24, జనవరి 2021, ఆదివారం

ఎవరి వల్ల

 ఎవరి వల్ల 

నీవు  ఒక హోటల్కి వెళ్లావనుకో అక్కడ నీవు భోజనం చేస్తే నీకు ఆ భోజనంలో వడ్డించిన పదార్ధాలు అన్ని చాల రుచికరంగా వున్నాయి నీవు తృప్తిగా భుజిం చావనుకో అప్పుడు నీకు ఒక అభిప్రాయం కలిగింది అదేమిటంటే ఇంత రుచిగా వంటచేసిన ఆ వంట వాడు ఎవరు. అతనిని చూసి అభినందించాలి అని నీకు అనిపించి మేనేజర్ దగ్గరకు వెళ్లి భోజన వంటకాలు చేసింది ఎవరు అని విచారిస్తే ఫలానా రామా రావు అని చెప్పి ఆతను ఇప్పుడు ఇక్కడ ఉండడు  పొద్దున్నే వండి వెళతాడు అన్నాడు . అప్పుడు నీకు ఆ రామా రావుని చూడాలని బాగా అనిపిస్తుంది. తరువాత కూడా నీవు ఆక్కడ భోజనం చేసి సదరు రామా రావుని చూడాలని అనుకుంటావు.  కానీ చూడలేకపోతావు.  . 

ఇప్పుడు నీకు ఒక విషయం జోతకం అయ్యింది అంత రుచిగా వండిన వంటవాడు రామా రావు అని.  కానీ నీవు ఆ రామా రావుని ఇంత వరకు చూడలేదు.  ఐనప్పటికి ఆ రామారావు యొక్క ఉనికి అతని పనితనాన్ని నీవు గుర్తించావు. . మనకు కనపడుతున్న పనితనాన్ని కార్యం అని సదరు పనితనానికి కారణం అయిన దానిని కారణం అని మన మహర్షులు తెలిపారు. 

మహా మేధావులైన మన మహర్షులు ఈ జగత్తుని చూసి విశ్లేషణ చేశారు. ఈ జగత్తుకు మూలా కారణం ఎవరు అనే పరిశోధన చేశారు.  ఆ పరిశోధనల  ఫలితమే మన ఉపనిషత్తులు  అందులో ఒకటి  " కేనోపనిషత్" కేనా అనే సంస్కృత పదానికి అర్ధం ఎవరివల్ల ఆ సరళిలో ఈ ఉపనిషత్తు పయనిస్తుంది. ఈ ఉపనిషత్తుతో మన మహర్షులు మనకు ఈ సృష్టి రహస్యాన్ని ఛేదించే క్రమంలో కృషి చేశారు. మోక్షార్ధులైన ప్రతి వారు చదవ వలసిన ఉపనిషత్తులలో ఈ కేనోపనిషత్ ఒకటి. 

ప్రతి ఉపనిషత్తు ఒక శాంతి మంత్రంతో మొదలు అవుతుంది.  ఈ ఉపనిషత్తు శాంతి మంత్రాన్ని ఇప్పుడు చూద్దాము. 

శాంతిమంత్రి :

ఓం ఆప్యాయన్తు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షు: 

శ్రోతమథో బలమింద్రియాణిచ సర్వాణి !

సర్వం బ్రహ్మౌపనిషదం మాఁహం బ్రహ్మనిరాకుర్యాం 

మామా బ్రహ్మి నిరాకరోదనిరాకరణ మస్త్వనిరాకరణం మేఁ స్తు !

తదాత్మని నిరతే య ఉపనిషత్తు ధర్మాస్తేమయిసస్తు తేజమయిసస్తు !!

ఓం శాంతి: శాంతి: శాంతి: 

మమ = నా; అంగాని = అవయవాలు; అప్యాయన్తు = శక్తివంతములగు గాక; ఆథో = ఇంకనూ; వాక్ = వాక్కు; ప్రాణ: = ప్రాణం; చక్షు: = కన్ను; శ్రోత్రమ్ = చెవి; బలమ్ = శక్తి; సర్వాణి = అన్ని; ఇంద్రియాణి = ఇంద్రియాలు; చ = కూడా; ఔపనిషదం = ఉపనిషత్తులో చెప్పబడిన; బ్రహ్మ = బ్రహ్మం; సర్వం = సమస్తం; అహం = నేను; బ్రహ్మ = బ్రహ్మాని; మానిరాకుర్యాం = నిరాకరింపకుందును గాక; బ్రహ్మ = బ్రహ్మం; మా = నన్ను; మాని రాకరోత్ = నిరాకరింపకుండుగాక; అనిరాకరణం = నిరాకరించుకుండటం; మే = నాయెడల; అస్తు = ఉండుగాక; ఉపనిషత్తు = ఉపనిషత్తులతో; యే = ఏఏ; ధర్మా: = ఉత్తమ గుణాలు (ఉన్నవో); తే = అవన్నీ; తదాత్మనివిరతే = ఆ ఆత్మలో శ్రద్ధగల; మయి = నాయందు; సన్తు = ఉండుగాక. 

నా అవయవాలు శక్తివంతాలగుగాక. నా వాక్కు, ప్రాణాలు, కళ్లు, చెవి మరియు అన్ని ఇంద్రియాలు శక్తివంతాలగుగాక. ఈ సకలబ్రహ్మాండము వేదాంతవేద్యమైన బ్రహ్మమే. ఎన్నడూ నేను బ్రహ్మాన్ని నిరాకరించకుందునుగాక. బ్రహ్మం నన్ను నిరాకరింపకుండుగాక (అనగా నేను ఆ బ్రహ్మమే కదా!). నా నిరాకరణం బ్రహ్మంలో లేకుండుగాక. బ్రహ్మనిరాకరణం కనీసం నాలో లేకుండుగాక. ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఉత్తమగుణాలు ఆత్మనిరతుడైన నాయందు నిలుచుగాక. నాయందు ఆ సకలధర్మములు నెలకొనుగాక!

 ఓం శాంతి: శాంతి: శాంతి:

మన హిందూ ధర్మంలో మన మహర్షులు మనకు అన్నీ ధనాత్మకపు (పాజిటివ్ థింకింగ్ ) ఆలోచనలనే మనకు ఉపదేశించారు. రుణాత్మకత (నెగెటివ్ థింకింగ్) కు ఏమాత్రము చోటు లేదు. మనం ఎల్లప్పుడు ఆశా వాదులుగానే మన విద్యను అభ్యసించాలన్నది మన మహర్షుల అభిమతం. 

ఇప్పుడు మొదటి మంత్రాన్ని చూద్దాము. 

1. కేనేషితం పతతి ప్రేషితం మన: 

కేనప్రాణ: ప్రథమ: ప్రైతియుక్త: !

కేనేషితాం వాచమిమాం వదన్తి

చక్షు: శ్రోత్రం క ఉ దేవోయునక్తి !!

మన: = మనస్సు; కేన = దేనిచేత; ప్రేషితం = పంపబడి; పతతి = తన పనులుచేయ దుముకుచున్నది; కేన = ఎవనిచేత; యుక్త: = నియోగింపబడి; ప్రథమ: = ముఖ్యమైన; ప్రాణ: = ప్రాణం; ప్రైతి = తన పనులపై సంచరిస్తుంది; కేన = దేనిచేత; ఇషితామ్ = ఇష్టాన్ని అనుసరించి; ఇమామ్ = ఈ; వాచమ్ = మాటలు; వదన్తి = మానవులు పలుకుతారు; చక్షు: = కన్ను; శ్రోత్రం = చెవి; ఉ = నిజానికి; క: = ఏ; దేవ: = తేజోవంతుడు; యునక్తి = నియమించుతాడు..

శిష్యుడు : మనస్సుని దాని విషయాలపైకి పడేటట్లు ఏది ప్రేరేపిస్తుంది? దేనిచేత ప్రయోగింపబడి ప్రాణం తన పనులను కొనసాగిస్తుంది? దేని ఇష్టాన్ని అనుసరించి మానవులు మాటలు మాట్లాడుతారు? నిజంగా ఏ బుద్ధి కళ్లను, చెవులను నియమిస్తుంది? 

యెంత అద్భుతమైన ఆలోచనో చుడండి. మన కళ్ళు  చూస్తున్నాయి,మన చెవులు వింటున్నాయి ఈ విషయాలు ప్రతి వారికి తెలుసు.  కానీ కళ్ళు  చూడటానికి,చెవులు వినటానికి కారణం ఎవరు??? 

2. శ్రోత్తస్య శ్రోత్రం మనసో మనో యద్ 

వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణ: !

చక్షుషశ్చక్షురతి ముచ్యధీరా: 

ప్రేత్యాస్మాల్లోకా దమృతాభవన్తి !!

యత్ = ఏదైతే; శ్రోత్రస్య = చెవియొక్క; శ్రోత్రమ్ = చెవియో; మనస: = మనస్సుయొక్క; మన: = మనస్సో; వాచ: = వాక్కుయొక్క; హ = నిజంగా; వాచమ్ = వాక్కు; స: = అదే; ఉ = మరియు; ప్రాణస్య = ప్రాణంయొక్క; ప్రాణ: = ప్రాణమో; చక్షుష: = కన్నుయొక్క; చక్షు: = కన్నో(ఈ విధంగా తెలుసుకుని ఆత్మ ఈ ఇంద్రియాలూ మొదలైనవే అన్న భ్రాంతి); అతి ముచ్య = వదిలించుకుని; ధీరా: = బుద్ధిమంతులు; అస్మాత్ = ఈ; లోకాత్ = ఇంద్రియ జీవనం నుండి; ప్రేత్య = తప్పుకొని; అమృతా: = అమరులు; భవన్తి = అవుతారు. 

ఆచార్యుడు : ఆత్మ శక్తి వలననే చెవి వుంటుంది. కన్ను చూస్తుంది. జిహ్వ మాట్లాడుతుంది. మనస్సు గ్రహిస్తుంది. ప్రాణాలు పనిచేస్తాయి. బుద్దిమంతుడు ఆత్మను ఈ ఇంద్రియ వ్యాపారాలనుండి వివక్షిస్తాడు. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు. 

 

3. నతత్ర చక్షుర్గచ్చి నవాగ్ గచ్చతి నోమున: !

న విద్మో న విజానీమో యథైత దనుశిష్వాత్ !!

తత్ర = ఆ బ్రహ్మ విషయములో; చక్షు: = కన్ను; నగచ్చతి = పోజాలదు; నవాక్ = మాటలు (పోజాలవు); న ఉ మన: = మనస్సుకూడా (పోజాలదు); తత్ = అది; న విద్య: = మాకు తెలియదు; యథా = ఎలాగ; ఏతత్ = దీనిని; అనుశిష్యాత్ = నేర్పించవచ్చునో; తత్ = అదికూడా; న విజానీమ: = మాకు తెలియదు. 

ఆ బ్రహ్మ విషయంలో కన్ను పోజాలదు... మాటలుగాని, మనస్సుగాని పోలేవు. కాబట్టి మాకు దాని గురించి తెలియదు. దాన్ని ఏవిధంగా నేర్పించవచ్చునో ఆ పద్ధతి కూడా మాకు తెలియదు. 

మన మహర్షుల గొప్పతనం, నిరాడంబరత ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. మనం కాంతితో ప్రపంచాన్ని చూస్తాము కాంతిని మాత్రము చూడలేము. కాంతి లేకుండా చూడలేము. అదేవిధంగా మనం ఆత్మకలిగి ఉన్నందున అన్ని తెలుసుకోగలం.  కానీ ఆత్మను మాత్రము తెలుసుకోలేము.  ఎందుకంటె తెలుసుకోవలసినది తెలుసుకుంటున్నది ఒకటే కనుక. మీకు ఇంకా స్పష్టంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను. మనం కళ్ళతో చూస్తున్నాము కానీ మన కళ్ళను మన కళ్ళు చూడలేవు.  కానీ కళ్ళు ఉన్నాయని మనకు తెలుసు. అదే ఆత్మకు కూడా అనువర్తిస్తుంది. 

 

4. అన్యదేవ తద్విదితాదథో అవిదితాదథి !

ఇది శుశ్రుమ పూర్వేషాం యేనస్తద్ వ్యాచచక్షిరే !!

తత్ = అది; విదితాత్ = తెలిసిన దానికంటే; ఏవ = నిశ్చయంగా; అన్యత్ = భిన్నమైనది; అథో = ఆపైన; అవిదితాత్ = తెలియని దానికంటే; అధి = అతీతమైనది; యే = ఎవరైతే; స: = మాకు; వ్యాచచక్షిరే = వివరించారో; పూర్వేషాం = పూర్వీకులనుండి; ఇతి = ఇలా; శుశ్రుమ = మేం విన్నాం....

నిశ్చయంగా అది తెలిసిన దానికంటే భిన్నమైనది. ఆ తరువాత అది తెలియనిదానికంటే అతీతమైంది. దానిని మాకు వివరించిన పూర్వీకులనుండి మేం ఈ విధంగా విన్నాం. 

 

5. యత్ వాచా సభ్యుదితం యేన వాగభ్యుద్యతే !

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!

యత్ = ఏదైతే; వాచా = మాటలచేత; అనభ్యుదితమ్ = ప్రకటింపబడదో; యేన = దేనిచేత; వాక్ = మాటలు; అభ్యుద్యతే = ప్రకటింపబడుతాయో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి = తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ ఉన్నారో; ఇదమ్ = ఇది; న = కాదు... 

మాటలు దేన్ని ప్రకటించలేవో మాటలనే ఏది ప్రకటిస్తుందో అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు పూజించేది కాదనీ తెలుసుకో. 

 

6. యన్మనసా నమనుతే యేనాహుర్మనో మతమ్ !

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!

యత్ = ఏది (ఏ ప్రత్యగాత్మ చైతన్యము); మనసా = మనస్సుచే; న మనుతే = గ్రహించబడదో; యేన = దేనిచేత (ఏ ప్రత్యగాత్మ చైతన్యము చేత); మన: = మనస్సు; మతమ్ (ఇతి) = సంకల్పాదులలో ప్రసరించును (అని); ఆహు: = చెప్పుదురో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి = తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ వున్నారో; ఇదమ్ = ఇది; న = కాదు... 

మనస్సుచేత గ్రహించ శక్యం కానిదీ, దేనిచేత మనస్సు సంకల్పాదులలో తిరుగునో అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో. 

 

7. యచ్చక్షుషా న పశ్యతియే న చక్షూంషి పశ్యతి !

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!

యత్ = దేనినైతే; చక్షుషా = కన్నులచేత; న పశ్యతి = (మానవుడు) చూడడో; యేన = దేనిచేత; చక్షూంషి = కన్నులను; పశ్యతి = చూస్తాడో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ వున్నారో; ఇదమ్ = ఇది; న = కాదు... 

కన్నులు చూడజాలనిది కాని దృష్టిని చూచేది - అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజింజేది కాదనీ తెలుసుకో. 

 

8. యచ్చోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్ !

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!

యత్ = దేనిని; శ్రోత్రేణి = చెవిద్వారా; నశృణోతి = మానవుడు వినజాలడో; యేన = దేనిచేత; ఇదం = ఈ; శ్రోత్రం = వినికిడి; శ్రుతం = వినబడుతుందో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి = తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ వున్నారో; ఇదమ్ = ఇది; న = కాదు. 

మానవుడు చెవి ద్వారా వినజాలనిదీ దేనిచేత వినికిడి వినబడుతున్నదో - అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో. 

 

9. యత్ ప్రాణేన న ప్రాణిత యేన ప్రాణ: ప్రణీయతే !

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!

యత్ = దేనినైతే; ప్రాణేన = ఊపిరిచేత; నప్రాణిత = వాసన చూడజాలడో; యేన = దేనిచేత; ప్రాణ: = ఊపిరి; ప్రణీయతే = శ్వాసోచ్ఛ్వాసములను సలుపునో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి = తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ వున్నారో; ఇదమ్ = ఇది; న = కాదు. 

మానవుడు ఊపిరి చేత వాసన చూడజాలడో, దేనిచేత ఊపిరి శ్వాసోచ్ఛ్వాసములను సలుపునో - అది మాత్రమే బ్రహ్మ అనీ ఈ జనులు ఇక్కడ పూజించే ఇది కాదనీ తెలుసుకో. 

రెండవ భాగం ;

1. యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి 

నూనం త్వం వేత్థ బ్రహ్మణో రూపమ్ !

యదస్యత్వం యదస్య దేవేష్యథను 

మీ మాంస్యం మేవతే మన్యే విదితమ్ !

ఆచార్యుడు : ‘‘నేను బ్రహ్మతత్వం గురించి బాగానే తెలుసుకున్నాను’’ అని ఒకవేళ అనుకున్నట్లయితే.. నువ్వు తెలుసుకున్నది చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు చూసే ప్రాణులలో దేవతలలో పరిచ్చిన్నమైన బ్రహ్మ రూపం అతి స్వల్పం. కాబట్టి బ్రహ్మం గురించి నువ్వు తెలుసుకోవలసి వుంది. 

శిష్యుడు : (మళ్లీ చింతనచేసి బ్రహ్మం సాక్షాత్కరించుకొని) బ్రహ్మం తెలుసుకున్నానని అనుకుంటున్నాను. 

 

2. నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ!

యోనస్తత్ వేద తద్వేదనో న వేదేతి వేద చ!!

నాకు బాగా తెలుసు అని నేను అనుకోను. నాకు తెలియదు అని కూడా కాదు. తెలుసు కూడా! నా తోటివిద్యార్థులలో అది తెలియంది కాదు అని, తెలిసినది అని గ్రహించినవాడు దానిని గ్రహించగలడు. 

 

3. యస్యామతం తస్య మతం మతం యస్య న వేద స:!

అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత మవిజానతమ్!!

ఏ బ్రహ్మవేత్త అయితే తనకు బ్రహ్మం తెలియదని భావిస్తాడో.. వాడు దాన్ని తెలుసుకుంటాడు. ఏ బ్రహ్మవేత్త అయితే తనకు బ్రహ్మం తెలుసునని భావిస్తాడో.. వాడు దాన్ని తెలుసుకోలేడు. బ్రహ్మవేత్తలు రెండుతెగలు. అందులో ఒకరు బ్రహ్మం తెలుసునని అనుకునేవారు. వీరికి బ్రహ్మం తెలియదని కాదు కాని రెండవతెగవారు బ్రహ్మం తెలియదని అనుకునేవారు. వీరికి బ్రహ్మం తెలుసు. 

 

4. ప్రతిబోధవిదితం మత మమృతత్వం హి విన్దతే!

ఆత్మనా విన్దతే వీర్యం విద్యయా విన్దతేఁ మృతమ్!!

మనస్సు చెందే వికారాన్ని స్పూర్తిగోచరం ద్వారా తెలుసుకున్నవాడు అమరత్వాన్ని పొందుతాడు. ఆత్మ ద్వారా నిజమైన బలాన్ని, జ్ఞానం ద్వారా అమరత్వాన్ని పొందుతాడు. 

 

5. ఇహ చేద వేదీ దథ సత్యమస్తి 

న చేదిహావేదీ న్మహతీ వినష్టి: !

భూతేషు భూతేషు విచిత్య ధీరా:

ప్రేత్యాస్మాల్లోకా దమృతా భవన్తి !!

ఇక్కడ ఈ ప్రపంచంలో దాన్ని సాక్షాత్కరించుకున్నట్లయితే.. ఆపైన నిజమైన జీవితం వుంది. అలా సాక్షాత్కరించుకోనట్లయితే సర్వనాశనమే. ప్రతి జీవిలోనూ ఆత్మను వివక్షిచుకుంటూ.. ప్రజ్ఞాశాలి ఇంద్రియ జీవనాన్ని అతిక్రమించి అమరత్వాన్ని పొందుతాడు. 

మూడవ భాగం : 

1. బ్రహ్మ హ దేవేభ్యో విజిగ్యే, తస్యహ 

బ్రహ్మణో విజయే దేవా అమహీయన్త !

త ఐక్షన్తాస్మాకమేవాయం విజయోఁ

స్మాకమేవాయం మహిమేతి!!

ఆచార్యుడు : బ్రహ్మం ఒకప్పుడు దేవతలకు రాక్షసులపైన విజయం సంపాదించిందని కథ. విజయం బ్రహ్మంవలనే అయినా.. దానివల్ల దేవతలు మహిమాన్వితులయ్యారు. నిజంగా మేమే గెలిచాం.. మాదే ఈ ఘనత అని దేవతలు తలపోశారు. 

 

2. తద్దైషాం విజజ్ఞౌ, తేభ్యోహ ప్రాదుర్భభూవ 

తన్న వ్యజానత కిమిదం యక్షమితి 

ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మం.. దేవతల ముందుకు దివ్యతేజంతో సాక్షాత్కరించింది. కానీ ఆ అపురూపమైన శక్తి ఏమిటో వారికి అర్థం కాలేదు. 

 

3. తేఁగ్ని మబ్రువన్, జాతవేద; ఏతద్ 

విజానీహి కిమేతద్ యక్షమితి; తథేతి!!

దేవతలు అగ్నిదేవునితో ‘‘ఓ సర్వజ్ఞుడా.. ఈ శక్తి ఏమిటో తెలుసుకో’’ అన్నారు. అందుకు అగ్నిదేవుడు ఒప్పుకున్నాడు. 

 

4. తదభ్యద్రవత్, తమభ్యవదత్ కోఁసీతి, అగ్నిర్వా 

అహమస్మీత్య బ్రవీజ్జాతవేదా వా అహమస్మీతి !!

అగ్ని ఆ దివ్యశక్తి దగ్గరకు వేగంగా వెళ్లాడు. అప్పుడా శక్తి.. ‘‘నువ్వెవరివి’’ అని అగ్నిదేవుడ్ని ప్రశ్నించింది. ‘‘నేను అగ్నిని.. సర్వజ్ఞణ్ణి’’  అని బదులిచ్చాడు. 

 

5. తస్మిం స్త్వయి కింవీర్య మిత్యపీదం సర్వం 

దహేయం యదిదం పృథి వ్యామితి!!

‘‘అయితే నీలో ఏం శక్తి వుంది’’ అని దివ్యశక్తి అడిగింది. ‘‘భూమ్మీద వున్న అంతటిని నేను దహించివేయగలను’’ అని అగ్నిదేవుడు అన్నాడు. 

 

6. తస్మైతృణం నిదధావేతద్ దహేతి

తదుపప్రేయాయ సర్వజవేన తన్న 

శశాకదగ్ధుం స తత ఏవ నివవృతే నైత 

దశకం విజ్ఞాతుం యదేతద్ యక్షమితి!!

అప్పుడా దివ్యశక్తి అతని ముందు ఒక గడ్డిపోచును పెట్టి కాల్చు అని అంది. అగ్ని తన యావచ్ఛక్తిని ఉపయోగించాడు.. కానీ ఆ గడ్డిపోచను కాల్చలేకపోయాడు. అగ్నిదేవుడు దేవతల వద్దకు మళ్లీ తిరిగిపోయి ‘‘ఆ దివ్యశక్తి ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను’’ అని అన్నాడు. 

 

7. అథవాయు మబృవన్, వాయువేతద్ 

విజానీహి కిమేతద్ యక్షమితి; తథేతి!!

అప్పుడు దేవతలు వాయుదేవునితో.. ‘‘ఓ వాయుదేవా, ఈ అసాధారణమైన శక్తి ఏమిటో తెలుసుకో’’ అన్నారు. అతడు అందుకు అంగీకరించాడు. 

 

8. తదభ్యద్రవత్ తమభ్యవదత్ కోఁసీతి!

వాయుర్వా అహ మస్మీత్యబ్రవీన్మాతరిశ్వా వా అహమస్మీతి!!

వాయువు ఈ అసాధారణమైన శక్తి దగ్గరకు వెళ్లాడు. ఆ శక్తి ‘‘నువ్వెవరివి’’ అని ఇతణ్ణి అడిగింది. ‘‘నేను వాయువును, గాలిని ప్రభువును’’ అని సమాధానం చెప్పాడు. 

 

9. తస్మి స్త్వయి కిం వీర్యమిత్యపీదం 

సర్వమాదదీయ యదిదం పృథివ్యామితి!!

‘‘అయితే నీలో ఏం శక్తి వుంది?’’ అని దివ్యశక్తి అడిగింది. ‘‘భూమ్మీద వున్న దేన్నైనా నేను ఎగురగొట్టగలను’’ అన్నాడు వాయుదేవుడు. 

 

10. తస్మైతృణం నిదధాతే తదాదత్స్వే తి

తదుపప్రేయాయ సర్వజవేన, తన్న శశా

కాదాతుం, స తత ఏవ నివవృతే! నై తద 

శకం విజ్ఞాతుం యదేతద్ యక్షమితి!!

ఆ దివ్యశక్తి వాయుదేవుడి ముందు ఒక గడ్డిపోచను వుంచి, దీన్ని ఎగురగొట్టు అంది. వాయువు తన పూర్తిశక్తిని ప్రయోగించాడు.. కానీ ఆ గడ్డిపోచ కదల్లేదు. దీంతో వాయుదేవుడు తిరిగి వెళ్లి ‘‘ఆ శక్తి ఏమిటో తెలుసుకోలేకపోయాను’’ అని దేవతలతో అన్నాడు. 

 

11. అథేంద్రమబ్రువన్, మఘవన్నే 

తద్విజానీహి, కిమేతద్

యక్షమితి; తథేతి; తదభ్య 

ద్రవత్; తస్మాత్ తిరోదధే!!

అప్పుడు దేవతలు ఇంద్రుడితో.. ‘‘ఓ దేవేంద్రా! ఈ అపురూపమైన శక్తి ఏంటో తెలుసుకో’’ అన్నాడు. ఇంద్రుడు సరేనన్నాడు. ఆ శక్తి వద్దకు త్వరగా చేరుకున్నాడు. కాని ఆ దివ్యశక్తి అతని ఎదుటనుండి మాయమైపోయింది. 

 

12. స తస్మిన్నే వాకేశే స్త్రియ 

మాజగామ బహుశోభమానాముమాం 

హైమవతీం; తాం హోవాచ 

కిమేతద్ యక్షమితి!!

ఆకాశంలో అత్యంత అద్భుతంగా, సౌందర్యవంతంగా వున్న ఒక యువతిని, హిమవంతుని కుమార్తెను చూశాడు ఇంద్రుడు. అప్పుడామెను ‘‘ఈ అపురూపమైన దివ్య శక్తి ఏమిటి’’ అని అడిగాడు. 

( ఇది మూడవ భాగం

నాలుగవ భాగం : 

సా బ్రహ్మేతి హోవాచ!!

బ్రహ్మణో వా ఏతద్ విజయే 

మహియధ్వమితి; తతో హైవ 

విదాఞ్చకార బ్రహ్మేతి!!

‘‘అది బ్రహ్మం అని.. బ్రహ్మం వల్ల కదా మీరు విజయం సాధించి, ఘనత పొందారు’’ అని ఉమాదేవి అంది. ఆ దివ్యశక్తి బ్రహ్మం అని ఇంద్రుడు అప్పుడు తెలుసుకున్నాడు. 

 

2. తస్మాద్ వా ఏతే దేవా అతితరా 

మివాన్యాన్ దేవాన్, యదగ్ని ర్వా 

యురింద్రస్తే హ్యేనన్నే దిష్ఠం పస్పర్శుస్తే 

హ్యేనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి!!

అందువల్లే కదా ఈ దేవతలు అంటే.. అగ్ని, వాయువు, ఇంద్రుడు - ఇతర దేవతలను అధిగమించారు. వారే ఆ శక్తికి అత్యంత సమీపంగా వెళ్లారు. అది బ్రహ్మం అని తెలుసుకోవడంలో వారే ప్రథములు. 

 

3. తస్మాద్ వా ఇంద్రోఁతితరా

మివాన్యాన్ దేవాన్; సహ్యేనన్నే 

దిష్ఠం పస్పర్శ, స హ్యేనత్ 

ప్రథమో విదాంచకార బ్రహ్మేతి!!

ఇంద్రుడు ఈ బ్రహ్మంను సమీపంలో స్పృశించాడు. అందువల్లే ఇంద్రుడు ఇతర దేవతలను అధిగమించాడు. అతడే ఆ దివ్యశక్తి బ్రహ్మం అని తెలుసుకోవడంలో ప్రథముడు. ఇంద్రుడే బ్రహ్మవేత్తలలో మొదటివాడు. 

 

4. తస్యైష ఆదేశ: యదేతద్ విద్యుతో వ్యద్యుతదా 

ఇతీన్న్యమీమిషదా ఇత్యధి దైవతమ్!!

బ్రహ్మం వర్ణన ఇది : అహో! మిరుమిట్లుగొలుపు మెరుపును ప్రకాశింపచేసేది ఆ బ్రహ్మమే. మనిషిని రెప్పలు ఆర్చేటట్లు చేసేది ఆ బ్రహ్మమే. ప్రకృతి శక్తులుగా ఆ బ్రహ్మం అభివ్యక్తీకరణకు సంబంధించినదిగా చెప్పవలసింది ఇది. 

 

5. అథా ధ్యాత్మం యదేతద్ గచ్ఛతీవ చ 

మనోఁ నేన చైతదుపస్మరత్యభీక్ష్ణం సంకల్ప: 

ఇప్పుడు ఆత్మలో బ్రహ్మం అభివ్యక్తీకరణం అన్న దృక్కోణం నుండి దాని వర్ణనను గురించి, ఆ బ్రహ్మంవల్లే మనస్సు ఈ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. జ్ఞాపకం వుంచుకుంటుంది, వస్తువులను ఊహించుకుంటుంది. 

 

6. తద్ధ తద్వనం నామ 

తద్వనమిత్యుపాసితవ్యం ; 

సమ ఏతదేవం వేదాభిహైనం 

సర్వాణి భూతాని సంవాచ్ఛంతి !!

బ్రహ్మం తద్వనం అని అన్ని జీవులకూ ఆత్మగా ఆరాధించదగిందని ప్రసిద్ధి చెందింది. కాబట్టి దాన్ని తద్వనంగా ధ్యానించాలి. ఇలా తెలుసుకున్న వానిని సకల జీవులూ ప్రేమిస్తాయి. 

 

7. ఉపనిషదం భో బ్రూహీత్యుక్తా త ఉపనిషద్ 

బ్రాహ్మీం వావ త ఉపనిషదబ్రూమేతి !!

శిష్యుడు : ఆచార్యవర్యా.. నాకు ఉపనిషత్ ను ఉపదేశించండి. 

ఆచార్యుడు : నీకు ఉపనిషత్తు ఉపదేశించబడింది. నిజంగా బ్రహ్మం గురించి ఉపనిషత్తు నీకు ఉపదేశించాం. 

 

8. తస్యై తపోదమ: కర్మేతి ప్రతిష్ఠా

వేదా: సర్వాంగాని సత్య మాయతనమ్ !!

తపస్సు, నిగ్రహం, నిష్టా పూర్వకమైన కర్మ. ఇవి ఉపనిషత్తులని బ్రహ్మ జ్ఞానానికి మూలభిత్తికలు. వేదాలు దాని సర్వాంగాలు. సత్యం దాని నివాస స్థానం. 

 

9. యోవా ఏతామేవం వేదాపహత్య పాప్మాన 

మనన్తే స్వర్గేలోకే జ్యేయే ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి !

నిజంగా ఇలా ఉపనిషత్తును తెలుసుకున్నవాడు పాపాన్ని నిర్మూలించుకుంటాడు. అనంతం మహోన్నతం, ఆనందమయం అయిన బ్రహ్మంలో ప్రతిష్ఠితుడౌతాడు. అవును.. అందులో ప్రతిష్టితుడౌతాడు

కారణభూతుడు బ్రహ్మ అని ఆ బ్రహ్మఐక్యతే మోక్షమని ఈ ఉపనిషత్తు మనకు బోధిస్తున్నది. సాధకులు కేవలము ఒకసారి ఒక నవల చదివినట్లుగా చదివితే ఉపనిషత్తులు బోధపడవు.  వాటిని ఏకాగ్ర చిత్తంతో పలుమారులు చదివితే కానీ వాటి అర్ధం అంతరార్ధము సాధకులకు అర్ధం కాదు. నిష్ఠతో ఉపనిషత్తులు చదవాలని నా సూచన 


ఈ విధంగా సాగిన పరిశోధనే ఈ కేనోపనిషత్తు 

కేనోపనిషత్తు ఆసాంతం చదివి ముక్తి పదం వైపు అందరు పయనింతురుగాక. 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 

 






కామెంట్‌లు లేవు: