💐 ఆలోచనాలోచనాలు💐 తెలుగు చాటు పద్య సుమ మాలిక💐 పూర్వ కవుల సమస్యాపూరణములు 💐 సమస్య;---""" నినునిను నిన్నునిన్ను మఱినిన్నును నిన్నును నిన్నునిన్నునున్.""" "" రామాయణార్థముతో పూరణము"" చం. అనిలజ! జాంబవంత ! కమలాప్తతనూభవ! వాయుపుత్ర! యో / పనస! సుషేషణ! నీల ! నల! భానుకులుండగు రాఘవేంద్రుఁడ / ద్దనుజపురంబువేగెలువ దైత్యులఁజంపఁగ వేగరమ్మనెన్ / నినునిను నిన్నునిన్ను మఱినిన్నును నిన్నును నిన్ను నిన్నునున్."" ఇదే సమస్యను "" భారతార్థములో"" పూరించుట---- చం. "" అనఘసురాపగాతనయ! యర్కతనూజ! విచిత్రవీర్యనం/ దన ! గురుపుత్ర! ద్రోణ! కృప ! నాగపురీశ్వర! దుస్ససేన! ర/ మ్మనుమనె రాజసూయము యమాత్మజుఁడిప్పుడు చేయఁబూని తా/ నినునిను నిన్నునిన్ను మఱినిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.""" ఇదే సమస్యను"" భాగవతార్థములో"" పూరణము---- చం.""" అనఘసురేశ! వాయుసఖ! ఆర్యమనందన! రాక్షసేంద్ర! యో/ వననిధినాథ! గంధవహ! వైశ్రవణా! నిటలాక్ష! తాను ర/ మ్మనుమనిచెప్పె మాధవుఁడు మారుని పెండ్లికి మిమ్మునందఱిన్ / నినునిను నిన్నునిన్ను మఱినిన్నును నిన్నును నిన్నునిన్నునున్.""" మరియొక సమస్య ---- "" తోఁచునడంగు వెండియునుదోఁచునడంగు మెరుంగుచాడ్పునన్."" "" రామాయణార్థముతో"" ఉ."" తోఁచకపట్టి తెమ్మనుచుఁ దొయ్యలి వేఁడిన వెంటనంటి చేఁ/ జాచుచు మెల్లమెల్లఁగను జాడల జాడల నాశలాలన్/నాచుకవచ్చు రామరఘునాయకుముందర మాయలేడి తాఁ / దోఁచునడంగు వెండియునుదోఁచునడంగు మెరుంగుచాడ్పునన్."" ఇదే రామాయణార్థముతో "" రామరావణయుద్ధ నేపధ్యం"" లో---- ఉ."" పీఁచమడంచి రాఘవకపిప్రవరాదులు వాల్మగంటి మ/ న్నేఁచగ మిన్నుమన్ను దిశలెచ్చటి వచ్చటఁ గాలఁగారవిన్/ గ్రాచు శరాగ్నికీలల జగంబులు ఘూర్ణిల నింద్రజిత్తు తాఁ / దోఁచునడంగు వెండియునుదోఁచునడంగు మెఱుంగుచాడ్పునన్."" ఇదే సమస్యను """ భాగవతార్థములో"" పూరణము---- పూచినమాటపట్లఁ దలపోయఁగలేక మనోభవుండు ప్రే / రేచ గణాలునాలుఁ దనురెప్పలనార్పక చూడఁగా మనం / బాచగలేనియట్టి త్రిపురారిపురస్థలి శౌరి నారియై / తోఁచునడంగు వెండియునుదోఁచునడంగు మెఱుంగుచాడ్పునన్."" "" ఇఱుకరాదు; కొఱుకరాదు; నఱుకరాదు; పెఱుకరాదు"" ఈ నాలుగు పదాలతో ఒక పద్యం. తే.గీ. "" ఇఱుకరాదుచేత నిసుమంత నిప్పైన / గొఱుకరాదు యినుము కొంచెమైన / నఱుకరాదు నీరు నడిమికి రెండుగాఁ/ బెఱుకరాదు బావి పెల్లగిలగ."" చివరగా ఒక చమత్కార పద్యంతో ముగింపు. "" ఒకేపేరులో మూడేసి పేర్లు ఉండాలన్నది ఇందులోని షరతు."" దశరథాగ్ర సుతుండు, శశియు, పట్టణంబొక పేరులోపల నుండ వలయు. దర్పకాంతకుడు , నేత్రంబును, మాలయు నొక పేరు లోపల నుండవలయు. వేల్పును, త్రోవయు, వెలయు ప్రసూనంబు నొక పేరు లోపల నుండవలయు. కనకంబు, కార్పాస మొనర మహీజంబు నొక పేరు లోపల నుండ వలయు. దీన యర్థంబు తెలియంగ బూనుకొనుచు / మది విచారించి పదునైదుమాసములను / సమ్మతిగ జెప్ప భావజ్ఞ చక్రవర్తి / చెప్పలేకున్న నగుదు నే చిన్నినవ్వు. సమాథానం చెప్పటానికి 15 నెలల గడువున్నా మనం ఇప్పుడే ప్రయత్నిద్దాం. దశరాథాగ్రసుతుడు = రాముడు , శశి = చంద్రుడు, పట్టణం = పురం . ఈ మూడింటిని కలిపితే రామచంద్రాపురం అయ్యింది. ఇక రెండవది. దర్పకాంతకుడు = రుద్రుడు, నేత్రం = కన్ను, మాల = దండ - కాబట్టి రుద్రాక్ష మాల సమాధానం అవుతుంది. వేల్పు = దేవత, త్రోవ = దారి, ప్రసూనం = పుష్పం. వీటన్నింటినీ కలిపితే " దేవదారిపుష్పం" అయ్యింది. చివరగా కనకం = పైడి, కార్పాసం = పత్తి, మహీజం = చెట్టు, ఈ మూడింటిని కలిపితే "" పైడిపత్తిచెట్టు"" అవుతుంది. ఇప్పుడు మనం " భావజ్ఞ చక్రవర్తుల" మే! హాయిగా నవ్వుకొందాం. తేది 17--10--2023, మంగళవారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి