. శ్రీమాత్రేనమః
*శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*
ది:20-10-2023
శా॥
వానల్దండిగ నీరమీయ కొలువై పండ్లుం బ్రసూనమ్ములున్
కానల్ సైతము నేత్రపర్వమవగా క్రాలేటి చంద్రాతప
మ్మేనాటం దరుగంగనట్టి రుచిమద్ధ్రీంకారశబ్దార్భటీ
గానమ్ముల్ వినిపింప పర్వమిలపై కాలూనె సంరంభమై -11
శా॥
వీటం బందిరులల్లి కొందఱు గృహంబే దేవళమ్మై సనన్
వాటమ్ముంగని కొందఱున్ స్థిరత దేవస్థానముం గొందఱున్
పీటల్వెట్టి కఠోరదీక్షల మహాప్రీతిం గలామగ్నులై
సాటింగాంచని బూజలీయ నలరే సర్వార్థదాత్రీ! నతుల్ -12
శా॥
మోహమ్మే భవబంధకారణము సంపూర్ణమ్ముగా బాపుమా!
దేహమ్మే బహుకర్మహేతువు నగున్ దేహమ్ము నీబోకుమా!
దేహింగూర్చి సమగ్రతం దెలిపి సందేహమ్ములం ద్రోలుమా!
మోహమ్మాదిగ శత్రుషట్కమును నిర్మూలించుమా! మాతరో! -13
(పీట=పీఠము; కలా=చిత్కళ)
"కవితాభారతి"
*~శ్రీశర్మద*
8333844664
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి