28, నవంబర్ 2023, మంగళవారం

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 100*


*రామకృష్ణ ఆరాధన*


బలరాంబోసు ఇంటి నుండి శ్రీరామకృష్ణుల అస్థుల కలశాన్ని తీసుకువచ్చి, దానిని విడిగా ఒక గదిలో అమర్చి ఆ గదిలోనే ధ్యానం మొదలైన ఆధ్యాత్మిక  సాధనలు ఆ యువ సన్న్యాసులు అనుష్ఠించసాగారు. స్వామి రామకృష్ణానంద మఠంలో నిరంతరంగా నివసించనారంభించినప్పుడు ఆ గదిని తీర్చిదిద్దాడు. గది మధ్యలో గురుదేవుల చిత్రపటాన్ని అమర్చి నిత్యపూజకు శ్రీకారం చుట్టాడు. స్వామీజీతో సహా పలువురు సోదర శిష్యులకూ, సురేంద్రాదులకు ఇదినచ్చలేదు.


శ్రీరామకృష్ణులు తమను అర్చించమని ఎవరితోనూ చెప్పలేదని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాక విరజాహోమం నిర్వర్తించి యథావిధిగా సన్న్యాసం పుచ్చుకొన్న తరువాత పూజాది క్రతువుల అగత్యం లేదన్నది వారి వాదం.


ఒక రోజు పూజామందిరంలో నిలబడే ఆరాధనను ప్రతిఘటిస్తూ వాడిగా వేడిగా స్వామీజీ వాదించసాగారు. అందుకు స్వామి రామకృష్ణానంద కూడా యుక్తమైన జవాబులిచ్చాడు. కాసేపటికల్లా వాదాలు తారస్థాయిని చేరుకొన్నాయి. ఒక ఘట్టంలో స్వామి రామకృష్ణానంద స్వామీజీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొంటూ పూజామందిరం నుండి బయటికి త్రోసివేశాడు. అంతా కళ్లుమూసి తెరచేటంత లోనే జరిగిపోయింది. 


పిదప తన చర్యకు పశ్చాత్తాపం చెంది స్వామీజీని క్షమాపణ కోరాడు. మనఃస్ఫూర్తిగా క్షమించడం మాత్రమే కాక అతడి గురుభక్తిని స్వామీజీ ఎంతగానో శ్లాఘించారు. ఈ విషయంగా పలుమార్లు భేదాభిప్రాయాలు తలెత్తినప్పటికీ రామకృష్ణ ఆరాధన మాత్రం కొనసాగింది.


స్వామి రామకృష్ణానంద పూజా విధానాన్ని చూసినవారు అక్కడ గురుదేవుల దివ్యసాన్నిధ్య అనుభూతి పొందారనడం అతిశయోక్తి కాదు. సజీవులయిన వారికిఎలా సకలోపచారాలు చేస్తామో, అదే విధంగా గురుదేవులను ఆయన ఆరాధించాడు. ఆయనకు నైవేద్యం అర్పించబడింది. ఆరాత్రికం నిర్వహించారు. ఆరాత్రిక సమయంలో "జై గురుదేవా, శ్రీ గురుదేవా" అని అందరూ కలసి ఉచ్చరించేవారు; కొన్ని సమయాల్లో గురుగీత శ్లోకాలు పారాయణ చేసేవారు. దీపారాధన కన్నులపండువగా ఉండేది. అందరూ ముక్తకంఠంతో 'జయ శివ ఓంకార" అనే పాట పాడేవారు.


రోజులు గడిచేకొద్దీ పూజా విధానాన్ని మరింతగా క్రమబద్ధీకరించాడు. రామకృష్ణానంద స్వామి. సంస్కృతంలో చక్కని అభినివేశం గల ఆయన తగిన మంత్రాలు చేర్చి రామకృష్ణ పూజా పద్ధతిని రూపొందించారు.


నిత్య పూజే కాకుండా శివరాత్రి, కాళీపూజ లాంటి విశేష పర్వదినాలను, క్రిస్మస్ ను వారు ఉత్సవం మాదిరి జరుపుకొన్నారు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: