🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
కధ కాని కధ...మనందరి కధ !
💐💐💐💐💐💐💐💐💐
ఇది మన సమాజంలో 70 - 80 ఏళ్ళ క్రితం నుంచీ జరిగిన, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల స్ఫూర్తితో అల్లిన అనుభవాల పందిరి.
అప్పట్లో దాదాపు అందరం అమ్మమ్మల ఇళ్ళలోనే పుట్టేవాళ్ళం. ఎందుకంటే...అదే సంప్రదాయం,
సుఖము, సురక్షితము, సాగుబడి. ముఖ్యంగా,
ప్రేమతో చాకిరీ చేసేవాళ్ళు, వైద్య సలహాలిచ్చేవాళ్ళు,
ప్రతి ఇంటా దండిగా అనుభవజ్ఞులు వుండేవారు.
అదంతా ఒక సహకార సమాఖ్య !
పురుళ్ళు - పుణ్యాలు, రోగాలు - రొష్టులు, పండగలు - పబ్బాలు, పెళ్ళిళ్ళు - పేరంటాలు, నోములు - వ్రతాలు, కష్టాలు - సుఖాలు ఏవి వచ్చినా, పెద్దల దగ్గిరనించీ పిల్లకాయల దాకా అందరూ తమకు చేతనైన పనులు బాధ్యతగా, ప్రేమతో ఒకళ్ళకొకళ్ళు చేసుకునేవారు.
దాన్నే ఇప్పుడు "టీమ్ వర్క్" అంటున్నారు !
"అందరికోసం ఒక్కడు నిలిచి, ఒక్కనికోసం అందరు కలిసి" అని శ్రీశ్రీ గారు రాసినట్టు, అక్షరాలా నడిచేది.
"ఆ రోజులే వేరు...అదొక గుప్తుల స్వర్ణయుగం,
మళ్ళీ రమ్మన్నా రాదు" అని వాపోయేవాళ్ళు
ఎప్పుడూ ఉంటూనే వుంటారు !
💐💐💐💐💐💐
నాటి - ఆనాటి అమ్మమ్మల ఇళ్ళలో ఉన్న జరుగుబాటు, ఆప్యాయతలు, ముఖ్యంగా
పిల్లలు పుట్టినపుడు, అందరూ తలో చెయ్యీ వేసి, చూపించిన ప్రేమలు, పొందిన అనుభూతులు తల్చుకుని...ఎన్నో సౌకర్యాలు వచ్చిన ఈ రోజులతో పోల్చుకున్నా, ఎందుకో...
ఆ తరం వాళ్ళ మనసులు, అటే ఓటు వేస్తాయి అనిపిస్తుంది.
చెప్పుకోదగ్గ హాస్పిటళ్ళు, డాక్టర్లు లేని ఆ ఊళ్ళలో డెలివరీలంటే భయం ఉండేది కాదు.
(ఇప్పుడు స్కానింగులతో మొదలై, 'సీ సెక్షన్' లతో
ముగుస్తోంది !)
రోమన్ చక్రవర్తి, జూలియస్ సీజర్ పుట్టిన పద్ధతి కాబట్టి, దానికి 'సిజేరియన్' అనే పేరు వచ్చిందిట !
(మా ఫామిలీ 'సిజేరియన్ డాక్టర్' చెబితే తెలిసింది.)
ఇప్పటి కార్పొరేట్ డాక్టర్లకి ఈ "సిజేరియన్" చెయ్యడం అంటే కత్తితో నేర్పిన విద్య ! ఎందుకంటే...
"డబ్బు సంపాదించడం ఎలా ?" అనే రహస్యం వాళ్ళందరికీ "స్టాఫ్ రెగ్యులేషన్స్" లోనే ఉంటుందిష !...
టార్గెట్లలోనే ప్రింటు చేయించి మరీ యిస్తారుట !
కొంచెం ఫన్నీ గా చెప్పుకుంటే...ఇప్పటి బాలింతరాళ్ళు, కొత్తగా పుట్టిన బిడ్డకంటే ఎక్కువగా, సెల్ ఫోనునే చూసుకుంటున్నారు ! ఆ బిడ్డని చూసుకుందుకు,
షిఫ్టు డ్యూటీల్లో నర్సులు వస్తారుగా ...
వాళ్ళకి డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ సార్ వాండు..
ఇచ్చి పూడుస్తాడు !
😜
మళ్ళీ 'అప్పట్లోకి' వెళ్ళిపోదాం...
చిన్న చిన్న జ్వరాలు, రోగాలు వచ్చినా ఎక్కువగా
గృహ వైద్యాలతోనే నడిచిపోయేది.
ప్రతి ఊళ్ళోను ఒకళ్ళిద్దరు చెయ్యి తిరిగిన మంత్రసానులు ఉండేవారు. ప్రతి ఇంటికీ ఆస్థాన పనిమనిషి - చాకలి - మంగలి - పురోహితుడితో పాటు, ఒక మంత్రసాని కూడా ఉండేది.
ప్రతి ఇంట్లోను కనీసం ఐదారుగురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి, ఏడాదిలో నాలుగైదు డెలివరీలు ఖాయం ! "టర్నోవరు" కి ఢోకా లేదు !
కూతుళ్ళతో పాటు, తల్లులు కూడా పురిటి మంచం అలంకరించడం రివాజు. అందుకోసం...
ప్రతి ఇంట్లోనూ కనీసం నాలుగైదు నులక మంచాలు రడీగా ఉండేవి.
మనవరాళ్ళతో పాటు, పక్కనే చంటాడితోపాటు నులకమంచం వేయించుకున్న అదృష్టవంతులైన అమ్మమ్మలు కూడా అక్కడక్కడ వుండేవారు !
(అప్పటికింకా కుటుంబ నియంత్రణలు రాలేదుగా !)
💐💐💐💐💐💐
ఇప్పటి డాక్టర్లు హాస్పిటల్ వార్డుల్లో రౌండులకి వెళ్ళినట్టుగా...మంత్రసానులు చూలింతలని, బాలింతలని చూసుకుంటూ ఊళ్ళో రౌండ్లు వేసేవాళ్ళు.
తమ అనుభవాన్ని బట్టి, ఏ రోజుకి ఆయా ఇళ్ళలో
బాలకృష్ణులు లేక లక్ష్మీదేవులు ఉద్భవిస్తారో చెప్పేసి, చెయ్యవలసిన ఏర్పాట్లు, సిద్ధంచేయవలసిన సరంజామా వివరించేసి, ఆ ప్రకారం తమ కాల్షీట్లు ఇచ్చేవాళ్ళు.
సరే..'ఆ రోజు' రాగానే, ఇంటిల్లిపాదీ ఎవరికిచ్చిన డ్యూటీ వాళ్ళు ఎక్కేసి, రెడీగా ఉండేవాళ్ళు.
ఇంటి పెద్ద... పుట్టబోయేవాళ్ళ పుట్టిన సమయం,
నక్షత్రం, పాదం రాసుకుందుకు వీలుగా, ఒక గడియారం, తెలుగు కాలెండరు, పంచాంగం
రడీ చేసుకునేవాడు.
ఒకవేళ జన్మ నక్షత్రం శాంతి నక్షత్రం లేక దోషం ఉన్నదైతే, కన్నతండ్రి ఏ ఏ గ్రహాలకు శాంతి చేయించుకుని, ఏ ఏ దానాలు ఇచ్చి,
ఏ రోజున తన సంతానం మొహం నూనెలో చూడాలో, ఆస్థాన పురోహితుడు గారు నిర్ణయించేవాడు.
(చాలా చోట్ల యిప్పటికీ జరుగుతోంది అనుకోండి)
అమెరికా లాంటి చోట్ల, కనబోయే తల్లికి బాసటగా, కాబోయే తండ్రిని కూడా డాక్టర్లతో పాటు, లేబర్ రూములో వుండమంటున్నారు, బొడ్డుతాడు కూడా తండ్రి చేతే కోయిస్తున్నారు !
తమ ప్రమేయం లేకుండా తాము పుట్టబోయే టైము, నక్షత్రాన్ని బట్టి, తమ భవిష్యత్తు జీవితం మొత్తం
నిర్ణయం అయిపోతుందని, ఆ 'విధివ్రాతను' ఎవరూ తప్పించలేరని, పాపం ఆ గర్భస్థ శిశువులకు అప్పటికి తెలియదు !
'జ్యేష్ఠ' నక్షత్రం అయితే, తనకంటే ముందు పుట్టినవాళ్ళకి, 'రోహిణి' అయితే...మేనమామలకి,
(కృష్ణ పరమాత్మ 'రోహిణి' లోనే పుట్టి, స్వయానా తన మేనమామ - కంసుడి పుట్టి ముంచాడు కాబట్టి, అప్పట్నుంచీ మేనమామలందరికీ ఆ సౌకర్యం వచ్చిందిట !)
'మూల' నక్షత్రం అయితే...మూలనున్న ముసలాళ్ళకి.
"బోర్డింగు పాసులు" వచ్చినట్టే అని,
గాఢంగా నమ్మేవారు/తున్నారు.
"వీడు/ఇది పుట్టి, మా తాత/నాయనమ్మని
చంపేశాడు/సింది అని, వాళ్ళ జీవితాంతం
గుర్తుచేస్తూనే వుండేవారు !
కానీ..పాపం దయదల్చి, ఐపీసీ సెక్షన్ 302 కింద
బుక్ చేసేవారు కాదు ! 😊😊
ఆ పురిటిగది బయట...కావలసిన మగాళ్ళందరూ...
చేతులు వెనక్కి పెట్టుకుని, సినిమాల్లో చూపించినట్టు,
"కువ్వా...." అని వినిపించేదాకా అటూ - ఇటూ ఆతృతగా తిరుగుతూ...ఒకళ్ళనొకళ్ళు గుద్దుకుంటూ వుండేవారు !
💐💐💐💐💐💐
బాలింతరాళ్ళు ఏమి తినాలో, ఏది తినకూడదో,
ఎప్పుడు తినాలో, ఎంత తినాలో అనుభవజ్ఞులైన
సీనియర్లు యిప్పటి 'డైటీషియన్' ల పాత్ర పోషించేవారు.
పెళ్ళికాని క్రితం, బొండు మల్లెల్లా ఉన్న తల్లులు,
ఒక పిల్ల పుట్టగానే...కాడ మల్లెల్లాగ అయిపోయేవారు.
నడ్డి కట్టు బిగించడానికి కాస్త బలంగా ఉన్న చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకీ డ్యూటీ పడేది. పథ్యం పెట్టగానే బాలింతలకి...ఏ నిద్రమాత్రకీ రానంత
నిద్ర ముంచుకొచ్చేది. కానీ నిద్రపోకూడదుట !
అందుకని, నిద్ర చెడగొట్టడానికి, ఇంట్లో వాళ్ళు...
పళ్ళాలు వాయిస్తూ, తప్పెట్లూ - తాళాలూ మోగించేవాళ్ళు !
సరే...మామూలుగా... పుట్టిన బంగారుకొండలు,
తల్లిని తిండి తిననివ్వరు...రాత్రిళ్ళు నిద్రోనివ్వరు !
కన్నతల్లి అన్నం తినే సమయానికే అలారం కొట్టినట్టు లేచి, ఆరున్నొక్క రాగం మొదలెట్టేవాళ్ళు.
తెల్లారుఝామున సరిగ్గా తల్లికి నిద్ర ముంచుకొచ్చే సమయానికే...కన్న కాసులు లేచి, ఆడుకునే సమయం !
పూర్వం ఇప్పటిలాగ, పుట్టిన దగ్గరనుంచి, మూడేళ్ళు వచ్చేదాకా 'డైపర్ల' భోగం లేదు కాబట్టి, ఆ పురిటి గది అంతా...చిత్ర విచిత్ర వాసనలతో ప్రత్యేకత సంతరించుకునేది.
పది - పదిహేను పాత బొంత గుడ్డలు సర్వకాల సర్వావస్థలయందు తయారుగా ఉండేవి...
కొన్ని బయట ఎండలోనూ...కొన్ని ఇంట్లోనూ...
మూడేళ్ళు వచ్చేదాకా మగ పిల్లలు - బోసి మొలలతోను, ఆడపిల్లలు - సిగ్గుబిళ్ళలతోను తిరుగాడేవాళ్ళు.
బాలింతరాలి ఒళ్ళు గట్టిపడి, వేడి చెయ్యాలని,
'కాయం ఉండలు' అనే ప్రత్యేక సరుకు ఖాయంగా ఉండేవి. వాటి దెబ్బకి, చంటాళ్ళ దెబ్బకి, అమ్మణ్ణి గారి బూరి బుగ్గలు కాస్తా...లోపలికి పోయి, చపాతీలు అయిపోయి, కళ్ళు పైకి తేలిపోయేవి !
మొహంలో కళ్ళు - పళ్ళు మాత్రమే కనపడేవి !
💐💐💐💐💐💐
బాలింతరాళ్ళని ఒకరకమైన 'క్వారంటయిన్' లో వుంచేవారు. 'ఎంట్రీ పాస్' లు లేనివాళ్ళకి ఆ గదిలోకి 'నో ఎంట్రీ....'
(ఇప్పుడు హాస్పిటల్లోనే...ఫోటోలు, వీడియోలు తీసేసుకుని, చంటాళ్ళని దేశ - విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ చూపించెయ్యలిగా ?)
😊😊
ఇప్పుడు భారసాల దాకా ఆగకుండా, ఆరోజే పేరు చెప్పేస్తే, హాస్పిటల్ వాళ్ళు బర్త్ సర్టిఫికెట్ తయారు చేసేసి, పాస్ పోర్టుకి కూడా రడీ చేసేస్తున్నారు.
అప్పట్లో ఇంటిపేరు వాళ్ళందరూ ఏ వూళ్ళో వున్నా, పురిటి వాళ్ళే కాబట్టి, ఆ పదిరోజులూ వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళలో పూజలు, శుభకార్యాలు చేసుకోకూడదు.
(ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా...ఆ పట్టింపులు వుండట్లేదనుకోండి !)
పసికందుల కడుపు "వేక్యూమ్" చెయ్యడం కోసం, స్వచ్ఛమైన ఆముదం హోల్ సేల్ గా కొనేసి, దాన్ని పట్టించడానికి, ఒక 'అచ్చొచ్చిన' ఉగ్గు గిన్ని తయారుగా పెట్టేవారు. ప్రతిరోజూ కడుపు లోపలికి ఆముదం పోసి, తలకీ, ఒంటికీ దిట్టంగా పట్టించేస్తే, పిల్లలు
ఘుమఘుమలాడిపోయేవారు !
(మా అమ్మమ్మ అయితే...
"చంటిపిల్లలు 'కంహ్మటి' వాసనొస్తారు" అనేది !)
😊😊
వాళ్ళ ఉగ్గు గిన్నెలు..తండ్రుల - తాతల ఆర్ధిక స్థోమతుని బట్టి, వెండివి, బంగారంవి కూడా ఉండేవి.
వాళ్ళకి ఆముదం పట్టించడం ఒక పెద్ద ప్రహసనం !
ఆ పసి గుడ్డులకి కూడా ఆముదం వాసన, రుచి పడదు కాబట్టి, మొహం చిట్లించి, తెగ గింజుకుంటూ ఏడ్చేవాళ్ళు.
అందుకు ముందుగా కాస్త తేనె నాకించి, తరవాత
'అసలు సరుకు' నోటికి వేలు అడ్డంపెట్టి,
వాటంగా పట్టించి, పని కానిచ్చేవారు.
అప్పటికి చూసేవాళ్ళకి పెద్ద రిలీఫ్ వచ్చేది !
తరవాతి ఘట్టం...వాళ్ళ స్నానం ! సీనియర్లతో ఒకరు,
రెండు పీటలు వేసుకుని, రెండు కాళ్ళమీద పడుకోబెట్టుకుని, నలుగు పెట్టి, వేడి వేడి నీళ్ళు పోస్తూ, గిన్ని తోమినట్టు తోమేస్తే, ఏడ్చి ఏడ్చి, వాళ్ళు బయటికి రాగానే, ఒళ్ళు తుడిచే డ్యూటీ ఒకళ్ళది. సాంబ్రాణి పొగ వేస్తూ, కడుపు నింపే బాధ్యత కన్నతల్లిదేగా?
ఎప్పుడో...పెళ్ళికి కొన్న మధుపర్కాలు, ఉయ్యాలగా మార్చి, దూలానికి వేలాడదీసి, అందులో పడుకోబెట్టి,
తల్లికి నోటికొచ్చిన 'వరహాల లాలి' పాట అందుకుంటే,
అప్పటికి ఇంట్లో తాత్కాలిక ప్రశాంతత నెలకొనేది,
తల్లి బ్రేక్ ఫాస్టుకి బ్రేకూ దొరికేది.
తరవాతి కాలంలో స్టాండు ఉయ్యాళ్ళు,
స్ప్రింగు ఉయ్యాళ్ళు వచ్చేశాయి.
💐💐💐💐💐💐
భారసాల నాడు, పేరుకోసం వెతుక్కోఖ్ఖర్లేకుండా
ఆడపిల్లకి నాయనమ్మ పేరు, మగపిల్లాడికి
పితామహుడి పేరు రడీగా ఉండేవి.
అవీగాక, ఇతరత్రా మొక్కులూ గట్రా వుంటే,
ఆ దేవుళ్ళందరి పేర్లూ ముందూ - వెనకా చేరి,
"వీర వెంకట సత్య సూర్య శివరామ నాగేంద్ర వల్లీశ్వర సుబ్రహ్మణ్యేశ్వర రావు" ఉరఫ్ 'సుబ్బి గాడు'...
లేక... డిట్టో డిట్టో.. "అలివేలు మంగతాయారు"
ఉరఫ్ 'మంగ' పేర్లు ఖాయం అయ్యేవి.
వాళ్ళు పెద్దయ్యాక...ఇస్కూళ్ళలో వాళ్ళని,
"ఏబీసీడీ ల సుబ్బు" అని, లేక..
"గూడ్సు బండి మంగ" అని ముద్దుగా పిలిచేవారు !
పాపం వాళ్ళు బడిలో చేరాక, వాళ్ళ పేరే
తప్పుల్లేకుండా రాయలేకపోయేవాళ్ళు !
తరవాత్తరవాత...పాస్ పోర్టుల్లోనూ...
ఎయిర్ పోర్టుల్లోనూ చోటు సరిపోయేది కాదు !
ఇప్పుడు ఆ బాధ లేదు కదా !
ఇంటర్నెట్ లో అంతకుముందు ఎవరికీ లేని పేరు,
కనీ - వినీ ఎరుగని పేరు, ఎవరికీ అర్థం కాని పేరు, గూగుల్లో మాత్రమే అర్ధం దొరికే పేరు, వెతికి పట్టుకుని, సింపుల్ గా ఆడపిల్లకి..."జిష్ణ" లేక "తృష్ణ" అని, మగపిల్లాడికి అయితే, "హితేష్' లేక "మటాష్" అనీ పెట్టేసి, రికార్డుల్లో రాయించేసి, అప్పుడు ఎవరైనా (అడిగితే)...చెబుతున్నారు...ట !
😂😂
💐💐💐💐💐💐
అలా కొద్దికాలం గడిచాక, కన్నతల్లి,
"ఆ దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలాడేనా...
ఆ సోగ కనుల రెప్పల్లో తూనీగలాడేనా..."
అని ఆ జాబిలి కూనకి జోల పాడుతుంటే...
కన్నతండ్రి ఒక చేతి సంచీతో బస్సు దిగొచ్చి,
"చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రానీ..."
అని పాట పూర్తిచేసేవాడు.
ఒకే యింట్లో కొంచెం అటూ - ఇటూ గా,
ఇద్దరు ముగ్గురు బాలింతరాళ్ళు పోటా పోటీగా
కూడా ఉండేవారు.
వాళ్ళ పిల్లలకి పెద్దవాళ్ళు టోకెన్ నెంబర్ల ప్రకారం, స్నానాలు చేయించేవాళ్ళు.
ఒకే గదిలో దూలానికి రెండు - మూడు గుడ్డ ఉయ్యాళ్ళు ఊగుతుంటే చూడముచ్చటగా ఉండేది.
అలా దిన దిన ప్రవర్ధమానంగా ఎదిగిన ఎడ పిల్లలకి మాత్రం, ఆముదంతో అనుబంధం తీరిపోయేది కాదు.
మూణ్ణెల్లకోసారి, అంబాజీపేట నుంచి, స్వచ్ఛమైన సరుకు
'డోర్ డెలివరీ' అవ్వాల్సిందే...పెద్దలకీ...పిల్లలకీ...
వంతులవారీగా పట్టించాల్సిందే !
🤢🤮
ఆ రోజంతా...ఆ ఆముదం త్రేణుపులు వస్తుంటే వుండేదీ...చెప్పనలవి కాదు...ఎవరికి వారు
'ఫ్లాష్ బ్యాక్' లోకి వెళ్ళి తల్చుకోవాల్సిందే !
నిత్యం తెల్లారకుండానే, చెవులమీంచి మొహమ్మీదకి కారేట్టుగా తలకి ఆముదం పట్టించే 'ఆముదం మొహం గాళ్ళు' ఇంటికి యిద్దరైనా వుండేవారు. ఆరోజుల్లో వాళ్ళ దరిదాపుల్లోకి వెళ్ళడానికి ఎవరూ సాహసించేవారు కాదు !
(పాపం ! భార్యలకి తప్పదుగా !)
😂😂
💐💐💐💐💐💐
అంతేనా ? జ్వరాలు వస్తే, ముందు ఆముదంతో
కడుపు ఖాళీ చేశాక, పైనుంచి నోరు ఎండగట్టేవారు !
నాలుగో - అయిదో లంఖణాల స్కోరు చేశాక,
జ్వరం తగ్గితే...పథ్యం పెట్టడానికి ఒక చిన్న పరీక్ష పెట్టేవారు !
చేతి జానతో...బొడ్డు దగ్గిరనుంచి ముక్కుదాకా అందుకో గలిగితేనే...పథ్యం భాగ్యం !
లేకపోతే...కోర్టు వాయిదానే !
(ఇప్పుడు మనం జ్వరం లేకపోయినా...
లంబోదరం నుంచి - నాసికా త్రయంబకం దాకా అందుకోడం కష్టసాధ్యమే !)
నామాట మీద నమ్మకం లేకపోతే...ట్రై యువర్ లక్...
😌😌
ఈలోగా...ఆ జ్వరం రోగికి, అడ్డమైనవన్నీ తినెయ్యాలనిపించేటంత కరువు వచ్చేసేది !
నోరు కట్టుకోలేక, దొంగచాటుగా తినేసి,
వాంతులు చేసుకున్న "వమన" రావులూ వుండేవారు.
ఇంక పథ్యం పెట్టడం అంటే...అదొక స్టాండర్డ్ పేకేజీ.
శొంఠిపొడి, కారప్పొడి, పాత చింతకాయ్ పచ్చడి,
చారు ! బస్ !!... నో మజ్జిగ / పెరుగు.
అదికూడా... మజ్ఝాన్నం రెండు దాటాక !
తరవాత కొంతకాలం దాకా, డోక్కుపోయిన మన మొహాల్ని అద్దంలో చూసుకుంటే, మనకే డోకొచ్చేది.
ఇతి లంఖణాల అధ్యాయం సమాప్తః !
💐💐💐💐💐💐
నెలకోసారి నలుగు పెట్టి, కుంకుడు కాయ పులుసుతో తలంట్లు మష్టు ! అలా తలంటుకున్నవాళ్ళకి
కళ్ళలో కుంకుడు రసం ఫ్రీ ! మనని చూస్తే...
వాళ్ళకి "కన్నెర్రగా" వుండేది !
మళ్ళీ... అంబాజీపేట ఎక్కడుందో తెలీకపోయినా,
అక్కణ్ణించి వచ్చిన స్వచ్ఛమైన వంటాముదమును...
ముదమున మూణ్ణెల్లకోసారి తాగి తీరాలి !
💐💐💐💐💐💐
అలా పుట్టి - అలా పెరిగి, ఇంత వాళ్ళమైన మనం...
ఉగ్గుపాలతో తాగిన ఆముదాన్ని మర్చిపోయి,
"నలుగు పెట్టుకోవడం అంటే ఏంటి మమ్మీ...?"
అని ఇప్పటి పిల్లలు అడిగేట్టుగా పెంచి,
"లంఖణం" స్పెల్లింగు మర్చిపోయి, జ్వరం రాగానే
ఒఖ్ఖ మాత్రతో దాని పీచమణిచేసి, శుభ్రంగా అన్నీ
అడ్డంగా తినేసే సౌలభ్యం కలిగించుకున్నాం.
భళా - భళీ !
బహుశా... అప్పుడది కరెక్టు...ఇప్పుడిది కరెక్టు !
మూల కధ... అమ్మమ్మలు - నాయనమ్మలు...
కధనం - గ్రాఫిక్స్ - చిలవలు - పలవలు...
వారణాసి సుధాకర్.
💐💐💐💐💐💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి