24, జనవరి 2021, ఆదివారం

భగవత్గీత

 భగవత్గీత ఎందుకు చదవాలి. 


ఇప్పుడు మనం ఒక అంధకారమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నాము అని అనటానికి నేను చాలా బాధ పడుతున్నాను. పూర్వము మన దేశంలో పెద్దలు, గురువులు, మహర్షులు చెప్పిన విధి విధానాన్ని ఎలాంటి ప్రశ్నలు వేయకుండా తూచా తప్పకుండా ఆచరించారు వారు ఎంతో ప్రశాంతమైన, ఆరోగ్యమైన జీవితాన్ని కలిగి వుండే వారు. 


ఇప్పుడు రోజు రోజుకి మన సమాజంలో తల్లిదండ్రుల మీద భక్తి, గౌరవములు సన్నగిల్లి తల్లిదండ్రులను ప్రశ్నించటం, పెద్దలను గౌరవించక పోవటం, నాకే అన్ని తెలుసు అనే భావన కలిగి ఎదుటి వారిని ఎంతవారైనా కూడా  విమర్శించటం, చులకనగా చూడటము, మన ఆచార వ్యవహారాలను అవహేళన చేయటం మొదలైన విపరీత భావనలు పెరిగి పోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మన సనాతన ధర్మా వ్యవస్థకు  గ్లాని కలిగే ప్రమాదం లేకపోలేదు. అందుకే మన జాతిని సరైన మార్గంలో ఉంచటానికి ప్రతి మనిషి మనస్సు ప్రశాంతతతో ఉండటానికి మనకు వున్న ఒకే ఒక మార్గం భగవద్గీత పఠనము. పూర్వము మన ఇళ్లల్లో భగవద్గీత పారాయణం చేసే వారు అని మనం వినే వాళ్ళము. మనం పారాయణం చేయలేక పోయినా కనీసం ఇతర పుస్తకాల వలె  పఠనం అయినా చేసిన మనం పతనము కాకుండా ఉండగలం. . 


భగవద్గీత ఏమి చెప్పుతుంది. భగవద్గీత ఒక మతగ్రంధము అని చాలా మంది అభిప్రాయం పడుతున్నారు. మిత్రులారా భగవద్గీత మతగ్రంధము కాదు అది ప్రతి మానవుడు, వయస్సు, లింగ భేదం లేకుండా చదవ వలసిన ఒక అపూర్వ గ్రంధము. నీవు భగవద్గీత చదివితే నీ జీవితము ఒక చక్కటి క్రమశిక్షణతో, ఒక మంచి ఆదర్శంతో, ప్రశాంతతతో, సాత్వికతతో సాగటం తథ్యం.  


మనం ఏదైనా సామాను అంటే ఒక కారు, ఒక మోటారు సైకిలు ఒక కుట్టుమిషను కొన్నామనుకోండి అప్పుడు మనకు సదరు కంపెనీవారు ఆ సామానుతోపాటు ఒక చిన్న పుస్తకాన్ని మనకు అందచేస్తాడు, దానిని యూసర్ మనువల్ అని మనం అంటాము.  ఆ సమానుని ఉపయోగించే ముందు మనం క్షుణంగా ఆ పుస్తకాన్ని చదివి సదరు సామానుని వాడటం చేస్తాము. దానివల్ల మనకు సులువుగా ఆ సామాను వాడటం తెలుస్తుంది. 


ప్రతి మనిషి చూడలేనిది ఒకటి అందరిలో వున్నది దానిని మనం మనస్సు అని అంటాము. నన్ను విసికించకు నా మనస్సు బాగోలేదు. అబ్బా నా మనస్సు ఇప్పుడు ఎంతో హాయిగా వుంది. అనే మాటలు మనం తరచుగా అంటుంటాము, వింటుంటాము. నిజానికి ఆ మనస్సు అంటే ఏమిటి అది ఎక్కడ వున్నది అని అడిగితె మనం ఎవ్వరం చెప్పలేము. డాక్టర్లు మీరు ఉద్రేకతకు లోను కాకండి లేకపోతె మీకు బీపీ పెరుగుతుంది, అది హార్ట్ అట్టాక్ కి దారితీయ వచ్చు, లేదా పెరాలిసిస్ రావచ్చు అందుకే మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి అని అంటారు. కానీ అది ఎట్లాగో మాత్రం ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు కొత్తగా మీరు యోగ చేయండి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని అంటున్నరు. అందుకే చాలామంది యోగ కేంద్రాలకు, యోగ గురువుల దగ్గరికి వెళతారు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ డాక్టర్లకు ఆ యోగ అనేది భగవద్గీత నుండి ఉద్భవించిందని  మీరు భగవద్గీత చదవండి అందులో కృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఆచరించండి అని మాత్రము చెప్పరు. నిజానికి ప్రజలంతా భగవద్గీత ప్రతి రోజు చదువుతూ గీతాచార్యుడిని పూర్తిగా అనుసరిస్తే ప్రపంచంలో చాలా మటుకు బీపీలు, గుండె జబ్బులు, పక్ష వాటాలు తగ్గుతాయి.  అంతే కాదు మన సమాజంలో ఒకరికి ఇంకొకరికి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా చక్కటి ప్రేమభావం కలుగుతుంది.  అందుకు ఏమాత్రం సందేహం లేదు. 


మనిషి మనస్సుని ఎలా నియంత్రించుకోవాలి అని చెప్పే యూసర్ మాన్యువలె ఈశ్రీమద్ భగవద్గీత . 


భగవద్గీత గూర్చిన విషయాలు. 


మన పురాణ ఇతిహాసాలు దుఃఖానికి, శోకానికి ఒక ప్రత్యేక గుర్తింపు వుంది. ఒక మహర్షి శోకం నుండి ఉద్బవించినది శ్లోకం, ఆ శ్లోకం శ్రీమద్రామాయణంగా రూపుదిద్దుకున్నట్లు ఆ వాల్మీకి మనకు ఆది కవిగా ప్రసిద్ధి చెందినట్లు మనకు తెలుసు. 


ఇక అర్జనుని విషాదము శ్రీ కృష్ణ భగవానుని నుంచి భగవత్గీత అనే అపూర్వ బోధ ఈ ప్రపంచానికి అందింది. అర్జనునిలోని నిరాశ, నిస్పృహ, వైరాగ్యానికి శ్రీ కృష్ణ భగవానుడు చేసిన బోధ అర్జనుని కార్యోన్ముఖుని చేసింది. అదే సామాన్యులమైన మనందరిలో నిరాశ, నిస్పృహలు, జీవితం మీద కలిగే విరక్తిని పూర్తిగా నివారించి అందరిని ఒక మంచి దారిలో నడిపేది శ్రీమద్ భగవద్గీత 


భగవద్గీత గూర్చి కొన్ని విషయాలు. 


గీతలో 18 అధ్యయాలు వున్నాయి. . ఇందులోని ప్రతి అధ్యాయానికి యోగం అనే పదంతో కూడిన పేరు ఉంటుంది. శ్రీ కృష్ణ భగవానులు తనని నమ్ముకున్న వారి యోగ క్షేమాలు చూస్తానన్నారు. మనం యోగం, క్షేమం అంటే ఏమిటో తెలుసుకుందాము. 


యోగము అంటే మనకు లేనిది మనకు కలవటం. ఉదా. నీవు ఒక క్రొత్త కారు కొనుక్కున్నావనుకో అది వాహన యోగం. అంటే నీకు ఇంతకు ముందు లేని వాహనం ఇప్పుడు నీకు లభించింది. నీకు వివాహమైనదనుకో దానిని కళత్ర యోగం అంటారు. అంటే ఇంతకు ముందు నీ జీవితంలో లేని భార్య నీకు లభించింది అని అర్ధం. నీవు ఒక క్రొత్త ఇల్లు కొనుక్కొన్నావనుకో దానిని గృహ యోగం అని అంటారు. ఈ విధంగా నీకు లేనిది నీకు లభించటం అన్న మాట. 


క్షేమం అంటే నీకు లభించినది నీ తోటే ఉండటం. అంటే నీవు కొన్న ఇల్లు నీ తోటే ఉండటం. అదే విధంగా నీకు యోగించిన అన్ని నీతోటే ఉండటాన్ని క్షేమం అని అంటారు. నీవు ఆరోగ్యంగా వున్నా వనుకో అంటే నీవు క్షేమంగా వున్నావన్నమాట. 


మన జీవితంలో మనకు కలిగే అన్ని యోగాలకు, వాటికి కావలసిన క్షేమాన్ని మనకు ఇస్తానని శ్రీ కృష్ణ భగవానులు మనకు చెప్పారు.  కాబట్టి నిష్కల్మషమైనా భక్తితో ఎల్లప్పుడూ మనం భగవంతుడిని శరణు చొచ్చాలి. 


భగవద్గీత  ఎవరు, ఎప్పుడు, ఎలా చదవాలి. 


గీతను ప్రతి మానవుడు చదవ వచ్చు. కావలసినది ఒక్కటే శ్రీ కృష్ణ భగవానుని మీద అచంచలమైన భక్తి, భగవత్ గీత మీద అనంతమైన శ్రార్ధ. ఈ రెండు ముందుగా అలవరచుకొని పరిశుద్ధ మనస్కులై భగవద్గీత చదవటానికి ఉద్యుక్తులు కండి. 


గీతలో 18 అధ్యాయాలు వున్నాయి అని మనం తెలుసుకున్నాము. మొట్టమొదటి అధ్యాయానికి " అర్జున విషాద యోగం" అని పేరు. ఈ అధ్యాయంలో అర్జనుల వారికి కలిగిన విషాదాన్ని గూర్చి తెలియచేస్తుంది. నేను మొట్ట మొదటిగా గీతను చదవ దలుచుకున్న వారికి ముందుగా మొదటి అధ్యాయం నుంచి కాకుండా మీరు  14వ  అధ్యాయానికివెళ్ళమని చెపుతాను. దానికి కారణము ఈ  అధ్యాయం పేరు "గుణ త్రయ విభాగ యోగము" అని అంటారు. అంటే మనుషులు తమ తమ మానసిక స్థితులను పట్టి మూడు రకాలుగా వుంటారాని  అవి. 1. సత్వ, 2 రాజో, 3 తమో గుణములు. అవి శ్రీ కృష్ణ భగవానులు తెలియచేసారు. ఈ అధ్యయానిని చదివిన తరువాత చదివిన మీరు ఈ మూడు గుణములలో ఏ గుణానికి చెందుతారో మీకు తెలుస్తుంది.   అప్పుడు మీరు వున్నా స్థితి మీకు అర్ధం అవుతుందికాబట్టి మీరు వున్న స్థితి కన్నా ఇంకా మెరుగైన స్థితికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. అప్పుడు తమో గుణ వంతుడు ముందుగా రజోగుణ వంతుడిగా తరువాత ఉత్తమ గుణమైన సత్వ గుణానికి మారుతాడు. ఎప్పుడైతే మనిషి సత్వ గుణ వంతుడు అవుతాడో అప్పుడు గీత పూర్తిగా చదివే శక్తి తరువాత శ్రార్ధ వస్తాయి. అప్పుడు మొదటినుండి అంటే అర్జున విషాద యోగం నుండి చదువ గలుగుతారు.  భగవద్గీత ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నా కొద్దీ చదువరుడు తానూ ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తాడు. తన మానసిక స్థయిర్యం కలుగుతుంది. తత్వారా పరి పూర్ణమైన ఉత్తమ మైన మనిషిగా తన్ను తాను తీర్చుకో గలుగుతాడు.  గీతను చదివి అర్ధం చేసుకొని ఆకళించుకొని తన జీవితానికి ఆపాదించుకున్న ప్రతి మనిషికి శాంత స్వభావం, పరిస్థితులను అర్ధం చేసుకునే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించగల శక్తి. ఇతరులను నొప్పించకుండా తన పని తాను చేసుకునే విధంగా తయారు అవుతారు. కాబట్టి మిత్రులారా మీరంతా నేను సూచించిన విధంగా గీత పఠనం చేయండి మీ జీవితాలను బాగు పరుచుకోండి. 


గమనిక: ఈ వ్యాసం ఒక్కరి మనస్సు నయినా మార్చిన ఈ వ్యాస రచన సార్ధకమైనట్లే. 


మీ 


సి. భార్గవ శర్మ 


జై శ్రీకృష్ణ 


ఓం శాంతి శాంతి శాంతిహి 


సర్వే జన సుఖినోభవంతు.

కామెంట్‌లు లేవు: