౪౪౪ ఆలోచనాలోచనాలు ౪౪౪ ( అక్షరరూపం దాల్చిన ఒక సిరా చుక్క ; లక్ష మెదళ్ళకు కదలిక!) 1* ఒక పసిపిల్లవాడిని యోగ్యుడిగా మార్చడానికి, తల్లి 20 సంవత్సరాల కాలాన్ని తీసుకొంటుంది. భార్య వాడ్ని తెలివితక్కువ వాడిక్రింద జమకట్టడానికి 20 నిముషాల సమయం చాలు! 2* మనిషి సరదాగా కొంచెం మద్యాన్ని మాత్రమే పుచ్చుకొంటాడు. లోనికి పోయిన ఆ ద్రవపదార్దం మరికొంతను ఆకర్షిస్తుంది. ఆ తరువాత మద్యమే ఆ తీసుకొన్న మనిషిని లోబరుచుకొని, వాడి చేత సమాజం మెచ్చని పనులను చేయిస్తుంటుంది. -- జపాన్ దేశపు సామెత. 3* డబ్బు పోగొట్టుకున్నవాడు - కొంత పోగొట్టుకొంటాడు. స్నేహితుణ్ణి పోగొట్టుకొన్నవాడు ఎక్కువ పోగొట్టుకొంటాడు. విశ్వాసం పోగొట్టుకొన్నవాడు అంతా పోగొట్టుకొంటాడు. 4* ఒక వ్యక్తిని పడగొట్టినవాడు బలవంతుడైతే,అతడిని పైకి లేపి నిలబెట్టినవాడు మిక్కిలి బలవంతుడు. 5* పూల సుగంధం గాలివాలుతోనే వ్యాపిస్తుంది. కానీ మంచివారి సౌజన్యం , ఎదురు గాలికి కూడా వ్యాపిస్తుంది. 6* నేనేది ఖర్చు పెట్టానో, అది నేను పోగొట్టుకొన్నట్లే! నేనేది దాచిపెట్టానో అది నేటికి నేను కలిగివున్నట్లు! నేను ఇప్పుడు దేనిని పంచిపెడుతున్నానో, దానిని నేను రేపటికి కలిగివుంటాను. 7* మనుష్యులు తరచూ ఒంటరివారై పోతుంటారు. ఎందుకంటే వారు జగత్తులో వంతెనల కంటే గోడలనే ఎక్కువ కట్టుకొంటూవుంటారు కదా! 8* సరియగు సమయానికి నిద్రించడం ఒకరి రోగాన్ని సగానికి తగ్గిస్తుంది. మిగిలిన సగం సరియైన సమయానికి నిద్ర లేవడం ద్వారా! 9* నౌకాశ్రయంలో ఓడ సురక్షితమే! కానీ దానిని తయారుచేసింది అట్లా ఓడరేవులో భద్రంగా, ప్రదర్శన వస్తువుగా ఉంచడానికి కాదుగదా! 10* కుక్క చర్మపు సంచీలోని గంగాజలం ఎంత పవిత్రమైనదో, శీలహీనునిగల సంపద అంత పవిత్రమైంది. 11* వేల సూర్యులు, చంద్రులు పోగొట్టలేని అజ్ఞానపు చీకట్లను మహాపురుషుల అమూల్య వాక్కులు పోగొట్టగలుగుతాయి. 12* ప్రతివాడు సమాజాన్ని మార్చాలని ఉబలాటపడేవాడే! కానీ సమాజానికి అనుగుణ్యంగా తాను మారటానికి ఇష్టపడడు.-- టాల్ స్టాయ్. 14* స్నేహితానికి(+) కూడిక గుర్తు మంచిది. కానీ శత్రుత్వానికి (౼) తీసివేత కలిసి వస్తుంది. "" ఆనో భద్రాః క్రతవోయన్తు విశ్వతః""-- ఋగ్వేదం 1వ మండలం, 89 సూక్తం. " మనకు అన్నివైపులనుండి ఉదాత్త భావనలు లభించుగాక!" ( Let noble thoughts come from every side.). Dt 30-- 11--2023, Thursday, Good morning.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి