9, అక్టోబర్ 2023, సోమవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-69🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-69🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*కళ్యాణకట్ట*


తిరుమల శ్రీవారి భక్తులు తలనీలాలు సమర్పించే స్థలాన్ని కళ్యాణకట్ట అని పిలుస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. స్వామివారికి తలనీలాలు సమర్పించే సంప్రదాయం ఎన్నేళ్ల క్రితం మొదలైందో నిర్దిష్టంగా తెలియదుగానీ.. రెండున్నర శతాబ్దాల క్రితం కొండ కిందే తలనీలాల సమర్పణ జరిగేదని చెబుతారు. చంద్రగిరి సమీపంలోని కళ్యాణీ నదీ తీరంలో వెలసిన క్షురక కేంద్రాలకే కళ్యాణకట్ట అని పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. కళ్యాణకట్టకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా..


శ్రీవారి పాదాల చెంత ఉండే ప్రసిద్ధ నది స్వర్ణముఖి. ఈ నదికి సంబంధించిన పురాణాలు, ఐతిహాసాలు ఎన్నో ఉన్నాయి. అయితే స్వర్ణముఖి నదికి చరిత్రలో ఎంతో గొప్ప స్థానం ఉంది. స్వర్ణముఖి నదికి ఉపనది కల్యాణి నది.


 కల్యాణి నది ఒడ్డున శ్రీనివాస మంగాపురం ఆలయం వుంది. పూర్వం తిరుమలకు సామూహికంగా మాత్రమే భక్తులు వెళ్ళేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణీ నదీ తీరంలో కళ్యాణ కట్టలు వెలిశాయి. యాత్రికులు తమ తలనీలాలను ఈ కళ్యాణకట్టలోనే సమర్పించి కళ్యాణీ నదిలో స్నానం చేసి కళ్యాణ వేంకటేశ్వరుని దర్శించుకునేవారు. 

కళ్యాణీ నదీ తీరంలో మంగలికట్టలు వెలిశాయి కాబట్టి వారికి కళ్యాణకట్టలు అనే పేరు వచ్చింది. తిరుమలలో మంగలి కట్టలు వెలిశాక శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ కట్టలు అంతరించాయి. అందుకే తిరుమలలోని మంగలి కట్టలకు కళ్యాణ కట్టలు అనే పేరు స్థిరపడింపోయింది.


 నీలాద్రి కొండ మీద క్రూర జంతువుల సంచారం ఎక్కువగా వుండడం వల్ల తనకు చాలా యిబ్బందిగా ఉందని నీలాదేవి శ్రీనివాసుకి మొరపెట్టుకుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న స్వామివారి సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా స్వామివారి నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి అతి పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది. వెంటనే తన నొసటిపై ఉన్న వెంట్రుకలను శ్రీవారికి అతికిస్తుంది. వెంటనే శ్రీనివాసుడు మేల్కొని చూడగా నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండకు వచ్చి భక్తులు తమ తలలాలను సమర్పిస్తారని, అవి నీలాదేవికి చేరుతాయని వరమిచ్చాడట. ఇదే కాక మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వేంకటేశ్వరుడు బీబీనాంచారీని పెళ్ళి చేసుకొనేటప్పుడు ఆమెకొక వరం ఇచ్చాడట. ఎగువ తిరుపతికి జుట్టుతో వచ్చేవాళ్ళు తనవారని, గుండు చేయించుకున్నాక తిరిగి వెళ్ళే వాళ్ళు నీవాళ్ళని ప్రమపూర్వకంగా మాటిచ్చాడట.


ఇదే కాక ఒకప్పుడు వీరారాదన ఉండేది వీరోచితంగా మరణించే వారికి స్వర్గలోక ప్రాప్తి, రంభా సంయోగం లభిస్తుందని భావించేవారు. రాజుకోసం, రాజ్యమ్కోసం ఆత్మబలులు చేసుకునేవారు, అగ్నిగుండంలో ప్రవేశించేవారు, తలలు నరికించుకునేవారు. మరణించిన వేరునికి వీరలగల్లును ప్రతిష్టించి పూజించేవారు. వీరగల్లె వీరకల్లు అంటే వీరునికి చెందిన రాయి. ఈ వీరారాధన తిన్నగా వైదిక మతంలో ప్రవేశించింది. వీర శైవం, వీ వైష్ణవంగా రూపుదిద్దుకుంది. తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ప్రసాదాలు అమ్మే చోట తలలు నరుక్కుంటున్న వీరగల్లులున్నాయి ఇప్పటికీ ఉన్నాయి. శైవుల్లో వీర శైవుల్లు బయల్దేరారు. శివుని వ్యతిరేకించేవాళ్ళను చంపడం, శివుని కోసం ఆత్మార్పణమ చేసుకోవడం, శ్రీశైలంలో కనుమూరి పద్ధతిలో కొండకొమ్ము మీద నుంది దూకడాన్ని పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రలో కూడా పేర్కొన్నారు. శివరాత్రి రోజు వేలాది మంది ఎడతెరిపి లేకుండా కనుమూరి కొండకొమ్మ మీద నుంది దూకి ఆత్మార్పణం చేసుకునేవారు. అలాగే గుడి ముందు శిరచ్చేద యంత్రాలతో తలలు నరికించుకునేవారు. ఆ కొయ్య శిరచ్చేద యంత్రాలను మద్రాసు ఎగ్మోరులోని మ్యూజియంలో నేటికీ చూడవచ్చు.


మరికొంతమంది కత్తులతో తలలను నరికించుకొని శివునికి 'తలపండు'నూ సమర్పించేవాళ్ళు. రెడ్డి రాజుల్లో అనవేమారెడ్డి శ్రీశైలం ఆలయం ముందు ఇలాంటి వారి కోసం వీర శిరోమండపాన్ని నిర్మించాడు. ఆ మండపం ఈనాటికీ చెక్కుచెదరకుండా ఉంది. కొంతమంది చేతులు నరుక్కునేవారు, మరికొంతమది అనేక అవయవాలను సమర్పించేవారు, ఇంకా కొంతమంది తమ వీపులలోని మాంసాన్ని కోసి శివునికి సమర్పించేవాళ్ళు. అలా ఆనాడు తలను పండుగా భావించి, తలను నరికించుకొని దేవునికి సమర్పించేవారు. దానివల్ల శైవులు అయితే కైలాసానికి, వైష్ణవులు అయితే వైకుంఠానికి చేరుకునేవారు. అలాంటి ఆచారం కాలక్రమేణా గుండు గీయించుకోవడం వరకు వచ్చింది. తలకు ప్రధానమైనవి కురులు. కురులను సమర్పిస్తే దేవునికి తలను సమర్పించిన దానితో సమానం.


జానపద విజ్ఞానం ప్రకారం చూస్తే తల వెంట్రుకలు ఎవరికైనా అపూర్వం. తల వెంట్రుకల మీద ఎన్నో జానపద కథలు ఉన్నాయి. మనిషి అందానికి ప్రతీక తల వెంట్రుకలు. తల వెంట్రుకల సౌదర్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే విధానం జానపదుల్లో కనిపిస్తూ ఉంటుంది. వెంట్రుకలను సంపదతో పోల్చి కేశసంపద అని అంటారు. ఆరోజుల్లో ఎంత పొడవు కురులు ఉంటే అంత విలువ ఉండేది.


అందుకే ఆ రోజుల్లో మగవాళ్ళు కూడా జుట్టు పెంచి, పూలను అలంకరించుకునేవాళ్ళు. మనిషి కురుల మీద చూపించే మమకారం మరి దేనిమీదా చూపించడు. అద్దంలో చూసుకున్నా కురులనే చూసుకుంటారు. అంత విలువైన వెలకట్టలేని కురులను శ్రీవారి మీద భక్తితో వాటిని తృణప్రాయంగా భావించి స్వామివారికి సమర్పించడం గొప్ప విషయం. తాము అంద విహీనంగా మారినా ఫరవాలేదు. తమ అందంకన్నా శ్రీవారి భక్తి మిన్న అనే ఆనందంలో తరించాలనే ఉద్దేశ్యంతో స్వామివారికి తలనీలాలను సమర్పిస్తారు. కాలం గడిచేకొద్దీ గుండు గీయించుకోవడం మొక్కుబడిగా మారిపోయింది. మొదట గుండు గీయించుకుని కులదైవానికి సమర్పిస్తారు. ఆ తర్వాత రకరకాల మొక్కుబడులతో తిరుమలకు వచ్చి గుండు గీయించుకోవడం ఆనవాయితీగా మారింది.


   కళ్యాణీ నదీ తీరంలో కళ్యాణకట్టలో వెలిశాయి. అప్పట్లో తిరుమల శ్రీవారి దర్సనానికి వచ్చే భక్తులు. ఇక్కడే తలనీలాలు సమర్పించి కళ్యాణీ నదిలో స్నానం చేసి, కళ్యాణ వేంకటేశ్వరున్ని దర్సించుకునేవారట. అప్పుడే తలనీలాలు తీసే కేంద్రాలకు కళ్యాణకట్టలు అని పేరు వచ్చిందట. ఆపై అదే పేరు స్థిరపడింది కళ్యాణ వేంకటేశ్వరున్ని దర్శించుకున్న అనంతరం..తిరుమలలో ఏవైనా ఉత్సవాలున్నా, ప్రత్యేకంగా అక్కడిదాకా వెళ్లాలనుకున్నా గుంపులు, గుంపులుగా వెళ్ళేవారట. ఈ ప్రయాణంలో తప్పిపోకుండా ఉండేందుకు తప్పిపోయిన వారు కలుసుకునేందుకు గుంపులో ముందు, వెనుక బాగా ఊదేవారట.


ఇప్పటికీ మైసూరు ప్రాంతం నుంచి వచ్చే భక్తులు బాకా ఊదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీనివాసపురంలో కళ్యాణకట్టలు మెల్లగా కనుమరుగయ్యాయి. తిరుమలలోని చంద్రగిరి రస్తా పక్కనున్న మంగలిబావి వద్ద కళ్యాణకట్టలు ఏర్పాటయ్యాయి. ఊరికి దూరంగా ఉండే ఈ కళ్యాణకట్టలు క్రమంగా ఆలయ సమీపానికి మారాయి. ముందుగా తిరుమల నడిబొడ్డున ఉన్న రావిచెట్టు కింద తలనీలాలు తీసేవారట. ఆ తరువాత పక్కనే ప్రత్యేక భవనం నిర్మించారు. పెరుగుతున్న భక్తులరీత్యా అదీ చాలకపోవడంతో ప్రస్తుతమున్న కళ్యాణకట్టను నిర్మించారు. వందల మంది క్షురకులు నిత్యం పనిచేస్తున్నారు. 


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: