*మార్పు తెచ్చిన మహనీయుడు..*
"ప్రసాద్ గారూ..సబ్ కలెక్టర్ గారు దత్తాత్రేయ స్వామి మందిరానికి దర్శనానికి వస్తారట..వారితో పాటు మండల తహసీల్దారు గారు కూడా వస్తారు..రెవెన్యు సిబ్బంది వుంటారు..సబ్ కలెక్టర్ గారికి చక్కగా దర్శనానికి ఏర్పాట్లు చేయండి.." అంటూ మండల పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది..సరే అన్నాను..ఆరోజు బుధవారం..భక్తుల తాకిడి అసలు ఉండదు..కనుక ఆ వచ్చే సబ్ కలెక్టరు గారికి దర్శనం ఇబ్బందిలేదు అనుకున్నాము..ఆలయ మర్యాదలతో ఏర్పాట్లు చేసాము..
మరో రెండుగంటల తరువాత సబ్ కలెక్టర్ గారు మందిరానికి వచ్చారు..నన్ను నేను పరిచయం చేసుకున్నాను..శ్రీ స్వామివారి గురించి, తపోసాధన తరువాత కపాలమోక్షం పొందడం వరకూ శ్రద్ధగా విన్నారు..భక్తి పూర్వకంగా స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు..ఆ తరువాత మండల తహసీల్దారు గారు కూడా దర్శనం చేసుకొని ఇవతలకు వచ్చారు..దాదాపుగా రెవెన్యూ సిబ్బంది అందరూ దర్శించుకున్నారు కానీ..ఒక వ్యక్తి మాత్రం..దూరంగా ఉండిపోయాడు..అతను విడిగా ఉండటం చూసి.."మీరు కూడా వెళ్లి స్వామివారి సమాధిని దర్శించండి.." అన్నాను..అతను నా దగ్గరకు వచ్చి.."నేను మతం మార్చుకున్నాను..అందువలన ఆలయాలకు వెళ్లను..ఇప్పుడు అందరితో పాటు ఇక్కడిదాకా రావాలి కాబట్టి వచ్చాను..లేకుంటే వెలుపలే ఉండేవాడిని..నన్ను బలవంతం చేయొద్దు.." అన్నాడు..ఇక నేనేమీ మాట్లాడలేదు..
సబ్ కలెక్టర్ గారు మరి కొద్దిసేపు మందిరం లోనే గడిపి..స్వామివారి జీవిత విశేషాలు మళ్లీ అడిగి తెలుసుకొని.."చాలా ప్రశాంతంగా వుందండీ ఇక్కడ..ఈసారి దంపతులము వస్తాము.." అని చెప్పి..ప్రసాదం తీసుకొని..వెళ్లిపోయారు..ఆ హడావుడి అంతా ముగిసిన తరువాత..మతం మార్చుకున్నాను అని చెప్పిన వ్యక్తి గురించి కొద్దిసేపు ఆలోచించాను..సరే..అతని నమ్మకం అతనిది అని సరిపెట్టుకున్నాను..దాదాపుగా అతని గురించి మర్చిపోయాను..
మరో రెండు రోజులు గడిచిపోయాయి..ఆ ప్రక్క శనివారం మధ్యాహ్నం మూడు గంటల వేళ..ఒకవ్యక్తి.."ప్రసాద్ గారూ..నా పేరు ప్రభాకర రావు..ఈరోజు స్వామివారి దర్శనానికి వస్తున్నాము..సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొని..రేప్పొద్దున స్వామివారి సమాధి దర్శనం చేసుకొని తిరిగి వెళతాము..నేనూ నా భార్యా పిల్లలిద్దరూ..కలిసి వస్తున్నాము..మాకు రాత్రికి ఉండటానికి ఒక రూమ్ ఇవ్వగలరా..? " అని ఫోన్ లో అత్యంత ప్రాధేయపూర్వకంగా అడిగాడు..రిజిస్టర్ చూస్తే ఒకే ఒక రూమ్ ఖాళీ ఉంది..వారిని రమ్మనమని చెప్పాను..మరో రెండు గంటల్లో వస్తామని చెప్పి ఫోన్ పెట్టేసాడు..
సాయంత్రం ఐదున్నర సమయం లో ఆరోజు సబ్ కలెక్టర్ గారితో వచ్చి..స్వామివారి సమాధిని దర్శించుకోను అని చెప్పిన వ్యక్తి..నేరుగా నా దగ్గరకు వచ్చి.."మధ్యాహ్నం ఫోన్ చేసింది నేనే ప్రసాద్ గారూ..నా పేరే ప్రభాకరరావు..మొన్న మీతో మతం మార్చుకున్నాను అని చెప్పింది కూడా నేనే.."అన్నాడు..నేను ఆశ్చర్యం గా చూసాను..రెండురోజుల క్రితం..తాను మందిరం లోపలికి రావడమే మహా అపరాధం చేసాను అన్నట్లు భావించిన వ్యక్తి..ఏకంగా స్వామివారి పల్లకీసేవ లో పాల్గొనాలని..సమాధి దర్శనం చేసుకోవాలని అనుకోవడం ఏమిటని..ఈ మార్పు ఎలా సాధ్యం అని అర్ధం కాలేదు..
"ఈమె నా భార్య రాజేశ్వరి..మొన్న బుధవారం నాడు ఇక్కడ దాకా వచ్చి..మీరు పిలిచినా కూడా వినకుండా..స్వామివారి దర్శనం చేసుకోకుండా వెళ్ళాను..ఇంటికి వెళ్లి ఈమెటోవా విషయం చెప్పానండీ..నా భార్య చాలా కోప్పడింది.."నిన్ను ఏ మతం అని వాళ్ళు అడిగారా?..నువ్వు తప్పు చేసావు..ఆ స్వామివారు చాలా మహిమ ఉన్న వారు..మన పెళ్లి కాకముందు..నాకు కడుపు లో నొప్పి వచ్చి అల్లాడి పోయాను..మందులు వాడినా ఫలితం దక్కలేదు..మా అమ్మానాన్న నన్ను మొగిలిచెర్ల లోని దత్తాత్రేయ స్వామి మందిరానికి తీసుకొచ్చి పదకొండు రోజులపాటు ఉంచారు..స్వామివారి తీర్ధం తీసుకున్నాను..మరే మందులూ వాడలేదు..నాకు నొప్పి తగ్గిపోయింది..మళ్లీ ఇప్పటికి నాకు ఆ నొప్పి రాలేదు..ఇద్దరు పిల్లలు పుట్టారు..అంతా ఆ స్వామిదయ..నువ్వు అక్కడిదాకా వెళ్లి..నీ మూర్ఖత్వం తో స్వామిని చూడకుండా వచ్చావు.."అని బాగా ఆవేదన తో చెప్పిందండీ..అప్పటికీ నేను సంశయం తోనే వున్నాను..నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత నా ఆఫీస్ బ్యాగు లో కాగితాల కోసం చూస్తుంటే..అందులో మొన్న మీరు మా వాళ్లకు ఇచ్చిన విభూతి గంధంతో పాటు స్వామివారి ఫోటో ఉన్న పాకెట్ ఉన్నది..నేను తీసుకోలేదు కదా..ఇందులోకి ఎలా వచ్చిందని ఆలోచిస్తుంటే..నాతో పనిచేసే నా సహచరుడు తనకిచ్చిన పాకెట్..నా బ్యాగులో పెట్టాడట..మా ఆవిడ మాటలు..ఆ వెంటనే స్వామివారి విభూతి, ఫోటో..మా ఇంటికి రావడం..ఎందుకనో నాకు స్వామి నన్ను పిలిచినట్లు అనిపించింది..నాలో ఉన్న సందేహం మొత్తం తీరిపోయింది..ఆ మాటే ఆమెతో చెపితే...సంతోషం గా ఈరోజు వెళదామని చెప్పింది..మొత్తానికి నన్ను స్వామివారే రప్పించుకున్నారు.." అన్నాడు..
"మా వారిలో మార్పు వచ్చింది..అదే చాలు మాకు..ఆయన ఏ దేవుణ్ణి కొలిచినా నేను బాధపడ లేదు కానీ..ఇక్కడిదాకా వచ్చి..దర్శనం చేసుకోలేకపోయాడు అంటే..చాలా బాధపడ్డానండీ..మనసులోనే స్వామిని క్షమించమని వేడుకున్నాను..నా మొర స్వామివారు విన్నారు.." అని అతని భార్య రాజేశ్వరి గారు ఉద్వేగం తో చెప్పారు..
ఆ తరువాత ఆ ప్రభాకర రావు స్వామివారికి అత్యంత భక్తుడిగా మారిపోయాడని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి