నన్నెచోడుని చమత్కారము
చ: హరి వికచామలామలాంబుజ సహస్రము పూన్చి ,మృగాంకునందవి
స్ఫురిత మలాసితాబ్జమని , పుచ్చఁగఁ జాచిన చేయిఁజూచి , చం
దురుఁ డట రాహు సావి వెఱదుప్పులఁ దూలఁగ , జారుచున్న న
య్యిరువురఁ జూచి , నవ్వు పరమేశ్వరుఁడీవుత! మాకభీష్టముల్ ;
కుమార సంభవము-- అవతారిక-- 3 పద్యం: నన్నెచోడ మహాకవి !
కఠినపదములకు అర్ధము:- వికచ--వికసించిన; అమల--స్వఛ్ఛమైన ; అంబుజము--కమలము ;సహస్రము--వేయి;
స్ఫురిత--కనిపించుచున్న; మల--మాలిన్యముతోకూడిన; అసితాబ్జము--నల్లనిపద్మము; పుచ్చగ--తొలగింపగ; మృగాంకుడు--చంద్రుడు; రాహు సావి--రాహువని-- వెఱదుప్పులన్-తూలగన్--భయముతో వణకుచుండ ; జారుచున్న-- వెనుకకుజరగుచున్న;
భావము: శ్రీ మహావిష్ణువు పరిశుభ్రమైన తెల్లని వేయి తామరపూలతో శివుని శిరస్సును పూజింపగా , శివజటాజూటముననున్నచంద్రుని, ఏణాంకములో నలనల్లగా కనవచ్చు మచ్చను జూచి, యేమిది! పరిశుభ్రమైన తామఱలను గొనివచ్చితినే, అందీ
పంక కళంకితమైన నల్లని తామఱయెటుల వచ్చినది?. దీనిని తొలగింతునుగాక! యనిభావించి చేయిసాచి యాపద్మము నందుకొనజూచెను. కానీ అదిపద్మము కాదుగదా చంద్రుడాయె. నల్లని పొడవైన యాకారమేదో తనవయిపు వచ్చుటను చంద్రుడుజూచి ఔరా! రాహువు గ్రసించుటకు వచ్చుచున్నాడేమో నని భయపడి వెనుకకు వెనుకకు జరుగు చున్నాడట. వారియిరువుర తగులాటమును గాంచి శివుడు నవ్వుచున్నాడట! అట్టిపరమ శివుడు మాకభీష్టసంపద లొసగుగాక! యని కవిభావన.
వ్యాఖ్య:- నన్నెచోడకవి రాజకవులలో నాద్యుడు. వీరశైవుడు. దేసి కవితాభిమాని. అతడు రచించిన 12 ఆశ్వాసముల
కుమారసంభవ కావ్యము ఆగామి ప్రబంధకవులకు మేల్బంతి. నన్నయకు కొంచెము తరువాతివాడుగా భావింప బడుచున్ననీతడు.ప్రతిభావంతుడైన ప్రౌఢకవి.
ప్రస్తుత పద్య మతని చమత్కార సృజనకు చక్కని నిదర్శనము. విష్ణువు చంద్రునిలోని కళంకమునుగాంచి తానుతెచ్చినపూలలో మలిన మైన పుష్షమేమో ననిభ్రమపడుటయు, దానిని తొలగిం ప చేయిచాప, నల్లని యాహస్తమును గాంచి చంద్రుడు రాహువేమోనని భయమంది వెనుకకు జరగుచుండుటయు. వీరిరువురు భ్రాంతి నొందుటను గమనించి పరమశివుడు నవ్వుటయు.
నిందలి చమత్కార వైభవము! విష్ణువు నీలమేఘశ్యాముడు.నల్లని యతని బాహుదండమునుగాంచి రాహువేమోనని చంద్రుడుభ్రమయుట,చంద్రగతమైనకళంకమునుగాంచి మలినపుష్పమని విష్ణువుభ్రమయుట వలని ది పరస్ఫర భ్రాంతి. కావున
భ్రాంతి మదలంకారము !
స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి