16, సెప్టెంబర్ 2023, శనివారం

నవగ్రహ పురాణం - 56 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 56 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿


*కేతుగ్రహ జననం - 1*



నారదమహర్షి ఆకాశమార్గాన ప్రయాణం చేస్తూ హిమాలయ ప్రాంతంలో నేల మీదికి దిగాడు. ఆయన రాకకోసమే నిరీక్షిస్తున్నట్టు భూదేవి ఆయన ముందు నిలబడింది. *"మాతా !"* నారదమహర్షి ఆశ్చర్యంగా అన్నాడు.


*"ఆకాశ మార్గాన నిన్ను చూశాను నారదా ! నింగి నుండి నేలకు దిగుతావేమో అని ఎదురు చూస్తున్నాను...”* *“నారాయణ ! జనని ముఖాన ఏదో విచారం..."* నారదుడు భూదేవిని చూస్తూ అన్నాడు.


*"విచారం లేకుండా ఎలా ఉంటుంది నారదా ! అందరి భారమూ సహించి , మోయాల్సింది నేనే కదా ! సృష్టికర్త సృజన నిర్విరామంగా సాగుతోంది. ఫలితంగా మను సంతతి నా మీద ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. నా మీద భారం మోయలేనంతగా పెరిగింది నారదా ! నువ్వు వెంటనే వెళ్ళి ఆ బ్రహ్మదేవుడికి నా బాధ వివరించు. నా భారాన్ని తగ్గించే యోచన చేయమను !"*


*"నారాయణ ! భూభారం పెరిగితే ప్రమాదమేనని మా జనకులూ , ఆయన జనకులూ అనుకుంటూ ఉంటే విన్నాను ! ఇప్పుడే సత్యలోకానికి వెళ్తాను !"* అంటూ నారదుడు నింగికి ఎగిరాడు.


నారదుడు బ్రహ్మ దర్శనం చేసుకున్నాడు. భూమి ఉపద్రవాల అంచుకు చేరిందనీ , అందుకు కారణం ప్రాణుల సంఖ్య భయంకరంగా పెరిగిపోవడమేననీ వివరించాడు. భూదేవి సందేశాన్ని వినిపించాడు.


*"సమస్య తీవ్రమైందే , కుమారా !"* బ్రహ్మ సాలోచనగా అన్నాడు.


*"కొంత కాలం సృష్టి కార్యానికి విరామం ఇస్తే...”* నారదుడు సూచించాడు. 


సరస్వతి చిన్నగా నవ్వింది. *"దాని వల్ల ప్రయోజనం లేదు , నారదా ! ఇప్పటికే ఉన్న ప్రాణుల వల్లనే కదా భూభారం పెచ్చు పెరిగింది !”*


*“ఔను ! ఉన్న ప్రాణుల సంఖ్య పెరగకుండా చూడటం ప్రస్తుత సమస్యకు పరిష్కారం కాదు , కుమారా ! ఉన్న సంఖ్య తరగాలి !"* బ్రహ్మ ఆలోచిస్తూ అన్నాడు.


*"ప్రాణుల సంఖ్య తగ్గించడానికి ఏం చేయాలో తీవ్రంగా ఆలోచించాలి. ఆలోచిస్తాను !"* బ్రహ్మ మళ్ళీ అన్నాడు. *"నువ్వు వెళ్ళి భూమాతకు తెలియజేయి నారదా !".* 


*"ఆజ్ఞ!"* అన్నాడు నారదుడు.


బ్రహ్మ ఆలోచనా సముద్రంలో మునిగిపోయాడు. కాలం గడుస్తోంది కానీ , ఆయనకు పరిష్కారం తట్టలేదు. దాంతో ఆయనలో ఆగ్రహం పెచ్చరిల్లింది. మితిమీరిన ఆయన ఆగ్రహం వల్ల ఆయన నాలుగు ముఖాల నుండి అగ్ని జ్వాలలు వెలువడ్డాయి. ఆ మంటల మూలంగా ప్రాణులకే కాకుండా , లోకాలలోని అచేతన పదార్థాలకూ ప్రమాదం ఏర్పడింది. సకల లోకాలలో సర్వనాశనం తాండవం చేసే పరిస్థితి తలయెత్తింది. బ్రహ్మ తన తీవ్రాలోచనలో ఉండిపోయాడు.


బ్రహ్మ ముఖాల నుండి వెలువడే అగ్నిజ్వాలల ప్రమాదాన్ని ఊహించిన పరమశివుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆలోచనా ధ్యానాన్ని భగ్నం చేశాడు.


*"సృష్టికర్తా ! మీ ఆలోచనను ఉపసంహరించి , తద్వారా అగ్నికీలలను అణగార్చండి. మీ కర్తవ్యం సృష్టి ; సంహారం కాదు !"* శివుడు అన్నాడు.  *"ఆ సంహార కార్యానికి మరొక తగిన శక్తిని సృష్టించండి. భూభారాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రాణుల సంఖ్యను నియంత్రించడానికి మీరు చేయాల్సిన పని అది మాత్రమే. ఇక , నేను సంహారకర్తను , లయకారకుణ్ణి. నా విధి కూడా చంపడం కాదు. చనిపోయిన ప్రాణులకు విశ్రాంతి ప్రసాదించడం !".*


పరమశివుడి సూచన సృష్టికర్తకు నచ్చింది. శ్రీహరి ఉద్దేశం కూడా అదే ! తాను కేవలం సృష్టికర్త ! తన విద్యుక్త ధర్మం ప్రాణులను పుట్టించడం , చంపడం కాదు !


ఆలోచనలను ఉపసంహరించిన బ్రహ్మలోంచి ఒక స్త్రీ మూర్తి ఆవిర్భవించింది. ఆమె శరీరం ఎరుపు , నలుపు , పసుపు వర్ణాల మేళవింపులో ఉంది. ఆవిర్భవించిన వెంటనే ఆమె దక్షిణం వైపు అభిముఖంగా నిలుచుంది.


*“నేనెవరు ?"* అందామె బ్రహ్మను చూస్తూ.


*“నీ పేరు మృత్యువు ! ఒక మహాకార్యనిర్వహణ కోసం నిన్ను సృష్టించాను. సృష్టిలోని ప్రాణులను సంహరించడమే నీ కర్తవ్యం. వెళ్ళు ! ఆ కార్యంలో నిమగ్నురాలివై పో !"* అన్నాడు బ్రహ్మ.


బ్రహ్మ వాక్కు వినగానే మృత్యువు దీనంగా ఏడవడం ప్రారంభించింది. ఆమె కళ్ళల్లోంచి అశ్రువులు జలజల రాలాయి. బ్రహ్మ ఆ కన్నీటి బిందువులను తన దోసిట్లో పట్టుకున్నాడు.


*"నన్ను క్షమించండి. ప్రాణులను చంపడం అధర్మం. ఆ పనిని నేను చేయను. వెళ్తున్నాను ! తపస్సు చేసుకుంటాను !"* అంటూ , మృత్యువు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. 


బ్రహ్మ పరమశివుడి వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు. శివుడు చిరునవ్వు నవ్వాడు. *"స్త్రీ సహజమైన వాత్సల్య లక్షణంతో మృత్యు దేవత అలా అంది. నెమ్మదిగా ఆమెకు నచ్చజెప్పి , కార్యోన్ముఖురాలిని చేయండి !”*


బ్రహ్మ వద్ద నుండి వెళ్లిపోయిన మృత్యుదేవత 'ధేనుకాశ్రమం' అనే ప్రదేశంలో తపస్సు ప్రారంభించింది. కొన్నాళ్ళు జరిగాక బ్రహ్మదేవుడు ఆమె ముందు సాక్షాత్కరించాడు.


*“స్వామీ...”* అంది మృత్యువు ఆశ్చర్యంగా.


*“నీకు నిర్దేశించిన కార్యక్రమానికి నిన్ను నువ్వు అంకితం చేసుకునే దాకా , నేను నీకు ప్రత్యక్షమవుతూనే ఉంటాను. నీ ఆవిర్భావానికి మూలం ప్రాణుల సంహార సంకల్పం. ఆ సంకల్పం వికల్పం కాకూడదు ; కాదు. ఈ విధి నీకు విధిస్తున్న విధి నుండి నువ్వు తప్పించుకోలేవు !"* బ్రహ్మ మృత్యువు ముఖంలో గూడుకట్టుకుంటున్న విచారాన్ని చూస్తూ క్షణకాలం ఆగాడు.


*"మృత్యుదేవీ ! జాగ్రత్తగా ఆలకించు. నీ చేతులతో నువ్వు ప్రాణులను వధించే అవసరం ఉండదు. ఆ రోజు నువ్వు కన్నీళ్ళు కార్చావు. ఆ అశ్రువుల్ని నేను దోసిట పట్టుకున్నాను. గుర్తుంది కదా ! ఒక్కొక్క అశ్రుకణం ఒక్కొక్క రోగంగా రూపొంది , ప్రాణులను మరణాలకు తరలిస్తాయి. ఆ కార్యాన్ని అధివీక్షించి , క్రమ పరచడమే నీ విధి. నా ఆదేశాన్ని శిరసా వహించు. నీ విధిని స్వీకరించు. కర్తవ్యాన్ని ఆచరించడం ప్రారంభించు !"* అన్నాడు గంభీరంగా బ్రహ్మ.


నిరాకరించలేని తన నిస్సహాయత అర్థమైందా మృత్యుదేవతకు. ఆ ఆలోచన కలిగిన మరుక్షణం ఆమెలోంచి వేడి నిట్టూర్పూ సెగలు కక్కుతూ వెలువడింది. పతాకాల ఆకారంతో వెలువడిన ఆ నిట్టూర్పులోంచి ఒక బాలుడు ఆవిర్భవించాడు.


బ్రహ్మ ఆ బాలుణ్ణి చిరునవ్వుతో చూసి , చూపుల్ని మృత్యువు వైపు మరల్చాడు. *“నీ మూలంగా ఈ బాలుడు జన్మించాలన్న ఆశయంతోనే , నిన్ను ఆనాడు నా సన్నిధి నుండి వెళ్ళనిచ్చాను. ఈ బాలుడు నీ కుమారుడు !"*


బ్రహ్మమాటలు వినగానే మృత్యువు బాలుణ్ణి చేతుల్లోకి తీసుకొని ఎదకు హత్తుకుంది. *"కేతువు ఆకారంలో జన్మించిన నీ కుమారునికి 'కేతువు' అని నామకరణం చేస్తున్నాను. బాలకుణ్ణి పెంచి , పెద్దవాణ్ణి చేయి !”* అన్నాడు బ్రహ్మ.


మృత్యువు తలను అడ్డంగా ఊపింది. *"నా కర్తవ్యం కఠినాతి కఠినమైంది. పుత్రపోషణకూ , దానికీ సమన్వయం కుదరదు ; కుదుర్చుకోలేను. బాలకుణ్ణి మీరే స్వీకరించండి !"*


బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. *"నీ సమస్యకు చక్కటి పరిష్కారం ఉంది. నీ కేతువు రాక్షస లక్షణాలతో జన్మించాడు. రాక్షస సంతతిని పొందిన కశ్యప ప్రజాపతి ఆ బాలకుణ్ణి పెంచడానికి తగినవాడు. కశ్యపుడు నీ పుత్రుడిని తన పుత్రుడిగా స్వీకరించి , పోషిస్తాడు. 'కేతువు' కశ్యపుడికి అందేలా చూడు !"*


*"ధన్యోస్మి !”* అంది మృత్యువు కేతువును ముద్దుపెట్టుకుంటూ.

కామెంట్‌లు లేవు: