హర హర స్తోత్రం
----------------------------- ---------------------
నమశ్శివాయ మంత్రమొండు నాల్కపల్కబూనుచో
క్రమంబు తప్ప కోంకృతే విరాజిలంగ పూర్వమై
సముద్రమంటి కూర్మితోడ చంద్రశేఖరుం డహో!
ప్రమోదమందజేయు కష్టవహ్ని కాల్చకుండగన్.
మనమ్మె పాద సన్నిధానమందు నుంచి భక్తితో
వనంబెపోయ మోదమందు వాంఛితార్థదాయియౌ
మనోజ్ఞమంచు బిల్వపత్రమాత్రమీయ మెచ్చుచున్
సనాతనుండు శంకరుండు సాంబమూర్తి యండయౌ.
హరా!హరా! యటంచు మానకార్తితోడ పల్కినన్
హరించి భక్తపాళి ఆర్తులబ్ధి ముంచివేయునే!
హరుండెతండ్రియౌచు రక్షనందజేయు ప్రేమతో
హరా!హరా!హరా! యటంటలాపు టింక నేలరా!
శాప బాధనంది క్రుంగు చంద్రుగాచె నీశుడే!
పాప మామృకండసూతి బాధమాన్పెశంభుడే!
ఆపృథాసుతుండె జయమునందజేసె శర్వుడే!
రేపుమాపు లనెడు వంకలేక బ్రోచు సాంబుడే!
సురాసురాదులెవ్వరేని సుంతభక్తిదల్చినన్
హరీశ చర్మధారి,మన్మథారి వ్యోమకేశుడే!
వరోరగంబుభూషవాడు భస్మధారి సత్కృపన్
వరంబులీయ వచ్చు వేగ భక్త వత్సలుండెగా!
రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి