16, సెప్టెంబర్ 2023, శనివారం

రామాయణమ్ 326

 రామాయణమ్ 326

....

మదించిన ఏనుగుల సమూహానికి రెక్కలు వచ్చి గాలిలోకి ఎగిరితే ఎలా ఉంటుందో అలాగా ఆకాశమంతా నిండిపోయి ప్రయాణం చేస్తున్నారు వానరవీరులు.

.

ముందు ఎగురుతున్న హనుమంతుని అపురూపంగా చూసుకుంటూ ఆయన మీదనుండి దృష్టి మరల్చకుండా గాలిని తోసుకుంటూ ఆధారమేలేని ఆకాశంలో రయ్యిమంటూ దూసుకు పోతున్నారు .

.

ఇక కిష్కింధ కొంతదవ్వున ఉన్నదనగా వారికి ఫలపుష్పాదులతో నయనానందకరంగా నందనవనాన్ని మరపిస్తున్న మధువనం కనపడ్డది .

.

అది సుగ్రీవునికి అత్యంత ఇష్టమైన వనం దానిని ఆయన మేనమామ దధిముఖుడు సంరక్షిస్తూ ఉన్నాడు.

.

ఆ వనాన్ని చూడగానే మధువులు గ్రోలి విజయోత్సవాలు జరుపుకోవాలన్న కోరిక వారిలో పెచ్చరిల్లింది . కోరిక పుట్టినదే తడవుగా అంగదుని అనుమతి కోరి ఆయన సమ్మతి మీద మధువనంలో ప్రవేశించారు వానరవీరులంతా .

.

రావడము రావడమే చెట్లమీద విరుచుకు పడ్డారు అందరూ.

.

పండ్లు తెంపి పొట్టపట్టినంతా తిని వాటితో బంతులాడేవాడొకడు!

తేనెతుట్టెలు తెంపి మధువులు గ్రోలి మత్తెక్కి ఊగేవాడొకడు

తోకనెత్తుకొని ఠీవిగ అటునిటు పరుగులెత్తేవాడింకొకడు

.

గంతులు వేసేవాడొకడు గొంతునిండా తేనెలు తాగేవాడొకడు

.

బారుగా చెట్లు ఎక్కేవాడొకడు 

వాడికి ఎదురుగా సర్రున దిగేవాడింకొకడు

.

కొమ్మలు పట్టుకొని వేలాడేవాడొకడు

అంత ఎత్తునుండి ధబ్బున నేలమీద దూకేవాడింకొకడు

.

చెట్టుమీదనుండి మరియొక చెట్టుమీదకు దూకేవాడొకడయితే

గుట్టలుగా పండ్లు తెంపి నేలపై విసిరేవాడింకొకడు

.

ఒకడివీపుమీద మరియొకడు స్వారీచేస్తుంటే వాడి మూపుమీద ఎక్కి ఊపున దూకేవాడు ఇంకొకడు.

.

పూలు కోసి ,కసుకాయలు తెంపి విసురుగా విసరివేస్తూ ఒకడు..

లేచిగుళ్ళు తెంపివేసి కొమ్మలు విరిచివేసి వికవిక నవ్వేవాడొకడు వాడిని చూసి పకపకనవ్వేవాడొకడు వారివురినీ చూసి పళ్ళికిలించి సకిలించేవాడింకొకడు.

.

మొత్తం వనమంతా ధ్వంసంచేస్తూ ఒకరినొకరు పరిహసించుకొంటూ ,హసిస్తూ కుప్పిగంతులు వేసి పాటలు పాడుకొంటూ ఉన్న వానరమూక ను చూసి కావలి వాళ్ళు వారించబోతే వారిని చావచితకకొట్టి పారిపోయేటట్లు చేయగా వారు వెళ్ళి దధిముఖుని వద్ద మొరపెట్టుకొన్నారు.

.

దధిముఖుడు మద్దిచెట్లు,తాడిచెట్లు,పెద్దపెద్దబండరాళ్ళు ఆయుధాలుగా పట్టుకొన్న బంట్లు వెంటరాగా హనుమదాదులు ఉన్నచోటికి వచ్చివారిని వారించబోగా,.

.

ఆ దధిముఖుడిని పట్టి ముఖముపైకొట్టి గడ్డము మీద గ్రుద్ది నేలపై పడద్రోసి ముష్టిఘాతాలతో అతని ఒడలంతా పొడిచిపొడిచి విడిచిపెట్టినాడు అంగదుడు.

.

ఆ దెబ్బలకు ఓర్వలేక పోయిపోయి సుగ్రీవుని ముందు వడలిపోయిన ఒడలుకలవాడై తీవ్రగాయాలతో రుధిరధారలు కారుతుండగా వానరరాజుముందు అంజలి ఘటించి నిలుచున్నాడు దధిముఖుడు.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: