24, జనవరి 2021, ఆదివారం

మహాపురుషులు

 *మహాపురుషులు*

🕉️🌞🌎🏵️🌼🚩

✍️నారంశెట్టి  ఉమామహేశ్వరరావు 

 🍁🍁🍁🍁🍁🍁


మనసులోని యోచన, మాటలోని  సూచన, క్రియలోని ఆచరణ ఒక్కటై  ముందడుగేసేవారే  మహాపురుషులు. నూటికో కోటికో ఒక్కరై  జన్మించి చిరకీర్తితో  చిరస్మరణీయులవుతారు. 

 

‘ప్రళయకాలంలో మేరుపర్వతమే కదలవచ్చునని,  సప్తసాగరాలు చెలియలి కట్టను దాటొచ్చునని,  సత్పురుషుడు ఇచ్చిన వాగ్దానానికి మాత్రం తిరుగుండదన్న”  చాణక్యుని వచనాలను యథార్థమని నిరూపించిన మహాపురుషులను   పురాణాలు ఆదర్శంగా వర్ణించాయి. 

సత్యవాక్య పాలనకై విశ్వామిత్రుని పరీక్షలో రాజ్యభ్రష్టుడై , కష్ట నష్టాలను, కుమారుని మరణాన్ని దిగమింగి,  అర్ధాంగిని సైతం మరుభూమికి అర్పణ గావించేందుకు ఉద్యుక్తుడయిన హరిశ్చంద్రుడి చరితను మార్కండేయ పురాణం వివరించగా,  యంత్ర విజ్ఞానంలో సనత్కుమారులకు  సాటియై, బుద్ధిలో బ్రహస్పతికి ధీటుయై, సత్యవతిని వివాహమాడాలన్న తండ్రి కోరిక తీర్చేందుకు ఆజన్మ బ్రహ్మచర్యం గడిపిన భీష్ముడి గాథను భారతం వివరించింది.  

 

“ఉత్తమశీల స్వభావం కలవారు సర్వులను జయిస్తారని”  విదురనీతి వచించినట్టుగా   సూర్యుని శిష్యుడిగా  విద్యల్లో పారంగతుడై,      సముద్రాన్ని లంఘించి సీతాన్వేషణ జరిపిన అసమాన సాహసి,  లంకా దహనంతో రావణుని హెచ్చరించిన ధైర్యశాలి,  సంజీవనీ పర్వతంతో లక్ష్మణ  తేజస్సు  నిలిపిన అంజనీసుతుడి ఘనతను రామాయణం వివరించింది.   

“బంగారానికి  రుద్దడం , కత్తిరించడం , నిప్పులో  వేయడం, సుత్తితో కొట్టడమనే పరీక్షలున్నట్టే మానవ నైజంలోని  త్యాగం, శీలం, గుణం,  కర్మలే మహాత్ములను నిర్ణయిస్తాయని”  శాస్త్రాలు చెప్పిన 

ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. "రామో విగ్రహవాన్ ధర్మః సాధుస్సత్యపరాక్రమః యని” శత్రువుచే కీర్తించబడిన  ధర్మచరితుడు,  వనవాసానికి కారకురాలైన కైకేయిని మునుపటి ప్రేమతో ఆదరించిన పితృవాక్య పాలకుడు, శరణన్న శత్రువును క్షమించే ఉదాత్త స్వభావుడు, వాలి, రావణాది రాక్షసవీరులను జయించిన జగదేకవీరుడని రామాయణం వర్ణించింది.  

 

‘శక్త్యనుసారం కృషి చేస్తూ, కోల్పోయిన వాటికి శోకించక,  విపత్తులతో ధైర్యం వీడక, ఆరంభించిన కార్యాలను కొనసాగిస్తూ మనస్సును వశపరచుకుని చరించువారు పండితులని” గ్రంథాలన్నట్టు  పట్టుదలకు, కార్యసాధనకు మారుపేరుగా నిలిచి,  దివి నుండి భువికి గంగను తెచ్చి,   సగరపుత్రులు అరవై వేల మందికి మోక్ష ప్రాప్తి కలిగించిన భగీరథుని గొప్పతనాన్ని భాగవతం వివరించింది.    

 “వినయంతో ప్రారంభించి, సహనంతో కొనసాగిస్తే మహాకార్యాలు సాధ్యమవుతాయన్నట్టు” నేటి కాలంలోనూ కొందరు మహాపురుషులు నిరూపించారు.  బానిసత్వంలో మ్రగ్గుతున్న భారతావనికి  స్వేచ్ఛను ప్రసాదించిన  మహాత్మా గాంధీ,  విశాలభారత చిత్రపటావిష్కరణకై  సంస్థానాలను విలీనం  చేయించిన  సర్దార్  వల్లభాయి పటేల్ జాతికి ఆరాధ్య దైవాలయ్యారు. ​

​మహాపురుషుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని జాతి గర్వించే మేటి పౌరులుగా కొందరైనా తయారైన రోజున వారి ఆదర్శాలకు,  త్యాగాలకు  అర్ధం పరమార్ధం చేకూర్చిన వారిమవుతాం.


🕉️🌞🌎🏵️🌼🚩

కామెంట్‌లు లేవు: