24, జనవరి 2021, ఆదివారం

మొగలిచెర్ల

 *నమ్మకమైన రక్షణ..*


"గత నలభై రోజులుగా ప్రతిరోజూ నూటఎనిమిది ప్రదక్షిణాలు చేసాను..ఒక్క నిమిషం కూడా స్వామివారి నామం మరువకుండా మనసులో చెప్పుకున్నాను..అదేమి ప్రారబ్ధమో నా కష్టాలు తీరకపోగా..ఇంకా ఎక్కువయ్యాయి..స్వామివారికి నా మీద కనికరం కలిగినట్లు లేదు..ఏమి చేసేది?.."అంటూ ఆ మధ్యవయస్కుడు నా దగ్గరకు వచ్చి వాపోయాడు..


అతనిని మేమూ గత నెలరోజులుగా గమనిస్తున్నాము..నిజమే..ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే లేచి..తలారా స్నానం చేసి..మందిరం లోకి వచ్చి..మంటపం లోనుంచే స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని..ప్రదక్షిణాలు మొదలుపెట్టేవాడు..నూటఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి కాగానే..మళ్లీ మంటపం లోకి వచ్చి..అక్కడినుంచి నమస్కారం చేసుకొని వెళ్లిపోయేవాడు..మధ్యాహ్నం హారతి తీసుకొని..మళ్లీ సాయంత్రం హారతి వచ్చి, కళ్లకద్దుకొని వెళ్ళేవాడు..రాత్రికి మంటపం లోనే నిద్ర చేసేవాడు..


"మీదేవూరు..మీకున్న సమస్య ఏమిటి..? " అని అతనిని నేను అడిగాను..కొద్దిగా తటపటాయించి.."మాది గుంటూరు జిల్లా..సత్తెనెపల్లి దగ్గర ఉంటాను..చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానండీ..వాటిలోంచి బైట పడే మార్గాలన్నీ మూసుకుపోయాయి..అప్పులపాలయ్యాను..బంధువులు సైతం నన్ను దూరంగా పెట్టారు..ఎవ్వరూ నాకు సహాయం చేయడం లేదు..ఆ సమయం లో నా మిత్రుడు ఈ మందిరానికి వెళ్లి ప్రార్ధన చెయ్యి..నీ కష్టాలు తీరుతాయి అని చెప్పాడండీ..నమ్మి ఇక్కడకు వచ్చాను..కానీ నాకు ఏమీ వెసులుబాటు కలగలేదు.." అన్నాడు..


"మరి మీ సంసారం మాటేమిటి?..వాళ్ళు ఎలా వున్నారు?.." అని అడిగాను.."నేను ఇక్కడికు వచ్చే విషయం వాళ్లకు తెలీదండీ..మూడురోజుల తరువాత నేనే వాళ్లకు ఫోన్ చేసి త్వరలో వస్తానని చెప్పానే కానీ..ఇక్కడ ఉన్నానని చెప్పలేదు..అప్పుడప్పుడూ ఫోన్ చేస్తున్నాను.." అన్నాడు.."ముందు మీరు మీ ఊరెళ్లి..మీ వాళ్ళను కలవండి..వాళ్ళు కంగారులో వుంటారు..ఇలా ఎవ్వరికీ చెప్పకుండా అజ్ఞాతంగా వుండకండి..మీ రాత బాగుంటే..అన్నీ సర్దుకుంటాయి.." అని చెప్పాను.."అంతేనంటారా?.." అన్నాడు..అంతే అని చెప్పాను..ప్రక్కరోజు ఉదయం వెళ్ళిపోయాడు..


ఆరు నెలలు గడిచిపోయాయి..ఒక శనివారం మధ్యాహ్నం అతను వచ్చాడు..ఈసారి అతనితో పాటు అతని భార్యా పిల్లలు కూడా కలిసే వచ్చారు..నేరుగా నా వద్దకు వచ్చి.."నేను గుర్తున్నానా?..ఇక్కడ నలభై రోజులు వుండి వెళ్ళాను.."అన్నాడు..గుర్తున్నారు..అన్నాను.."ఎలా వున్నారు?." అని అడిగాను.."ఇప్పుడు బాగానే ఉన్నసనండీ..నాకున్న అప్పులు పూర్తిగా తీరలేదు..కానీ నాకు కొద్దిగా వెసులుబాటు వచ్చింది..ఇక్కడినుండి వెళ్లిన తరువాత..మా వాళ్ళను కలిశాను..అందరం కలిసి కూర్చుని..మాకున్న అప్పులు, మా ఆస్తులు లెక్కగట్టుకున్నాము..నా అప్పుల వాళ్ళను పిలిచి..కొద్ది సమయం ఇస్తే..ఆస్తులు అమ్మి తీరుస్తానని నచ్చచెప్పుకున్నాను..నేను పారిపోలేదని కూడా చెప్పాను..అందరూ ఒప్పుకున్నారు..మెల్లిగా తీర్చుకుంటున్నాను..ఈలోపల మా అబ్బాయికి, అమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చింది..ఇద్దరూ వెళ్లిపోయారు..ఒకరకంగా నాకు కొంత ఆసరాగా వుంటారు..మనసుకు ప్రశాంతత వచ్చింది..ఇప్పుడు ధైర్యం కూడా వచ్చింది..స్వామివారు నా ప్రయత్నం లేకుండా నా కష్టాలు తీరవు అని పాఠం చెప్పారని అనిపించింది..ఈరోజు ఇక్కడ నిద్ర చేసి..రేప్పొద్దున స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళతాము..ఏది ఏమైనా స్వామివారినే నమ్ముకున్నాను..ఇంతకుముందు కన్నా ఇప్పుడు నా పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది..ఇలానే నన్ను బైట పడేస్తాడు స్వామివారు అని నా నలభై రోజుల ప్రదక్షిణాల వల్ల నమ్మకం కలిగింది.." అన్నాడు..


అతని లో మార్పు వచ్చింది..ఆ మార్పుకు కారణం స్వామివారే అని అతని నమ్మకం..అతని నమ్మకమే అతని కి రక్ష..!!


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: