24, జనవరి 2021, ఆదివారం

మొగలిచెర్ల

 *భక్తి తో దర్శనం..*


ఆరోజు గురువారం..ఉదయం తొమ్మిదిన్నర గంటల వేళ ఒక  పెద్దాయన చేతిలో ఒక బట్టల సంచీ పట్టుకొని మందిరం లోకి వచ్చారు..రావడమే నేరుగా నేను కూర్చున్న స్థలానికి వచ్చి.."ఇక్కడ నాగేంద్ర ప్రసాద్ అంటే ఎవరు? అని నన్నే అడిగారు.."నేనే" అన్నాను..కూర్చోమని కుర్చీ చూపించాను..కూర్చున్నారు..సుమారు అరవై ఏళ్ల పై బడిన వ్యక్తి లాగా అనిపించారు..


"నాపేరు యదునందన రావు..నేను చాలా దత్తక్షేత్రాలు చూశానండీ..పిఠాపురం మొదలుకొని గిరినార్ దాకా అన్ని క్షేత్రాలూ చూసే భాగ్యాన్ని ఆ దత్తుడు కలిగించాడు..ఇన్నాళ్లకు ఈ మొగలిచెర్ల కు కూడా రప్పించాడు నన్ను..ఈ స్వామివారి గురించి విన్నాను..సుమారు రెండు సంవత్సరాలనుంచి ఇక్కడికి రావాలని అనుకుంటూ వున్నాను..అదేమిటో అలా అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వచ్చేది..ఆగిపోయేవాడిని..ఎలాగైతేనేమి..ఈరోజు రాగలిగాను..ఈరాత్రికి ఈ మంటపం లోనే నిద్ర చేస్తాను...ప్రత్యేకంగా నాకు వసతి ఏర్పాట్లేమీ వద్దు.." అని కూడా చెప్పారు..ఎంతో పరిచయం ఉన్నవారిలాగా మాట్లాడుతున్నారు.."మంటపం లో ఉండవచ్చు..మధ్యాహ్నం భోజనం ఉన్నది.."అని చెప్పాను..స్నానాదికాలకు ఉన్న ఏర్పాట్లు చెప్పాను..సరే అన్నారు..తన సంచీ లోంచి గురుచరిత్ర పుస్తకం తీసుకొని..మంటపం లో ఒక ప్రక్కగా కూర్చుని పారాయణం చేసుకుంటానని చెప్పారు..అలాగే అన్నాను..స్వామివారి సమాధిని దూరం నుంచే చూసి..నమస్కారం చేసుకొని మంటపం లోకి వెళ్లి కూర్చున్నారు..


ఆరోజు గడిచిపోయింది..ప్రక్కరోజు శుక్రవారం నాడు మా అర్చకస్వాములు వచ్చి స్వామివారి మందిరం తలుపులు తెరిచే లోపలే..మంటపం లో కూర్చుని వున్నారు..అక్కడినుంచే స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నారు..శనివారం ఉదయం కూడా అదే పరిస్థితి..ఈ మూడు రోజుల్లో ఒక్కసారి కూడా స్వామివారి సమాధి వద్దకు వెళ్ళలేదు..దూరం నుంచి నమస్కారం మాత్రం చెయ్యడం..గురుచరిత్ర కానీ..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర కానీ పారాయణం చేస్తూ కాలం గడుపుతున్నారు..శనివారం సాయంత్రం జరిగే పల్లకీసేవ ను ఆసక్తిగా తిలకించారు..పల్లకీ తో పాటు మూడు ప్రదక్షిణాలు భక్తిగా..భజన చేస్తూ తిరిగారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం కూడా స్వామివారి సమాధికి అర్చకస్వాములు చేసిన అభిషేకము..ఇచ్చిన హారతులు అన్నీ చూసారు..


ఆదివారం మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యం హారతి అయిపోయిన తరువాత..నా దగ్గరకు వచ్చి.."ప్రసాద్ గారూ..నేను శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని వస్తాను.." అన్నారు.."వెళ్ళిరండి.." అన్నాను..లోపలికి వెళ్లి స్వామివారి సమాధి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి..పాదుకులకు నమస్కారం చేసుకొని..స్వామివారి సమాధి కి కూడా నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చారు..


"దాదాపు నాలుగు రోజుల నుంచీ వున్నారు కదా..ఈరోజు దాకా స్వామివారి సమాధి దర్శనం ఎందుకు చేసుకోలేదు..?" అని కుతూహలం ఆపుకోలేక అడిగాను..


"నేను ప్రయత్నం చేసాను బాబూ..స్వామివారు నన్ను అక్కడికి మూడురోజుల పాటు రానివ్వలేదు..నిజం..నేనేదో కల్పించి చెప్పటం లేదు..రోజూ ఉదయం ఇక్కడికి రాగానే..స్వామివారి సమాధి దర్శనం చేసుకోవాలి అని అనుకునేవాణ్ణి..ఇంతలో..ఎందుకనో..కొంచెం సేపు ఆగి పోదాము అనే ఆలోచన వచ్చేది..అదొక నిర్లిప్తత ఆవరించేది..వచ్చిన రోజు గురుచరిత్ర పారాయణ చేసాను..శుక్రవారం ఉదయం నుంచీ ఈ స్వామివారి చరిత్ర పారాయణం మొదలుపెట్టి ఆరోజే పూర్తి చేసాను..శనివారం కూడా అదే పారాయణం చేసాను..ఈరోజు కూడా మూడోసారి పారాయణం పూర్తి అయిన తరువాతే నాలోని నిర్లిప్తత త పోయింది..స్వామివారి సమాధిని దర్శనం చేసుకోగలిగాను..ఎన్నో దత్తక్షేత్రాలు చూశాననే అహం నాలో ఉండేది..అది పూర్తిగా అణిగిపోయిన తరువాతే..స్వామివారి సమాధి వద్దకు వెళ్లగలిగాను..ఎన్ని క్షేత్రాలు చూసాను అనేది లెక్క కాదు..ఎంత భక్తితో దర్శించాను అనేదే దైవం వద్ద లెక్క..ఆ జ్ఞానం ఇక్కడే కలిగింది..ఇకనుంచి ఏ క్షేత్రానికి వెళ్లినా లెక్క కోసం కాకుండా..భక్తి తో వెళతాను.." అన్నారు..


ఈ నాలుగురోజుల నుంచీ ఆయనలో ఇంత అంతర్మధనం ఉన్నదా అని ఆ నిమిషం దాకా నాకు తెలీదు..వారిలో ఏ మూలో దాగున్న అహంకారాన్ని  స్వామివారుపూర్తిగా నిర్మూలించారని ఆయన పూర్తిగా విశ్వసించారు..యదునందనరావు గారు మరో మూడురోజులపాటు వున్నారు..కానీ ఆ మూడురోజులూ ఆయన రోజుకు రెండుసార్లు స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు..తిరిగి వెళ్లబోయేముందు నా దగ్గరికి వచ్చి.."స్వామివారు అనుమతి ఇచ్చారు..నేను వెళ్ళొస్తాను..నా జీవితం లో గొప్ప అనుభూతి పొందాను..దత్తుడి దగ్గరకు భక్తి తో వెళ్ళాలి..అన్ని దత్తక్షేత్రాలు మరొక్కసారి భక్తిగా దర్శనం చేసుకుంటాను.." అని చెప్పారు..


ఎవరిలో ఏ మార్పు ఎలా తీసుకొస్తారో సమాధి లో కూర్చున్న స్వామివారికే తెలుసు..దర్శనానికి వచ్చే వారి ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది అని నాకు అర్ధమయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: