వేకువ ఝామున పాడుకొనుటకు…
```
*తిరుప్పావై ప్రవచనం- 9 వ రోజు*
➖➖➖✍️
9 వ పాశురము:
*తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ*
*తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్*
*మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్*
*మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్*
*ఊమైయో? అన్ఱిచ్చెవిడో? ఆనన్దలో*
*ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?*
*"మామాయన్, మాదవన్; వైగున్దన్" ఎన్ఱెన్ఱు*
*నామమ్ పలవుమ్ నవి న్ఱేలో రెమ్బావాయ్!*
*🌺భావము:*```
నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టునూ దీపాలు వెలుగుతుండగా, అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతిమెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను లేపుమమ్మా! ఏమి? నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్దకస్తురాలా? లేక ఆమె లేవకుండగ ఎవరినైన కావలి వుంచినారా? లేక యింత మైమరచి నిద్రించుటకేమైన మంత్రించి వుంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు?
'ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా! ఓ శ్రియః పతీ! ఓ పరమపదవాసీ!' అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్ననూ ఆమెకు వినబడుటలేదేమి? ఇంకను లేవదేమి? అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు.```
*🌸అవతారిక :*```
'తూరుపుతెలవారె! ఓ జవ్వనీ లేవవే!' అంటూ పాడి 8వ (పాశురం) మాలికలో భగవదనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి. ఇప్పటివరకు శ్రవణం (వినటం) మననం (విన్నదానిని మాటిమాటికి స్మరించటం) వీటియొక్క విశిష్ఠతను తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకొంది. ఇక (9మొదలు 12 మాలికలలో (పాశురాలలో) ధ్యానం యొక్క విశిష్ఠతను తెలుపబోతోంది. ఎల్లప్పుడూ శ్రవణము, మననమూ చేసే వారియొక్క మనస్సు పవిత్రమౌతుంది. నిర్మలమౌతుంది. మాలిన్యం తొలగితేనేకద జ్ఞానం చోటు చేసుకొనేది. అప్పుడా జ్ఞానమే
ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్ధమైన వ్రాత నిష్ఠ కలిగినవారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్ర్యం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎచటికినీ పోక వున్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ వుంటే చాలుననుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తూన్న నాల్గవ గోపికను (యీ మాలికలో) లేపుచున్నారు. 'ఓ మామకూతురా! మరదలా లేలెమ్ము!' అంటున్నారు.```
🌷*9.వ మాలిక:*```
(కాంభోజి రాగము-ఆదితాళము)
1. ప.. ఓ మామకూతుర! మరదలా!
అ..ప.. ఏమిది? మణిమయ ద్వారము తెరువవు?
ఓ మామ కూతుర! మరదలా!
చ.. పావన మణిమయ భావనమందున
దివ్వెల వెలుగులు ధూపములమరగ
దివ్యమౌ తల్పమున దిటవుగ శయనించి
అవ్యక్తమైన నిద్దురపోదువటవే!
2 చ. మూగద? చెవిటిద? మిగుల నలసినద?
ఆగడప కావలి నందుంచబడినద?
ఆ గాఢ నిద్రకు మంత్రించబడినద?
వేగమె లేపవె! నీ కూతునత్తరో!
3 చ. లీలామానుష మాధువుడీతడు
కేళీలోలుడు వైకుంఠవాసుడు
చెలియలగూడి తిరునామ కీర్తనము
ఇలవెలియగ పలుమారు పాడితిమి
ఓ మామకూతుర! మరదలా!```
🌼*తొమ్మిదవరోజు ప్రవచనం:*
```
భగవంతునికి మనకు ఉన్న సంబంధం
*ఆండాళ్ తిరువడిగలే శరణం* ```
🍀*పాశురము:*
*తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్*
*దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం*
*మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్*
*మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్*
*ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో*
*ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో*
*మామాయన్ మాదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు*
*నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్*
ఆండాళ్ తల్లి ఈరోజు నాలుగో గోపబాలికను లేపుతుంది. *"తూ"* పరిశుద్దమైన *"మణి"* మణులతో చేసిన *"మాడత్తు"* మేడ, *"చ్చుత్తుం విళక్కెరియ"* చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక, దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్ర్తాలు కావాలి. శాస్ర్తాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆరెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం, ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. ఈ గోపబాలిక వెలుతురుకోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటిచుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటిచుట్టూ దీపాలు వెలిగించింది. *"ధూపం కమళ"* ధూపం పరిమళిస్తుంది. *"త్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్"* నిద్రపుచ్చే అందమైన ఒక పడక పై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా. *"మామాన్ మగళే!"* ఓ మామగారి కూతురా! *"మణి క్కదవం తాళ్ తిఱవాయ్"* మణులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా. ``` సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా, తొమ్మిది మణులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకూ భగవంతునికి ఉండే తొమ్మిదిరకాల సంబంధాలు తెలుసుకోవాలి.
1. మనందరికి తండ్రి ఆయనే!
2. మనందరిని రక్షించేవాడు ఆయనే
3. మనందరిని నావాళ్ళు అన కల్గిన వాడు ఆయనే- శేషి అంటారు.
4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు.
5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు.
6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే
7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు
8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు
9. భోక్తా ఆయనే. స్వీకరించగల వాడు ఆయనే
లోకంలో మనం ఏదో ఒక సంబంధం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంబంధాలు కల్గి, శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! ```
*"పితా రక్షకః శేషి భర్తా జ్ఞేయ స్వామి ఆధారః ఆత్మా భోక్తా"* అష్టాక్షరీ మహా మంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నో సార్లు ఈ విషయం చెప్పాడు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆగోపిక వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల వంటిది.
అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా వాళ్ళ స్థానాన్ని తలచుకున్నా మనం తరించిపోతాం. మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనియందు మనస్సు అనిపించదు, దీన్ని పోషించుకోవాలి, దీని కోసం దేన్నైనా వదిలెయ్యాలి అని ఇలా దేహ భ్రాంతి పెరిగిపోతుంది, ఈ తలుపు తెరుచుకోవాలి. ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకొంటే లోపలుండే వాడి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం. ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సిందే.
*"మామీర్!" ఓమేనత్తా, "అవళై ఎళుప్పీరో"* మీ కూతురుని లేపమ్మా. ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే, ఆయనే మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు. *"ఉన్ మగళ్ తాన్ ఊమైయో"* నీపిల్ల ఏమైనా మూగదా లేక *"అన్ఱి చ్చెవిడో"* చెవిటిదా లేక *"ఆనందంలో"* అలసిపోయిందా *"ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో"* ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా. శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం, ఆయన దగ్గర ఉంటే ఇక ఏమంత్రం పనిచెయ్యదు. అక్కడి నుండి బయటకు రావడం కష్టం. భగవత్ జ్ఞానం కల్గిన వ్యక్తి అలానే ఉంటాడు, ఇతరమైన మాటలు మాట్లాడడు. బయటి విషయాల్లో మూగవాళ్ళ వలె ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చెవిటివారివలె ఉంటారు. లౌకికమైన పనుల యందు అలిసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కాస్తుంటాడు. ఈ గోపిక అలాంటి జ్ఞాని.
అయితే లోపలగోపబాలిక తల్లి “అలా ఆక్షేపించకండి, ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా, లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది. మీరూ ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది”అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాం. ఏమేమి అని అడిగింది.
*"మామాయన్"* చాలా ఆశ్చర్యమయిన పనులు చేసేవాడు, ఒకనాడు అడివి దహించి పోతుంటే ఒక్కసారి ఇలా మింగేసాడు, మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు. ఎలాగో ఒకలాగ ఆయనపై మనస్సు పడేట్టు ఆయన మన బాగుకోసం చేసాడిన్ని పనులు. ఇవన్నీ దయ చేత కారుణ్యం చేత చేసాడు.
ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు ఆయనకు ఒకావిడ ఉంది, మన పాపాలను కనపడకుండా చేసే ఒకావిడ ఉంది, *"మాధవన్"* మా-లక్ష్మీదేవి ధవ-నాథుడు,లక్ష్మీదేవి సంబంధం కల్గిన వాడు ఆయన, మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడంలేదు, ఆయన *"వైకుందన్"* వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ- త్రిపాద్ విభూది అనిపేరు. అక్కడుండే వారంతా తన మనస్సు తెలుసుకొని ప్రవర్తించే వారు. అలాంటి వైకుంఠానికి నాథుడు. మన బాగుకోసం మనకోసం వచ్చాడు. ఇలా *"ఎన్ఱెన్ఱు"* ఎన్నెన్నో *"నామం పలవుం నవిన్ఱ్"* నామాలను పలుకుతున్నాం.
ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాళ్ తల్లి.'✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి