శ్రీ సూర్యనారాయణాయ నమః.
సీ.
కరము దీప్తిదమైన కరసహస్రముతోడ
ధరవారి ననిశంబు దనుపువాడు,
గ్రహరాజు తానౌచు నహరహమ్మును మిత్ర
కోటి కానందమ్ము కూర్చువాడు,
ద్యుమణియై నభమందు తోరంపు సౌందర్య
మొప్పు మీరగ దెల్పు చుండువాడు,
ధ్వాంతశక్తిని గూల్చి తానొక్కడై నిల్చి
వందనమ్ములు నిత్య మందువాడు
తే.గీ.
సూర్యనారాయణుం డంచు సూరికోటి
పిలుచుచుండెడి వాడెంచ నిలకు సతము
కర్మసాక్షిగ ధర్మంబు గరపువాడు
తరణి భానుండు ప్రత్యక్షదైవ మతడు.
కం.
వందనము సూర్యదేవా!
వందన మో యరుణ! మిత్ర! వందనము హరీ!
వందనము లోకబాంధవ!
వందన మిదె స్వీకరించ వలె తిమిరారీ!
హ.వేం.స.నా.మూర్తి.
28.07.2024.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి