28, జులై 2024, ఆదివారం

మాతృదినోత్సవ సందర్భంగా...

 మాతృదినోత్సవ సందర్భంగా...


అమ్మ కెవరు సాటి అవనియందు!

----------------------------

ఆ.వె.

అమ్మ పెట్టు బువ్వ అమృతోపమానము;

ప్రేమ యనెడి తేనె వేసి కలిపి

కొసరి కొసరి పెట్టు కొడుకుకూతుళ్లకు!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

ఉన్న 'కొద్దిపాటి' అన్నమంతయు కల్పి

ప్రేమతోడ బెట్టు పిల్లలకును;

"లేదు ఆకల"నుచు లేచిపోవును తాను!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

అరువదేళ్లు వచ్చి అవ్వతాతలు నైన 

పిల్లవాళ్లె తల్లి కళ్ల కెపుడు!

తల్లి ప్రేమ మనకు తరగని పెన్నిధి!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

తండ్రి కోపగించి తా కొట్టబోవగా

అమ్మ అడ్డు వచ్చి ఆదుకొనును!

ఈగనైన మీద మూగనీకుండురా!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

ఉగ్గుపాలు బోసి ఉయ్యాలలో నూపి

నిద్రపుచ్చి నిన్ను భద్రముగను

నిద్ర లేని రేలు నినుగూర్చి గడిపెరా!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

చేయి చాచి తాను చేరబిల్చుచు నీవు

అడుగు అడుగు వేయ అమ్మ నేర్పె!

నేర్పినట్టి విద్య నిన్నెత్తునన్నిల్పె!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

కాస్త సుస్తి చేయ కలవరపడిపోవు;

వేయి మ్రొక్కులిడును వేల్పులకును;

సంతు మీది ప్రేమ యెంతొ చెప్పగ లేము!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

అమ్మ "బొమ్మ"నిచ్చి ఆటలాడగ జేసి

తనయ కపుడె "అమ్మతనము" నేర్పి

భావి మాత కొఱకు బాటను చూపించు!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

కొంత వయసు వరకు సంతు చేసిన యట్టి

మలము మూత్రములను తొలగ దీసి

మురికి కడిగి యెత్తి ముద్దులాడును కదా!

అమ్మ కెవరు సాటి అవని యందు!


ఆ.వె.

అక్షరాలు నేర్పి 'అమ్మ' 'ఆవ'ని వ్రాయ

అమ్మ సంతసించు నమితముగను!

భవితలోని వారి బాగును దలపోయు!

అమ్మ కెవరు సాటి అవని యందు!


----------కోడూరి శేషఫణి శర్మ

కామెంట్‌లు లేవు: