అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - జంబూద్వీపం - భరత వర్షము - మేరు పర్వతం - నలభై రెండవ భాగం
_________________________________________________
ప్రియవ్రతుడు తన పెద్ద కుమారుడైన అగ్నీధ్రునికి జంబూ ద్వీపానికి అధిపతిని చేశాడు. అగ్నీధ్రుడు శివునికి మహాభక్తుడు. నిత్యం శివుని పూజించి ఆరాధించేవాడు. జంబూద్వీపం తొమ్మిది వర్షాలుగా (దేశాలుగా) విభజించబడింది.
పరమేశ్వరుని ఆరాధించే అగ్నీధ్రుడికి తొమ్మిదిమంది కుమారులు కలిగారు. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావ్రతుడు, రమ్యుడు, హిరణ్మానుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే తొమ్మిది మంది కుమారులు తండ్రి లాగానే శివధర్మము పాటించే శివభక్తులు. కుమారులు పెద్దవారు, సమర్ధులు, శక్తిశాలురు అయిన తరువాత అగ్నీధ్రుడు వారిని తొమ్మిది వర్షాలకు (దేశాలకు) అధిపతులను చేశాడు.
జంబూద్వీప దక్షిణ భాగంలో గల హిమవర్షానికి నాభిని, హేమకూటము అనే వర్షానికి కింపురుషుడికి అప్పగించాడు. మేరు పర్వతము చుట్టుకుని ఉన్న ఇలావృత వర్షానికి ఇలావ్రతుని అధిపతిని చేశాడు. రమ్యుని నీలాంచల వర్షానికి , హిరణ్మానుడిని శ్వేత వర్షానికి రాజులను చేశాడు.
మాల్యవంత వర్షానికి భద్రాశ్వుడిని, కేతుమాలునికి గంధమాదన వర్షానికి రాజులను చేసి అగ్నీధ్రుడు తపస్సుకి వెళ్లాడు. శివాధాన్యంలో నిమగ్నుడై శివసాయిజ్యం పొందాడు. ఈ వర్షములలో నివసించు జనులు వేదధర్మాలు పాటిస్తూ సుఖంగా ఉన్నారు. వీరికి వృద్ధాప్యం, మృత్యు భయం లేదు. యుగముల ప్రభావము, లక్షణాలు లేవు. మహాదేవుని పూజిస్తూ పరమగతి పొందేవారు.
అగ్నీధ్రుడి జేష్ఠ పుత్రుడు, హిమవర్షాధిపతి అయిన నాభి మేరువతి అనే భార్య ద్వారా ఋషభుడు అనే పుత్రుని పొందాడు. ఋషభుడు రాజులందరిలో శ్రేష్ఠుడిగా గౌరవించబడేవాడు. ఋషభునికి మహావీరుడైన పుత్రుడు కలిగాడు. అతని పేరే భరతుడు. హిమాలయ పర్వతాలకు దక్షిణ భాగంలో కల వర్షానికి భరతుని అధిపతిని చేసి ఋషభుడు శివయోగియై అడవులకు వెళ్లి పరమపదించాడు.
భరతుడు అధిపతినైన వర్షానికి భరత వర్షము అని పేరు కలిగింది. భరతుడు ప్రజారంజకంగా, ధర్మబద్దంగా పరిపాలించి, రాజ్యభారము తన కుమారుడు సుమతికి అప్పగించి తపస్సుకై అడవులకు వెళ్లి పోయాడు.
జంబూద్వీప మధ్యలో మేరువు అనే మహాపర్వతము ఉంది. రత్నమయమైన శిలలతో మేరు పర్వతం ఎనభై నాలుగు వేల యోజనాల ఎత్తు కలిగి ఉంటుంది. భూమి లోపలికి పదహారు వేల యోజనాలు చొచ్చుకుని ఉంటుంది. తొంభై ఆరువేల యోజనాల విస్తీర్ణపు చుట్టుకొలత కలిగి లక్ష యోజనాల విస్తరించి ఉంటుంది. శిఖరం ముప్ఫైరెండు వేల యోజనాల విస్తీర్ణం ఉంటుంది.
పరమేశ్వరుడు స్పర్శ చేత ఈ పర్వతం బంగారు వర్ణం పొందింది. ఉమ్మెత్త పువ్వు ఆకారంలో ఉన్న ఈ పర్వతం పై సకల దేవతలు నిసిస్తుంటారు. మేరు పర్వతం తూర్పభాగం పద్మరాగ కాంతితో, దక్షిణ భాగం బంగారు కాంతితో, పడమర భాగం నల్లని కాంతితో, ఉత్తర భాగం పగడపు రంగు కాంతితో ప్రకాశిస్తుంటాయి. ఆదిశేషుడు పాతాళంలో ఈ పర్వతాన్ని తన పడగల పై మోస్తుంటాడు.
మేరు పర్వత తూర్పు భాగంలో ఇంద్రుని రాజధాని అయిన అమరావతి నగరం ఉంది. నగరంలో బంగారు భవనాలు రత్నాల గోపురాలతో ఉంటాయి. బంగారు తోరణాలు కట్టిన బంగారు సింహద్వారాలు విభిన్న ఆకారాలలో అమరావతిలో ఉన్నాయి. అమరావతి ప్రజలు నిత్యం ఉత్సవాలు జరుపుకుంటూ సుఖసంతోషాలతో ఉంటారు.
మేరు పర్వతం ఆగ్నేయ దిశలో అగ్నిదేవుడి నగరం "తేజస్వి" ఉంది. ఈ నగరం అమరావతి నగరంతో సమానంగా అన్ని వైభవాలు, సౌకర్యాలు కలిగి ఉంటుంది. నైరుతి దిశలో యముని రాజధాని నగరం "వైవస్వతి" ఉన్నది. నల్లని వర్ణంలో గల నగరంలో సువర్ణ భవనాలు, విశాలమైన రాజవీధులు కలిగి ఉన్నది.
మేరు పర్వతానికి నైరుతి దిశలో "శుద్దవతి" నగరం, వాయువ్య దిశలో "గంధవతి" నగరం, ఉత్తర దిశలో "మహోదయ" నగరం, ఈశాన్య దిశలో "యశోవతి" నగరం ఉన్నాయి. అన్ని దిశలలో సుందర నగరాలు గల మేరు పర్వతం పైన ఆకాశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిసిస్తుంటారు. మేరు పర్వత మధ్యభాగంలో యక్షులు, గంధర్వులు, మునులు, భూత గణాలు నివసిస్తారు.
మేరు పర్వతం పైన గల ఆకాశంలో వేయి యోజనాల విస్తీర్ణం గల విమానంలో సూర్యుడు చంద్రుడు అగ్ని నేత్రాలు గల పరమేశ్వరుడు పార్వతీదేవి, గణపతి, కుమారస్వామిలతో కలసి మణిమయ సింహాసనం పై విరాజిల్లుడై ఉంటాడు.
మేరు పర్వతపు ఆకాశంలో శివుని వామభాగంలో ఐదువందల యోజనాల విస్తీర్ణం గల విమానం లో విష్ణుమూర్తి, దక్షిణ భాగంలో ఐదువందల విస్తరం గల విమానంలో బ్రహ్మదేవుడు నిసిస్తుంటారు. మేరు పర్వతం పైన గల అన్ని నగరాలలో శివాలయాలు ఉన్నాయి. శివుని నిత్యం పూజిస్తుంటారు. సనకసనందాది మహర్షులు, సిద్దులు, యోగులు మేరు పర్వతం పై సంచరిస్తుంటారు.
మేరు పర్వత క్రింద భాగంలో జంబూనది నాలుగు వైపులా ప్రవహిస్తుంటుంది. ఈ నదికి దక్షిణ భాగంలో మహోన్నతమైన జంబూ వృక్షము ఉంది. నాలుగు దిశల వ్యాపించిన వృక్షము అన్ని కాలాలలో జంబూ ఫలాలను ఇస్తుంది. ఈ ఫలాల రసము చేతనే జంబూనది ఏర్పడింది. ఈ జంబూ ఫలాలను, రసమును అమృతంగా, ఆహారంగా ఇక్కడి ప్రజలు సేవిస్తారు.
మేరుపర్వతమునకు నాలుగు వైపులా విస్తరించి ఉన్న జంబూద్వీపపు తొమ్మిది వర్షాల (దేశాల) గురించి రేపటి భాగంలో చదువుదాం.
మీ అమూల్యమైన స్పందన కోరుతూ.
మీ
శ్రీకాంత్ గంజికుంట కరణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి