*కార్యకారణ.....*
కుండకు కారణం మట్టి. కుండలో నుండి మట్టిని తీసేస్తే కుండ ఉండదు. నగలకు కారణం బంగారం. నగలలో నుండి బంగారాన్ని తీసేస్తే నగ ఉండదు. అలాగే సంసారానికి కారణం అజ్ఞానం. కనుక అజ్ఞానాన్ని తొలగిస్తే ఇక సంసారం ఉండదు.
అజ్ఞానాన్ని తీసేయాలంటే జ్ఞానం కావాలి. చీకటిని పారద్రోలాలంటే వెలుగు కావాలి. అలాగే అజ్ఞానాన్ని పారద్రోలాలంటే ఆత్మజ్ఞానం కావాలి. తత్త్వజ్ఞానం కావాలి.
ఈ కార్యకారణ సంబంధాన్నే ఉపమానాల ద్వారా తెలియజేస్తున్నారు ఈ శ్లోకలలో...
వయసిగతేకః కామవికారః...
వయస్సు అంటే యౌవనం. యౌవనంలో శరీరం ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. నరములలో పటుత్వం ఉంటుంది, చర్మం బిగువుగా ఉంటుంది, కండలు కఠినంగా ఉంటాయి, రక్తం ఉప్పొంగుతుంది. అప్పుడు కళ్ళు మూసుకుపోయేంత కామోద్రేకం కలుగుతుంది. దానితో వికార చేష్టలు చేస్తారు.
అయితే ఆ వయస్సు కాస్తా జారిపోతే ఈ ఉద్రేకాలు చల్లబడతాయి. చర్మంలో బిగువు సడలిపోతుంది. నరములలో పటుత్వం తగ్గుతుంది. రక్తం యొక్క వేగం తగ్గుతుంది. శరీరం ముడతలుపడి అందహీనంగా కనిపిస్తుంది. కనుక కామ వికారాలకు కారణమైన యవ్వనం పోతే కామ వికారాలు కూడా పోతాయి.
క్షీణే విత్తే కః పరివారః...
ఎవడి దగ్గరైనా డబ్బుంటే చాలు ఆశ్రితులు, స్నేహితులు, బంధుమిత్రులు అందరూ చేరుతారు. డబ్బున్నది గనుక పనులు చేసి పెట్టటానికి సేవకులు వస్తారు. అయితే సొమ్ము పోతేనో, ధన హీనుడైతేనో అతడు ఇక సేవకులను ఏ మాత్రం పోషించే స్థితిలో ఉండడు. అప్పుడు వారంతట వారే తొలగిపోతారు.
ఈ విధంగా కారణం తొలగితే కార్యం తొలగిపోతుందనే విషయాన్ని ఉపమానాల ద్వారా తెలియజేసి, ఈ సంసారం తొలగాలంటే దీనికి కారణమైన అజ్ఞానం తొలగాలని, అజ్ఞానం తొలగాలంటే జ్ఞానం కావాలని, కనుక జ్ఞానం ద్వారా సంసారాన్ని తొలగించుకోమని చెబుతున్నారు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి