దైవం అంతటా ఉన్నప్పుడు విగ్రహం ఎందుకు, ఆలయాలు ఎందుకు
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి అమృత భాషణ నుండి..
విశ్వంలో గాలి అంతటా ఉన్నప్పుడు, మనకు గాలి పంఖా ఎందుకు అవసరం అవుతుంది.....? అంటే సర్వవ్యాప్తమైన గాలి మనకు సరిపోవడం లేదని అర్థం, అలాగే దైవం విశ్వం అంతటా ఉంటాడు. అయినా, నీవు దానిని అధికంగా భావించాలి, వ్యక్తిగతంగా చూడాలి, ప్రత్యేకంగా పూజచేయాలి అని అనిపించినప్పుడు, నీ కోసం ఒక వ్యవస్థ కావాలి. అంతటా ఉండే దేవుడు, అంతటా ఉండే గాలి కానీ నీకు అది చాలటం లేదు. నీకు గాలి కొంచెం ఎక్కువ కావాలి కనుక, విసనకర్రతోనైనా విసురుకుంటావు, లేదా పంఖా ఐనా ఉపయోగించుకుంటావు.
అదే విధంగా అంతటా ఉండే దైవాన్ని నీ కండ్లతో చూడాలి అని కానీ, చేతులతో మ్రొక్కాలి అని కానీ, నోరారా కీర్తించాలని అని కానీ అనిపించినప్పుడు, నీ కోసం ఆ దేవుడు ఆంగీరకరించిన రూపమే విగ్రహము. అయితే నీకు పంఖాలో నుండి గాలి రావాలి అంటే ఊరికే రాదు. దానికి ఒక వ్యవస్థ కావాలి. ఒక ఫ్రేములో కొన్ని రేకు ముక్కలు పెట్టాలి. మధ్యలో ఒక మోటారు కావాలి దానికో హబ్ తయారు చేయాలి. మధ్యలో మెషిన్ పెట్టాలి. దానికి కొన్ని మీటలు పెట్టాలి. దానికి విద్యుత్తు ప్రసరణ కోసం తీగలు తగిలించాలి. ఎక్కడో ఒకచోట విద్యుత్తు నియంత్రణకు స్విచ్ పెట్టాలి. ఇన్ని చేసినా పంఖా తిరగదు, దానిని కదిలించేందుకు విద్యుత్ ప్రవాహం ఉండాలి. ఇవన్ని సమకూరితే నీవు కోరుకున్న రీతిలో గాలి నీకు వస్తుంది. ఈ పరిక్రమణ లో ఎక్కడ చిన్న లోపమున్నా అది పనిచేయదు, పైగా మనం అస్తవ్యస్తంగా ఉపయోగిస్తే విద్యుదాఘాతం లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది, కాబట్టి ఎంతో నియమంగా ఏమరుపాటు లేకుండా ప్రతిదీ సవ్యంగా ఉండేలా చూసుకోవాలి,
ఇదే క్రమంలో మనం కోరుకున్నప్పుడు మన కోసమని ఒక రాతి తోనో, లోహం తోనో, చెక్క తోనో, వస్త్రం మీదనో ఒక రూపాన్ని మనం తయారు చేసి దానికి ఫ్రేమ్ లాగ ఒక ఆలయాన్ని నిర్మాణం చేసి దానికి ఒక మంత్రం అనే కనెక్షన్ ఇస్తే, నిత్యం స్మరిస్తూ శరణాగతి వేడితే అక్కడ దేవుడు నీ కోసం తన యొక్క అనుగ్రహాన్ని గాలి ఇఛ్చినట్లుగా ప్రసరింపచేస్తాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.
మనకి ఆలయం మన రక్షణ కోసం. సమాజ రక్షణ కోసం. వేడి తాపం పెరిగితే, మనకు గాలి ఎట్లా అవసరమో, సమాజంలో కూడా క్లేశాలు పెరిగితే, కష్టాలు పెరిగితే, దుఃఖాలు కలిగితే, నష్టాలు కలిగితే, వీటిని తగ్గించి, మనకు సుఖాన్ని ఇవ్వడం అనేది, విగ్రహం యొక్క లక్ష్యం, ఆలయం యొక్క లక్ష్యం. దాన్ని మనం రక్షించుకుంటే అది మనకు లాభం, దాన్ని భక్షిస్తే మనకే నష్టం, అందుచేత మనం దాన్ని కాపాడుకోవాలి. ఇది మనందరి బాధ్యత.
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి అమృత భాషణ నుండి.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి