🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
9️⃣8️⃣``
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*98 వ రోజు*
*వన పర్వము తృతీయాశ్వాసము*
*హనుమంతుడు చెప్పిన యుగధర్మాలు*```
భీముడు “అన్నయ్యా! ఆయా యుగాలలోని ఆచారాల గురించి చెప్పవా?” అన్నాడు.
హనుమంతుడు ఇలా చెప్పసాగాడు
“భీమసేనా! కృతయుగంలో అన్నీ కృతములే కాని చెయ్యవలసినది ఏమీ లేదు. అందుకనే ధర్మం నాలుగు పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేదాలు తమకు విధించిన విధులు నిర్వర్తించారు. వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగాయి. కనుక వారు పుణ్యలోకాలు పొందారు. ఆ యుగంలో జనులకు అసూయ, ద్వేషము, గర్వము, మదము, మాత్సర్యము, కోపము, భయం, సంతాపం, ప్రజాక్షయం, అవయవక్షయం లాంటివి లేవు. తరువాత త్రేతాయుగం ఆరంభమైంది. ధర్మం మూడుపాదాలతో నడిచింది.
ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞయాగాదులు చేసే వారు, తపస్సులు చేసే వారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు.
ద్వాపరయుగం వచ్చింది. ధర్మం రెండు పాదాలతో నడిచింది. వేదములు, శాస్త్రములు విధించిన ధర్మము కామము అనుసరించబడ్డాయి. కాని ద్వాపరయుగంలో ప్రజలు మాటమీద నిలవరు, సత్యము శమము హీనమౌతుంది. ప్రజలు కామ్యార్ధం మాత్రమే యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజా రక్షణ చేస్తాడు. తరువాత వచ్చునది కలియుగం. ఈ యుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో లోకులను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామము, క్రోధము మొదలైన వాటికి వశులై అధర్మ వర్తనులై ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు, ధర్మము, దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి. కాని వాటికి ఫలితం విశేషంగా ఉంటాయి" అని హనుమంతుడు చెప్పాడు.
భీముడు "ఆంజనేయా ! అలనాడు నీవు సాగరం దాటిన భీమరూపాన్ని చూడకుండా నేను ఇక్కడ నుండి కదలను" అన్నాడు.```
*హనుమంతుడి బృహద్రూపం*```
ఆంజనేయుడు సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునకు చూపాడు. రెండవ మేరు పర్వతమా అని భ్రమింప చేసే ఆంజనేయుని విరాట్రూపం చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని ఉపసంహరింపమని హనుమంతుని వేడుకున్నాడు.
హనుమంతుడు రూపాన్ని ఉపసంహరించి “భీమసేనా! నీవు కావాలి అనుకున్న సౌగంధికా పుష్పములు ఉన్న కొలనును యక్షులు, గంధర్వులు సంరక్షిస్తుంటారు. అక్కడ నీ శౌర్యప్రతాపాలు పనికి రావు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తుంటారు. దేవతలు భక్తికి లొంగుతారు కనుక ధర్మమెరిగి ప్రవర్తించు. సదాచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం ప్రతిష్టించ బడుతుంది. వేదముల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలవలన దేవతలు సంతృప్తి చెందుతారు. దేవతలు తృప్తి చెందితే సకాల వర్షాలు పడి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆలోచించి నిర్ణయించుకో. పిల్లలతో, గర్వం కలవారితో, నీచులతో వ్యర్ధ ప్రసంగం చెయ్యవద్దు. నిన్ను చూస్తే సంతోషం కలుగుతుంది. నీకేమి కావాలో అడుగు. భీమా! నీకు, నీ వారికి అపకారం చేసిన కౌరవులు, దృతరాష్ట్రుడు మొదలైన వారిని సంహరించి హస్థినా పురం నేల మట్టం చెయ్యమంటావా?" అన్నాడు.
భీముడు "అమిత బలశాలివి అయిన మీకు అది అసాధ్యంకాదు. కాని మా శత్రువులను మేమే జయించడం ధర్మం కదా" అన్నాడు.
హనుమంతుడు “భీమా! యుద్ధభూమిలో నన్ను తలచిన ఎడల నేను అర్జునిని రథం మీద ఉన్న ధ్వజంపై ఉండి మీకు విజయం కలగడంలో సహకరిస్తాను. అలాగే మీ ధైర్య సాహసాలు ప్రత్యక్షంగా చూస్తాను" అన్నాడు.
తరువాత హనుమంతుడు భీమునకు సౌగంధికా సరోవరానికి మార్గం చూపి వెళ్ళి పోయాడు.```
*సశేషం*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి