఉద్యోగాన్వేషణకు బయలుదేరేవాణ్ణి. అలవాటు ప్రకారం ఒక రోజు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ పడక నుండి లేచాను. ప్రక్క గదిలో ఉన్న మా అమ్మ అది విని చిరాగ్గా, 'అది ఆపరా! చిన్నతనం నుండి దేవుడు, దేవుడు అంటూ పల్లవి పాడుతున్నావు. ఆ దేవుడే ఇంత చేశాడు కదా! ఇంకా ఎందుకు పలవరిస్తావు!" అని అంది. 


ఆమె మాటలు నా హృదయంలో గాఢంగా నాటుకుపోయాయి. 'దేవుడనే వ్యక్తి నిజంగా ఉన్నాడా? ఒకవేళ ఉంటే, మనిషి హృదయపూర్వక ప్రార్థనలను చెవొగ్గి వింటాడా? అలా అయితే, ఇంతగా విలపిస్తున్నానే, దానికి ఎలాంటి జవాబూ రాదు ఎందుకు? సౌజన్యం మూర్తీభవించిన భగవంతుని సృష్టిలో ఇంత చెడు ఎక్కణ్ణుండి వచ్చింది? మంగళమయుడైన భగవంతుని పాలనలో ఇంత అమంగళ మెందుకు?' అంటూ దీర్ఘంగా ఆలోచించసాగాను. 


ఇతరుల దుఃఖం చూసి తల్లడిల్లిన విద్యాసాగర్ ఒకసారి, 'భగవంతుడు మంచితనమే మూర్తీభవించిన వాడు, మంగళమయుడైన వాడు అయినప్పుడు లక్షలాది ప్రజలు కరవు కాటకాల భయానక గుప్పిట్లో చిక్కి పిడికెడు అన్నం కోసం అలమటిస్తూ మరణిస్తున్నారెందుకు?' అని అడిగారు కదా, ఆ వాక్కు పరిహసిస్తున్నట్లు నా చెవుల్లో

ప్రతిధ్వనించాయి. ఆ రోజు భగవంతుని పట్ల ఎన్నడూ లేనంత విసుగు నాకు కలిగింది. ఇటువంటి సమయం కోసమే నిరీక్షిస్తున్నట్లుగా, 'నిజంగానే భగవంతుడున్నాడా? అనే సందేహమూ నాలో తలెత్తింది.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: