*** ఆలోచనాలోచనాలు *** తెలుగు నీతి పద్య రత్న కదంబం *** *** 1* ఉ. మాటలచేత దేవతలు మన్నన జేసి వరంబు లిత్తు;రా/ మాటలచేత భూపతులు మన్నన జేసి ధనంబు లిత్తు; రా/ మాటలచేత మానినులు మన్ననజేసి మనంబు లిత్తు, రా/ మాటలు నేర్వకున్న యవమానము,న్యూనము, మానభంగమున్.( చాటుపద్యము) 2* ఉ. కోరికతో ధనాఢ్యుఁడని కుత్సితు నల్పుని దుష్టచిత్తునిన్/ జేరినవార లీప్సితముఁ జెంది సుఖింపరు, హానిఁగాంతు రా/ చారు ఫణాగ్రభాగ విలసన్మణిరాజము గల్గి వెల్గినన్/ గ్రూర భుజంగమున్ గవయఁ గూడెనె శ్రీకర రాజశేఖరా! (రాజశేఖర శతకము, సత్యవోలు సుందర కవి) 3* శా. సత్యం బెప్పుడు దప్పడేనియు, దురాచారుండు గాడేని, యౌ/ చిత్యం బేమరడేని , దుర్జనుల గోష్ఠింబొందడే, భక్తి సాం/ గత్యం బాదటఁ బాయడేని, మదనగ్రస్తుండు గాడేని,నీ/ భృత్యుండాతడు మూడులోకములలోఁ బెంపొందు సర్వేశ్వరా! (సర్వేశ్వర శతకం, యథావాక్కుల అన్నమయ్య) 4* శా. గాజుంబూస యనర్ఘ రత్నమగునా? కాకంబు రాయంచయౌ/ నా? జోరీగ మధువ్రతేంద్ర మగునా? నట్టెన్ము పంచాస్యమౌ/ నా? జిల్లేడు సురావనీజమగునా? నానా దిగంతంబులన్/ రాజౌనా ఘనలోభి దుర్జనుడు? భర్గా! పార్వతీ వల్లభా! ( శ్రీ భర్గ శతకం, కూచిమంచి తి మ్మకవి) 5* సీ. సాధుసజ్జనులతో జగడమాడినఁ గీడు, కవులతో వైరంబు గాంచఁగీడు. పరమదీనులఁ జిక్కఁబట్టి కొట్టినఁ గీడు, బిచ్చగాండ్రను దుఃఖపెట్టఁ గీడు. నిరుపేదలను జూచి నిందఁ జేసినఁ గీడు,పుణ్యవంతులఁ దిట్టఁబొసగుఁ గీడు. సద్భక్తులను దిరస్కారమాడినఁ గీడు, గురుని ద్రవ్యము దోఁచుకొనినఁ గీడు. తే.గీ. దుష్టకార్యములొనరించు దుర్జనులకు/ ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె/ భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర! ( నరసింహ శతకం, కాకుస్థం శేషప్ప కవి) 6* శా. స్నానంబుల్ నదులందుఁ జేయుట, గజస్నానంబు చందంబగున్/ మౌనంబొప్ప జపించు వేద మటవీ మధ్యంబులో నేడ్పగున్/ నానహోమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చను/ న్నీ నామోక్తియు, నీ పదాబ్జరతియున్ లేకున్న నారాయణా! ( నారాయణ శతకము, బమ్మెర పోతన) 7* కం. ఆచార్యున కెదిరింపకు/ ప్రోచినదొర నింద సేయఁబోకుము కార్యా/ లోచనము లొంటిఁ జేయకు/ మాచారము విడువఁ బోకుమయ్య కుమారా! (కుమార శతకము, పక్కి అప్పల నర్సయ్య) 8* కం. ఉడుముండదె నూఱేండ్లునుఁ/ బడియుండదె పేర్మి పదినూఱేండ్లున్/ మడువునఁ గొక్కెర యుండదె/ కడునిలఁ బురుషార్థపరుడు గావలె సుమతీ! ( బద్దెన కవి, సుమతీ శతకము) 9* ఆ.వె. అనగ ననగ రాగమతిశయిల్లుచునుండు/ తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన/ విశ్వదాభిరామ వినురవేమ! ( వేమన శతకం,యోగి వేమన) 10* సత్ప్రవర్తనంబు, సౌఖ్యంబు, మర్యాద/ మంచివారి పొందు మనకు నిచ్చు/ కలుషమతుల పొందు కలహాలు గొనితెచ్చు/ లలిత సుగుణజాల! తెలుగు బాల! (తెలుగు బాల శతకం, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి) 11* నల్లనిదని విడువజెల్లునె కస్తూరి/ తెల్లనిదని దాల్తె రెల్లుపూవు/ వన్నెలోన నేమి వైభోగమున్నది/ విలువ కట్టి చూడ తెలుగు బిడ్డా! ( తెలుగు పూలు, నార్ల చిరంజీవి) 12* నిలిచి నీళ్ళు త్రాగ నీరుకారు బ్రతుకు/ పరుగులెత్తవోయి పాలు త్రాగ/ పరుగునుండె పుట్టె నరుని నాగరికత/ వాస్తవమ్ము నార్లవారి మాట! ( నార్ల వేంకటేశ్వర రావు) "" ఆనో భద్రాః క్రతవోయన్తు విశ్వతః""-- ఋగ్వేదం. " అన్ని వైపుల నుండి మనకు ఉదాత్త భావనలు లభించుగాక!" (Let noble thoughts come from every side.). తేది 28--11--2023, మంగళవారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి