శ్రీభగవాన్ వామన మూర్తి
బలిదనుజుని మదమణచగ
పలుయమరుల మొరలు వినియు బాలక వటుగా
యిలమూడడుగుల నడిగియు
పలులోకములెల్ల గొలిచె పాదము తోడన్
ఇంతింతగుచును విశ్వము
సాంతంబుగ ప్రోచె జగతి సర్వేశుండై
వింతగు రూపము దాల్చియు
స్వాంతంబున బలిని మెచ్చి సద్గతి నిచ్చెన్
శ్రీకరంబైనట్టి చిరుత కూకటి తోడ
చిరునవ్వు లొలికించు చిన్ని వటువు
దారు కమండలు దాల్చి తా కరమందు
విజ్ఞాన ఖనివోలె వెల్గు వాడు
పావన దర్భలు పట్టియు న్నొకచేత
నతి ప్రసన్నత నున్న యర్భకుండు
హస్తంబు పైకెత్తి యభయంబు నిడుచుచు
గొడుగుతో నున్నట్టి వడుగు కుర్ర
ఘనుడు బలిచక్రవర్తిపై కరుణ జూప
వామనుని వోలె వచ్చియు వరము నడిగి
విశ్వమును నిండి వెల్గిన విష్ణువునకు
ప్రణతు లర్పించు చుంటిని భక్తితోడ
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి