పత్రికా ప్రకటన తిరుమల, 2023 ఆగస్టు 10
సామాన్య భక్తులకే నా ప్రాధాన్యం
- ధనవంతుల సేవలో తరించేవాడిని కాదు
- హిందూ ధార్మికతను ప్రపంచవ్యాప్తం చేస్తాం
- స్వామివారి సేవకులకు సేవకుడిని
- టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి
సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తానని, ధనవంతుల సేవలో తరించేవాడిని కాదని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ధనవంతులు, విఐపిలు దర్శనాల గురించి తాపత్రయపడితే స్వామివారి ఆశీస్సులు లభించవనే వాస్తవం గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గురువారం ఆయన అన్నమయ్య భవనంలో మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయ, ఆశీస్సులతో ఊహించని విధంగా తనకు రెండవ సారి టీటీడీ చైర్మన్ గా పనిచేసే మహద్భాగ్యం దక్కిందన్నారు. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామివారికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 2006 నుండి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పని చేసిన సమయంలో ఒక వైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించినట్టు చెప్పారు.
ఎందరో ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు, కార్యనిర్వహణాధికారులు, కార్యనిర్వాహక అధికారులు, ఉద్యోగుల కృషి, స్వామివారి పట్ల అచంచల భక్తి, విశ్వాసం తో పని చేసినందువల్ల టీటీడీలో మంచి వ్యవస్థ ఏర్పడిందన్నారు. దీన్ని మరింతగా ముందుకు తీసుకుని వెళ్ళి, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా తమ ధర్మకర్తల మండలి పనిచేస్తుందన్నారు. గతంలో తాను ఛైర్మన్‌గా పనిచేసిన హయాంలో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఆచరణలో చేసి చూపామన్నారు. స్వామివారి వైభవాన్ని ప్రజల హృదయాల్లో తీర్చిదిద్దేలా వారిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతామని చెప్పారు. హోదా, అధికారం, తాము ముఖ్యలమనే భావనతో దేవుడి దగ్గరికి వచ్చేవారిని ఆయన క్షణకాలమైనా చూడకపోతే ఉపయోగం లేదన్నారు. దేశవిదేశాల్లోని హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేలా టీటీడీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. తాను స్వామివారి సేవకులకు సేవకునిగా పనిచేస్తానని, అధికారం కోసం కాదని అన్నారు. స్వామివారిని భక్తుల దగ్గరికే తీసుకెళ్లి భక్తిప్రసాదం పంచుతామన్నారు.
దళిత గోవిందం
గతంలో తాను ఛైర్మన్‌గా పనిచేసిన కాలంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీదేవి, భూదేవిని దళితవాడలకు తీసుకుని వెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
శ్రీనివాసకళ్యాణాలు
భాగవంతున్నే భక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించేలా, స్వామివారి కల్యాణాన్ని వారంతా చూసి ఆనందించేలా శ్రీనివాస కళ్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించినట్టు చెప్పారు.
కళ్యాణమస్తు
పిల్లల పెళ్ళిళ్ళకు అప్పులు చేసి ఆర్థికంగా చితికి పోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూత నివ్వడానికి కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 32 వేలకు పైగా జంటలకు స్వామివారి సమక్షంలో పెళ్ళి చేసి ఆయన ఆశీస్సులు అందింపజేశామని, తద్వారా మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించామని వివరించారు.
అందరికీ అన్నప్రసాదం
2006 కు ముందు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే అన్నదానం లో భోజనం చేసే అవకాశం ఉండేదన్నారు. తమ హయాంలో దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తుడు రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కల్పించామన్నారు.
నాలుగుమాడ వీధుల్లో పాదరక్షలు నిషేధం
తిరుమల ఆలయ పవిత్రతను కాపాడటానికి నాలుగుమాడ వీధుల్లో పాదరక్షలతో ప్రవేశాన్ని నిషేధించినట్టు తెలిపారు.
చంటిబిడ్డ తల్లులకు మహాద్వారం పక్క నుండి ఆలయ ప్రవేశం
చంటిబిడ్డలతో స్వామివారి దర్శనానికి వచ్చే తల్లులు క్యూ లైన్లలో చాలా ఇబ్బందిపడే వారని, దీన్ని గమనించి చంటిబిడ్డ తో పాటు తల్లికి మహాద్వారం పక్కన కుడివైపు నుండి ప్రత్యేక లైన్ ద్వారా ఆలయంలోకి వెళ్ళేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
పౌర్ణమి గరుడ సేవ
బ్రహ్మోత్సవాలలో విశిష్ట మైన స్వామివారి గరుడ సేవను భక్తులు చూసి తరించడానికి ప్రతి పౌర్ణమికి నాలుగు మాడ వీధుల్లో స్వామివారి గరుడ సేవ జరిపేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఎస్వీ బీసీ
శ్రీ వేంకటేశ్వర స్వామివారి కీర్తిని, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారంచేయడం కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎస్వీ వేద విశ్వవిద్యాలయం
వేద పరిరక్షణకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించడంలో కీలక పాత్ర పోషించానని, అప్పటి గవర్నర్ శ్రీ రామేశ్వర్ ఠాకూర్‌తో అనేక సార్లు చర్చించి అనుమతులు మంజూరు చేయించామని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంపూర్ణ సహకారంతో విశ్వ విద్యాలయం ప్రారంభించామన్నారు.
108 అడుగుల అన్నమయ్య విగ్రహం
శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై 32 వేల సంకీర్ణ నలు రచించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 600 జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జన్మస్థలానికి సమీపంలో ఉన్న రాజంపేటలో 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించామన్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంలోని శాసనాలను వెలుగులోకి తెచ్చిన శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి విగ్రహాలతోపాటు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టును ప్రారంభించి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు అర్చక శిక్షణ
ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని ఆలయాల్లో అర్చకులుగా పనిచేస్తున్న వారికి శ్వేత ఆధ్వర్యంలో అర్చక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
మీడియా సమావేశంలో శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------------------------
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి