22, జనవరి 2026, గురువారం

- శ్రీ లింగ మహాపురాణం

  అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - శివ సంబంధ పవిత్రాగ్ని హోమము - నూట డెబ్భై తొమ్మిదవ భాగం

_________________________________________________________

స్రుక్, స్రువ సంస్కారాలు, నిరీక్షణ ప్రోక్షణ తాడన అభ్యుక్షణాది కార్యములు ఇంతకు ముందు చెప్పినట్టే మరల ఆచరించాలి స్రుక్, స్రువములను చేతుల్లోకి తీసుకోవాలి. ప్రథమ బీజ మంత్రముతో సంస్థాపన, తాడన కృత్యములు చేయాలి. స్రువము యొక్క కుశల మొదళ్లు, మధ్య, చివరల నుంచి మూడు సార్లు తాడనం చేయాలి.


'ఓం శక్తయే నమః' ఓం శంభవే నమః" మంత్రాలు పఠిస్తూ శివుని యొక్క కుడిచేతి వైపు స్రువమును కుశలపై ఉంచాలి. చతుర్థ బీజ మంత్రము పఠిస్తూ భక్తుడు స్రువము యొక్క దారాన్ని తన చేతికి కట్టుకుని దానికి పూజ చేయాలి. ధేనుముద్ర చూపాలి. చతుర్థ బీజమంత్రముతో మూసి షట్ బీజ రక్షకృత్యము ఆచరించాలి.


షట్ బీజమంత్రముతో ఈశాన్యం లోగల పాత్రలో గల నేతిని వేడి చేసి వేదిక పైన ఉంచాలి. పొడవైన దర్భను గుండ్రని ఉంగరము లాగా చుట్టి కుండలిని తయారు చేయాలి. కుండలిని చివరి భాగాన్ని ఎడమచేతి బొటనవ్రేలితో, చివర మధ్య భాగాన్ని అనామిక వ్రేలితో పట్టుకుని, స్వాహాతో అంతమయ్యే చతుర్థ బీజమంత్రముతో అగ్నిలో వేసి ఉత్పవన కృత్యము చేయాలి.


మరల ఆరు కుశలను తీసుకుని స్వాహాంత ప్రథమ బీజమంత్రముతో ఆత్మ సంపన్న కృత్యము చేయాలి. రెండు కుశల పవిత్ర బంధన కృత్యము ప్రథమ బీజమంత్రముతో చేయాలి. రెండు కుశల పై భాగాన్ని ఒకదానితో ఒకటి కట్టి కుండలిని ఘృతములో (నేతిలో) ఉంచి పవిత్రీకరణము చేయాలి. రెండు కుశలను తీసుకుని వాటి చివరలను కాల్చి వేదిక నాలుగు దిశలలో మూడు సార్లు తిప్పాలి. వాటిపై నీటిని చిలకరించి నేతిలో ముంచి అగ్నిలో వేయాలి. దీనిని నీరాజన కృత్యము అంటారు.


కుశలను అర్ఘ్య జలముతో శుభ్రపరచి తీసుకుని అగ్నిలో వేసి ఉద్ద్యోతన కృత్యము చేయాలి. రెండు కుశల చివరలను కొద్దిగా నేతితో తడిపి కలిపి, ముఖము యొక్క రెండు భాగములను శుక్ల (తెల్లని), కృష్ణ (నల్లని) రూపాలుగా స్మరించి సమర్పించాలి. ఘృతమును (నేతిని) మూడు భాగాలుగా విభజించి, మొదటి భాగాన్ని స్రువముతో తీసుకుని 'ఆగ్నేయ స్వాహా' అంటూ అగ్నిలో వేయాలి. రెండవ భాగాన్ని 'సోమాయ స్వాహా' అంటూ అగ్నిలో వేయాలి. మూడవ భాగాన్ని 'ఓం అగ్ని సోమాభ్యాం స్వాహా! అగ్నయే స్వాహా! శ్విష్టకృతే స్వాహా!' అంటూ అగ్నిలో ఆహుతి చేయాలి.


తిరిగి కుశల అగ్రభాగము నేతితో తీసుకుని సంహితామంత్రము చేత అభిమంత్రించాలి. కవచ, ధేను ముద్రలు చేసి, అస్త్ర మంత్రము చేత రక్షణ చేసి పవిత్ర ఆజ్యము పైన ఉంచి ఆజ్యసంస్కారం చేయాలి. తరువాత ముఖోద్ఘాటనము లేదా వక్త్రోద్ఘాటన సంస్కారం చేయాలి.


స్రువము చివరి భాగము నుంచి ఆజ్యమును శక్తి బీజమంత్రము చేత నాలుగు వైపుల త్రిప్పుతూ చక్రాభిధారణం చేస్తూ 'ఈశాన మూర్తయే స్వాహా' 'పురుష వక్త్రాయ స్వాహా' అఘోర హృదయాయ స్వాహా' ' వామదేవాయ గుహ్యాయ స్వాహా' 'సద్యోజాతాయ స్వాహా " అనే స్వాహా మంత్రాలతో ఆజ్య ఆహుతులు సమర్పించాలి వ దీనిని సంధాన కృత్యము అంటారు.


తరువాత "ఈశానమూర్తయే తత్పరుషాయ వక్త్రాయ, అఘోర హృదయాయ వామదేవాయ సద్యోజాతాయ స్వాహా" అనే వక్త్ర్యైకరణ కృత్యము చేయాలి. భక్తుడు ఈవిధంగా శివాగ్నిని ఉత్పన్నం చేసి అన్ని కార్యాలు ఎల్లప్పుడు చేయవచ్చును. లేదా ఒక జిహ్వాగ్నితో అన్ని శాంతి పుష్టికాది కార్యాలు చేయాలి.


సనత్కుమారా! గర్భాదానాదుల సంస్కారాలలో ఒక్కొక్కదానికి పది ఆహుతులు అగ్నికి సమర్పించాలి. యోని బీజమంత్రముతో శివాగ్నిలో ఐదు విధాల పరమ దివ్య ఆశాధారణలు చేయాలి. పూజా విధివిధానాలతో దేవతల ఆహ్వానము, ఉద్వాసన చేయాలి. మూలమంత్రము జపించి దేవదేవునికి నమస్కరించాలి. ప్రణవముతో మూడు సార్లు ప్రాణాయామం చేయాలి. జలమును చిలకరించి, నేతిని వేసి సమిధలను అగ్నిలో హవనం చేయాలి.


పాత్రలలో ఆజ్యము తీసుకుని రెండు భాగములను ఒకేసారి ఆరు ముఖాల నుంచి అగ్నిలో వేయాలి. రెండు సార్లు నైరుతి నుంచి, ఉత్తరం నుంచి వేయాలి. శివుని రెండు నేత్రాలు కుడి ఎడమ వైపు ఉంటాయి కనుక నేతి యొక్క రెండు భాగాలు పశ్చిమదిశగా కూర్చుని శివాగ్నిలో మూలమంత్రము జపిస్తూ పది ఆహుతులను సమర్పించాలి తరువాత చరువు, సమిధలు ఆహుతి ఇవ్వాలి.


భక్తుడు మూలమంత్రముతో పూర్ణాహుతి ఇవ్వాలి. శివునికి నలుదిశల ఉన్న దేవతలకు ఈశానాది క్రమములో శక్తిబీజ మంత్రము పఠిస్తూ ఒక్కొక్కరకి ఐదు ఆహుతులు సమర్పించాలి. చివరన అఘోర మంత్రము చేత ప్రాయశ్చిత్తం చేయాలి.


సనత్కుమారా! మూడు పద్దతులలో జరిగే అగ్ని కార్యమును వివరించాను. అవకాశము లభిస్తే ప్రతి దినము భక్తుడు చేయవచ్చును. అటువంటి భక్తుడు అగ్ని దీపక శక్తిని పొంది మోక్షము పొందగలడు. ముక్తి కోరుకునే వారు అహింసక హోమము చేయాలి. హృదయంలో అగ్నిదేవుని స్థిరపరచుకుని ధ్యానయజ్ఞ హోమము చేయవచ్చును. అందరిలో ఆత్మగా భాసిల్లే శివుని అనుభవం లోనికి తెచ్చుకుని భక్తితో ప్రాణాయామముతో మానసిక హోమము చేయవచ్చును.


తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.


మీ అమూల్యమైన స్పందన కోరుతూ.


మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

కామెంట్‌లు లేవు: