*ప్ర: కాశీయాత్ర చేసి వస్తే కాలభైరవుని రూపంగా కుక్కకు గారెల దండ వెయ్యాలి. లేకపోతే కాశీయాత్ర ఫలించదని మా పురోహితులు చెప్తున్నారు. కుక్కను ముట్టుకుంటే స్నానం చేసే ఆనవాయితీ ఉన్న కుటుంబం మాది. కానీ ఇలా చేయకపోతే కాశీయాత్రాఫలం దక్కదంటున్నారు. ఏమి చేయాలో తెలియజేయండి.*
జ: మీ కుటుంబపు ఆనవాయితీ మంచిది. అది శాస్త్రబద్ధం. దానిని వదలకండి. కాశీయాత్ర చేసివస్తే కుక్కకు దండ వెయ్యాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాలభైరవునికి శునక వాహనం ఉందన్న మాట శాస్త్ర సమ్మతమే. ఆ శునకం దివ్యమైనది. కానీ కాలభైరవుడు శునకరూపుడు కాదు.
యాజ్ఞవరాహానికి, ఊరపందికి పూర్తిగా తేడా ఉంది. ఊరపందిని వరాహస్వామి అనడం పాపం. అలాగే ఈ పద్దతి కూడానూ. అయితే - శునకాలు బలిభుక్కులు - కాకులవలనే, పూజానంతరం నివేదిత పదార్థాలు కొద్ది భాగం తీసి, వేరే పాత్రలో పెట్టి, ఇంటి బయట వేరే శునకానికి వేస్తారు. ఇది బలినివేదన. బలి సందర్భంలో ఆ ప్రత్యేక దేవతలకిచ్చిన పదార్థాలను శునకానికి మాత్రమే ఇస్తారు. అది ఇంటి బయట - తాకకుండానే, అలాగే ఏవో గారెలు లాంటివి కుక్కకి పెడితే తప్పులేదు. కానీ మాల వేయడం, కుక్కని భైరవుడు అనుకోవడం తగదు.
అలాగని కుక్కని ఈసడించుకోనక్కర్లేదు. వాటిని చూడవలసిన విధంగా చూడాలి. ఇళ్లల్లో, దేవత మందిరాల్లో కుక్కలు తిరిగితే మంచిది కాదు - అంటారు పెద్దలు. ఇది శాస్త్ర ప్రమాణం.
మనం తాకకపోయినా, కాపలాగా ఇంటి బయట ఉంటే తప్పులేదు. దానికి ఆహారం పెట్టినా దోషం కాదు. భూత దయ అవసరమే, కానీ దేని మర్యాద దానిది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి