🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 102*
భారత పర్యటన....బయలుదేరుతున్నారు..
తల్లితండ్రులు, చుట్టాలూ, పక్కాలూ, మిత్రులు అందరినీ వదలిపెట్టి ఒంటరిగా జీవించాలి; ఏ స్థలంలోనూ స్థిరంగా ఉండిపోకుండా సంచారం చేస్తూనే ఉండాలి; చేతకర్ర, కమండలం మాత్రమే తీసుకొని వెళ్లాలి. ఆత్మను మాత్రమే తోడుగా చేసుకోవాలి - ఒక సన్న్యాసి ఈ విధంగా జీవించాలని కోరుకొంటాడు. స్వామీజీ ఆశయం కూడా అదే. అలాంటి జీవితం కోసం ఆయన పరితపించారు. కాని ఆయన ఒంటరిగా పోవడం సోదర శిష్యులకు సుతరామూ ఇష్టం లేదు. అంతేకాదు; బయలుదేరాలని అనుకొన్నప్పుడల్లా ఏవేవో అవాంతరాలు వాటిల్లాయి.
ఆయన దూర ప్రయాణం చేసి వెళ్లినది వారణాసి (కాశీ) మాత్రమే. మహాశ్మశాన వాటికగా ఈ స్థలం పేర్కొనబడుచున్నది. ఈ క్షేత్రంలో మరణించే వారందరికీ ముక్తి లభిస్తుందని శాస్త్రాలు వచిస్తున్నాయి. ఇక్కడే నివాసం ఏర్పరచుకొని తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తే ఎనలేని ఫలం ప్రాప్తిస్తుందని హైందవుల విశ్వాసం. స్వామీజీ కూడా తమ పరివ్రాజక జీవితాన్ని కాశీక్షేత్రం నుండే ప్రారంభించారు.
కాశీలో బసచేసిన రోజుల్లో స్వామీజీ పలువురు సన్న్యాసులను, సర్వజ్ఞులను కలుసుకొన్నారు. వారిలో త్రైలింగస్వామి, భాస్కరానంద ముఖ్యులు,
గొప్ప మహాత్మునిగా ఖ్యాతిగాంచారు త్రైలింగస్వామి. 1868 జనవరిలో శ్రీరామకృష్ణులు కాశీ సందర్శించినప్పుడు ఈయనను కలుసుకొని, "ఈయనలో నిజమైన పరమహంస లక్షణాలున్నాయి" అని వ్యాఖ్యానించారు. మణికర్ణికా ఘట్టంలో నివసిస్తున్న త్రైలింగస్వామిని స్వామీజీ దర్శించారు. "త్రైలింగస్వామి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉన్నారు. అలాగని ఆయన ఉపదేశం ఏమీ చేయలేదని భావించరాదు. మౌనమే ఆయన ఉపదేశం" అంటూ కాలాంతరంలో ఆయన గురించి స్వామీజీ వ్యాఖ్యానించారు.
తమ స్వాధ్యాయ, తపోమయ జీవితం వలన భాస్కరానంద ఎనలేని గౌరవ మర్యాదలను పొందారనడం అతిశయోక్తి కాదు. సామాన్యంగా ఆయన దిగంబరం గానే జీవించేవారు. ఈయనను కూడా స్వామీజీ కలుసు
కొన్నారు. స్వామీజీ ముఖారవిందాన తాండవిస్తున్న దివ్య తేజస్సును చూసి భాస్కరానంద ఆయనను ఆదరాభిమానాలతో ఆహ్వానించారు. వారిద్దరూ అనేక విషయాల గురించి మాట్లాడుకొన్నారు. సంభాషణ మధ్యలో భాస్కరానంద, "కామినీ కాంచనాలను సమూలంగా ఎవరూ త్యజించలేరు" అన్నాడు.
అందుకు స్వామీజీ, "స్వామీ, మీరేమంటున్నారు? వాటిని సంపూర్ణంగా త్యజించిన వ్యక్తులు ఎందరో ఉన్నారు! ఒక సన్న్యాసి జీవితమూ, లక్ష్యమూ అదే కదా! కామినీ కాంచనాలను కూకటి వేళ్లతో సహా పెకలించి వేసిన వ్యక్తిని నేను చూశాను" అన్నారు. ఆ మాటలు విని భాస్కరానంద చిన్నగా నవ్వి, “నువ్వు చిన్న వాడివి. నీకేం తెలుసు?" అన్నాడు. ఇది విన్నాక స్వామీజీ ఊరకే ఉండలేక పోయారు.
కామినీకాంచనాలను జయించిన శ్రీరామకృష్ణుల మహోన్నత జీవితం స్వామీజీ మనస్సులో మెదలింది. దానిని వివరించి, ఉద్వేగంతో తమ భావనలను ప్రకటించారు. స్వామీజీ ఉద్వేగపు వెల్లువను గమనించిన భాస్కరానంద ప్రక్కన ఉన్నవారితో, "ఆహా! ఈయన నాలుక మీద సరస్వతీదేవి కొలువై ఉంది. ఈతడి మనస్సు మహోజ్జ్వల కాంతితో ప్రకాశిస్తున్నది" అన్నాడు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి