🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 59*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*శ్రీరామకృష్ణుల నుండి పొందిన సందేశం.....*
వైష్ణవ మత సిద్ధాంతాన్ని శ్రీరామకృష్ణులు క్లుప్తంగా ఇలా చెప్పారు: "భగవన్నామ స్మరణ, భూతదయ, ఆరాధన భక్తుల పట్ల మర్యాద అనే మూడింటినీ అనుసరించమని ఈ మతం బోధిస్తోంది. భగవంతుడు, ఆయన దివ్యనామమూ అభిన్నమని గ్రహించి సదా ప్రగాఢ ప్రేమతో భగవన్నామాన్ని ఉచ్చరించాలి; భక్తుడూ భగవంతుడూ ఒక్కరే, కృష్ణుడూ భక్తుడూ ఒక్కరే అన్న విషయం గ్రహించి సాధువులనూ భక్తులనూ స్తుతిస్తూ ప్రణమిల్లాలి. లోకమంతా శ్రీకృష్ణునికి సొంతమనే ప్రగాఢ విశ్వాసంతో భూతదయ....”
'భూతదయ' అని చెబుతూవున్న శ్రీరామకృష్ణుల మాటలు తడబడ్డాయి. అట్లే ఆయన పారవశ్య స్థితిలో మగ్నులయ్యారు. కాస్త బాహ్యస్మృతిలోకి రాగానే, "భూతదయా?....? అల్పుడా! హీనమైన పురుగుకు సమమైన వాడివి నువ్వు ;నువ్వు భూతదయ చూపడమా? దయ చూపడానికి నువ్వు ఎవడవు? కాదు, ఎన్నటికీ కాదు మనిషిని మహేశ్వరుని రూపంలో గాంచి సేవ మాత్రమే. చేయాలి. అదే నువ్వు చేయవలసింది" అన్నారాయన.
శ్రీరామకృష్ణుల పలుకులు అందరూ విన్నారు. కాని వాటి గూఢార్థాన్ని వారెవరూ అర్థం చేసుకోలేకపోయారు. నరేంద్రుడొక్కడే శ్రీరామకృష్ణుల భావ స్రవంతిని సరిగా అర్థం చేసుకొన్నాడు. గదిలో నుండి బయటకు రాగానే అతడు, “ఈ రోజు గురుదేవుల మాటలలో ఒక అద్భుత కాంతి గోచరమయింది. నిస్సార మైనదిగా, వట్టిపోయినదిగా పేర్కొనబడే వేదాంత జ్ఞానాన్ని, భక్తిమార్గంతో జత చేర్చి ఎలాంటి సరళమైన, మధురమైన సారభూతమయిన మార్గాన్ని ఆవిష్కరించారు ఆయన !
అద్వైత జ్ఞానాన్ని సంతరించుకోగోరితే సంసారాన్నీ, లోకులనూ ఆసాంతం పరిత్యజించి అరణ్యాలకు పోవాలి; ప్రేమ, భక్తి లాంటి కోమలమైన భావనలను హృదయంలో నుండి కూకటివేళ్లతో సహా పెకలించివేయాలంటూ చెప్పుకొచ్చారు. పర్యవసానం? ఆ మార్గంలో పయనించే వ్యక్తి సంసారాన్నీ, దాన్లోని ప్రతి వ్యక్తినీ తన మార్గంలోని ఆటంకాలుగా ఎంచి, అతణ్ణి ద్వేషించి తన వినాశనాన్ని తానే వెతుక్కొంటున్నాడు.
కాని శ్రీరామకృష్ణులు ఈ రోజు పారవశ్య స్థితిలో వెల్లడించిన పలుకుల నుండి, అరణ్యంలోని వేదాంత జ్ఞానాన్ని ఇంటికి తీసుకురావచ్చు, దైనందిన జీవితంలో ప్రతి దశలోను దానిని అనుసరించవచ్చునని స్పష్టమవుతున్నది. చేస్తున్న దానిని అట్లే కొనసాగించనీ, దాన్లో హాని లేదు. కాని భగవంతుడే ప్రాణులుగాను, లోకంగాను ఉన్నాడనే భావనను మాత్రం దృఢంగా నిలుపుకొంటే చాలు. జీవితంలో ప్రతి క్షణమూ మనం ఎవరితో వ్యవహరిస్తున్నామో, ఎవరి పట్ల ప్రేమ కనబరుస్తున్నామో, గౌరవమర్యాదలు చెల్లిస్తున్నామో, దయ చూపుతున్నామో వారందరూ భగవంతుని అంశలే.
ఈ విధంగా అందరినీ శివరూపంగా భావించినప్పుడు అతడు ఇతరులకన్నా తనను గొప్ప వ్యక్తిగా ఎలా అనుకోగలడు? ఇతరుల పట్ల కోపమూ, ద్వేషమూ ఎలా వహించగలడు? ఏ విధంగా దయ చూపించగలడు? ఈ రీతిలో మానవుని మాధవునిగా గాంచి అతనికి సేవ చేయగా చేయగా అతడి హృదయం పావనమవుతుంది; సత్వరమే అతడు తనను మహా చైతన్యస్వరూపుడైన భగవంతుని అంశంగా, పవిత్రునిగా, జాగృతి చెందినవానిగా, ముక్తునిగా గ్రహిస్తాడు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి