శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
సత్యవ్రతుడికి తనమీద తనకే అసహ్యంవేసింది. కన్నతండ్రి శపించాడు. రాజ్యం నుంచి
వెళ్ళగొట్టాడు. గురువు శపించాడు. పిశాచత్వం సంక్రమించింది. ఛీ! ఎందుకొచ్చిన బతుకు ! మరణించడమే
మేలనుకున్నాడు. త్వరత్వరగా ఎండుకట్టెలు ఏరి తెచ్చి చితిని పేర్చుకున్నాడు. స్నానంచేసివచ్చి చండికాదేవిని
మనసారా ఒక్కసారి స్మరించి అగ్నిలో ప్రవేశించబోయాడు. జగన్మాత - కరుణామయి - ప్రత్యక్షమయ్యింది.
ఆగు ఆగు అంది.
హే సత్పురుష ! ఏమిటి నువ్వు చేస్తున్న పని. ఆత్మహత్య మహాపాపమని ఎరగవా ? నీ
నిషాదత్వం పిశాచరూపం ఈ క్షణంలోనే తొలగిపోతాయి. తపోవృద్ధుడైన నీ తండ్రి వచ్చి స్వయంగా నీకు
పట్టాభిషేకం జరిపిస్తాడు. రేపే నిన్ను రాజధానికి తీసుకువెళ్ళడానికి మంత్రులూ సామంతులూ వస్తారు.
ధర్మబద్ధంగా రాజ్యం పరిపాలించు. మీ తండ్రి తపస్సులు ఫలిస్తాయి. కామాన్ని జయించి బ్రహ్మలోకం
పొందుతాడు.
వరాలు ఇచ్చి జగదీశ్వరి అదృశ్యమయ్యింది. మరణ ప్రయత్నం విరమించి త్రిశంకుడు ఆశ్రమానికి
వచ్చాడు. నారదుడు అయోధ్యకు వెళ్ళి ఈ జరిగిన వృత్తాంతాన్ని మంత్రి సామంతులకు తెలియపరిచాడు.
అరుణ మహారాజు తపస్సుచేసుకొంటున్న చోటుకి వెళ్ళి అంతా వివరించాడు. తన కుమారుడు అగ్ని
ప్రవేశానికి సిద్ధమయ్యాడన్నమాట వినడంతోనే అరుణుడు విలవిలలాడాడు. నారదుడితో కలిపి రాజధానికి
తిరిగివచ్చాడు. మంత్రులను సమావేశపరిచిసత్యవ్రతుడికి తాను దేశబహిష్కరణ విధించండం
మొదలుకొని అతడి అగ్నిప్రవేశమూ అమ్మవారి ఆశీర్వాదమూ వరకు అన్నీ వివరించి, మీరంతా త్వరగా
వెళ్ళి సత్యవ్రతుడిని సగౌరవంగా, నామాటగా ఆహ్వానించి తీసుకురండి, పట్టాభిషేకం జరిపించి నేను
మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోతాను అన్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి