🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*భ్రమల వల్లే బాధలు*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*మనిషి శాశ్వతమనుకొని సుఖసారమనుకొని ప్రీతి పెంచుకుంటున్న జీవితంపై జగద్గురువులైన శంకరాచార్యులు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు…*
*కారణజన్ములుగా ఈ భువిపైన అవతరించిన ఆదిశంకరులు మానవ శ్రేయస్సుకు ఉపయుక్తమైన ఉపదేశాలను అమృతగుళికలుగా అందజేశారు.*
*లౌకికమైన లంపటంలో కూరుకుపోయి ఈలోకంలో స్థిరంగా ఏదో వేల సంవత్సరాలు బతికేస్తామన్న పిచ్చి భ్రమలతో అతి ప్రణాళికలు రచించుకుంటూ మూర్ఖులుగా మసలుకుంటున్నా మానవులకు ఆయన హెచ్చరికలు చేశారు.*
*కొన్నాళ్లు యాత్రికుల్లా గడపడానికి ఈలోకంలోకి అడుగుపెట్టామన్న సత్యాన్ని మరచిపోయి, స్థిరాసనాలు వేసుకునేందుకు ఆస్తులు కూడబెట్టుకునేందుకు తాపత్రపడుతున్నాం. తుదకు మనమూ వెళ్లిపోయే రోజొకటి వస్తుందని తెలుసుకోలేకపోతున్నాం. తామరాకుపై ఉన్న నీటిబిందువులా మనిషి జీవితం కూడా అతిచంచలమైంది. అయినా ఈలోకంలో మనుష్యులు రోగాలతో బాధపడుతూ, దేహాభిమానాన్ని విడువక, దుఃఖంతో చిక్కుకొని ఉంటారు. ఇలా మనిషికి శాశ్వత సుఖమే లేదని తెలుసుకోమంటున్నారు శంకరాచార్యులు.*
*ఈ సత్యం మనల్ని నిరాశలోకి నెట్టేసేందుకు చెప్పింది కాదు. వాస్తవమేంటంటే తెలుసుకొని మసలుకొమ్మని చేస్తున్న హెచ్చరిక.*
*మనం అనవసరంగా ఈ జీవితంపై పెంచుకుంటున్న మమకారం ఈ శరీర సుఖాలకోసం పడుకున్న తాపత్రయం తగ్గించుకోమనే చెప్తున్నారు. ఏ సుఖమూ శాశ్వతం కాదనీ, ఏ కష్టమూ కలకాలం ఉండదనీ, మన మనస్సు అర్థం చేసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వేగానికి లోను కాదు. మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయలేదు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు అనేవారు ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం చేసుకోవాలి.*
*మరణించాక చేసేదేమీ లేదు. స్వగ్రామం నుంచి సమీప నగరానికి ఉద్యోగం చేయడానికి వచ్చినట్లుగా, ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించడానికి ఈలోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడటానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంటబెట్టుకుని ఇది మా తోట. ఇది మా తటాకం అని ఆ వనమంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని, తోటమాలిని పని నుంచి తొలగించి వేస్తే, మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతడికి ఉండదు. పుత్రమిత్ర బంధువులంతా సహచరులేకానీ శాశ్వతం కాదనీ ఇల్లూ, వాకిలీ, ఆస్తి అంతస్తులంతా మనం అద్దెకు తీసుకున్నా వసతి సౌకర్యమే కానీ వాటికి మనం సంపూర్ణ యజమానులం కామనీ, వెంటవచ్చేవి కావనీ గుర్తుంచు కోవాలి. ఈ మర్మం తెలియకే మనలో చాలామంది జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నారు. వేదాంతంలో తామరాకు, నీటిబిందువ్ఞల సహచర్యం గురించి అద్భుతంగా వివరిస్తారు.*
*నీటిలోనే పుట్టి పెరిగి, నీటితోనే నిరంతరం సంబంధం కలిగి ఉంటుంది తామరాకు. కానీ ఆ నీటితో మమేకం కాకుండా, తడిసిపోకుండా, నిర్మలంగా తేలియాడుతుంది. అలాగే స్థితప్రజ్ఞుడు, జ్ఞాన యోగి, గుణాతీతుడు అయిన వ్యక్తి కూడా ఈ సంసారంలో ఉంటున్నా దానికి బందీ కాడు. చలించడు. ప్రయత్నం చేస్తే అందరికీ ఈ స్థితి సాధ్యమే. ఆధునిక సమాజంలో తీరికలేని వ్యవహారాలు మనల్ని మరింత అహంకార పూరితుల్ని చేస్తున్నాయి. మనం లేకపోతే ఈ ఇల్లు ఏమైపోతుందో ఈ పిల్లలేమైపోతారో అన్న ఆందోళనలో పడేస్తున్నాయి. ఈ ప్రపంచం స్తంభించి ఈలోకానికి ఏ ఒక్కరి అవసరమూ లేదు.*
*నెయ్యితో నిప్పును ఆర్పడం ఎంత అమాయకత్వమో, కోర్కెలను తీర్చుకోవడం ద్వారా వాటిని సంతృప్తిపరచాలనుకోవడం కూడా అంతే అమాయకత్వం.*
*ఓం శ్రీ గురుభ్యోనమః.*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి