21, నవంబర్ 2023, మంగళవారం

ఋతుక్రమం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*ఋతుక్రమం..ఊర్ధ్వ, అధో లోకాల వివరణ..*


*(ముప్పై నాలుగవ రోజు)*


శ్రీ స్వామివారు ఏదో ముఖ్యమైన విషయం గురించి వివరించబోతున్నారని శ్రీధరరావు దంపతులకు, సత్యనారాయణమ్మ గారికీ అర్ధమైంది..


"స్త్రీలైనా..పురుషులైనా..పశుపక్ష్యాదులైనా.. క్రిమికీటకాలైనా..శరీరధారణ ఉన్న ప్రతి జీవికీ..ఆకలి దప్పులు.. నిద్ర, మైధునం.. ఋతుక్రమం..సంతానోత్పత్తి..మల, మూత్ర, స్వేద, కఫ, అపానవాయు విసర్జన అన్నది తప్పనిసరిగా ఉంటుంది..వీటిలో ఏ ఒక్క ధర్మాన్నీ..ఏ జీవీ తప్పించుకోలేదు..ఏ ఒక్కటి సరిగ్గా జరుగాకపోయినా..ఆ జీవి అనారోగ్యం పాలు కావటమో.. లేదా ఏదో లోపంతో బాధపడటమో జరుగుతుంది..అవునా?..ఇక మానవమాత్రుల విషయానికి వస్తే..స్త్రీలకు బహిష్టు అనేది సహజమైన శారీరిక ధర్మం!..మల మూత్ర విసర్జన..శరీరానికి చెమట పట్టటం..జలుబు చేస్తే..ముక్కులోంచి చీమిడి రావడం..దగ్గు వచ్చినప్పుడు కళ్ళే రావడం..ఎంత సహజమో..ఇదీ అంతే సహజం!..అవన్నీ అపవిత్రం కానప్పుడు..ఇది అపవిత్రం ఎలా అవుతుంది?..మానవ శరీరం ఒక మహా అద్భుత లోకం.." అంటూ అనర్గళంగా చెపుతూ ఒక్కక్షణం ఆగి ..ప్రభావతి గట్టి వైపు చూసి..


"తల్లీ!..అసలు సప్త సముద్రాలు..పోనీ పద్నాలుగు లోకాలు అంటే ఏమిటో చెప్పమ్మా.." అని అడిగారు..


"నాయనా!..ఇలా గబుక్కున చెప్పమంటే చెప్పలేను కానీ..భూమి క్రింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలనీ..భూమికి పైన..స్వర్గలోక,  సువర్ణలోక, భువర్ణలోక, సత్యలోక, తపోలోక, బ్రహ్మలోక..ఇలా చెపుతారు..వాటి క్రమం ఎలా ఉంటుందో గుర్తులేదు..చదివి చాలా రోజులైంది.."  అన్నారు ప్రభావతి గారు..


"అవునమ్మా..అలానే చెపుతారు..అయితే అవన్నీ మనిషి శరీరం లోనే ఉన్నాయి తల్లీ బాగా ఆలోచిస్తే..సప్త సముద్రాలు అంటే..లవణ, క్షీర, రక్త, స్వేద, జీర్ణకోసం లోని ఆమ్లాలు..నోటిలోని లాలాజలం ఇలా చెప్పుకోవచ్చు..అలాగే నీవు చెప్పిన ఊర్ధ్వ, అధో లోకాలకు కూడా మానవదేహమే నిలయం..మాలాంటి యోగులు, మనో నేత్రాలతో..యోగసిద్ధితో చూస్తాము వాటిని..మేము చెపితే సత్యమని నమ్మి, చిత్తశుద్ధితో ఆలోచిస్తే తప్ప తెలుసుకోలేరు మీరు!.."


"చూడు తల్లీ!..శరీరాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తే..నాభి అనేది భూలోక స్థానం..అటు పైలోకాలకు, ఇటు క్రింది లోకాలకు నాభి ఆధారభూతం..నాభి నుండి క్రింది భాగం..ఆకలి దప్పులకు.. జీర్ణకోశానికి, ప్రాణీ జన్మస్థానానికి..మల మూత్ర విసర్జనకు..ప్రాణీ కదలికలకు..సృష్టి కార్యానికి ఆధారం..ఉదాహరణకు..మీరు ఏ రైల్లోనో..బస్సులోనో ప్రయాణం చేస్తున్నారు..లేదా ఎక్కడో ఒకచోట ముఖ్యమైన పనిలో ఉంటారు..హఠాత్తుగా మల మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది..అవకాశం లేదనుకోండి..అప్పుడేం చేస్తారు?..ఒక గంట పాటో.. అరగంట పాటో..లేదా మీరు ఆపుకోగలిగినంత సేపు ఆపుకుంటారు..అవునా?..అంటే..నీ శరీరం లోనే ఒక మరుగుదొడ్డి ఉంది..నీ వెంటే మోసుకుపోతున్నావు..మళ్లీ అవకాశం రాగానే..విసర్జిస్తారు..శరీరం లోని ఆ భాగం ఖాళీ అవుతుంది..ఒక క్రమబద్ధమైన ఏర్పాటు శరీరం లో వుండన్నమాట!..అవగతం అవుతోందా?..అందుకే నాభి నుండి క్రింది భాగాలను అధోలోకాలు అనవచ్చు..ప్రతి ప్రాణీ పుట్టుకా అధోలోకాల నుండే జరుగుతుంది..అలాగే ఈ బహిష్టు కూడా..శరీరం లోపల తయారవుతున్న మకిలి..అవసరమైన మంచి రక్తం నీలోనే ఉంచబడి..చెడు రక్తం బహిష్టు రూపం లో బైటకు వెళ్ళిపోతుంది..దానికి రకరకాల పేర్లు పెట్టి..ఇంటికి దూరంగా ఉంటారు.."


"ఇక ఊర్ధ్వ లోకాలు..నాభి పై స్థానాలు..రక్తప్రసరణకు ఆధారమైన గుండె..నాడీమండలం..ఆలోచనకు మెదడు..శిరస్సు..రుచులు ఆస్వాదించే నాలుక..మాట్లాడటానికి నోరు..ధ్వనిని గ్రహించే చెవులు..దృష్టి తెలుసుకునే కళ్ళు.. ఇవి..వీటినే ఊర్ధ్వలోకాలుగా భావించండి..నీ ఆలోచన సక్రమంగా  ధర్మబద్ధంగా వుంటే..నీ శరీరం ధర్మమార్గంలో పయనిస్తుంది..అవి వక్రంగా వుంటే..జీవితమే గతి తప్పుతుంది.."


"యోగులు ఇంద్రియ నిగ్రహం..రాజయోగం..గుహ్యప్రదేశం నుండి..మూలాధారం మొదలు సహస్రారం వరకూ కొనసాగిస్తారు..అంటే జీవి అధోలోకం నుండి..నాభి దాటి..ఊర్ధ్వలోకాలను తెలుసుకొని..ఆత్మజ్యోతిని దర్శించటం అన్నమాట!..ఇది మానవ దేహం లోనే ఉన్న ఊర్హ్వ అధోలోకాల గురించి క్లుప్తంగా ఇస్తున్న వివరణ.." 


"ఇక అసలు విషయానికి వద్దాము..పెద్దలు ఏ ఆచారాన్నీ అనవసరంగా పెట్టరు.. ప్రతి దానికీ ఒక సహేతుకమైన కారణం ఉంటుంది..అదేమిటో వివరిస్తాను..శ్రద్ధగా వినండి.." అన్నారు..


శ్రీ స్వామివారు చెప్పబోయే వివరణ కోసం ఆతృతగా ఎదురుచూడసాగారు ఆ ముగ్గురూ..


ఋతుక్రమం..ఆచారం..మరింత వివరణ.. రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: