🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 48*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా*
*త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా |*
*తృతీయా తే దృష్టి ర్దరదలితహేమాంబుజ రుచిః*
*సమాధత్తే సంధ్యాం దివసనిశయో రన్తరచరీమ్ ‖*
ఇక్కడనుండి 57 వ శ్లోకం వరకు అమ్మవారి నేత్రాలను వర్ణిస్తున్నారు శంకరులు.
అహః సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా = అమ్మా నీ కుడి కన్ను సూర్యాత్మకము కనుక సూర్యుడినీ పగలునూ సృష్టిస్తున్నది.
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా = త్రియామ అంటే రాత్రి. రజనీనాయకుడు రజని అంటే రాత్రిఅధిపతి చంద్రుడు ఉండే కన్ను కనుక నీ ఎడమ కన్ను రాత్రిని సృష్టిస్తున్నది.
తృతీయా తే దృష్టి ర్దరదలిత హేమాంబుజరుచిః = మరి నీ మూడవ కన్ను అరవిరిసిన బంగారు పద్మము వలెనూ,
సమాధత్తే సంధ్యాం దివసనిశయో రన్తరచరీమ్ = పగలు రాత్రుల మధ్య వుండే ఉభయ సంధ్యాకాంతులతో ప్రకాశిస్తున్నది. ఉభయ సంధ్యలలో శ్రోత్రియులు అగ్నికార్యమును నిర్వర్తిస్తారు కనుక నీ సంధ్యా నేత్రము ఆ అగ్ని ప్రకాశమును వెలువరిస్తున్నది.
అమ్మవారు ఈ విధముగా దిన, రాత్ర, వార, మాస, ఋతు, అయన, సంవత్సర, యుగ కల్పాదులతో కూడుకొన్న కాలమానమును నిర్దేశిస్తున్నారు.
కంచి మహాస్వామి వారు ఈ త్రినేత్రములను, సత్త్వ రజస్తమో గుణముల వర్ణములతోను, త్రివేణీ సంగమముతోనూ పోల్చారు. కుడికన్ను తెల్లని సూర్యకాంతిని ప్రసరిస్తుంది కనుక, ఆ కాంతులు సత్త్వ గుణమును, శివుని తెల్లని జటాజూటము నుండి జాలువారిన గంగామాత తోను రాత్రిని సూచించే ఎడమ కన్ను కృష్ణవర్ణమైన (తమోగుణం) యమునతోనూ, రజోవర్ణమైన ఎర్రని కాంతులను వెలువరించే ఫాల నేత్రము శోణా నదితోనూ (వారు ఈ వ్యాఖ్యలో అంతర్వాహినియైన సరస్వతిని సంభావించలేదు) పోల్చారు. శోణా నదిలో దొరికే ఎర్రని శిలలు అమ్మవారి ఇష్టపుత్రుడైన విఘ్నేశ్వరునిగా పూజింపబడుతాయి. ఆ విధముగా అమ్మవారి త్రినేత్రములను విష్ణు,శివ,అంబికలు గా వర్ణించారు.
ఇక యోగపరంగా చూస్తే , మన వెన్నెముకనంటి యున్న పింగళ నాడి (సూర్యనాడి) కుడివైపున, చంద్ర నాడి అయిన ఇడా నాడి ఎడమవైపున, ఈ రెండిటి మధ్యనున్న అగ్నిరూపమైన సుషుమ్న నాడి భ్రూమధ్య స్థానము నందు కలుస్తాయి. ఆ సంధియే సంధ్య. అందుకే సంధ్యావందనంలో పరమేశ్వరుడిని భ్రూమధ్య స్థానంలో ధ్యానిస్తారు. భ్రూమధ్యం బుద్ధిశక్తి కేంద్రం. నిజానికి మనం అందరం మూడు కళ్ళ వాళ్ళమే.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి