21, నవంబర్ 2023, మంగళవారం

ఆశీర్వాదం

 *ఆశీర్వాదం..*


ఒక ఆదివారం నాటి ఉదయం ఎనిమిది గంటల వేళ..శ్రీ స్వామివారి మందిరానికి ఒక కుటుంబం వచ్చింది..బాగా వయసు పైబడిన వృద్ధ దంపతులు..మధ్యవయస్కులు..అలా రెండుతరాలకు చెందిన వ్యక్తుల లాగా అగుపించారు..ఆ వృద్ధ దంపతులను మెల్లిగా నడిపించుకుంటూ తీసుకువచ్చి నేను కూర్చున్న చోటుకి ఓ ప్రక్కగా కుర్చీలలో కూర్చోబెట్టారు.."మా అమ్మా నాన్న గార్లు..ఎక్కువసేపు నిలుచోలేరు..మేము స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు వీళ్ళను తీసుకెళతాము..లోపల భక్తులు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు వున్నారు..అందరూ వెళ్లిపోయిన తరువాత..మేము దర్శనం చేసుకుంటాము.." అని ఏదో సంజాయిషీ ఇస్తున్నట్టు గా వాళ్ళ అబ్బాయి చెప్పాడు.."పర్లేదు లెండి..మరో అరగంటలో లోపల ఖాళీ అవుతుంది..మీరు దర్శనం చేసుకోవచ్చు.." అన్నాను..


ఈలోపల ఆ పెద్దాయన నన్ను చూసి.."బాబూ..శ్రీధరరావు గారు నీకు తెలుసా..?" అన్నారు.."మా తండ్రి గారు.." అని చెప్పాను.."నువ్వు శ్రీధరరావు కుమారుడివా..? చాలా సంతోషం.." అన్నారు.."మీరెక్కడినుండి వస్తున్నారు?..మీకు మా నాన్నగారు తెలుసా?.." అని అడిగాను..తాను కూర్చున్న చోటునుంచి లేచి వచ్చి నా ప్రక్కన కూర్చున్నారు.."ఒక్కొక్కసారి సరిగా వినబడదు..అందుకని నీకు దగ్గరగా కూర్చున్నాను..మీ నాన్నగారిని నాకు చెక్కా కేశవులు గారు పరిచయం చేశారు..కేశవులు గారిది..మాది..ప్రక్క ప్రక్క ఊళ్లే..కేశవులు గారు విజయవాడ లో స్థిరపడ్డారు..నేను కూడా వ్యాపారమే చేసాను కానీ..ఎక్కువ రోజులు నాగపూర్ లో వున్నాను..ఒకసారి మా ఊరు వెళదామని విజయవాడ వచ్చాను..కేశవులు గారు తాను కూడా వస్తానని చెప్పి..నాతో పాటు బయలుదేరారు..ఇద్దరమూ రైల్లో ఒంగోలు వచ్చాము..అక్కడనుండి పామూరు బస్సు ఎక్కాము..అప్పుడు చెప్పాడు..మాలకొండలో ఒక యోగి తపస్సు చేసుకుంటున్నాడు..ఇప్పుడు ఆయనను చూసి వెళదాము అన్నాడు..సరే అన్నాను..ఇద్దరమూ మాలకొండలో బస్సు దిగి పార్వతీదేవి మఠం వద్దకు నడచి వెళ్ళాము..అప్పటికి సమయం సాయంత్రం నాలుగు గంటలు అవుతోంది..పార్వతీదేవి మఠం వద్ద కొద్దిసేపు కూర్చున్నాము..ఈలోపల స్వామివారు శివాలయం వైపు నుండి దిగి వచ్చారు..కేశవులు గారు నమస్కారం చేశారు..నేనూ నమస్కారం చేసాను..స్వామివారు మమ్మల్ని కూర్చోమన్నట్టు సైగ చేశారు..ఇద్దరమూ కూర్చున్నాము.."స్వామీ..ఈయన నా మిత్రుడు..మా ప్రక్క ఊరే..పేరు..నరసింహారావు..మేము చనువుతో నరసయ్యా అని పిలుస్తాము..వ్యాపారం చేస్తున్నాడు..చాలా దూరం లో ఉంటున్నాడు..తన ఊరుకు వెళుతుంటే..నేను కూడా మా ఊరికి వెళుతున్నాను..కలిసివేళదాము అని చెప్పి వెంటబెట్టుకొని వచ్చాను.." అన్నాడు..కేశవులు గారు చెప్పిందంతా స్వామి చిరునవ్వుతో అంతా విన్నాడు..నా వైపు చూసి.."బాగున్నావా?" అన్నాడు..బాగున్నాను అన్నాను..పార్వతీదేవి విగ్రహం ముందున్న కుంకుమ ను చేత్తో తీసుకొని..కేశవులు నుదుటి మీద..నా నుదుటి మీద బొట్టు లాగా పెట్టాడు.."నరసయ్యా..వ్యాపారం చేసుకో..కేశవులు లాగా ధర్మం తప్పకుండా చేసుకో..వృద్ధి లోకి వస్తావు.."అన్నాడు..చేతులెత్తి నమస్కారం చేసాను..నవ్వుతూ చూసాడు..ఆ తరువాత ఒక అరగంట స్వామివారు కేశవులు గారు మాట్లాడుకున్నారు..ఆ తరువాత తిరిగి వచ్చేసాము..రెండు రోజుల తరువాత..కేశవులు గారే నాకు మీ నాన్న ను పరిచయం చేశారు..ఆరోజు మొగలిచెర్ల లో మీ ఇంట్లో మీ అమ్మగారు మాకు భోజనం పెట్టింది..ఆరోజు సాయంత్రం తిరిగి వెనక్కు వచ్చేసాము..ఆ తరువాత నేను నాగపూర్ వెళ్ళాను..స్వామి చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి..నేను ఎవ్వరికీ అపకారం చేయకుండా..నాకు తెలిసి ఎటువంటి అన్యాయం చేయకుండా వ్యాపారం చేసాను..స్వామివారిని మళ్లీ ఒకసారి కూడా కేశవులు గారితోనే..ఇక్కడ కలిశాను..ఆరోజు కూడా నన్ను ఆశీర్వదించాడు..మీ అమ్మ చేతి భోజనం చేసాను..స్వామివారు చెప్పినట్టుగానే నా వ్యాపారం..నా పిల్లలు వృద్ధిలోకి వచ్చారు..ఇద్దరు సంతానం..అమ్మాయి ఢిల్లీ లో కాపురం ఉంటుంది..మా అబ్బాయి నా వద్దే స్థిరపడ్డాడు..మేము తెలుగు వాళ్ళం అంటే అక్కడ ఎవ్వరూ నమ్మరు..అంతగా కలిసిపోయాము..మా అబ్బాయికి మా ఊరు చూపించాలని ఒక కోరిక..ఇన్నాళ్లకు తీరింది..అట్లానే నన్ను ఆరోజు ఆశీర్వదించిన ఈ స్వామివారి మందిరం చూడాలని అనిపించింది..అందుకే..మా ఊరు నుండి తిరిగి వెళుతూ..ఇటు వచ్చాము..కేవలం రెండుసార్లు ఆ మహానుభావుడిని దర్శించుకుని..ఆయన చేతితో నా నుదుటి పై బొట్టు పెట్టించుకున్నాను..నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు..మీ తల్లిదండ్రులు..కేశవులు గారు..ఈ ఆశ్రమం కట్టించిన మీరాశెట్టి గారు ధన్యులు.." అన్నారు..


స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించి..ఆశీర్వాదం పొందిన నరసయ్య గారి కుటుంబానికి స్వామివారి సమాధిని దగ్గరుండి దర్శనం చేయించాను..మరో గంటసేపు మందిరం వద్ద వుండి..వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..శ్రీ స్వామివారు జీవించి ఉండగా చూసి తరించిన వారు..అప్పుడప్పుడూ మందిరానికి వస్తుంటారు..వారి అనుభూతులను వినడం కూడా ఒక అదృష్టమే..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: