24, జనవరి 2021, ఆదివారం

మృత్యు భయం

 *మృత్యు భయం ఎవరికి ఉండదు ...???*

మనిషి అన్నింటిని ఒప్పుకొంటాడు, కానీ ఒక్క మృత్యువు అంటే భయపడతాడు,

నేను దేనికి ఒరవను, భయపడను అన్న వాడు కూడా మృత్యువు అంటే ఆమడ దూరం పరుగెడతాడు...

మరి ఎవరికి ఈ మృత్యువు అంటే భయముండదు???, పురాణాలను చదివిన వారికా, పూజలు సల్పే వారికా, సేవలు చేసే వారికా, భజనలు నిర్వహించే వారికా???, 

         _*ఒకసారి రామావతార సంఘటన చూద్దాం*_

శ్రీ రామ పట్టాభిషేకం సందర్భంగా, అయోధ్యా నగర మంతయూ, వివిధ అలంకరణ లతో, అశేష జన సందోహంతో కళకళలాడింది. ...

'మనువు'  ధరించి న కిరీటం ధరించడం, సూర్యవంశ పురాజుల సాంప్రదాయం. 

ఆ సాంప్రదాయ మును ననుసరించి,  వశిష్ఠుడు, వామదేవుడు,జాబాలి  ముగ్గురూ కూడి రాముని శిరస్సుపై ఆ కిరీటమునుంచారు...


అనేకమంది రాజులు, రారాజు లు, సామంతులును, ఋషులు, ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. 

సింహ ద్వారము వద్ద, పెద్ద పెద్ద అక్షరాలతో, 

*" సత్యధర్మాభియుక్తానాం   నాస్తిమృత్యుభయం"* అని వ్రాయబడిన బోర్డు కనిపించింది. 

_అనగా .... సత్యధర్మాలతో జీవితం గడిపే వారికి, మృత్యు భయం లేదని అర్ధము...._

 

_ఎందుకంటే  -   సత్యధర్మాలను పాటించే వారికి మరే జన్మ ఉండదు. *జన్మించారు అంటేనే కదా, మరణముండేది!*_ 


                        *_🌸శుభమస్తు🌸_*

               🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

అద్వైత దర్శనమే

 శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


పరాద్భిన్నో జీవో జడమపి చ జీవా జ్జడమపి

తథా జీవాజ్జీవో జడమపి జడాద్ భిన్న మథవా౹

సమస్తేప్యద్వైతా దృగిహ తు భవేన్మోక్షసరణిః

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


పరుడి కంటే జీవుడు,  జడమూ భిన్నాలే. జీవుడి 

కంటే జడం భిన్నం.  జీవుడికంటే  జీవుడు, జడం 

కంటే జడం భిన్నాలు. కానీ భిన్నములైన ఈ  

సమస్తములయందు (పరుడు, జీవుడు, జడము ) 

అద్వైత దర్శనమే మోక్షం. విధాతా ! సృష్టిగతిని 

ఇలా కొనసాగిస్తూ నువ్వెందుకు విఫలుడ

వవుతున్నావు?

పండితవర్యులకు వినమ్రాంజలి!

1. అగ్నిపంచకముగా

   శ్రోత్రము, చక్షువు, జిహ్వ, త్వక్కు, ఘ్రాణము చెప్పబడినవి. వీనినే జ్ఞానేంద్రియా లన్నారు.

2. అగ్ని వలన ఆకలి, దాహము, నిద్ర, సంగమము, నిధానము కలుగుచున్నవని చెప్పబడినది. వీనిలో గల అగ్నితత్త్వమును సమన్వయము చేసి చెప్పగలరని ఆర్యులకు సవినయ విన్నపము.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

జగత్తు

 శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


జగన్మిథ్యా భ్రాన్తి శ్చల మచల మిత్యాదివిశయః

భవేద్వా జ్ఞానాంశః భవతి న ఫలం తేన కిమపి౹

న యావద్దృష్టం తత్ వ్యవహృతిపదే నిత్యగమనే

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


జగత్తు మిథ్య, భ్రాంతి, చలం, అచలం ఇవన్నీ 

కూడా జ్ఞాన విషయాలైతే కావొచ్చు. కానీ ఆ 

జ్ఞానం,  వ్యవహార స్థానంలో నిత్యజీవితంలో 

కనిపించనంతకాలం దాని వలన వచ్చే ఫలమేమీ 

లేదు.(మేమలా జ్ఞానాన్ని వినియోగించటం లేదు)

విధాతా ! సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ నువ్వెందుకు 

విఫలుడవవుతున్నావు?

మహాపురుషులు

 *మహాపురుషులు*

🕉️🌞🌎🏵️🌼🚩

✍️నారంశెట్టి  ఉమామహేశ్వరరావు 

 🍁🍁🍁🍁🍁🍁


మనసులోని యోచన, మాటలోని  సూచన, క్రియలోని ఆచరణ ఒక్కటై  ముందడుగేసేవారే  మహాపురుషులు. నూటికో కోటికో ఒక్కరై  జన్మించి చిరకీర్తితో  చిరస్మరణీయులవుతారు. 

 

‘ప్రళయకాలంలో మేరుపర్వతమే కదలవచ్చునని,  సప్తసాగరాలు చెలియలి కట్టను దాటొచ్చునని,  సత్పురుషుడు ఇచ్చిన వాగ్దానానికి మాత్రం తిరుగుండదన్న”  చాణక్యుని వచనాలను యథార్థమని నిరూపించిన మహాపురుషులను   పురాణాలు ఆదర్శంగా వర్ణించాయి. 

సత్యవాక్య పాలనకై విశ్వామిత్రుని పరీక్షలో రాజ్యభ్రష్టుడై , కష్ట నష్టాలను, కుమారుని మరణాన్ని దిగమింగి,  అర్ధాంగిని సైతం మరుభూమికి అర్పణ గావించేందుకు ఉద్యుక్తుడయిన హరిశ్చంద్రుడి చరితను మార్కండేయ పురాణం వివరించగా,  యంత్ర విజ్ఞానంలో సనత్కుమారులకు  సాటియై, బుద్ధిలో బ్రహస్పతికి ధీటుయై, సత్యవతిని వివాహమాడాలన్న తండ్రి కోరిక తీర్చేందుకు ఆజన్మ బ్రహ్మచర్యం గడిపిన భీష్ముడి గాథను భారతం వివరించింది.  

 

“ఉత్తమశీల స్వభావం కలవారు సర్వులను జయిస్తారని”  విదురనీతి వచించినట్టుగా   సూర్యుని శిష్యుడిగా  విద్యల్లో పారంగతుడై,      సముద్రాన్ని లంఘించి సీతాన్వేషణ జరిపిన అసమాన సాహసి,  లంకా దహనంతో రావణుని హెచ్చరించిన ధైర్యశాలి,  సంజీవనీ పర్వతంతో లక్ష్మణ  తేజస్సు  నిలిపిన అంజనీసుతుడి ఘనతను రామాయణం వివరించింది.   

“బంగారానికి  రుద్దడం , కత్తిరించడం , నిప్పులో  వేయడం, సుత్తితో కొట్టడమనే పరీక్షలున్నట్టే మానవ నైజంలోని  త్యాగం, శీలం, గుణం,  కర్మలే మహాత్ములను నిర్ణయిస్తాయని”  శాస్త్రాలు చెప్పిన 

ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. "రామో విగ్రహవాన్ ధర్మః సాధుస్సత్యపరాక్రమః యని” శత్రువుచే కీర్తించబడిన  ధర్మచరితుడు,  వనవాసానికి కారకురాలైన కైకేయిని మునుపటి ప్రేమతో ఆదరించిన పితృవాక్య పాలకుడు, శరణన్న శత్రువును క్షమించే ఉదాత్త స్వభావుడు, వాలి, రావణాది రాక్షసవీరులను జయించిన జగదేకవీరుడని రామాయణం వర్ణించింది.  

 

‘శక్త్యనుసారం కృషి చేస్తూ, కోల్పోయిన వాటికి శోకించక,  విపత్తులతో ధైర్యం వీడక, ఆరంభించిన కార్యాలను కొనసాగిస్తూ మనస్సును వశపరచుకుని చరించువారు పండితులని” గ్రంథాలన్నట్టు  పట్టుదలకు, కార్యసాధనకు మారుపేరుగా నిలిచి,  దివి నుండి భువికి గంగను తెచ్చి,   సగరపుత్రులు అరవై వేల మందికి మోక్ష ప్రాప్తి కలిగించిన భగీరథుని గొప్పతనాన్ని భాగవతం వివరించింది.    

 “వినయంతో ప్రారంభించి, సహనంతో కొనసాగిస్తే మహాకార్యాలు సాధ్యమవుతాయన్నట్టు” నేటి కాలంలోనూ కొందరు మహాపురుషులు నిరూపించారు.  బానిసత్వంలో మ్రగ్గుతున్న భారతావనికి  స్వేచ్ఛను ప్రసాదించిన  మహాత్మా గాంధీ,  విశాలభారత చిత్రపటావిష్కరణకై  సంస్థానాలను విలీనం  చేయించిన  సర్దార్  వల్లభాయి పటేల్ జాతికి ఆరాధ్య దైవాలయ్యారు. ​

​మహాపురుషుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని జాతి గర్వించే మేటి పౌరులుగా కొందరైనా తయారైన రోజున వారి ఆదర్శాలకు,  త్యాగాలకు  అర్ధం పరమార్ధం చేకూర్చిన వారిమవుతాం.


🕉️🌞🌎🏵️🌼🚩

అంత రంగ సాధన

 *అంత రంగ సాధన*

మనము ఈరోజు చేస్తున్న పూజలు, భజనలు, ఎంతవరకు మనలను భగవంతుని వద్దకు చేరుస్తాయో ఎవరికి తెలియదు,

ఎవరో ఈ దీపం పెట్టండి, ఈ వ్రతం నోమండి, ఈ జపం చేయండి, అని చెప్పగానే ఎగబడి చేస్తాము ... 

కానీ ఎవరైనా సాధన చేయండి, ఈ విధంగా జీవించడం మంచిది, ఈ విధంగా ఆలోచించండి అని చెప్పగానే, వారిపై కస్సు బస్సులు ఆడి, చిందులేస్తాము...

ఈ పూజలు, భజనలు, సాధనలో భగవంతున్నీ తెలుసుకోనేంతవరకే, అటు తరువాత ఆయనను చేరాలి అంటే ... అంతరంగ సాధన సల్పాలి...


   సముద్రము ముత్యాలాది నిధులకు నిలయం, ముత్యాలు కావాలనుకునేవారు సముద్రం లోతులకు పోవాలే తప్ప ఒడ్డున నిలబడి వెతికితే దొరుకుతాయా?! 

అదే విధముగా ఆత్మానందము కావలెనన్నా మన హృదయాంతరములోకి పోయి అందు కొలువైయున్న పరమాత్మను పట్టుకోవాలెను, 

తప్ప బాహ్యమైన, అల్పమైన పూజలతో సరిపెట్టుకోకూడదు. 

సముద్రపు ఒడ్డున నిలబడి వెతికితే దొరుకేవి కేవలం రాళ్లురప్పలే! 

అలానే బాహ్యమైన పూజల వలన కూడా రాళ్ల మాదిరి ఆనందమే కలుగుతుంది....

 రాయికి, ముత్యానికి పోలిక చెప్పలేము, అలానే సాధారణ ఆనందానికి, ఆత్మానందానికి కూడా పోలిక చెప్పలేము....


 ఆత్మానందము విలువ కట్టలేనిది, విశిష్టత కలది. ఇది మానవుని సహజ సంపద.

 కనుక ప్రతీ ఒక్కరూ బాహ్యమైన పూజలు తగ్గించుకుని అంతరంగమునందు భగవంతుని ఆరాధించుచూ ఆత్మానందము పొందుటకు సాధన చేయాలి.

ఆనందానుభవం

 శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


న వాదా దద్వైతా ద్భవతి జనుషో మోక్షపదవీ

వినా తద్విజ్ఞానా త్ప్రియతదనుభవా త్తస్య ఫలనాత్౹

వయం వాక్యై ర్వాదై ర్మధుఘృతరసం జ్ఞాతుమనసః

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹



తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


అద్వైత జ్ఞానం లేకుండా, తనకిష్టమైన ఆ 

ఆనందానుభవం లేకుండా, దాని ఫలం 

కనిపించకుండా, అద్వైత వాదం వలన జనులకు 

మోక్షం రాదు. కానీ,  మేమేమో వాక్యాలతో, 

వాదాలతో తేనె, నెయ్యి మొదలైన వాటి రసాన్ని 

తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటాం.  విధాతా !

సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ నువ్వెందుకు 

విఫలుడవవుతున్నావు?

శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


తిరస్కుర్మో న త్వం త్వదభిలషితం నాపి విపులాం

త్వదాత్మీయాం సృష్టిం పర మిహ వయం వచ్మ నితరామ్౹

పరాత్మానం నిత్యం జగదిద మనిత్యం భ్రాన్తి మథవా

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


నిన్ను తిరస్కరించట్లేదు, నీ కోరికనూ  

తిరస్కరించట్లేదు, నీ స్వరూపమైన ఈ సృష్టినీ 

తిరస్కరించట్లేదు. కానీ, మేము ఆ పరమాత్మ 

నిత్యమని, జగత్తు అనిత్యమని లేదా భ్రాంతియని 

చెబుతుంటాం. విధాతా ! సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ 

నువ్వెందుకు విఫలుడవవుతున్నావు?

సాష్టాంగ నమస్కారం

 *సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత*


_అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.._

_సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము..._


ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...


అష్టాంగాలు అంటే...


"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా పాదములు,

"కరాభ్యాం" అనగా చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.


ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.


మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..


_ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి._


_1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి._


_2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి._


_3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి._


_4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి._


_5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి._


*అంటే  " నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.*


_6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి._


_7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి._


_8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి..._


*స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు.* ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. 

అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.


పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. 

దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.


*_నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం..._*

మానవీయ లక్షణం

 మనిషి శారీరకంగా ఆర్ధికంగా బలహీనమైనపుడు.. ఆ మనిషి ఎన్ని తప్పులు చేసినా అంతకుముందు మన మననును బాధ పెట్టినా అవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా.. వారిని ఆదరించి నీకు మేమున్నాం అని భరోసా కల్గించడం మానవీయ లక్షణం. రోగాన్ని రోగ గ్రస్త శరీరాన్ని మనం నయంచేయలేకపోయినా అప్పటి వారి మానసిక స్థితి శరీర దౌర్భల్యానికి ఆదరణతో కూడిన సేవ సాంత్వన కల్గించే మాటలను తప్పకుండా అందించాలి. మనుషుల హృదయాలు రాతి హృదయాలు కరగనివయితే కాదు.. కదా!

మంచిమనుషులకు కోపం తాటాకు మంటలాంటిదంటారు.. కదా.. అలా వుండగల్గాలి. ఎవరూ తప్పులు చేయనివారు లోపాలు లేని వారు వుండరు. క్షమ మనిషిని మహోన్నత శిఖరాల మీద కూర్చుండబెడుతుంది అంటారు కదా.. నిజానికి చాలామంది డబ్బు లేక సరైన వైద్యం లేక పోరాడి అలసి అలసి నిస్సహాయస్థితిలో మరణిస్తారు. కొంతమంది అహంకారంతో అన్నీ వుండి కూడా ఆత్మీయులు లేక అలమటిస్తారు.

మనం భగవంతుని ముందు క్షమసత్వం చెప్పుకున్నట్టే మనవారి ముందు చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రేమ వాత్సల్యం ఎరిగినవారు వారే గ్రహిస్తారు. ఎన్ని కన్నీళ్ళు కుమ్మరించిన మాట చేసిన గాయం మానదు.. అయినా వారినీ క్షమించాలి.


ఉమర్ ఖయ్యామ్ రుబాయీ కి చలం తెలుగు అనువాదం చూడండి. 


“భరించే నీక్షమ నాకండగా వుండగా

నా పాపభారాన్ని చూసి నాకేం భయంలేదు.

నా చరిత్ర ఎంత నల్లనిదైనా

నీ కరుణ నన్ను కడిగి శుభ్రంచేస్తే

నీ సమక్షంలో నిలవడానికి నేను జంకను”.

ఇలా అని మనం భగవంతుని ముందే కాదు మన వారి వద్ద అన్నాము అనిపించుకోవడానికి అభిజాత్యం ప్రదర్శించవద్దు. గంగ లాగ పొంగి వచ్చి యమునలా సంగమించేదే ప్రేమ. ప్రేమించడానికి ఒక సాప్ట్ కార్నర్ వుంటుంది ప్రతి ఒక్కరిలో. దాన్ని వాడండి శత్రువుల హృదయాన్ని కుడా గెలుచుకొండి. ఎందుకంటే ఈ భూమి మీద ఇంకా ఎంతకాలం ఉంటామో మరలా మానవులు గా ఈ విచక్షణతో పుడతామో లేదో తెలియదు. కాబట్టి ఈ చిన్ని జన్మలో ఇన్ని కల్మషాలు మనకు ఎందుకు? ఆలోచించండి? *కుదిరితే ఒక పులకరింపు... లేకపోతే ఒక పలకరింపు* ....🙏

అసలైనతోడు



*నీ ఈజీవితంలో అసలైనతోడు ఎవరు?*

అమ్మనా?

నాన్ననా?

భార్యనా?

భర్తనా?

కొడుకా?

కూతురా?

స్నేహితులా?

బంధువులా ?


లేదు.ఎవరూ కాదు.!


నీ నిజమైన తోడు 

*నీ శరీరమే!* 

ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!!

నువ్వు అవునన్నా,కాదన్నా,ఇది కఠిన నిజం.!!!

*నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.* నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు. 

 ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.

*నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని  చూసుకుంటావో,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా  చూసుకుంటుంది.*

నీవేమి తినాలి?

నీవేమి చేయాలి?

ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?

నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?

అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.

గుర్తించుకో !

నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!

నీ శరీరమే నీ ఆస్థి,సంపద.

వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.

నీ శరీరం నీ బాధ్యత...


డబ్బు వస్తుంది.వెళ్తుంది.

బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.

గుర్తుంచుకో.!

నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.

ఒక్క నీవు తప్ప...!


ఊపిరితిత్తులకు- *ప్రాణాయామం.*

మనసుకు- *ధ్యానము*

శరీరానికి- *యోగా.*

గుండెకు- *నడక.*

ప్రేగులకు- *మంచి ఆహారం.*

ఆత్మకు- *మంచి ఆలోచనలు.*

ప్రపంచానికి- *మంచి పనులు.*


👆ఒకటికి రెండు పర్యాయాలు చదవండి. మీ  chakravarthy 🙏

సుభాషితమ్

 🙏 *శుభోదయమ్*🙏

🌸 *సుభాషితమ్* 🌸


శ్లో|| అత్యార్యమతిదాతారం అతిశూరమతివ్రతమ్|

ప్రఙ్ఞాభిమానినం చైవ శ్రీర్భయాన్నోపసర్పతి||


*…. మహాభారతమ్ - ఉద్యోగపర్వం ….*


తా|| "అతి మంచితనం కలవాడి దగ్గరకు, అతిగా దానం చేసేవాడి దగ్గరకు, అతి పరాక్రమవంతుడి దగ్గరకు, తన తెలివిమీద అభిమానం కలవాడి దగ్గరకు లక్ష్మి భయంతో చేరదు...... 

🙏💖🌷

23, జనవరి 2021, శనివారం

మహర్షులు - 2

 మన మహర్షులు - 2


 *అత్రి మహర్షి* 


🍁🍁🍁🍁🍁


అత్రి మహర్షి సప్తమహర్షులలో ఒకరు.


అత్రి మహర్షి బ్రహ్మదేవుడి మనస్సులోంచి పుట్టాడు. 


అంటే బ్రహ్మమానస పుత్రుడన్నమాట. అలా పుట్టిన అత్రి మహర్షిని బ్రహ్మదేవుఁడు “లోక రక్షణ కోసం నేను కొంతమందిని సృష్టిస్తున్నాను, నువ్వు గొప్ప తపశ్చక్తిని పొంది నాకు ఈ సృష్టికార్యంలో సాయపడాలి" అని అడిగాడు


అందుకు అత్రి మహర్షి సరే! అలాగే సాయపడతానని చెప్పి ఒక మంచి అనుకూలమయిన ప్రదేశాన్ని చూసుకుని తపస్సు ప్రారంభించాడు


ఈ మహర్షి చేసిన ఘోరతపస్సుకి ఆయన కళ్ళల్లోంచి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చి భూమి, ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించి పోయింది. ఆ తేజస్సుని భూమ్యాకాశాలు కూడా భరించలేక పోవడం వల్ల అది సముద్రంలో పడిపోయింది


ఇది బ్రహ్మదేవుడికి తెలిసి ఆయన ఆ తేజస్సుని అత్రిమహర్షికి తేజస్సు యొక్క కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా పుడతాడని, క్షీరసాగర మథన సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడిని కలుస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు.


 కొంతకాలం తర్వాత, అత్రి మహర్షికి అనసూయాదేవితో వివాహం జరిగింది. 

. అనసూయాదేవి గొప్ప

పతివ్రతగా వినుతికెక్కింది.


 ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనసూయాదేవిని పరీక్షిద్దామని బయలుదేరి అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారు. 


అత్రి మహర్షి అనసూయాదేవి వారికి ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు త్రిమూర్తులు మహర్షితో మాకు వడ్డించే స్త్రీ నగ్నంగా వడ్డించాలి

అన్నారు. అనసూయాదేవి అంగీకారంతో అత్రిమహర్షి మీ కోరిక ప్రకారమే అన్నాడు.



త్రిమూర్తులు స్నానం చేసి కూర్చున్నాక అనసూయ వారిమీద మంత్రజలం చల్లి చంటి పిల్లల్లా చేసి నగ్నంగా వడ్డించింది. మళ్ళీ దుస్తులు ధరించి వాళ్ళ ముగ్గుర్ని మంత్రజలంతో మామూలుగా చేసి తినండి అంది. భోజనం తర్వాత మళ్ళీ చంటి పిల్లల్ని చేసి ఉయ్యాలలో వేసింది.


త్రిమూర్తుల్ని వెతుక్కుంటూ సరస్వతి, లక్ష్మి, పార్వతి వచ్చి అనసూయ దగ్గర చంటి పిల్లల్ని చూసి మా భర్తల్ని మాకియ్యమని అడిగి అత్రి అనసూయలను మా ముగ్గురి అంశలతో ముగ్గురు పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తల్ని తీసుకుని వెళ్ళిపోయారు.


ఒకసారి కౌశికుడి భార్య, సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతాడని తెలిసి సూర్యుడు ఉదయించకుండా చేసింది. అనసూయాదేవి సూర్యుడు ఉదయించేటట్లు చేసి కౌశికుణ్ణి కూడా బ్రతికించింది.


అత్రి మహర్షి సంతానం కోసం వంద సంవత్సరాలు భార్యతో కలిసి తపస్సు చేశాడు.


అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై పిల్లలు కలిగేలా వాళ్ళని ఆశీర్వదించారు.


 కొన్నాళ్ళయ్యాక అత్రి మహర్షి  

 అనసూయా దేవికి చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు అనే పేర్లతో ముగ్గురు పిల్లలు పుట్టారు.


సంసారపోషణార్ధం పృథు చక్రవర్తి దగ్గరకు ధనం కోసం వెళ్ళాడు అత్రి మహర్షి.


ఆ సమయంలో పృథుచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ యాగాశ్వాన్ని రక్షించడానికి తన కుమారుడితో వెళ్ళమని పృథు చక్రవర్తి అత్రి మహర్షిని అడిగాడు. అత్రి మహర్షి సరేనని బయల్దేరాడు.


పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేశాడు. 


అత్రి మహర్షి తన దివ్యదృష్టితో చూసి ఆ విషయం పృథు చక్రవర్తి కుమారుడికి చెప్పాడు.


 అతడు ఇంద్రుణ్ణి జయించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చాడు.


అశ్వమేధయాగం పూర్తయ్యాక పృథు చక్రవర్తి ఇచ్చిన ధనం, వస్తువులు మొదలయిన వాటిని తీసుకువెళ్ళి పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయా దేవితో కలిసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు.


 ఒప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల్లో వెలుగు తగ్గిపోయి లోకమంతా చీకటయిపోయింది. అప్పుడు

అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందర్ని చంపేశాడు.


అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు రహస్య పాయశ్చిత్తాలు మొదలయిన వాటి గురించి తెలియచేయబడ్డాయి.


. అలాగే అత్రి సంహితలు అనే గ్రంథాల్లో ఆచారాలు, గురుప్రశంస, చాతుర్వర్ణ ధర్మాలు, జపమాలాపవిత్రత, పుత్రులు దత్తపుత్రులు మొదలయినవాటి గురించి తెలియచేయబడ్డాయి.


దత్తపుత్రుణ్ణి స్వీకరించవచ్చు అనే దాన్ని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టింది.

అత్రిమహర్షి......!


చదివారు కదా !... సప్తమహర్షుల్లో ఒకడయిన అత్రి మహర్షి గురించి...


రేపు మరో మహర్షి గురించి తెలుసుకొందాం...


జై శ్రీమన్నారాయణ🙏


🍁🍁🍁🍁

సాధన - 8*

 *సాధన - 8* 


*ఓం పూతాత్మనే నమః* 


అద్భుతమైన శ్రీమహావిష్ణువు మంత్రం ఇది. ఇది అత్యద్భుతమైన కార్యసిద్ధి మంత్రం . "పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణా బాధతే". పూర్వజన్మలో చేసిన పాపం రోగం రూపంలో పీడిస్తుంది. రోగం పోతే కాని కార్యసిద్ధి అవ్వదు. సంపదలు రావు. కాబట్టి, రోగం పోవాలంటే కార్యసిద్ధి అవ్వాలంటే పాపం తొలగాలి. పాపం తొలగితే పుణ్యాత్ముడు  అవుతాడు.

           'పూత ఆత్మ' అంటే పవిత్రమైన ఆత్మ కలవాడు విష్ణువు.శ్రీమన్నారాయణుడు పరమాత్మ, పవిత్ర ఆత్మ స్వరూపుడు.


*మంత్ర ప్రయోగం ఫలితం :* 

ఈ మంత్రాన్ని ప్రతి శనివారం 1000 సార్లు అనుష్ఠానం చేస్తే మీరు చేసిన ఏడు జన్మల పాపాలు పోతాయి. "సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి".  పాపాలు పోతే మీరు అనుకున్నవి అన్ని కార్యాలు సిద్ధి అవుతాయి, సంపదలు వస్తాయి.


           కాబట్టి మీరు 40 శనివారాలు కానీ లేదా 27 శనివారాలు కానీ నియమం పెట్టుకోండి. వీలుంటే 40 శనివారాలు  చేయటం చాలా మంచిది. అంత  ఓపిక లేని వాళ్ళు కనీసం  27 శనివారాలు నియమం పెట్టుకుని, ప్రతి  శనివారం నాడు, ఆడవాళ్ళు అయితే బయట ఉన్నప్పుడు మానేయండి, మగవాళ్ళు మైలు వచ్చినప్పుడు మానేయండి

ఆడవాళ్ళైనా ,మగవాళ్ళైనా అశుచిగా ఉన్నప్పుడు చేయకూడదు.

           శనివారం ఉదయం స్నానం చేసి శనిహోర అని ఉంటుంది 6 గంటల నుంచి ఇంచుమించుగా సూర్యోదయం నుంచి ఒక గంట కాలం శనిహోర ఉంటుంది.  మీకు పంచాంగం లో సూర్యోదయం అని ఉంటుంది 5.30 కి కానీ 6 గంటలకి కానీ అక్కడ నుంచి మొదలు పెట్టి 1000 సార్లు జపం చేయవచ్చు.

           ప్రతి శనివారం ఈ " ఓం పూతాత్మనే నమః" అనే మంత్రాన్ని అనుష్ఠానము చేస్తూ తులసి పత్రాలు లేక మారేడు ఆకులతో శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని పూజించండి. ఆ విగ్రహం రాగిది అయినా వెండిది అయినా ఇత్తడిది అయినా అవ్వచ్చు. చిన్ని విగ్రహాన్ని పూజించండి. 27 శనివారాలు లేదా 40 శనివారాలు ఇలా పూజ చేశాక  ఈ విగ్రహాన్ని ఎవరైనా ఒక మంచి పండితుడికి దానం చేయండి. మీకు తోచిన దక్షిణ  ఇవ్వండి. ఇంత అని నియమం లేదు. దీని వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. కార్యసిద్ధి అవుతుంది అని స్వయంగా దుర్వాస మహర్షి ఇంద్రుడికి చెప్పాడు. 

             ఇంద్రుడు అది చేశాక సామ్రాజ్యం వచ్చింది. అనుకున్న పనులు నెరవేరాలంటే ఎంత క్లిష్టమైన పనైనా సరే ఎంత కష్టమైన ఉద్యోగం రావాలనుకున్నా ఇలా మీరు 40 వారాలు చేసినా లేదా మీరు 27 వారాలు చేసినా మీ భక్తిశ్రద్ధలను బట్టి మీరు అనుకున్న పనులు నెరవేరి తీరుతాయి.అందువల్ల కార్యసిద్ధి శ్రీవిష్ణు మహామంత్రం అని దీనిని దుర్వాసుడు చెప్పాడు. తద్వారా కార్యసిద్ధిని పొందండి.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని,లేనివారు ఓంకారం లేకుం.డా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

జీవితం

 *ఒక మంచి కథ..*


*జీవితం గురించి కథ..సహనం.*


అనగనగా ఒక చెట్టు, పచ్చని ఆకులతో, 

తెల్లటి పూలతో అందంగా ఉండేది.. 

దారిన పోయేవాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది.. 

ఎంత వైరాగ్యం ఉన్నవాడికైన సరే నిండుగా ఉన్న 

ఆ చెట్టుని చూస్తే చాలు మళ్ళి జీవించాలనే 

ఆశ కలిగేది.


అలా కొన్నాళ్ళు గడిచాక చెడుగాలులు వీయడంతో పూలు రాలిపోయాయి.. 

ఎండకు ఆకులు ఎండిపోయి కొమ్మనుండి వేరైపోయాయి.

చెట్టు బోసిపోయింది.. 

అటుగా వెళ్తున్న వాళ్లందరు చెట్టును జాలి చూపులు చూశారు.

ఇక దీని ఆయుష్షు ఐపోయిందని మాట్లాడుకున్నారు.


అది విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహ పడలేదు.

తనకు మళ్ళి గత వైభవం రాకపోతుందా! 

అనే నమ్మకంతో బతుకుతుంది.


కొన్నాళ్ళకి ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది. అంతే చెట్టులో చలనం మొదలైంది.. 

కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి... కొన్ని రోజులకి ఆకులు చిగురించాయి , 

పువ్వులు వికసించాయి.. 

మళ్ళి పది మందికి నీడనివ్వటం మొదలుపెట్టింది, వాళ్ళకు జీవతం మీద ఆశను కలిగేలా చేసింది... 

ఆ చెట్టు...!


మనిషి జీవితము అంతే...

ఒక్కొక్కసారి కొన్ని 'అనర్ధాల' వల్ల నవ్వులు అనే పూలు మాయమౌతాయి..

కొన్ని అపార్ధాల వల్ల కావాల్సినవాళ్ళే ఎండిపోయిన ఆకులు లా వీడిపోతారు...


అయిన సరే నిరుత్సాహ పడకూడదు.. 

ఏదో రోజు ఆ అనర్ధాలు, అపార్దాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి..


ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటున్నావో.. అదే నమ్మకంతో ఏదో ఒకరోజు 

నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది 

అని గట్టిగా నమ్ము...

అలా జరగాలంటే నీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం..


గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలుకగా మారలేదు అన్న నిజం నువ్వు గ్రహించాలి.

కాలం పెట్టిన సహన పరిక్షలో నువ్వే నెగ్గాలి..


ఎందుకంటే మంచి విషయాలు అంత తేలికగా 

పూర్తి కావు.. కాబట్టి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి, 

సహనానికి ఆశ్రయం ఇవ్వు... బద్ధకానికి కాదు.

గుర్తుంచుకో.


నువ్వు త్వరగా లేచినంత మాత్రాన సూర్యుడు 

ముందుగా ఉదయించడు., 

దానికి సమయం రావాలి..మనకు సహనం ఉండాలి...!

Gaanam

 



22, జనవరి 2021, శుక్రవారం

విషం కలిసినప్పుడు

 పదార్థాలకు విషం కలిసినప్పుడు ఆయా పదార్థాల           

సేవన వలన కలుగు విపరీతాలు - పదార్థ లక్షణాలు. 


  *  విషము కలిసిన అన్నమును అగ్ని యందు వేసిన ఛటఛటమను ధ్వని కలుగును. నెమలి కంఠము నందలి రంగు వలే పొగ వెలువడును. ఆ పొగని భరించుట చాలా కష్టం అగును. మంటలు కలిసి ఉండక విడివిడిగా వెలువడును. చకోర పక్షి విషము కలిసిన అన్నమును చూసిన వెంటనే ఎర్రగా ఉండు దాని నేత్రములు తెల్లబడును. కోకిలకు స్వరము చెడిపొవును.


 *  విషము కలిసిన ఆహారము నుండి వెలువడు ఆవిరి తగిలినచో హృదయము నందు బాధ , కనులు తిరుగుట, తలనొప్పి తగ్గును. ఇటువంటి సమయంలో చెంగల్వకోష్టు , ఇంగువ, వట్టివేర్లు , తేనె చేర్చి నశ్యము చేయించవలెను . 


 *  విషము జీర్ణాశయం నందు చేరినపుడు ఒళ్లంతా మంటలు , అతిసారం, కడుపులో గూడ గూడ మనుట , శరీరం తెల్లబడుట జరుగును.


 *  మద్యము నందు , జలము విషము కలిసిన ద్రవం నందు గీతలు , నురుగు, బుడగలు కలుగును. విషము కలిసిన ద్రవము నందు మన శరీరఛాయ కనపడదు. ఒక వేళ కనిపించిన జంట నీడలుగా , రంధ్రములతో కూడినట్టుగా , పలుచగా , వికృతాకారముగా కనపడును.


 *  కూరలు , పప్పులు , అన్నము, మాంసము అను వాటి యందు విషము కలిసిన చితచితలాడుచూ రుచిని కోల్పోయి చద్దివానివలే దుర్గన్ధమును కలిగి ఉండును. అన్ని పండ్ల యందు కూడా విషపూరితం అయినపుడు వాటికి ఉండు సహజసిద్ధ రుచి , సువాసన కోల్పోవును. పచ్చికాయలకు విషము తగిలిన వెంటనే పండును. పండిన వానికి విషము తగిలిన వెంటనే కుళ్లిపోవును.


 *  దంతములకు తగిలిన దంతములు విరిగిపోవును. నాలుక , పండ్లచిగుళ్ళు , పెదవులు వాచును .


 *  తలకు పూయు నూనె యందు విషము కలిసిన ఆ నూనె జిగటలుగా సాగును. నూనె చిక్కబడి రంగు మారును . అది శరీరముకు తగిలిన పొక్కులు పుట్టి బాధ కలుగును. పొక్కుల నుంచి స్రావం కలుగును. చర్మం పుండు అగును. చెమటలు పుట్టును . జ్వరం కలుగును. మాంసం విడిపోవును.  నలుగుపిండి , స్నానం చేయు జలము , తలస్నానం చేయు కుంకుడు రసం నందు కూడా విషం కలిసిన పైన చెప్పిన లక్షణాలు కలుగును.


 *  విషము కలిసిన లేపము తలకు పూసిన జుట్టు ఊడిపోవును. తలయంతయు బాధ కలుగును. కన్ను , ముక్కు, చెవి మొదలగు రంధ్రముల నుంచి రక్తం కారును . శిరస్సు నందు గడ్డలు లేచును .


 *  ముఖమునకు పూసుకోను ముఖలేపనం నందు విషము కలిసిన ముఖం కమిలినట్లు అగును. తామర కాడపైన ఉండే విధంగా సన్నని ముళ్ళు వంటివి ముఖంపైన లేచును .


 *  ముక్కుతో పీల్చే వాటి యందు విషము కలిసిన శరీర రంధ్రముల నుంచి రక్తం బయటకి వచ్చును. శిరోభాధ , కఫం బయటకి కారుట జరుగును.


 *  పువ్వులకు విషము తగిలినచో వాటి సువాసన కోల్పోవును . వర్ణం మారును , వాడిపోవును . విషము సోకిన పువ్వుల వాసన చూసిన శిరోభాధ కలిగి నేత్రముల యందు నీరు చేరును .


 *  చెవిలో వేసుకోను తైలం నందు విషము కలిసిన వికృతి కలిగి ధ్వని గ్రహించు శక్తి తగ్గును. చెవి యందు వాపు , పోట్లు , రసి కారుట కలుగును.


 *  కంటికి పెట్టుకొను కాటుక యందు విషము కలిసినచో కన్నీరు జిగురుగా మారును , కనులు మండును . గుడ్డితనం కూడా కలుగును.


 *  పాదుకలు యందు విషం ఉన్నచో పాదముల యందు వాపు , రసికారుట, పాదములు మొద్దుబారుట, పొక్కులు కలుగుట అను లక్షణములు సంభంవించును.


 *  నగల యందు విషము కలిసిన అవి మాములుగా ప్రకాశించవు . కాంతి తగ్గి ఉండును. ధరించిన శరీరభాగాలను హింసించును. వొళ్ళంతా మంటలు కలుగచేయును . చర్మం, మాంసం ఊడిపడును.  


            పైన చెప్పినవిధముగా ఆయా పదార్థాలలో విషము కలిసినపుడు విషము యొక్క తీక్షణత వలన అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. ఇప్పుడు నేను మీకు వివరించిన విషలక్షణాల గురించి రాజులకు వారివారి గురువులు తప్పకుండా వివరించేవారు.


     గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు