16, సెప్టెంబర్ 2023, శనివారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 40*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 40*


శ్రీరామకృష్ణుల మనోఫలకంపై నరేంద్రుని భవిష్యత్తు దేదీప్య మానమైన చిత్తరువులా ద్యోతకమయింది. సమావేశానంతరం ఆయన ఇలా అన్నారు: "ఏ శక్తితో కేశవ్ లోకప్రసిద్ధుడై ప్రశంసలందుకొంటున్నాడో అలాంటి పద్దెనిమిది శక్తులు నరేంద్రునిలో పరిపూర్ణ స్థితిలో నెలకొని ఉండడం చూశాను! కేశవ్ లోనూ, విజయ్ లోనూ జ్ఞానప్రకాశం ఒక దీపంలా మాత్రమే ప్రకాశిస్తూన్నది. కాని నరేంద్రుణ్ణి చూస్తే, అతడి హృదయంలో జ్ఞానభాస్కరుడే ఉదయించి ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశం, మాయను ఆసాంతం తుడిచివేసింది.”


మరొకసారి ఇలా అన్నారు.... 


“నరేంద్రుడు అత్యున్నత స్థితికి చెందినవాడు. మగతనం గలవాడు. ఎందరో భక్తులు ఇక్కడకు వస్తూవుంటారు. కాని మచ్చుకు ఒక్కరు కూడా అతడి మాదిరి లేరు. ఇక్కడకు వస్తూవున్న భక్తుల గురించి అప్పుడప్పుడు నేను యోచించడం కద్దు. వారిలో కొందరు దశదళ పద్మాలు, కొందరు శతదళ పద్మాలు, కాని నరేంద్రుడో సహస్రదళ పద్మం, తక్కిన భక్తులు కుండలు, కడవలు; నరేంద్రుడు పెద్ద గంగాళం. తక్కిన వారు చిన్న నీటి గుంటలు; నరేంద్రుడు హాల్దార్పుకూర్ లాంటి పెద్ద చెరువు. తక్కినవారు చిన్న చిన్న చేపలు; నరేంద్రుడు ఎర్రటి కళ్లుగల పెద్ద బాడిస చేప.”


శ్రీరామకృష్ణులు ముఖతా ఇలాంటి ప్రశంసలు వింటే ఆంతరిక ప్రకాశం కొరవడిన దుర్బలుడు, అహంకారంతో కన్నూమిన్నూ తెలియకుండా గంతులు వేస్తాడు. నరేంద్రుని విషయంలో ఈ మాటలు పూర్తిగా మరో విధమైన ప్రభావాన్ని చూపాయి. అసాధారణమైన అంతర్ముఖ స్థితిలో ఉండే అతడి మనస్సు లోలోతులకు పోయి కేశవ్, విజయ్ ఎనలేని సుగుణాలతో తన అప్పటి స్థితిని పోల్చి చూసింది. అంతటి ప్రశంసలకు తాను తగననుకొన్న నరేంద్రుడు శ్రీరామకృష్ణుల వాక్కులను నిరసించాడు: 


“ఏమంటున్నారు? ఇది వింటే లోకులు మిమ్మల్ని పిచ్చివాడంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేశవ్ సేన్ ఎక్కడ? మహాత్ముడైన విజయ్ గోస్వామి ఎక్కడ? ఏమీలేని పాఠశాల విద్యార్థినయిన నే నెక్కడ? వారితో నన్ను పోల్చకండి, దయచేసి ఇలా మాట్లాడకండి" అన్నాడతడు. కాని నరేంద్రుని నిరసనను శ్రీరామకృష్ణులు పట్టించుకోలేదు. అది ఆయనకు సంతోషాన్నే కలిగించింది. ఆప్యాయంగా ఆయన ఇలా అన్నారు:


 “నాయనా! నేనేం చేయగలను? ఈ మాటలు నేను పలుకుతున్నానని అనుకొంటున్నావా నువ్వు? జగజ్జనని నాకు. దర్శింపజేసింది. నేను చెప్పాను. ఆమె సత్యం తప్ప మరేదీ దర్శింపజేయదు. అందువల్లనే అలా మాట్లాడాను.”🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: