17, సెప్టెంబర్ 2020, గురువారం

🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌻 వేదము సర్వాంతర్యామి. అది సృష్టి ఘనము. (అనగా సృష్టి అంతయు జరుగునట్టి విజ్ఞాన ప్రణాళికతో నిండి ఉండును.) వేదమతి విస్తారమైనది. (విత్తనము నుండి వృక్షము వలె సృష్టి విప్పారునట్టి ప్రణాళిక దాని యందు ఉన్నది). వేదమునకు పారము లేదు. (సృష్టికి ఆద్యంతములు లేవు.) వేదము అద్వితీయము (సృష్టిలో ఒకరినొకరు ద్వితీయములుగా కనిపింతురు. కాని అందలి మొత్తము ప్రణాళిక‌ అఖండము). అట్టి వేదమునే నిత్యము వల్లె వేయుచు, దాని మంత్రములచే ఉపాసించు వేదవాదులైన మహనీయులు కలరు. వారు ఆ మంత్ర ప్రయోగ కుశలతచే వివిధ గుణసముదాయమును దేవతలుగా ప్రత్యక్షము చేసికొనగలుగుచున్నారు. తమ ఉపాసన సామర్థ్యముచే ఇంద్రాది దేవతలను అర్చించుచున్నారు. ఈ‌ దేవతలు వారికి ఇష్ట దైవములు. వారెవ్వరును ఈశ్వరుని చూడలేకున్నారు.

(ఈశ్వరుడు అనగా వెలుపలి అంతర్యామి కాదు. సర్వజీవుల హృదయమునందును చూడబడవలసిన అంతర్యామి. వేద దేవతలను వేరుగా ఉపాసించి‌ ప్రత్యక్షము చేసికొనగల సమర్థులున్నారు. ప్రత్యక్షము చేసికొనుట అనగా తన కన్నా వేరుగా మాత్రమే చూడగలుగుట. తమ భావముల రూపములనే వారు దేవతలుగా ఆరాధించుచున్నారు. కనుకనే ఎవరి దేవుడు వారికి ఎక్కువ. ఎవరిమతము వారిది. ఎందరు ఉపాసకులు ఉందురో అందరు ఇష్టదైవతములు ఉందురు గదా! ఒకే దేవత విషయమున ఇద్దరు సాధకులు వేరు వేరు రూపములను కల్పించుకొనుచున్నారు. మార్కండేయుడు చూచిన శివుడు వేరు, రావణాసురుడు చూచిన శివుడు వేరు. ఇద్దరు విష్ణు భక్తులు నారాయణ మంత్రమును ఉపాసించినను ఎవరి విష్ణువు వారికి ప్రత్యక్షమగును. ఒకరి విష్ణువు శత్రువులను చంపును. ఇంకొకరి విష్ణువు లోకములను కాపాడును. అదితికి ప్రత్యక్షమైన విష్ణువు వామనుడై, దితికొడుకుల నుండి రాజ్యమును హరించి అదితి కొడుకులకు ఈయవలెను. ఈ విధమైన మార్గము పేరు భక్తియైనను, పూజయైనను, వ్రతమైనను, యజ్ఞమైనను, మంత్రోపాసనమైనను అంతర్యామిదర్శనము ఈయదు. శివమంత్రము చేసినను, విష్ణుమంత్రము చేసినను అంతర్యామి కనబడడు. అంతర్యామిని సాధించుటకై ఇంకను పెద్దమంత్రము ఎచ్చట ఉండునో వెదకుచుండును. ఇంకను పెద్దలు దాచిపెట్టిన తంత్ర రహస్యములు ఉన్నవని సాధించుటకై తిరిగి త్రిప్పలు పడుచుందురు.

ఒక వాణిజ్య సంస్థలో అనేకులు పని చేయుచుందురు. వాణిజ్యము వారిలో ఎవ్వరికిని చెందదు. తమ జీతము మాత్రమే తమకు చెందును. అందొక్కడు పని ఎక్కువగుట వలన ఎవనినో పెట్టి పని చేయించుకొని జీతము ఇచ్చును. అతని దగ్గర పని చేయుచున్న వానికి అతడే యజమాని గాని వాణిజ్యమునకు యజమాని ఎట్లుండునో వాడెరుగడు. అట్లే వేదములు చదువువారు వేదము ఎట్లుండునో ఎరుగకపోవచ్చును. వేదమంత్రముల ప్రయోగము చేయువారు ఫలసిద్ధిని పొందుచున్నను ఆ మంత్రములు ఎందులకో తెలిసి ఉండకపోవచ్చును. తాము ఆ ఫలసిద్ధిని ఎందులకు కోరిరో తమకే తెలియదు గదా? లక్ష్మిని పూజించి లక్ష్మీ మంత్రము జపించి ఒకడు ధన ధాన్య వస్తుసంపదలను, గృహములను, భార్యను, బిడ్డలను కోరి పొందవచ్చును‌. కాని తాను అట్లు ఏల కోరెనో తనకే తెలియదు కనుక లక్ష్మీదేవి అంతర్యామి అని తెలియుట సాధ్యము కాదు. ఎవరైనను చెప్పినను నమ్ముటలో గూడ అంతర్యామిత్వముండదు.
తాను పూజించు లక్ష్మి అంతర్యామి అనియును, తక్కినవారు పూజించు లక్ష్మి అంతర్యామి కాదనియు కూడ నమ్మవచ్చును.

ఈ విధముగనే యజ్ఞయాగాది క్రతువులలో దేవతలను అర్చించు వేదవాదులున్నారు‌ "ఈ వేదవాదులు తాము ఎరిగిన దానిని అంగీకరింపనివారు, కామాత్ములు, స్వర్గపరులు" అని కృష్ణుడు గీతలో హెచ్చరిక చేసెను. "వేదములు త్రిగుణములు లక్ష్యములుగా గలవి. నీవు త్రిగుణములను విడిచిపెట్టుము" అని కూడ హెచ్చరిక చేసెను. విడిచిపెట్టవలసినది త్రిగుణములనే గాని వేదములను కాదు. త్రిగుణములు లేకుండా వేదములు లభింపవు. "పొట్టు లేకుండ ధాన్యము లభింపదు. దంచి పొట్టును తొలగించి గింజలను స్వీకరింపవలెను" అని ఆముక్తమాల్యదలో కృష్ణరాయలు హెచ్చరిక చేసెను.).......✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 873,874(For more Information about Master EK Lectures please visit www.masterek.org).

**మనసున్నవారికే మంత్రశక్తి**


!!మననాత్ త్రాయతే ఇతి మంత్రః!! మననం చేసేవారిని రక్షించేది మంత్రం. మననం అంటే జపం.మంత్రం-మంత్రశక్తి అనగానే పాతసినిమాలలో svr గారిలా చేసే ఇంద్రజాలం అనుకుంటారు కొంత మంది. కొంత మందికి అసలు మంత్రాలమీద నమ్మకమే ఉండదు....వాళ్లకి వాళ్లే సర్దేసుకుంటారు....ఎవరికీ ఏకీడు చేయకుండా మన బ్రతుకు మనం బ్రతికితే చాలు ఈ మంత్రాలు తంత్రాలు ఎందుకమ్మా అని.....😂.
నిజానికి అది తత్త్వ చింతన కాదు,మానసిక పరిణతి అసలు కాదు,అవగాహన రాహిత్యం,లేదా నిజమైన గురువులు,మంత్ర ప్రభావం తెలియకపోవడం. మనచపూర్వజన్మ కర్మ ప్రకారం మన జన్మ నక్షత్రం, లగ్నం మనకు ఉంటాయి.వాటికి సరిపోయి సిధ్దిని కలిగించే దేవతను తెలుసుకుని మంత్రజపం చేయాలి. నిజమైన గురువు ఎప్పుడూ ఎవరడిగితే వారికి మంత్రాలు వెదజల్లడు.ఆ శిష్యుని యొక్క మంత్ర అరవణం,అడకచక్రం పరిశీలించి...కొంతకాలం శుశ్రూష చేయించి,ఆ వ్యక్తి ని పూర్తిగా గమనించి అప్పుడు తగు మంత్రం ఉపదేశిస్తాడు. ప్రతి మంత్రానికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతకు ప్రీతి కలిగించే విధంగా ఆ మంత్రజపం చేసే వ్యక్తి యొక్క జీవన విధానం ఉండాలి.నియమ నిబంధనలు ఉంటాయి.విధినిషేధాలు ఉంటాయి. వాటిని నిర్వర్తిస్తూ క్రమపద్ధతిలో చేసిన మంత్రజపం ఖచ్చితంగా సిద్ధిని(శక్తిని, ఫలితాన్ని) ఇస్తుంది. మంత్రం ఎప్పుడూ సిధ్దిని పొందిన గురువు దగ్గరే తీసుకోవాలి. ఆ గురువును జీవిత పర్యంతం గౌరవభావంతో చూడాలి. ఇక అరవణం కుదరని మంత్రాలు తీసుకోవడం వలన చాలా విపరీతాలు జరుగుతాయి. ఒక్కొక్క సారి జీవితం తారుమారైపోతుంది.మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటారు కొందరు.... కానీ చింతకాయలు కాదు తలకాయలే రాలుతాయి.నా పూర్వజన్మ సుకృతం వల్ల నేను అటువంటి మంత్రద్రష్టలను దర్శించి సేవించుకునే భాగ్యం దక్కింది.నా గురువు ఒక మహా మంత్ర ద్రష్ట.నా శ్రీ విద్యాగురువు కూడా తద్దేవతా స్వరూపులు(కామెంట్ లో మీ గురువు ఎవరు అని అడగకండి నేను చెప్పను)కనుక నా స్వానుభవంలో మంత్రసిధ్దిని పొందిన వారిని చూసాను,మంత్రం వదిలేసి భ్రష్టులైనవారినీ చూసాను.ఇది మంత్రం యొక్క ఒకవైపు రూపం. ఇంకొక వైపు మంత్ర జపం చేసేవారు నిర్మల మనస్కులై ఉండాలి. హింస,దూషణ,ఈర్ష్య, లోభత్వం ఉండకూడదు. అప్పడే ఆ దేవత ప్రీతి చెంది అనుగ్రహిస్తుంది.నిష్కల్మష మనస్సు తో ప్రార్ధించి రోదించాడు కనుకనే గోపన్న కాళిదాసు అయ్యాడు. అమ్మవారు స్వయంగా తేనే తాగించింది ఆయనకు. ఆయన నోటి నుండి అనాలోచితంగా వచ్చిన మాటలు కూడా నిజమయిన దృష్టాంతాలు కాళిదాసు చరిత్ర లో మనం చూడవచ్చు. స్వకర్మ బుధ్దితో,దేవతా సమర్పణయుతంగా చేసిన మంత్రజపం అద్భుతమైన శక్తులను కలిగిస్తుంది. దానికి పునాది మంచి మనసు....కనుక మనస్సు కలిగిన వారికే మంత్ర సిధ్ది లభిస్తుంది.... స్వస్తి
సర్వజన శ్రేయోభిలాషి
మీ సవ్యసాచి....✍️

🌸 *శ్రీమద్భాగవతము* 🌸


🌻 చతుర్ముఖ బ్రహ్మ, శివుడు, మనువులు, దక్షాది ప్రజాపతులు, నిష్ఠాపరులైన సనకసనందనాది మునులు, మరియు పులస్త్యుడు, భృగువు, పులహుడు, క్రతువు, అత్రి, మరీచి, వసిష్ఠుడు, అంగిరసుడు మొదలగు మహర్షులును బహు పుణ్యములు ఆర్జించిన వారగు బ్రహ్మవాదులు. అందురును వాక్కును జయించి ఈశ్వరత్వమును సాధించుకొన్నవారు. నిరంతర తపస్సు, యోగసాధన చేసి సమాధి పొందినవారు‌. పరిపూర్ణ మనస్సుతో నిరంతర దైవధ్యానము చేయుచున్నారు. వారైనను భగవంతుని సర్వసాక్షిగా గుర్తుంచుకొనినపుడే ముక్తులగుచున్నారు‌. లేనిచో వారికి గూడ అన్వేషణము చేసియు చూడలేని స్థితి కలుగును.

(ఇట్లనుటచే వీరందరిని తక్కువ చేయుటగాదు. వీరందరును సృష్టింపబడినవారే కనుక పుట్టుకచే అంతర్యాములు కాజాలరు. భగవంతుడు తత్త్వము చేతనే అంతర్యామి. అతని యందు సృష్టి అంతయు జరుగుచున్నను అతనికి ఏమరుపాటు కలుగుట సంభవము కాదు. తపస్సు, యోగము, వేదాధ్యయనము మున్నగునవి ప్రత్యేక లక్ష్యములుగా గమనింపబడినపుడు అంతర్యామి కన్నా వేరుగా గమనింపబడును. అప్పుడు తన సాధన మార్గము మాత్రము దృష్టి యందుండి అందలి అంతర్యామి గుర్తుండడు. ఈ స్థితి దాటునంతగా సర్వకాలములందును, సర్వసాధనములందును సాక్షిగా అంతర్యామిని గుర్తించుచుండవలెను. సాక్షి అనగా స+అక్షి= కన్నులు గలవాడు, చూచువాడు అని అర్థము. ఈ ఋష్యాదులు ఒకరిని ఒకరు చూచి వ్యవహరించుకొనవలెను కనుక చూడబడుచున్నది అంతర్యామియే అని మరువరాదు. ఈ గుర్తింపు చెదరినచో ఎదుటివారు కనుపించి అంతర్యామి మాయమగును.

పై చెప్పిన వారిలో బ్రహ్మకు గూడ ఇట్టి స్థితి కలుగవచ్చును. చతుర్ముఖుడు అహంకరించి కృష్ణుని పరిశీలింపవచ్చుట, రుద్రుడు మోహినీ రూపమును చూచి మోహితుడు అగుట, దక్షుడు గర్వించి పరమేశ్వరునిపై పగబూని శిరశ్ఛేదము పొందుట, సనకాదులు వైకుంఠమున జయ విజయులను శపించి‌ వారి రాక్షస జన్మములలోని దుండగములచే పరాభవింపబడుట ఈ దృష్టి చెదురుటకు నిదర్శనములు. ఈ కథలన్నియు సోపానక్రమమున భాగవత గ్రంథమున కూర్పబడినవి.)......✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 872(For more Information about Master EK Lectures please visit www.masterek.org).

సంగమేశ్వర ఆలయం

*🌸సంగమేశ్వర ఆలయం-ఏడునదులు కలిసే ప్రదేశం-8 నెలలపాటు నీటిలో-4 నెలలు -దర్శనభాగ్యం*🌸

🙏 ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం

జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ... నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది.

పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో... ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు .. ప్రతిష్ట సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.

ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా... అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు.

అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు.

ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు.
ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది . అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి.

ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.

కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న 'మచ్చుమర్రి' గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని , అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. స్వంతవాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్‌.టి.సి.వారు బస్సులను నడుపుతారు.తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.🙏🏻

        మీ
మురళీమోహన్

అభ్యంగన స్నానం



మానవుడికి స్నానం అనునది ఒక భోగం. ఒక యోగం. స్నానాన్ని ఏదో ఒళ్లు తడిపాము అన్నట్లుకాక తనువు మనసు తడిచేలా అనుభూతి చెందుతూ స్నానం ఆచరించాలి. చన్నీటి స్నానం శిరస్సు నుంచి ప్రారంభించాలి. వేడి నీటి స్నానం పాదాల నుంచి ప్రారంభించి తరువాత శరీరం తడపాలి. పురుషులు విధిగా రోజూ శిరస్నానం ఆచరించాలి. పర్వదినాలలోనూ, జన్మదినముననూ, విశేష క్రతువుల ప్రారంభంలోనూ అభ్యంగన స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి.

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. శరీరానికి తైలాన్ని (నువ్వులనూనెను) బాగా రాసి మర్దన చేసి నలుగు పిండితో ఒళ్ళు రుద్దుకుని గోరువెచ్చటి నీటితో స్నానం చేయడాన్ని 'అభ్యంగన(తలంటి)స్నానం' అంటారు. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు.

'అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం' (అభ్యంగన స్నానం అన్ని అవయవాలూ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మిక రీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడింది.

అయితే అభ్యంగన స్నానం నిత్యం చేయకూడదు. శ్రాద్ధ దినములయందు, ఆది, మంగళ వారములు, పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్ధశి తిధులయందు అభ్యంగన స్నానం చేయకూడదు. అనివార్యమై చేయవలసి వచ్చినప్పుడు ఈ కింద సూచించిన విధము చేయడం వలన దోషము తొలిగి శుభం కలుగుతుంది.

అభ్యంగన స్నాన వారదోషములు

ఆదివారం - తాపము. నివారణకు నూనెలో పుష్పములు.
సోమవారం - కాంతి, మనోల్లాసము.
మంగళవారం - మృతి. నివారణకు నూనెలో మన్ను.
బుధవారం - లక్ష్మీ కటాక్షము.
గురువారం - ధన నాశం. నివారణకు నూనెలో గరిక.
శుక్రవారం - విపత్తు. నివారణకు నూనెలో గోమయం.
శనివారం - భోగము

అయితే పండుగ, శుభదినములకు ఈ దోషము వర్తించదు. స్త్రీలకు గురు, శుక్రవారములు శుభములు....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193447

శుక్రవారం గుడికి వెళ్తున్నారా ?

శుక్రవారం పూట ఆలయాలను సందర్శించుకోవడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే..?

దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, కన్యలు సంప్రదాయ దుస్తులను ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వంటి ధరించాలి. జీన్స్ టీ షర్టులు వంటి ఆధునిక వస్త్రాలు ధరించరాదు.పురుషులైతే పంచ కండువా లేదా కుర్తా పైజామా వంటి సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. నుదుట కుంకుమ రంగుతో కూడిన బొట్టు పెట్టుకోవాలి.

ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడం, విభూతిని నుదుట బొట్టుకు పైన పెట్టడం చేయాలి. విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టెలను అప్పు తీసుకుని దీపమెలిగించడం కూడదు.

ఇక శుక్రవారం ఉదాహరణకు విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తున్నారంటే.. గరిక మాలతో తీసుకెళ్లండి. గరికమాలను వినాయకునికి ప్రతిశుక్రవారం సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, సర్వ శుభాలు చేకూరుతాయి.

ఇదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకునే భక్తులు తులసీ మాలతో వెళ్లండి. అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకునే వారు వెన్నముద్దతో వెళ్లడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

అదేవిధంగా దుర్గమ్మతల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

                            .

'పంచ' దంపతులు!!

ప్ర 'పంచ' దంపతులు!!💐శ్రీ💐

ఈ లోకంలో..కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా..
5 విధాలుగానే ఉంటారు.
💐💐💐💐💐💐
మొదటిది లక్ష్మీనారాయణులు
💐
విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి,
అక్కడే లక్ష్మి ఉంటుంది,
అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై..
ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో..
ఆ జంట లక్ష్మీనారాయణుల జంట.
💐💐💐💐💐💐

రెండవది గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం💐

తలనుంచి కాలిబొటన వ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు,
రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,
ఆలోచనలకు తల, కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం,
కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.
💐💐💐💐💐💐

మూడవది బ్రహ్మ సరస్వతుల జంట.💐

బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం,
దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని.
ఇలా ఏ మాట మాట్లాడినా,
ఆ భార్య మాటే మాట్లాడే భర్త,
ఆభర్త మాటే మాట్లాడే భార్య ..
ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.
💐💐💐💐💐💐

నాల్గవది ఛాయా సూర్యులు.💐

సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు,
అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.
తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు,
విపరీతమైన తీక్షణత కలవాడు.
అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది,ఛాయాదేవి.
ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా ,పట్టుదలతో ఉంటాడో.
ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.
💐💐💐💐💐💐

ఐదవది రోహిణీ చంద్రులు.💐

రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే
సామెత ఉంది,
చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ,
ఏ జంట భర్త మెత్తగా ఉండి,
లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో,
భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోను ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.💐

ఈ 5 జంటలలో మీరు ఏ జంటలో ఉన్నారు..!!💐💐💐💐💐💐

లోకా సమస్తా సుఖినోభవంతు..!!💐

  💐శ్రీ మాత్రే నమః💐

రామాయణమ్..80


.

చిత్రకూటానికి ప్రయాణమయ్యారు సీతారామలక్ష్మణులు వారివెంట భరద్వాజమహర్షికూడా దారిచూపడానికి వెంట కొంతదూరము ప్రయాణించాడు.
.
రామా ! ఈ మార్గములో నేను చాలా సార్లు చిత్రకూటమునకు వెళ్ళాను. ఇది ఏ విధమైన ఇబ్బందులు కలుగని మార్గము.
ఇక్కడ నుండి గంగాయమునల సంగమప్రదేశానికి వెళ్ళండి అక్కడనుండి పడమటిదిక్కుగా యముననే అనుసరిస్తూ వెళ్ళండి.
.
అలా ప్రయాణించిన తరువాత కాళిందిని తెప్పనిర్మించుకొని దాటండి .దాటినపిమ్మట మీకు శ్యామము అనే అతివిశాలమైన మర్రిచెట్టు కనపడుతుంది.ఆ వృక్షాన్ని ఆశ్రయించి అనేకమంది సిద్ధులుంటారు.అక్కడ సీత ఆ వృక్షానికి నమస్కరించి కావలసిన కోరికలు కోరవచ్చును .
.
ఆ పెద్ద మర్రిచెట్టు దాటి ముందుకు ఒక క్రోసు దూరము వెళ్ళండి అక్కడ చక్కటి నీలపురంగులో ఉండే అడవి కనపడుతుంది .
అది మోదుగుచెట్లతోనూ,రేగుచెట్లతోనూ,వెదురుడొంకలతోటి కూడి రమణీయంగా ఉంటుంది .
ఆ మార్గమే చిత్రకూటమునకు వెళ్ళే మార్గము.ఈ విధముగా మహర్షి మార్గనిర్దేశము చేసి తాను రామునికోరికమీద వెనుకకు మరలి నాడు.
.
మువ్వురూ యమునాతీరంచేరారు.యమున ప్రవాహం వేగం మంచి ఉధృతంగా ఉంది.దానిని ఎలా దాటాలా అని కాసేపు ఆలోచించి ,చకచకా కొన్ని ఎండిన కర్రలు,వెదురుకర్రలు సేకరించి వాటన్నిటినీ దగ్గరగా చేర్చి కట్టిఒకతెప్పతయారుచేసుకొన్నారు .
.
లక్ష్మణుడు రకరకాలచెట్ల కొమ్మలు తీసుకొని వచ్చి సీత సుఖంగా కూర్చోవడానికి వీలుగా ఒక ఉన్నతమైన ఆసనం సిద్ధం చేశాడు.
.
ఆ తెప్పమీదికి ఎక్కడానికి కాస్తసిగ్గుపడుతున్న సీతమ్మకు చేయూతనిచ్చి ఎక్కించాడు రామచంద్రుడు.
.
మూటకట్టినసీతఆభరణములు,గునపము,
మేకతోలుతోచేసినచిన్నపెట్టెను,
ఆయుధాలను సీతప్రక్కనే ఉంచాడు రాఘవుడు.
.
ఇరువురు అన్నదమ్ములూ తెడ్లేసుకుంటూ దానిని నడుపసాగారు సూర్యపుత్రిక అయిన ఆ నది మధ్యభాగంలోకి వెళ్ళగనే సీతమ్మ మరల మొక్కులు మొక్కుకుంది .
.
అమ్మా రాముడు క్షేమంగా తిరిగి అయోధ్యకు రాగానే నీకు వందకుండల కల్లు వేయి గోవులు సమర్పించుకుంటానమ్మా అని నదీమతల్లికి మొక్కులు మ్రొక్కింది.
.
ప్రయాణించి వచ్చిన తెప్పను అచటనే వదిలివేసి మరల నడకసాగించారు .వనములగుండా ప్రయాణం చేస్తూ శ్యామము అనే మర్రిచెట్టు వద్దకు వచ్చి చేరారు.
.
ఆ మర్రిచెట్టు చుట్టూ సీతమ్మ మరల ప్రదక్షిణం చేసి తన భర్త నిర్విఘ్నముగా వనవాస వ్రతము పూర్తిచేయాలని కోరికలు కోరింది.
.
మరల నడక మొదలు పెట్టారు . లక్ష్మణుడు ముందు తరువాత సీతమ్మ ఆవెనుక ధనుర్ధారియై రామయ్య.
దారిలో ఏదైనా అందమైన పొదగానీ ,పువ్వుగానీ కనపడినప్పుడు రామచంద్రుని దాని విశేషమడుగుతూ ఆయన చెపుతూ ఉంటే ఈవిడ చిన్నపిల్లలాగా ఆనందిస్తూ ముందుకు సాగుతున్నది.
వదినగారు ఏ పూవును పండును అయితే చూసి విశేషమడిగారో వాటిని సేకరించి మరిది లక్ష్మణుడు తీసుకొని వచ్చి ఆవిడకివ్వటం... ఇలా సాగుతున్నది వారి ప్రయాణం.

రామాయణమ్. 81
..
రాత్రి గడిచింది .అందరికన్న ముందుగా రాముడు నిద్దుర లేచాడు.ప్రక్కకు తిరిగి చూస్తే తమ్ముడు ఇంకా నిద్దురపోతూనే కనిపించాడు.
సోదరుడిని మెల్లగా తట్టి నిద్రలేపాడు .లక్ష్మణా ! వనంలో సంచరించే ప్రాణుల ధ్వనులు ఎంత మధురంగా ఉన్నాయో విను.ఇది మరల మనము బయలుదేరే సమయం త్వరగా ప్రయాణం సాగించాలి.
.
అన్నగారిచేత మేలుకొలుపబడ్డవాడయిన లక్ష్మణుడు నిద్రను,బద్ధకాన్ని వదిలించుకొని లేచి యమునలో స్నానంచేసి ప్రయాణ సన్నద్ధుడైనాడు.
.
భరద్వాజ మహర్షి చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ చిత్రకూటం వైపు సాగిపోయారు.
.
మార్గంలో సీతకు వనశోభను చూపిస్తూ సీతా చూశావా ఈ కింశుకవృక్షాలు! వాటిపూలను అవే మాలలు గ్రుచ్చి వేసుకొన్నట్లుగా ఉంది.ఎర్రటిపూలతో మంటపెట్టినట్లుగా ఉంది.
.
శిశిరం వెళ్లిపోయింది. అందుకే అడవంతా విరగబూసింది .సీతా ఇటు చూడు ఈ భల్లాత(జీడి) వృక్షము పూలు పండ్లతో భారం మోయలేక వంగిపోయి ఉంది.ఇవి అందించే మధురఫలాలను తినడానికి నరులెవ్వరూ ఇచటలేరు కదా!
.
లక్ష్మణా ! అదుగో చూశావా ప్రతిచెట్టుమీదా తేనెపట్టు ఉంది.ప్రతి తేనేపట్టు ఎంతో పెద్దగా ఉండి నేలను తాకుతున్నట్లుగా ఉన్నాయి.
.
ఎక్కడ చూసినా పూలే ! నేల అంతా పరుచుకొని రహదారిని కప్పివేసి సున్నితమైన సీతమ్మపాదాలకు రక్షణగా ఉన్నాయవి..
.
వానకోయిలకూస్తుంటే దానికి సమాధానంగా నెమలి క్రేంకారం మనోహరంగా శ్రవణానందకరంగా ఉన్నది.వనమంతా పక్షుల కూజితాలతో సందడిసందడిగా ఆహ్లదకరంగా ఉంది.
.
ఎదురుగా ఎత్తైన శిఖరాలతో చిత్రకూటం కనపడుతున్నది .దానిమీద గుంపులుగుంపులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి.
.
లక్ష్మణా మనోహరమైన ఈ గిరిశిఖరాలమీద ఉండాలనే ఉత్సాహం ఊరిస్తున్నదయ్యా! అందాలుచిందించే ఈ చోటు చోడు కంటికి బహుపసందయిన విందుగావిస్తున్నది.
ఈ తరులు,ఈ గిరులు ఎంత రమణీయంగా ఉందో ఈ ప్రదేశం .
ఇక్కడే మనం నివాసం ఏర్పరచుకొని సుఖంగా జీవించవచ్చు.
.
ఆ ప్రదేశంలో ఎందరో మునులు స్థిరనివాసం ఏర్పరచుకొని తాపసవృత్తిలో జీవిస్తున్నారు.వారందరినీ చూశారు వారు.
.
ముందుగా వాల్మీకి మహర్షి ఆశ్రమం చేరుకొని ఆ మహానుభావుడికి నమస్కరించి వినయంగా నిలుచున్నారు మువ్వురు.వారి ఆగమనానికి మహర్షి ఆనందించి వారిని తగురీతిగా సత్కరించి కూర్చోమని ఉచితాసనాలిచ్చినాడు.
.
రాముడు తమను తాము మహర్షికి పరిచయం చేసుకొని తమ రాకకు గల కారణాన్ని మహర్షికి తెలిపి,లక్ష్మణుని వైపు తిరిగి లక్ష్మణా మనం ఇక్కడ నివసించటానికి యోగ్యమైన ఒక గృహాన్ని నిర్మించవలె అందుకు కావలసిన సామాగ్రిని సేకరించమని కోరాడు.

తెలుగు పద్యమంటే...



తెలుగువాళ్ళకి తెలుగుపద్యమంటే ఏమిటో చెప్పాల్సిన అవసరమేముందీ అని దీర్ఘం తీస్తున్నారా?
నిజమే, కానీ "పద్యం" అన్న పదానికి కాలక్రమంలో నానార్థాలు ఏర్పడ్డాయి కదా. కాబట్టి స్పష్టతకోసం ఈ వివరణ.

కొందరు పద్యం అన్న పదాన్ని కవిత్వానికి పర్యాయపదంగా ఉపయోగిస్తారు. ఛందోబద్ధమైనా కాకపోయినా కవితాఖండికని పద్యం ఆంటూ ఉంటారు. కానీ నా నిర్వచనం అదికాదు.
ఛందోబద్ధమైన అక్షర సముదాయం పాదం. అలాటి పాదాల సమాహారం పద్యం. ఇదీ నా నిర్వచనం.
"పద సముదాయం" అని కాకుండా "అక్షర సముదాయం" అని ఎందుకన్నానూ అంటే, తెలుగులో, ఒక పదంలో కొంత భాగం ఒక పాదంలోనూ మరికొంత రెండవపాదంలోనూ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ పద్యం చూడండి:


శ్రీరఘురామ, చారు తులసీ దళ ధామ, శమ క్షమాది శృం
గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, దు
ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

ఇందులో ఏ పాదం తీసుకున్నా చివరి పదం కొంతభాగమే ఆ పాదంలో ఉండి మిగతాభాగం రెండవ పాదంలోకి వెళుతోంది.
అయితే, ఈ నిర్వచనంలో ఒక చిన్న చిక్కుందండోయ్!

తాన తాన తాన తానాన తానాన
తాన తాన తాన తాన తాన
తాన తాన తాన తానాన తానాన
తాన తాన తాన తాన తాన

పైది ఛందోబద్ధమైన పాదాల సమాహారమే. కానీ పద్యం కాదు, దానికి అర్థం లేదు కాబట్టి. అందువల్ల పద్యాన్ని ఇలా నిర్వచించుకోవచ్చు.

"ఛందోబద్ధమైన అక్షరాల సమాహారం పాదం. పాదాల అర్థవంతమైన సమాహారం పద్యం".

తెలుగు పద్యం‌ అంటే జనం ఎందుకు పారిపోతున్నారు?

ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.

అబ్బే, అలాంటి దేమీ‌ లేదూ.  తెలుగు పద్యానికి బ్రహ్మాండమైన ఆదరణ ఉందీ,  జనం‌ ఎగబడి తెలుగు పద్యాలు చదివి సంతోషిస్తున్నారూ అని యెవరైనా అంటే వాళ్ళు అయితే వంచన చేస్తున్నారనైనా అనుకోవాలి లేదా ఆత్మవంచన చేసుకుంటున్నారనైనా అనుకోవాలి.

ఒకప్పుడు సంస్కృతభాష మాత్రమే కావ్యాలు వ్రాయటానికి తగిన మాధ్యమం అనుకునే వారు.  అయితే‌ కాల క్రమేణా దేశీయ భాషల్లోనూ కావ్యాలు రావటం మొదలయింది.

కన్నడంలో పావులూరి మల్లన అనే ఒక తెలుగు కవి మహాభారతకథను ఒక గ్రంథంగా రచించాడు.  ఆయన జైనుడు కాబట్టి ఆ గ్రంథంలో అందరూ జైనులు. పాండవులు మహాశ్వేత భక్తులు ఇత్యాది. ఆర్షమతానికి జైనం సవాలు విసరటం ఒక కారణంగా, దేశభాషలో మహాభారతాన్ని అందించాలని నన్నయభట్టారకులవారి ప్రయత్నం మెదలయింది.  అయితే నాటి చదువరులు పూర్తి దేశభాషాకవిత్వన్ని మెచ్చే పరిస్థితి లేదు కాబట్టి చాకచక్యంగా తెలుగు సంస్కృతాల మిశ్రమ భాషలో అందంగా నన్నయ గారు వ్రాసారు.  ఒక పద్యం చూడండి ఉదాహరణకు:

మ. వివిధోత్తుంగ తరంగఘట్టన చలద్వేలావనైలావలీ
లవలీలుంగలవంగసంగత లతాలాస్యంబు లీక్షించుచుం
ధవళాక్షుల్ సని కాంచిరంత నెదుటం దత్తీరదేశంబునం
దవదాతాంబుజ ఫేనపుంజనిభు నయ్యశ్వోత్తమున్ దవ్వులన్

మీరు తెలుగువారై ఉండి తెలుగుభాషలో మంచి పాండిత్యం ఉన్నవారై ఉంటే ఈ‌పద్యం అర్థం అవుతుందా?

ఎంతమాత్రం కాదు. ఈ‌ పద్యంలో ఉన్న మాటలనుభాషల వారీగా పట్టీ వేస్తే అలా యెందుకన్నదీ బోధపడుతుంది.

వివిధ, ఉత్తుంగ, తరంగ, ఘట్టన, చలత్, వేలా, వన, ఇలావలీ, లవలీ, లుంగ, లవంగ, సంగత, లతా, లాస్యం, ఈక్షించు, ధవళ, అక్షి, చని, కాంచు, అంత, ఎదుట, తత్, తీర, దేశంబు, అవదాత, అంబుజ, ఫేన, పుంజ, నిభ, ఆ, అశ్వ, ఉత్తమ, దవ్వు.

ఇందులో‌ఎన్ని తెలుగు మాటలున్నాయి? చని, కాంచు, అంత, ఎదుట, ఆ, దవ్వు. ఈ‌ కాసిని మాటలేగా?  మిగతావన్నీ సంస్కృత పదాలే!

అందు చేత ఈ పద్యం చదివి ఆనందించాలీ అంటే తెలుగు పాండిత్యం అక్కరకు రాదు.  సంస్కృతంలో‌మంచి ప్రవేశం ఉండి తీరాలి.

నన్నయగారు అన్ని పద్యాలూ ఇలాగే వ్రాసారనుకునేరు. విషయం అదికాదు. ఆయనకు సంస్కృతం దట్టించి తెలుగుపద్యాలు వ్రాయవలసిన అక్కర యేర్పడింది నాటి వారి మనోరంజనం కోసం.

కవిత్రయం‌వారు మహాభారతాన్ని తెలుగువారికి అందించారు. తెలుగువాళ్ళు దానిని నెత్తిన బెట్టుకున్నారు. తెలుగులో బోలెడు మంది మహాకవులు రచనలు చేసారు. కాని ఎవరూ సంస్కృతం జోలికిపోకుండా తెలుగులోనే మహాకావ్యాలు వ్రాయలేదు. ఒక్క తిక్కన గారు మాత్రం తెలుగుకు పెద్దపీట వేసి వ్రాసారు సాధ్యమైనంత వరకూ. తరువాత వచ్చినది ప్రబంధయుగం.

ఇన్నాళ్ళ తరువాత అయినా మన తెలుగుకవులు సంస్కృతభాష మీద మోజు నుండి బయట పడ్డారా అంటే లేదనే చెప్పాలి.  ప్రబంధాలలోనూ‌ కవిత్వానికి వాడే భాషలో సంస్కృతానికే అగ్రతాంబూలం.

అందుచేత తెలుగు కావ్యాలూ వగైరా చదువుకోవాలీ అంటే కొంత తెలుగూ బోలెడు సంస్కృతమూ అర్థం అయేటంత భాషాజ్ఞానం సంపాదించాలి. అల్లసాని పెద్దనగారికి ఆంధ్రకవితాపితామహుడని బిరుదు.  ఆయనగారి మనుచరిత్రంలోని ఒక పద్యం చూడండి:

చ.  అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
 
మంచి పద్యం. సందేహం లేదు. ఈ‌ ఒక్క పద్యం సొగసుమీద ఒక వ్యాసం వ్రాయవచ్చును!

ఈ‌ పద్యం నిండా సంస్కృతమే! అట, చను, కాంచె అన్న మొదటి మాటలు మినహాయిస్తే అంతా గంభీరమైన సంస్కృత సమాసాల ఆడంబరవిన్యాసమే.  దాని అందం దాని దనుకోండి. అది వేరే విషయం.  కాని తెలుగుపద్యంలో తెలుగు ఎంతా అన్నది ప్రశ్న.

ఆధునికులు ఏమీ‌తక్కువ తినలేదు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి రామాయణ కల్పవృక్షంలోని యీ పద్యం చూడండి:

శా. నిష్టావర్షదుదారమేఘపటలీ‌నిర్గఛ్చదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికాయుగపదుజృంభన్మహాఘోరబం
హిష్ఠస్ఫూర్జదుషండజర్ఝరరవాహీనక్రియాప్రౌఢి ద్రా
హిష్ఠంబై యొకరావమంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్

*🌸మనస్సు పావనమైనప్పుడు సత్యం గోచరిస్తుంది.*🌸



 *మనస్సుని ఎలా పావనం చేయడం అనేది వెంటనే ఉద్భవించే సందేహం.*

 *నీరు నిర్మలంగా ఉన్నప్పుడు అందులో మనం*
 *ప్రతిభింబిస్తాం. అందులో విషం కలిపినా, పాలు కలిపినా నీరు కలుషితం అవుతాయి. బింబం అగోచరమౌతుంది. అలానే మనస్సులో మొదట చెడు తలంపులు తరిమేయడానికి మంచి తలంపులు చేయాలి. క్రమంగా మంచి తలంపులు కూడా తగ్గించాలి. అలా తగ్గించగా మనసు నిర్మాలమౌతుంది. అప్పుడు సత్యం గోచరిస్తుంది.*

 *కాలులో ముల్లు గుచ్చుకున్నప్పుడు మరో ముల్లు తో తీసివేసి రెండు ముళ్ళు పారవేస్తాం. అలానే అజ్ఞానమనే ముల్లు* *తీసివేయడానికి జ్ఞానమనే ముల్లును వాడవలసి ఉంటుంది. అజ్ఞానం పోగానే జ్ఞానాన్ని విసిరివేయాలి. అంటూ శ్రీరామకృష్ణులు విపులీకరించారు.*

 *ఈ రీతినే మనస్సు నిశితంగా గమనించే ఎవరికైనా ఒకవిషయం స్పష్టమౌతుంది. మనస్సు ఒక్కొక్క భాగము ఒక్కొక్క పనిని నేర్పడానికి తహతహలాడడం* *గ్రహించవచ్చు. ఒక రథానికి పూన్చిన గుఱ్ఱాలు ప్రతిఒక్కటీ ఒకొక్క దిశలో పోతుంటే రథికుడు గతి ఏమౌతుంది?*

 *సాధన లేక పరివిధాల పోయే మనస్సు గల మనిషి గతీ అంతే.. అతడు దేనిని సక్రమంగా చేయలేడు. బాహ్య వ్యవహారాలనే సక్రమంగా చేయలేని అతడు ఆంతరంగిక జీవితం గురించి ఆలోచన కూడా చేయలేడు* .

 *ఏకాగ్రమైన మనస్సే పావన మనస్సుగా విరాజిల్లుతుంది.*

  🕉️🌞🌎🏵️🌼🚩

సనాతనము అనగానేమి?

సనాతనము అనగానేమి? హిందుత్వము సనాతన ధర్మమా? సనాతన మతమా? ధర్మము అంటే? సనాతన సత్యధర్మము అంటే ఏమిటి? వేద సహిత సనాతన ధర్మం ఎట్లు ఏర్పడింది?
ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కూడా అతి సున్నితమైనది, వివాదాస్పదమై యుంది. మనము సత్యానే్వషకులము కావున, సత్యమును గ్రహించవలసినదే. సనాతనము అనగా అనాది అయినది. ఆది లేనిది అనాది. అతి పురాతనమైనదని అర్థము. సృష్టాది నుండి జరిగిన పరిణామము. సృష్టికి పూర్వము, సృష్టి ప్రారంభము నుండి గల వ్యవస్థ, పూర్వ వ్యవస్థ అని భావము. అనగా ఆధ్యాత్మిక ప్రపంచమునకు సంబంధించిన అనాది వ్యవస్థ. మహాకల్పము తరువాత, నూతన సృష్టి ప్రారంభమున గల పూర్వకాలానికి సంబంధించిన ఆధ్యాత్మిక వ్యవస్థ.
పురాతన కాలంలో జీవించిన మానవుల యొక్క దైవ సంబంధమైన ఆచారాలు, సంప్రదాయాలు, పూజలు, దేవుళ్లు, విగ్రహారాధనలు, వీటికి సంబంధించిన పురాతన విషయాలను, సనాతన ధర్మాలు అంటారు. ఆధ్యాత్మిక ప్రాచీనత, పాతకాలపు పద్ధతులు. మన ప్రస్తుత ధార్మిక రంగానికి మూలం. ఆది, ఆరంభం ఎలా ఉండినది అని తెలుపునదే సనాతనము. ప్రభవ స్థానం. వంశ మూలం మాదిరి, దైవ, దైవ సంప్రదాయాల, ఆచారాల సముదాయం. నేటి వ్యవస్థకు ఆధారభూతమైనది వౌలికమైనది. ఇక ధర్మమును గురించి తెలుసుకుందాము.
సనాతనము నుండి, అనాది నుండి సమాజం చేత విధిగా గుర్తింపు పొందిన ఆచారాలు, సంప్రదాయకాలు లేదా అనుశాసితాలైన నియమాల సముదాయమే ధర్మము. పూర్వము నుండి ఏ సూత్రమును, నియమమును, ప్రమాణమును, సంప్రదాయికాలను అందరూ అంగీకరించారో, వర్తమాన కాలంలో కూడా ఆరాధించుచున్నారో, భవిష్యత్ కాలంలో కూడా అంగీకరించి, పాటించెదరో అదియే ధర్మము.
అట్టి ధర్మమునే ‘సార్వజనీక’ లేదా ‘సనాతన నిత్యధర్మము’ అని పేరు. అందరికీ ఆమోదయోగ్యమైన సదాచారం, అనాచారం. తదితరములన్నియు ప్రమాణ యోగ్యము కావు కనుక అవి ధర్మములు కావు. బ్రహ్మము మొదలుకొని, జైమిని ముని వరకు అందరూ అంగీకరించబడినది నిత్యధర్మము, శాశ్వత ధర్మము. అట్టి ధర్మము త్రికాలముల యందును ఒకే విధముగా ఉండవలయును. అందరూ అంగీకరించినవి. మార్చరాని, మార్పులు, కూర్పులు, మిథ్యా కల్పనలు చేయరాని సూత్రం, సిద్ధాంతము, నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు ఎప్పటికీ న్యాయబద్ధముగా ఉంటాయి. ధర్మమునకు అధికారి ధర్మదేవత.
ఇదియే సమాజ ధర్మవ్యవస్థ, న్యాయ విధానం, ధర్మసూత్రాల అధికార ప్రభావం న్యాయ విషయాలపై ప్రభావితం ఉంటుంది. కాల, పరిస్థితుల ననుసరించి, అవసరం వచ్చినపుడు తమ స్వార్థం కొరకు, సంప్రదాయాన్ని తిరస్కరించడం, ధర్మ వ్యతిరేకంగా యధేచ్ఛగా ప్రవర్తించడం అధర్మము. పూర్వకాలపు ఋషులు, యోగులు, జ్ఞానులు, ధర్మశాస్త్ర పండితులు రూపొందించినవి. న్యాయబద్ధమైన సమాజం చేత విధిగా గుర్తింపు పొందిన నియమాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారములు ఆవశ్యం అనుసరించవలసినవి, పాటించవలసిన ఆదేశాలే ధర్మ సముదాయాలు, సమూహము.
వేదములు బోధించునవి ధర్మాలే. వేద విరోధములు, వ్యతిరేక సిద్ధాంతములు అధర్మము, అసత్యములు. ధర్మమే జ్ఞానము. సామాజిక న్యాయశాస్త్రంలో ఒక శాఖ ఆధ్యాత్మిక ధర్మం, పరమపదమునకు చెందిన ఒక ప్రత్యేక శాఖకు సంబంధించిన నియమాలు, న్యాయసూత్రాల సమూహమే ఆధ్యాత్మిక ధర్మం. వివిధ గ్రూపులు, సంప్రదాయాల మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించిన న్యాయం. ఒక ఆధ్యాత్మిక పురోభివృద్ధికి గల ఒక అలిఖిత చట్టం, ఆచారం, సంప్రదాయం, వ్యవహారాలకు సంబంధించినది.
పరమపద ప్రాప్తి యందు అభ్యుదయం అభిలషించేవారు, ఇట్టి దివ్యమైన ధర్మమైన ధర్మశాస్త్ర పరిజ్ఞానం కలిగి యుండాలి. దైవసాధన, జీవితాదుల్లోని ప్రవర్తన నియమాలు ఈ ధర్మశాస్త్రం బోధిస్తుంది. ఇదియే ప్రకృతి నియమాలు, మూలసూత్రాలు, ప్రకృతిలోని క్రమపద్ధతి. సనాతనం నుండి అందరూ అంగీకరించిన సంప్రదాయాన్ని యాదృచ్ఛికంగా మనం ఒక నియత క్రమంగా భావిస్తాం. పాటిస్తాం. అదియే వేదసహిత సనాతన ధర్మం. అట్టి న్యాయం భగవంతుడికి ప్రియమైనదిగా, వేద సమ్మతంగా ఉంటుంది. ఈ ధర్మం హేతుబద్ధంగా ఉచితమైన ప్రవర్తన నియమమే ధర్మము. ఈ విధంగా కట్టుబడి, న్యాయ విధేయమైన, న్యాయ విధేయత కలిగినవే ధర్మాలు.
మన ఈ సృష్టికి న్యాయాధిపతి, న్యాయకారి భగవంతుడు, ధర్మాధర్మ నిర్ణేత, వారి ముఖ కమలం నుండి ప్రకాశమైనవే ధర్మములైన ఈ వేద వాక్యములు. ధర్మాన్ని నిర్ణయించి, నిర్దేశించిన వ్యక్తి. ఆధ్యాత్మిక రంగంలోని అనేక శాఖలకు సంబంధించిన సంప్రదాయాలు, ఆచారాల ధర్మాధర్మములను నిర్ణయించుటకు యోగ్యుడైన నిర్గుణ వ్యక్తి. అవియే వేద సహితాలు, వేద నిషేదితాలు. నూతన సృష్టి ఉత్పన్నం మహా ప్రళయ కాలానంతరం ఆ ధర్మములను మార్పు, కూర్పులు లేకుండా పాటించవలసినదే. భగవదానుగ్రహంగా అమలులోనికి వచ్చినవే ధర్మములు. ఈ సృష్టికి న్యాయాధిపతి అయిన న్యాయకారి అయిన భగవంతుని నిర్ణయం, తీర్పుల ననుసరించి ఏర్పడిన నియమమే, సూత్రమే, సిద్ధాంతమే, సంప్రదాయమే, ఆచారమే ధర్మము.
వివేకం, వివేచనా శక్తి, యుక్తాయుక్త పరిజ్ఞానంతో, ధర్మాధర్మ వివేకం, మనస్సాక్షి, అంతరాత్మ మనఃపూర్వకంగా, మానవ కళ్యాణం కొరకు రూపొందించిన న్యాయము, నియమమునకు ధర్మము అని పేరు. ధర్మం న్యాయబుద్ధి కలది, ధర్మపరాయణమైనది, అంతర్వివేకం కలది. అంతర్వాణి సమ్మతించినది, ధర్మం నైతిక చైతన్యం కలిగి, ఉచితానుచితజ్ఞత ప్రకటిస్తాయి. సార్వజనిక సనాతన నిత్యధర్మమే ఆ మత ధర్మము.
సృష్ట్యాది యందు హిందూ మతము ఉనికి ఉన్నదా? సనాతనమున ఏ మతము లేదు? ఏ విధంగా అయితే పరమాత్మకు మతము లేదో అదే మాదిరి మతములతో కూడిన మానవ జాతిని భగవంతుడు సృష్టించలేదు. ఈ మతములన్నియు కలియుగమునకు సంబంధించినవే. ఇవి మానవ కల్పితములు, నిర్మితములు, ఆర్యావర్తనము నందు మత ప్రసక్తి లేదు, మతము లేదు, ‘హిందు’ ‘హిందూమతము’ హిందుత్వము అన్న పదములు హైందవ గ్రంథముల యందు ఎచటను ప్రస్తావన లేదు. ఒక ధార్మిక వ్యవస్థను మతము అని గుర్తించుటకు, నిర్ణయించుటకు దానికి కొన్ని ప్రమాణాలు, మతాన్ని నిర్ణయించే సూత్రాలు, లక్షణాలు, ప్రమాణాలు ఉంటాయి. అటువంటివి:
1.వాడుకలోని మతము పేరు ఎంతకాలం నుండి ఉనికిలో ఉంది.
2.ఆ మతము ఆరాధించే దేవుడు.
3.మత గ్రంథము
4.మత గురువు
5.మత పీఠము
6.మతాచారాలు, సంప్రదాయాలు మొదలగునవి.
భారతదేశములోని ధార్మిక వ్యవస్థ అయిన హిందూ మతమును ఒక మతముగా గుర్తించుటకు కావలసిన ప్రమాణములు గమనిస్తే -
-హిందూ మత దేవుడు ఎవరు?
-మతాచారాలు, సంప్రదాయాలు ఏవి?
-మత గ్రంథమేది?
-మత గురువు ఎవరు?
-మత పీఠము ఏది?
ఈ ప్రకారము విచారించిన భారతదేశానికి ‘హిందువు’ ‘హిందూ మతము’ ‘హిందూ మతస్థుడు’ అన్న పదములు వర్తించవు. అనేక ఆచారములు, సంప్రదాయాలు, నియమాలు, గుణ, కర్మ, స్వభావాల సమూహంతో కూడినదే హిందువులుగా ఆదరణలోకి వచ్చింది. కావున హిందూ, హిందూమతము అన్నది ఒక మతము కాదు, సనాతనము నుండి ఈ మతము లేదు. హిందూ మతము అని చెప్పుటకు కావలసిన ప్రమాణాలు దీనికి లేవు, మత దేవుడు లేడు, ఒక మత గ్రంథము లేదు. మత గురువు లేడు, మతాచారము లేదు. మత సంప్రదాయాలు, ఆచారాలు లేవు. సనాతనము నుండి ఏ మతము లేదు, విగ్రహాలు లేవు, విగ్రహారాధనలు లేవు, సనాతనుడైన పరమాత్ముడు ఒకడే ఉండెను.
ధర్మములు అనేక రకములు. యుద్ధ ధర్మము, వ్యాపార ధర్మము, కుటుంబ ధర్మము, ఆపద్ధర్మము మొదలగునవి. ఆయా కార్యకలాపాలకు ఆయా ధర్మాలు ఉన్నాయి. అదే మాదిరి ఆధ్యాత్మిక ధర్మము ఒకటి. దీనిలోని ఒక ఉపశాఖ. మనము ఆరాధించుటకు ధ్యేయ వస్తువేది? పూజ, ఆరాధన, ప్రార్థనలు, స్తుతులు ఎవరికి చేయాలి? పూజ సంప్రదాయాలు, ఆచారాల ధర్మమేమిటి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ప్రస్తుత సృష్టి రెండు సిద్ధాంతాలపై ఆధారపడి పని చేస్తుంది. అవి. 1.్ధర్మసిద్ధాంతము 2.కర్మ సిద్ధాంతము.
ధర్మ సిద్ధాంతమే ఆత్మతత్త్వము. కర్మ సిద్ధాంతమే జీవుడు. జీవుడు ఆత్మ ఈ రెండే సృష్టి యందలి అజములు అనగా ఉత్పన్నములు కానివి. వీటికే ఆది దైవము, ఆది భౌతికము అని పేరు. ఆది దైవము ఆత్మ. ఆది భౌతికము జీవుడు.
ఆరాధనకు, పూజ సత్కార్యములకు ధ్యేయ వస్తువు ఆత్మయే, ఆది దైవము. మానవ శరీరంలో గల పరబ్రహ్మ యొక్క అంశయే ఆత్మ. అనగా పరమాత్ముడు బాహ్యమున లేడు, విగ్రహమున లేడు, మందిరమున లేడు, భౌతికమున లేడు. కావున మన సనాతన ఆధ్యాత్మిక ధర్మము ఆత్మయే, ధ్యేయ వస్తువు, ధ్యాన వస్తువు ఆత్మయే. ఏ విగ్రహమూ కాదు, మందిరము కాదు. హిందు, హిందూ ధర్మము, సనాతన ధర్మము ఆత్మయే. ఆది ఇదియే మానవ వంశమూలము. సృష్టి ఆరంభ బీజము, మానవులకు తొలి ఆధారభూతమైనది, ఆరాధన వస్తువు. వౌలికమైన పరమాత్మ, హిందూ ధర్మదేవత ఆత్మ. ఇదియే ధర్మబద్ధమైన హిందూ ఆధ్యాత్మిక సమాజ స్థితి. సమాజం చేత వేదాలానుసారం విధిగా, అనాదిగా గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక సంప్రదాయాల ధర్మం, పూజ్యనీయము. మొదటి మూర్తి పూజ్యనీయము ఆత్మ. ఈ సృష్టి అంతయు ఆత్మస్వరూపమే, అంతర్యామి, సర్వాంతర్యామి, పరమాత్మ.
ఆత్మనే పూజించాలి, ఆరాధించాలి, సృష్టికర్త. పిత, సృష్టి అయిన సమస్త వస్తు పదార్థములు, ప్రాణులు, జీవులు, మానవులు, జంతువులు, కీటకాలు, పతంగులకు ఆధార శక్తి, జీవశక్తి ఆత్మయే. జీవరాశి ముఖ్యంగా మానవ రాశి పుట్టుటకు ముందే ఆత్మను వ్యక్తం చేశాడు. జీవజాలం పరిణామ క్రమంలోగాక ప్రత్యేకంగా విడివిడిగా సృష్టి జరిగింది. సృష్టికర్తయే బ్రహ్మ, బ్రహ్మ ఆత్మశక్తితో కూడియున్నాడు. వారి నుండి విడివడినదే ఆత్మ. ఆదియే శివశక్తి, ఆదిశక్తి, మూల ప్రకృతి, శాశ్వత అణువు, బ్రహ్మాణువు, దేవకణము, దైవకణము. దీనికి వేదముల యందు ప్రమాణములు కలవు. అవి,
‘ఏకమేవా ద్వితీయం బ్రహ్మ’
అనగా ఈ సృష్టికి పూర్వం ఎవరున్నారు, అనడానికి ఈ శ్లోకమే ఆధారము. పూర్వం బ్రహ్మ ఒక్కడే యున్నాడు. బ్రహ్మ తప్ప మరొక వస్తువు లేదు. ఈ సృష్టికి ప్రారంభమున ఆత్మ ఒక్కటియే యున్నది.
‘ఆత్మావా ఇదమేక ఏవాగ్ర అసీత్’
ఈ సృష్టి ఉత్పన్నము కాక పూర్వము బ్రహ్మ ఒకడే ఏకాకిగా ఉండెను. సృష్టి ప్రారంభమున ఆత్మ ప్రకాశమైనది. ఈ బ్రహ్మను గురించి మరియు ఈ సృష్టి సర్వమును గురించి తెలిసినదే ఆత్మ. ప్రమాణము చూడండి.
‘ఆయామాత్మ బ్రహ్మ సర్వానుభూః’
కావున మన మతము ‘ఆత్మమతము’ అదియే సనాతనము. ఆత్మను ఆరాధించుట, పూజించుటయే ‘సనాతన ధర్మము’. హిందూ మతము మత ధర్మము కాదు, మతము కాదు. ఈ రోజు భారతదేశంలో హిందూ, హిందూ మతము అనగా-
-అనేక నానావిధ స్వభావము వలన వేరైనా నానా ప్రకారములుగా కనబడు పద్ధతులు, ఆచారాలు.
-విశ్వాసములు, నమ్మకాలు, మతం మీద నమ్మకం, వారి వారి యథార్థమైన అభిప్రాయాలు.
-సంప్రదాయాలు, పూర్వుల నుంచి తరువాతి తరాల వారికి సంక్రమించిన అభిప్రాయాలు, ఆచారాలు, సంప్రదాయాలు.
-రాత పూర్వకంగా కాకుండా, దైవాధికారం కలవిగా భావించే సిద్ధాంతాలు, ముఖ్యంగా దేవుడు చెప్పినవి, శిష్యులకు ఉపదేశించినవి, అవిచ్ఛిన్న వ్యవహారం ఆధారంగా ఏర్పడిన సూత్రాలు.
-సంప్రదాయాలలో ముఖ్యంగా మతం మీద అధికమయిన గౌరవాలు, దైవికావిష్కరణలు, సంప్రదాయము, సర్వమత జ్ఞానానికి కారణభూతాలుగా భావించే తాత్విక పద్ధతులు.
-మత కర్మలకు సంబంధించిన ఆచారంతో కూడిన పద్ధతులు అనుష్ఠానికమైనవి. మతాచారం కొరకు ఏర్పరచబడిన నియమాలు, ప్రమాణాలు, సిద్ధాంతాలు, మత కర్మాచరణలు.
ఈ విధముగా అనేకమైన విషయాలను ఉండకట్టి కలసి ఏర్పడి, కలసి సమగ్రంగా కనబడునదే ఈ హిందూ మతము. ఇదే ‘ఆది సనాతన దేవి దేవతా ధర్మము’ ‘దైవ మార్గ జీవనం’. భారత రాజ్యాంగము ప్రకారము గుర్తించబడిన దేశపు పేరు ఈనాడు ‘ఇండియా’ లేదా ‘్భరత్’ అని పిలుస్తారు. ఉత్తర భారతదేశమున ‘సింధూ’ అను పేరుగల ఒక పురాతన నది కలదు. అలనాడు ‘సింధూ’ అని పలక లేక ‘ఇందూ’ అని పిలిచేవారు. అదే ‘ఇన్‌డన్’ లేదా ‘ఇంధూ’ నదిగా మారింది. ‘హిందు’ అన్న పదమును భారతదేశంలో విదేశీయులు ప్రవేశపెట్టి వ్యాప్తి చెందినది.

💢నిత్య పారాయణ శ్లోకాలు💢



మనలో చాలామందికి తెలియని శ్లోకాలు
ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలో తెలుసుకోండి...

🌷ప్రభాత శ్లోకం :🌷
కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!

☘ప్రభాత భూమి శ్లోకం : ☘
సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !
విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!

🌝సూర్యోదయ శ్లోకం : 🌝
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!

🍀స్నాన శ్లోకం : ☘
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!

♨భస్మ ధారణ శ్లోకం : ♨
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!

🍀భోజనపూర్వ శ్లోకం : 🍀
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!

అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!

త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!

💢 భోజనానంతర శ్లోకం : 💢
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!

🌷సంధ్యా దీప దర్శన శ్లోకం :🌷
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!

😔నిద్రా శ్లోకం :😔
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!

👍కార్య ప్రారంభ శ్లోకం : 👍
వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!

🌷హనుమ స్తోత్రం : 🌷
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!

బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!

💢శ్రీరామ స్తోత్రం : 💢
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

♨గణేశ స్తోత్రం : ♨
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !
అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!

🔯శివ స్తోత్రం : 🔯
త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !
ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!

🕉గురు శ్లోకం : 🕉
గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !
గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!

☸సరస్వతీ శ్లోకం :☸
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!

 యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!

🌷లక్ష్మీ శ్లోకం 🌷:
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!

☘వెంకటేశ్వర శ్లోకం ☘:
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!

♨దేవీ శ్లోకమ్♨ :
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!

💢దక్షినామూర్తి శ్లోకం💢 :
గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!

☸అపరాధ క్షమాపణ స్తోత్రం☸ :
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!

కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !!
 ఓం శని ఈశ్వరాయనమః.

"వేదాంత పంచదశి"*

*42) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

న సద్వస్తు సతః శక్తిర్న హి వహ్నేః స్వశక్తితా ౹
సద్విలక్షణతాయాం తు శక్తేః కిం తత్త్వముచ్యతామ్ ౹౹ 48 ౹౹

48. సత్త యొక్క శక్తియే సత్త కాజాలదు.అగ్ని యొక్క దాహక శక్తియే అగ్ని కాదు గదా.
(అట్లే మాయ కూడా బ్రహ్మము కాజాలదు)
బ్రహ్మము కంటె,సత్తకంటె భిన్నమైనచో ఆ మాయా తత్త్వ మెట్టిదో చెప్పుము.



శూన్యత్వమితి చేచ్ఛూన్యం మాయాకార్యమితీరితమ్ ౹
న శూన్యం నాపి సద్యాదృక్తాదృక్త త్తమిహేష్యతామ్ ౹౹ 49 ౹౹

49. మాయాస్వరూపము శూన్యమనినచో (ప్ర 2.34) శూన్యము మాయా కార్యమని చెప్పబడినది కారణస్వరూపము కార్యస్వరూపము కాజాలదు గదా.కనుక మాయ సత్తయు కాదు,అసత్తయు కాదు, ఇదమిత్థమని చెప్పలేనిది అనిర్వచనీయమైనది అని అంగీకరింపవలెను.


వాఖ్య:- పారమార్ధిక సత్త వ్యవహారిక సత్త ప్రాతిభాసిక సత్తయని సత్త మూడు విధములు.బ్రహ్మము మాత్రమే పారమార్థిక సత్త.ఈ సత్తకు భూత,భవిష్యద్వర్తమానము లందు భంగము లేదు.వ్యవహార కాలమున మాత్రము ఉండునది వ్యవహారిక సత్త.


ఉత్పత్తి వినాశములు కల వస్తువులన్నీ ఈ కోవకు చెందును. వ్యవహారకాలమున కూడ నిజముగ లేక పోయినను ఉన్నట్లు కన్పించునది ప్రతిభాసిక సత్త.ఇంద్రజాలకుడు చూపు వస్తువులిట్టివి.అసత్తు కూడా రెండు విధములు.వంధ్యాపుత్రుడు కుందేటి కొమ్మువలె అసలు లేకనే పోవుట.పగిలిన కుండవలె ఎండిన చెరువు వలె ఒకప్పుడుండినది పిదప నశించుట.


తత్వవివేక ప్రకరణ

కొన్ని వస్తువులు కొంతకాలము పోయిన తరువాత నశించి పోతాయని తెలిసికూడా అవి వున్నంత కాలం ప్రేమతో వ్యవహరించి,కావాలని ఆరాట పడతాము.

ఒక వస్తువు కనిపించి నంతకాలము అది నిజమని అంగీకరిస్తే కలలో కని పించిన నిధి కూడా సత్యమని అంగీకరించాలి.

అలా అంగీకరిస్తే ఆ నిధి ఎలా వచ్చింది?
మళ్ళీ ఎక్కడికి పోతుంది?అనే ప్రశ్నకు సమాధానం దొరకదు.
కనుక నిధి ఆసమయములో సత్యమని అంగీకరించుట సాధ్యంకాదు.

కనిపించినంత మాత్రాన సత్యం కానక్కరలేదని అంగీకరించేటట్లయితే,కొంతకాలం కని పించి,తరువాత కని పించకుండా పోయే ఏవస్తువు అయినా సరే,అసత్యమే (లేనిదే)
కనిపిస్తువున్న సమయంలో కూడా లేనిదే అని అంగీకరించాలి.తప్పదు.

భూత,భవిష్యద్వర్తమాన కాలాలు మూడింటి లోనూ అవిచ్ఛిన్నంగా ని‌బడి వుండే వస్తువు మాత్రమే నిజంగా అస్తిత్వం వున్నవస్తువు.
అదే నిత్యమైన వస్తువు.

ఏక్షణంలో అయినా అది లేనిదయితే,అది త్రికాలాలలోనూ గూడా పూర్తిగా లేనిదే.

“పరబ్రహ్మ పదార్థం” ఒక్కటే నిజమైన నిత్య వస్తువు.

ఈ జగత్తంతా అనిత్యమే అని వేదాలు,పురాణాలు,సృతులు మొదలగునవన్ని ఏకకంఠంగా నిర్ణయించి చెపుతున్నాయి.
ఈ జ్ఞానం మనస్సుకు పట్టవలెను.


బంగారు కంకణము నందు కంకణత్వమున్నదా,అది కేవలము బంగారము కాదా?

శూన్యత్వముతో సంబంధము లేకుండా ఆకాశమనబడు విషయమున్నదా ?

అదేవిధముగా అఖండమయిన బ్రహ్మముతో సంబంధము లేకుండా ప్రపంచమను “వస్తువు” లేదు.

చల్లదనము మంచు గడ్డ నుండి విడదీయరానిగా వున్నట్లే ప్రపంచమనబడునది కూడా బ్రహ్మము నుండి విడదీయరానిదే.

ఇవ్వన్నీ మనకు ఎలా హృదయగత ము అవుతాయి.....
దృఢ చిత్తులకే కదా తత్వ చింతన

సద్రూప వస్తువు యొక్క శక్తి ,సద్రూప వస్తువు నుండియే వ్యక్తమైంది.
వ్యక్తరూపం శక్తి, అవ్యక్త రూపం సద్రూపం.
శక్తి గా పరిమితమైనది, కొన్ని పరిమితులకు లోబడి పని చేస్తుంది.
అదే శక్తి ఘనమైతే సత్తా . ఇది అపరిమితమైనది. 

ఈ( శక్తి )మాయ శూన్యం అంటే దీనిచే ఏర్పడినజగత్తు కూడ శూన్యం కావాలి.

కానీ భ్రాంతి కాలంలో జగత్తు అనేకంగా,ఉన్నట్లుగానే కన్పడుతోంది.


ఈ జగత్తు మిథ్య,ఉన్నది పరమాత్మ,పరమాత్మ యొక్క శక్తి యైన చైతన్యం వ్యక్త రూపంలో జగత్తుగా కనపడుతోంది అనే ఙానదృష్టి పొందేవరకూ సద్వస్తువూ, శక్తీ విలక్షణమే.
అపరోక్షానుభూతితో ఆ ఙానం పొందాక ఏకత్వానుభవం ఉంటుంది.

తత్త్వానుభూతిని పొందిన వారికి తత్త్వచింతన అవసరము లేదు.

అురోక్షానుభూతిని పొందని సాధకులమైన మనకు ఈ చింతన అవసరము.

సూక్ష్మ బుద్ధితో అవగాహన చేసుకుని, అదే బుద్ధితో విచారణతో ఉండి, దాన్ని ఒక దీక్షగా మనం ఆచరణ లో పెట్టుకోవాలి.

🕉🌞🌏🌙🌟🚩

*42) కఠోపనిషత్తు*

ఓం నమః శివాయ:

🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

ఇప్పుడు ఆత్మను తెలుసుకొను విధము చెప్పబడుచున్నది.

        పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిమాణముగల శ్యామాదికము కంటెను మిక్కలి సూక్ష్మమైనది. మహత్‌ పరిమాణము గల ఆకాశాదికము కంటే మిక్కిలి మహత్తరమైనది. సర్వవ్యాపకమగుట చేత పిపీలికాది బ్రహ్మపర్యంతము వ్యాపించి ఉన్నది. అందుచేత అణువుకంటే అణువుగాను, మహత్తుకంటే మహత్తుగాను ఉన్నది. మరియు ప్రాణుల బుద్ధి గుహయందు లేక హృదయాకాశమునందు ఈ ఆత్మ ఉన్నది. అట్టి ఆత్మను తన హృదయాకాశమున సాక్షాత్కారము చేసికొనటకు ఆ క్రతువు అనగా నిష్కామ కర్మలను ఆచరించువాడు కాంచుచున్నాడు. ఎందుచేత ననగా వేద విహిత కర్మలను ఫలాపేక్షలేక, ఆచరించువాని చిత్తము నిర్మలమగును. ఎప్పుడు ఇంద్రియములు, మనస్సు నిర్మలమగునో అప్పుడు వాని బుద్ధియూ ప్రసన్నముగా నుండును. బాహ్యవిషయముల నుండి మరలిన బుద్ధి మాత్రమే పరమాత్మ మహిమను తెలిసికొనును. ఇట్లు తెలుసుకొనిన వాని శోకము నశించును, ఆత్మానందము అనుభవించును.


        ఆత్మ యొక్క విధానమును తెలుసుకోవటానికి, ఆత్మను తెలుసుకొనే విధానాన్ని విస్తారంగా చెప్పేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు యమధర్మరాజు గారు నచికేతుని ద్వారా. పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిమాణముగల శ్యామాదికము కంటెను మిక్కిలి సూక్ష్మమైనది. ‘శ్యామాదికము’ - అనే ఉపమానము వేశారు ఇక్కడ. ‘శ్యామాకాశ్చమే’ - అని నమకం, చమకం అనే రుద్రంలో వస్తుంది. అంటే, అర్థం ఏమిటంటే జడ చేతన సృష్టిలో, జడ సృష్టి అయినటువంటి వృక్షములు ప్రథమ విత్తనము. దాని పేరు శ్యామకము అని పేరు, శ్యామాకాశ్చమే.. మరొక వాచ్యార్థంలో శ్యామకము అంటే ‘చామదుంపలు’ అని కూడా అర్థం. అంటే ప్రథమముగా ఏర్పడినటువంటి దుంప ఏదైతే ఉందో, ఏదైతే మరల మరల పుట్టడానికి అనుకూలమైనటువంటి అవకాశం ఇచ్చేటటువంటి విత్తనం ఏదైతే ఉందో, ఆ విత్తనం కంటే కూడా మిక్కిలి సూక్ష్మమైనటువంటిది. మర్రి విత్తనంలో మర్రిచెట్టు దాగి వుంది. మర్రి విత్తనం ఆవగింజ అంత వుంది. కానీ మర్రి చెట్టు మహావృక్షం. మరి ఈ ఆవగంజంత ఉన్నటువంటి విత్తనం లోపల, అంత పెద్ద మర్రి చెట్టు ప్రావిర్భవింప చేయగలిగేటటువంటి శక్తి ఆ విత్తనంలో ఇమడ్చబడివుంది.


        కాబట్టి పదార్థము కంటే శక్తి సూక్ష్మమైనది. శక్తి కంటే ఆధారభూతమైనటువంటి చైతన్యము సూక్ష్మము. చైతన్యము కంటే ఆత్మ సూక్ష్మము. ఆత్మ కంటే పరమాత్మ మిక్కిలి సూక్ష్మమైనది.
కాబట్టి, ఈ రకంగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటటువంటి స్థాయీ భేదములతో... ఇది వివరించ పూన బడుతుంది. ఎంత సూక్ష్మ తరమైతే, అంత వ్యాపక ధర్మాన్ని కలిగి వుంటుంది. ఈ అంశాన్ని మనము వైజ్ఞానిక శాస్త్రంలో కూడా నిరూపించాము.


        ఉదాహరణ: ఎక్స్‌ రే కిరణాలు మన కంటికి కపపడవు. సూర్యకాంతి మన కంటికి కనబడుతున్నట్లుగా తోస్తున్నది. కానీ ఎక్స్‌ రే కిరణాలు కనపడవు. అందువలననే మనిషి ద్వారా అవి ప్రసరింపబడి ఆ ఎక్స్‌ రే ఫిల్మ్‌ తయారౌతుంది. అంటే, కంటికి కనపడనటువంటి సూక్ష్మతర, సూక్ష్మతమ... ఆల్ఫా, బీటా, గామా ఇలా చాలా కిరణాలు వున్నాయి. చాలా వలయాలు కూడా వున్నాయి. చాలా తరంగ దైర్ఘ్యాలు కూడా వున్నాయి. ఈ తరంగముల యొక్క, ఈ కిరణముల యొక్క పౌనఃపుణ్యము [frequency] వలన మనము ఎంతగా లోపలికి చొచ్చుకుపోతూ ఉంటామో అంతగా వ్యాపక ధర్మం కూడా వుంది.


కాబట్టి ఎలక్ట్రో మేగ్నటిక్‌ ఫీల్డు ని గనక మనం అంటే విద్యుదైస్కాంత తరంగ దైర్ఘ్యములను కనుక మనం ఫ్రీక్వెన్సీ ని గనక మనం డీ-కోడ్‌ చేసినట్లయితే, ఈ సృష్టి యందంతటా వ్యాపకమైనటువంటిది ఆ విద్యుదయస్కాంత తరంగములే. కాబట్టి, ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఎంతగా స్థూలమైతే, అంతగా పరిమితించబడిపోతున్నావు. ఎంతగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అవుతూ ఉంటావో అంతగా వ్యాపకత్వాన్ని కలిగివుంటావు.


 “తనను అన్నిటి యందునూ, అన్నిటిని యందునూ తనను దర్శించగలగినటువంటి ధీరుడు ఎవడో వాడు ఆత్మ నిష్ఠుడు” మరియు ప్రాణుల బుద్ధి గుహ
యందు లేక హృదయాకాశము
నందు ఇది వున్నది.
ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిశోధన. మానవులందరూ కూడా బుద్ధి యొక్క గుహ ఎక్కడ ఉన్నదో అదే హృదయ స్థానము.


అట్టి హృదయము నందు మరల ఆకాశ స్థానము వున్నది. అనాహత శబ్దము నీ యందు ఓంకార శబ్దము, ప్రణవ నాదము, నీ హృదయస్థానము నుంచి ఉత్పన్నమై, నీ శరీరమంతా వ్యాపించి 72 వేల నాడులను శక్తి వంతం చేస్తున్నది. ఏ చోటైతే నాదము యొక్క ఆద్య స్థానము ఉన్నదో, నాదము యొక్క పుట్టుక స్థానము ఉన్నదో అదే హృదయాకాశము. ఇట్టి హృదయాకాశమును ఎవరైతే కనుగొన గలుగుతారో సాధన పూర్వకంగా అనగా అర్థమేమిటి?


        ప్రస్తుతము మనలో ఉన్నటు వంటి శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి బహిర్ముఖముగా చైతన్యవంతమై చేతనవంతమై పనిచేస్తున్నవి. అంతరంగంలోనేమో చైతన్యం పరమాణు స్వరూపముగా ప్రకాశిస్తూ ఈ ఇంద్రియములన్నిటినీ ఈ నాడులన్నిటినీ, ఈ అవయవము లన్నిటినీ చేతన వంతముగా చేస్తుంది. ఇవి బహిర్ముఖముగా వ్యవహరిస్తువున్నాయి. ఈ బహిర్ముఖ వ్యవహారమునంతా విరమించగా విరమించగా... ఎక్కడికి విరమించాలట? తన లోపలికే విరమించాలట. తన లోపలికి అంటే ఎక్కడికి విరమించాలట?

అవి పుట్టేటటువంటి, అవి శక్తిని గ్రహిస్తున్నటువంటి ఆధారభూత స్థానం వైపుగా గనక నీవు చూపును మరలించినట్లయితే, నీ దృష్టిని మరలించినట్లయితే, కనుగొనే ప్రయత్నం చేసినట్లయితే, ప్రాణమనోబుద్ధుల యొక్క పుట్టుక స్థానాన్ని నువ్వు తెలుసుకోగలిగినట్లయితే, అంటే అర్థం ఏమిటంటే? వీటి యొక్క కదలికలను తగ్గించుకుని రాగా, తగ్గించుకుని రాగా, తగ్గించుకుని రాగా అవి హృదయస్థానము నుండి ఉద్భవిస్తున్నట్లుగా నీవు గుర్తించ గలుగుతావు. అటువంటి గుర్తింపును సాధించడము చాలా ముఖ్యము. దీని కొరకే సమస్త సాధనలు చెప్పబడ్డాయి. ఆటువంటి ఆత్మను హృదయాకాశంలో మాత్రమే సాక్షాత్కారము చేసుకొనుటకు ఒక యజ్ఞం చేస్తున్నావట అక్కడ నువ్వు.


 ఆ క్రతువు, ఇది ప్రతి రోజూ చేయవలసినటువంటి క్రతువు. మానవుడు చేయవలసినటువంటి నిత్య యజ్ఞము, జ్ఞాన యజ్ఞము హృదయస్థానములో చేయాలి. తన ఇంద్రియములను, ఇంద్రియార్థములైనటువంటివిషయములను, తన శబ్దాది విషయములను అన్నిటినీ ఈ క్రతువు నందు హవిస్సులుగా సమర్పించాలి. అనగా అర్థమేమిటి? వాటిని లేకుండా చేయాలి. విరమించాలి. అవి అందులో వ్యవహరించకుండా చేయాలి. అట్లా వెనక్కి తీసుకునేటటువంటి యజ్ఞాన్ని, విరమించేటటువంటి యజ్ఞాన్ని ఎవరైతే హృదయస్థానంలో చేసి, హృదయాకాశ స్థితిని గ్రహించ గలుగుతాడో అనుభూతం అవ్వాలట.


        నీవు బాహ్యముగా ఉన్నటువంటి ఏ నేనైతే ఉన్నదో, నామరూపాత్మకమైనటువంటి ఏ నేనైతే వుందో ఆ నేను హృదయాకాశ స్థానము నందు లేదు. యథార్థ నేను ఒక్కటే ఉన్నది. అసత్యనేను లేదక్కడ.


ఇట్టి యజ్ఞాన్ని ఎవరైతే ఏకాగ్రతతో ధ్యానంలో చేయగలుగుతారో, ఎవరైతే అంతర్ముఖ ప్రయాణంగా చేయగలుగుతారో, ప్రవృత్తి నుండి నివృత్తి దశగా మార్చుకోగలుగుతారో, భయం దిశ నుంచీ, అభయం దిశగా మార్చుకోగలుగుతారో, బంధం నుంచీ మోక్షం దిశగా మార్చుకోగలుగుతారో, ఈ రకంగా ఒక్కొక్కదానిని విరమించుకుంటూ ఈ ఆంతరిక యజ్ఞాన్ని ఎవరైతే చేస్తారో, ఈ అంతఃక్రతువు, ఈ క్రతువు ఎటువంటిదంటే అంతః క్రతువు, ఇది చేయడం వలన ఫలితం ఏమటండీ? బాహ్యముగా ఏ ఫలితమూ రాదు. బహిర్ వ్యవహారమునందు ఏ ఫలితములు రావు. కాకపోతే ఆత్యంతిక శ్రద్ధ ఏర్పడుతుంది. ఉత్తమమైన శ్రద్ధ ఏర్పడుతుంది. ఉత్తమమైన నైపుణ్యం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి గుణాతీత లక్షణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి సాక్షిత్వం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి అసంగత్వం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి నిర్విషయపద్ధతి ఏర్పడుతుంది.


 ఉత్తమమైనటువంటి నిష్కామకర్మ పద్ధతి ఏర్పడుతుంది. ఈ ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ ఏర్పడుతాయి ఈ ఆంతరిక యజ్ఞం చేయడం ద్వారా. తద్వారా బహిరంగంలో కొద్దిగా నిర్వ్యాపార స్థితి ఏర్పడినట్లుగా అయినప్పటికినీ ఉత్తమమే. అంటే ఫుల్‌గా వైబ్రంట్‌ గా వుండడు అన్నమాట. విపరీతంగా వ్యవహార స్థితిలో మునిగి పోయిన స్థితిలో వుండడు వీడు.

🕉🌞🌏🌙🌟🚩

*సనత్కుమారుని బోధలు*

*భాగవతము*
*శ్రీగురుభ్యోనమః*
🕉🌞🌎🌙🌟🚩

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

*మనలో దయ లేకపోతే పరిపూర్ణముగా 'కలి' ఆవహిస్తాడు. కలియుగములో ధర్మము ఒక పాదము. మూడు పాదములు అధర్మము. ఆ ఒక్క పాద ధర్మమే దయ.*


*స్థితిగతులలో, జ్ఞానములో, ప్రజ్ఞలో తక్కువ స్థితి వాళ్ళుంటారు. వారి యందు దయ, ఆదరణ ఉండాలి. చిన్నవారిని ఆదరణగా చూసుకునే పెద్దవారియందు భగవంతుని ఆశీర్వాదముంటుంది. మన వలన ఎవరికీ (చెట్టు, జంతువు ఏదైనా) అపకారము జరగకూడదు అనేది దయకు ప్రధానమైన సూత్రము.*

🕉🌞🌎🌙🌟🚩

*ఆచార్య సద్భోదన*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*

*మనలోని "నేను" ని తొలగిస్తే గానీ భగవంతుని పొందలేం. విచారణ ద్వారా మనలోని స్వార్థాన్ని పోగొట్టుకోగలమని భావిస్తున్నారా? కానీ దానిని ప్రేమ ద్వారా మాత్రమే తుడిచి వేయగలం. మనకు మనం అనాలోచితంగా, నిరపేక్షంగా ఉన్నత కేంద్రం పై దృష్టి నిలప గలిగితే మహోన్నత శక్తి మన ద్వారా పని గావిస్తూ గొప్ప కార్యాలను సాధింపజేస్తుంది. ఇది లెక్కలు కట్టే గుణం ద్వారా సాధించబడదు. నిష్కామ ప్రేమ అనే గొప్ప నిధి మానవునిలో దాగి ఉంది. దాని ద్వారా సర్వస్వాన్ని అర్పించగలం, తిరిగి సమస్తాన్ని చేజిక్కించుకోగలం. అయితే ముందుగా స్వార్థాన్ని త్యజించ గలగాలి.*

*"సర్వేజనా స్సుఖినోభవంతు.-*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🕉🌞🌎🌙🌟🚩