21, మార్చి 2025, శుక్రవారం

ప్రియ బాంధవా మేలుకో 16*

 *ప్రియ బాంధవా మేలుకో 16*




శాస్త్ర, సాంకేతిక, విద్యా, ఆర్థిక రంగాలలో భారత దేశం ఎంత పురోగమిస్తున్నా, చట్ట పరమైన నిబంధనలు ఎన్ని అమలుచేస్తున్నా దిన దినము వ్యక్తిగత, సామాజిక అవినీతి మరియు నేరాలు పెరుగుటకు కారణాలు పెద్దలు అన్వేషించాలి. 


లెక్కకు మించిన క్రిమినల్ కేసులలో నిందితులైన వారిని, సాంఘికంగా దుశ్చరిత్ర కలవారిని తమ పార్టీ ప్రతినిధులుగా ఎన్నికలలో అభ్యర్థులుగా ఎంపిక చేసే

 *దుర్నీతి రాజకీయ* పార్టీలు వేళ్లూనుకున్న సమాజంలో మనం జీవిస్తున్నామన్న స్పృహ ప్రజలకు (సామాన్యులు + మాన్యులు)  ఉండాలి. *మేథోప్రజ నిద్ర నటిస్తే* చట్టాలను ఉల్లంఘించే వారు *శాసన కర్తలవుతున్నారు* అంటే ఆశ్చర్యానికి తావులేదు, నేర గ్రస్థ రాజకీయ నేపథ్యంలో ఇవన్నీ సాధ్యమే. 


సాక్షుల అకారణ మరణాలు, హత్యలు, ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభత్వ అధికారుల అనైతిక ప్రాబల్యాలు, తాబేదారుతనం ప్రజలు గమనిస్తున్నారు. 


హత్యా ప్రయత్నాలు, హత్యలు, అత్యాచారాలు, అపహరణలు, కుంభకోణాలు, స్కాంలు, వీటిపై నత్తనడక విచారణలు, దర్యాప్తులు, న్యాయస్థానాలలో ఏళ్ల తరబడి వాద వివాదాలు,  వాయిదాలపై వాయిదాలు, సుధీర్ఘ విచారణలు చివరికి *శిక్షలు జీవిత కాలం లేటు*.దేశ ద్రోహులకు, తీవ్ర వాదులకు, విదేశీ నేరస్థులకు కారాగారాలలో మృష్టాన్న భోజనాలు, రాజ మర్యాదలు.  

 

భారతీయ న్యాయ స్థానాల సామర్థ్యము కంటే మించిన వ్యాజ్యాలు. 2024 సంవత్సరపు గణాంకాల ప్రకారం భారత దేశ జనాభా మరియు న్యాయ మూర్తుల నిష్పత్తి (:) ...పది లక్షలు : ఒకటి. న్యాయ మూర్తుల నియామకాలు గూడా చాలినంతగా లేవు. 


ఏ దేశంలో లేని  మరియు ప్రపంచం అబ్బురపడే వింత... *దేశ ద్రోహులను, అరాచక మరియు తీవ్రవాదులను సమర్థిస్తూ వాదించే న్యాయవాదులు మన దేశంలోనే  కోకొల్లలు*.


దేశ  సామాజిక పరిస్థితి గురించి ఒక అవలోకనము, ప్రశ్నల రూపంలో....*దేశంలో నేర నిరోధక మరియు న్యాయ వ్యవస్థ శక్తివంతంగా ఉందా*. సాక్షుల రక్షణకు న్యాయపాలిక నిర్దేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ  *అవి యథాతథాంగా అమలవుతున్నాయా*. ఇవన్నీ ఎవరు గమనించాలి అంటే సమాజమే గమనించాలి, *అది సమాజ బాధ్యత*.


అధిక శాతం ప్రజలకు  సమాజ శ్రేయస్సు విషయమై పట్టింపులేదు, ఉండదు,  ఎందుకంటే తాము బాగున్నాము, తమ వాళ్ళు బాగున్నారు, *ఎక్కడ ఏమైతే మనకెందుకు*.  ఇంత దుర్గంధ భూయిష్టంగా ఉన్న సమాజంలో విద్యావంతులు, విజ్ఞానవంతులు మరియు ప్రజ్ఞావంతులు ప్రశాంతంగా ఉండడం లేదా ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి లోనుగావడం నాలాంటి సామాన్యులందరికీ ఆశ్చర్యకరమే.


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: