16, సెప్టెంబర్ 2023, శనివారం

శ్రీరంగం

 భూలోక_వైకుంఠం శ్రీరంగం....శ్రీరంగం....


అద్భుతమైన ఏడు ప్రాకారాలు, ఇరవైకి పైగా గోపురాలు, ఆదిశేషునిపై విష్ణుమూర్తి శయనిస్తున్నట్లుగా ఉండే రూపం... ఇవన్నీ ఎక్కడోకాదు భక్తులు భూలోక వైకుంఠంగా పిలిచే శ్రీరంగంలోని అద్భుతమైన దృశ్యాలు. భక్తులను అనిర్వచనీయమైన భక్తిపారవశ్యంలోకి తీసుకెళ్లే శ్రీరంగం విశేషాలు ఇవి..


భూలోక వైకుంఠంగా ప్రసిద్ధినొందిన శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి కొలువై ఉన్నాడు. అతి పురాతన వైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి. తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో కావేరి నది ఒడ్డున శ్రీరంగం పట్టణంలో ఈ ఆలయం ఉంది. ద్రావిడ శైలిలో నిర్మాణం జరుపుకున్న ఈ ఆలయంలో అడుగడుగునా భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతుంది. ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన ద్వారాన్ని రాజగోపురం (రాయల్‌ టెంపుల్‌ టవర్‌) అని పిలుస్తారు. ఇది 237 అడుగుల ఎత్తు ఉంటుంది. డిసెంబర్‌, జనవరి మాసాల్లో ఇక్కడ ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ రెండు నెలల కాలంలో సుమారు పది లక్షల మంది భక్తులు శ్రీరంగనాథున్ని దర్శించుకుంటారు.


అంగ్‌కోర్‌వాట్‌ తరువాత అతి పెద్ద హిందూ దేవాలయంగా ఇది పేరుగాంచింది. ఈ ఆలయంలో 21 గోపురాలున్నాయి. 50 దేవతల విగ్రహాలు, వేయి స్తంభాల మండపం, చిన్న చిన్న నీటి కొలనులతో అతి సుందరంగా ఉంటుంది. హిందుయేతరులను రెండవ ప్రాకారం వరకు మాత్రమే అనుమతిస్తారు. రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి పైభాగం విమానం ఆకృతిలో ఉంటుంది. దీనికి పూర్తిగా బంగారు తాపడం చేశారు. ఆదిశేషునిపై నిద్రిస్తున్నట్టుగా ఉండే రంగనాథస్వామిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. సాక్షాత్తు భగవంతున్ని చూసిన భావన కలుగుతుంది.

శ్రీరంగనాథుని ఆలయ పరిధిలోనే మరికొన్ని సన్నిధానాలు, ఉపసన్ని ధానాలున్నాయి. అందులో థాయార్‌ సన్నిధి, చక్రథజవార్‌ సన్నిధి, ఉదయ వార్‌(రామానుజర్‌ సన్నిధి), గరుడల్వార్‌ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, హయగ్రీవర్‌ సన్నిధి ఉన్నాయి.

అద్భుతమైన ప్రాకారాలు

కావేరీ నది ఒడ్డున 156 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం విస్తరించి ఉంది. భారతదేశంలో ఏడు ప్రాకారాలతో నిర్మితమైన గుడి ఇదొక్కటే. ఈ ఏడు ప్రాకారాలు యోగాలో ఏడు కేంద్రాలుగా వైష్ణవులు భావిస్తుంటారు.


7)గోపురాల్లోని ఏడవ ప్రాకారం అసంపూర్తిగా ఉంది. దీన్ని రాయగోపురం అని పిలుస్తారు. నిర్మాణం పూర్తయితే అద్భుతమైన కట్టడంగా నిలిచిపోతుంది. దీని ఎత్తు 50మీటర్లుగా ఉండే అవకాశం ఉంది.


6)ఇందులో నాలుగు గోపురాలుంటాయి. దానిలో తూర్పువైపున ఉండే గోపురం 30వ శతాబ్దం నాటి వైభవాన్ని, నైపుణ్యాన్ని కళ్లముందు ఉంచుతుంది.


5)ఇందులో మనవాల మమునిగల్‌ దేవాలయం ఉంది. ఛోళ స్టయిల్‌లో నిర్మితమై ఉంటుంది.


4)ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడి గోడలన్నీ అందమైన శిల్పాలతో నిండి ఉంటాయి. వీణ వాయిస్తున్నస్త్రీ, పక్కనే రామచిలుక ఉండే శిల్పాన్ని చూసి ఎవరైనా సరే మంత్రముగ్ధులవుతారు. ఈ ప్రాకారంలోనే మ్యూజియం ఉంటుంది. శ్రీరంగంకు వచ్చినవారు తప్పక చూడాల్సిన మ్యూజియం ఇది. ఎన్నో అమూల్యమైన వస్తువులు ఇందులో భద్రపరచబడి ఉన్నాయి. దీన్ని వెల్లయిగోపుర అని పిలుస్తారు. దక్షిణ భాగంలో శేషరాయర్‌ మండపం ఉంటుంది ఈ మండపానికి ఎదురుగా వేయి స్తంభాల హాల్‌ ఉంటుంది. ఇందులో దేవతల ప్రతిమలు ఉంటాయి. ఇక్కడ ఏకాదశి రోజున పండుగ నిర్వహిస్తారు.


3)ఇందులో కార్తికేయ గోపురం ఉంటుంది. గరుడ మండపం ఉంటుంది. ఆలయంలో అతి సుందరమైన మండపం ఇది. ఈ ప్రాకారంలో వెస్ట్రన్‌వింగ్‌ కిచెన్స్‌, బియ్యం నిలువచేసుకునే గదులుంటాయి. తూర్పువైపున చంద్రపుష్కరిణి ఉంటుంది.


2)ఈ ప్రాకారంలో భక్తులకు పాలు, ప్రసాదం పంపిణీ చేస్తారు.


1)ఇక్కడి గోపురాన్ని నాజికెట్టన్‌ గోపురం అంటారు. ఇరువైపులా ఉండే ప్రతిమలు శంఖనిధి, పద్మనిధిగా పిలుస్తారు. ఈశాన్యభాగంలో యాగశాల, తొండమాన్‌ మండపం ఉంటాయి. ఈ మండపంలో సీలింగ్‌ భాగం ప్రతిమలు పేయింటింగ్స్‌లో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తూర్పు భాగంలో అర్జున మండప, కిలి మండపగా పిలిచే రెండు మండపాలుంటాయి.


ఎలా చేరుకోవాలి?


తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగంకు ప్రతీ పదినిమిషాలకు ఒక బస్సు వెళుతుంది. దూరం 9 కి.మీ. 15 నిమిషాల్లో చేరుకోవచ్చు.

తిరుచిరాపల్లిలో రైల్వేస్టేషన్‌, ఎయిర్‌పోర్టు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి శ్రీరంగంకు 15 కి.మీదూరం ఉంటుంది. శ్రీరంగంలోనూ రైల్వేస్టేషన్‌ ఉంది. స్టేషన్‌కు అరకిలోమీటరు దూరంలో ఆలయం ఉంటుంది.

రైలులో వెళ్లాలనుకుంటే హైదరాబాద్‌ నుంచి ముందుగా చెన్నై చేరుకోవాలి. అక్కడి నుంచి తిరుచిరాపల్లి వరకు మరో రైలులో చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులో, క్యాబ్‌లో శ్రీరంగం చేరుకోవచ్చు.

విశాఖపట్టణం నుంచి విజయవాడ మీదుగా చెన్నై చేరుకుని అక్కడి నుంచి తిరుచిరాపల్లి చేరుకోవచ్చు.

హైదరాబాద్‌ నుంచి చెన్నై దూరం 770 కి.మీ. స్లీపర్‌క్లాస్‌ చార్జీ రూ.395. ప్రయాణ సమయం 15 గంటలు.

విశాఖపట్టణం నుంచి చెన్నై దూరం 781కి.మీ స్లీపర్‌క్లా్‌సచార్జీ రూ. 425.ప్రయాణ సమయం 15 గంటలు.

చెన్నై నుంచి తిరుచిరాపల్లి దూరం 350 కి.మీ స్లీపర్‌క్లాస్‌ చార్జీ రూ.215.ప్రయాణ సమయం 5.30 గంటలు.

దర్శనవేళలు

సాధారణ దర్శనం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.15 వరకు తిరిగి సాయంత్రం 6 నుంచి 6.45 వరకు పూజ జరుగుతుంది.ఈసమయంలో దర్శనానికి అనుమతించరు. ఉదయం 6గంటల నుంచి 7.15 వరకు విశ్వరూప సేవ ఉంటుంది. ఈ సేవలో పాల్గొనాలనుకుంటే రూ.50టిక్కెట్‌కొనుగోలు చేయాలి. శీఘ్రదర్శనం కావాలనుకుంటే 250 టిక్కెట్‌ కొనుగోలు చేయాలి.


వసతి

వసతి సౌకర్యాలకు ఇబ్బంది లేదు. దేవాలయ వసతి గృహాలున్నాయి. ప్రైవేటు హోటల్స్‌, లాడ్జీలు ఉన్నాయి. దేవాలయం ప్రధాన ప్రవేశ ద్వారంకు సమీపంలోనే హోటల్స్‌ ఉన్నాయి. వసతి, భోజనంకు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. కావాలనుకుంటే దర్శనం చేసుకుని తిరిగి తిరుచిరాపల్లి వెళ్లి స్టే చేయవచ్చు. 

అక్కడ ఐదు నక్షత్రాల హోటల్స్‌ నుంచి సాధారణ లాడ్జీల వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి.


   శ్రీరంగనాధస్వామి నమో నమః🙏🌹


    👉సేకరణ:-

      🌿#శుభమస్తు🌿

 🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

కామెంట్‌లు లేవు: