21, మార్చి 2025, శుక్రవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*


*323 వ రోజు*


*సాత్యకి శౌర్యం*


సాత్యకి కృతవర్మను ఎదుర్కొని భల్ల బాణములతో కృతవర్మ వింటిని తుంచి నాలుగు బాణములు వేసి రథాశ్వములను చంపి, ఒక్క అగ్నిబాణముతో సారథిని కొట్టి, ఇంతలో తనకు అడ్డు వచ్చిన త్రిగర్త సైన్యమును నాశనం చేసాడు. రథము విరిగిన కృతవర్మను పాండవ సైన్యం చుట్టుముట్టింది. ఇది చూసిన ద్రోణుడు సాత్యకిని వదిలి పాండవ సైన్యమును ఎదుర్కొన్నాడు. ఇంతలో జలసంధుడు అనే రాజు సాత్యకిని ఎదుర్కొని తన ఏనుగును సాత్యకి మీదకు తోలాడు. సాత్యకి అతడిని అడ్డుకున్నాడు. జస్లసంధుడు సాత్యకి వింటిని విరిచి ఏభై బాణములతో సాత్యకి గుండెలకు గురి చూసి కొట్టాడు. సాత్యకి కోపించి జలసంధుని అరవై బాణములు జలసంధుని శరీరంపై నాటాడు. జలసంధుడు ఒక తోమరంతో సాత్యకిని కొట్టి కత్తితో అతడి విల్లు విరిచాడు. సాత్యకి వెంటనే మరొక విల్లు తీసుకుని ఆలస్యం చేయక జలసంధుని క్రూరమైన బాణముతో చేతులు నరికి, మరొక బాణముతో అతడి తల నరికి మరొక బాణంతో అతడి ఏనుగును తరిమాడు. సాత్యకి పరాక్రమానికి కౌరవసైన్యం భయకంపితం అయింది. ఇది చూసిన ద్రోణుడు కృతవర్మను వ్యూహము వద్ద నిలిపి తాను సాత్యకిని ఎదుర్కొన్నాడు. తనకు ఎదురుగా ద్రోణుడు రావడం చూసాడు సాత్యకి అతడి వెనుక కురుకుమారులైన దుర్మర్షణ, దుర్ముఖ, దుశ్శాసన, దుస్సహ, వికర్ణ, చిత్రసేనాదులు రావడం చూసాడు. ఇంతలో సుయోధనుడు వారితో చేరాడు. వారిని చూసిన ద్రోణుడు సుయోధనుడు తన సహోదరులతో సాత్యకిని ఎదిరించగలడు అనుకుని తిరిగి వ్యూహరక్షణకు వెళ్ళాడు. సాత్యకి కురుకుమారులకు ఒక్కొక్కరికి ఒక్కొకడిలా కనిపిస్తూ వారందరితో ఏక కాలంలో యుద్ధం చేస్తున్నాడు. అలా యుద్ధం చేస్తూ సుయోధనుడి విల్లు విరిచి అతడి శరీరం తూట్లు పడేలా కొట్టాడు. ఇది చూసిన కురుకుమారులు సాత్యకిపై బాణవర్షం కురిపించారు. సాత్యకి వారి అందరిపై ఒక్కొక్కరిపై అయిదేసి బాణము వేసి సుయోధనుడి మీద ఎనిమిది బాణములు వేసి అతడి వింటిని తుంచి, కేతనమును విరిచి, సారథిని కొట్టి, రథాశ్వములను చంపాడు. సుయోధనుడు సాత్యకి పరాక్రమానికి భయపడి పక్కనే ఉన్న చిత్రసేనుడి రథం ఎక్కి పారిపోయాడు.


*సాత్యకి కౌరవ సేనలను ఎదుర్కొనుట*


సుయోధనుడిపై సాత్యకి పైచేయి కావడం చూసిన కౌరవసేన హాహాకారాలు చేసింది. అది చూసి కృతవర్మ అక్కడకు చేరాడు. సాత్యకి కూడా తన రథమును కృతవర్మకు ఎదురుగా నిలిపాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు శరవర్షం కురిపించుకున్నారు. సాత్యకి కృతవర్మ విల్లు విరిచి, సారథిని చంపి మరొక బాణంతో కృతవర్మను మూర్చపోయేలా కొట్టాడు. ఆ దెబ్బకు కృతవర్మ రథంపైన పడ్డాడు. కృతవర్మ మరణించాడని అనుకుని సాత్యకి అర్జునుడి వద్దకు పోవడానికి ఆయత్తమయ్యాడు. కృతవర్మ తేరుకుని తిరిగి యుద్ధానికి వచ్చాడు. ద్రోణుడు కృతవర్మను వ్యూహద్వారము వద్ద నిలిపి తాను సాత్యకిని అడ్డగించడానికి వెళ్ళి మూడు క్రూర బాణములతో సాత్యకి నుదుటన కొట్టాడు. సాత్యకి అందుకు ప్రతిగా ద్రోణుడిపై బాణప్రయోగం చేసాడు. ఇరువురి మధ్య పోరు ఘోరమైంది. ద్రోణుడు ప్రయోగించిన శక్తి ఆయుధం విధి వశమున సాత్యకి రథమును తాకింది. సాత్యకి ద్రోణుడి భుజం మీద బాణమును వేసాడు. ద్రోణుడు సాత్యకి విల్లు తుంచి, సారథిని మూర్ఛిల్లేలా కొట్టాడు. సాత్యకి తానే రథము తోలుతూ యుద్ధము చేస్తున్నాడు. సాత్యకి ద్రోణుని రథసారథిని చంపాడు. సారథి లేని ద్రోణుని రథాన్ని గుర్రములు ఎటో లాక్కెళ్ళి చివరకు వ్యూహద్వారం చేర్చాయి. ద్రోణుని అడ్డు తొలగగానే సాత్యకి తన రథమును అర్జునుడి వైపు నడిపాడు. శరవేగంతో దూసుకుపోతున్న సాత్యకిని సుదర్శనుడు ఎదుర్కొని సాత్యకిపై బాణములు గుప్పించాడు. సాత్యకి ఆ బాణములను తునాతునకలు చేసి సుదర్శనుడి రథాశ్వములను చంపి, సారథిని చంపి చివరకు సుదర్శనుడి తల నరికాడు. సాత్యకి రథసారథితో " మహాసముద్రం వంటి ద్రోణుడిని దాటి వచ్చాను. ఈ పిల్ల కాలువలు ఒక లెక్కా ! " అన్నాడు. " ఆ విషయం నాకు తెలియనిదా ! ఇప్పుడు మనమెవరిని ఎదుర్కోవాలి " అన్నాడు సారథి. సాత్యకి " సారధీ! ఇక్కడ రధములు విరిగి పడి ఉన్నాయి. చనిపోయిన ఏనుగులు, హయములు, సైనికుల శవాలు పడి ఉన్నాయి. వీరిని అర్జునుడే చంపి ఉంటాడు. కనుక రధాన్ని ఈ మార్గంలో పోనిమ్ము అదిగో గాండీవం యొక్క ధనుష్టంకారం వినిపిస్తుంది అటు పోనిమ్ము. ఇంతలో కాంభోజరాజ సైన్యములు సాత్యకిని చుట్టుముట్టాయి. సాత్యకి వారి బాణములను ఎదుర్కొని అందరిని యమసదనముకు పంపాడు. ఆ ప్రాంతం అంతా పీనుగుల పెంట అయింది. వారి మీదనుండి రధము నడుపుతూ సాత్యకి ముందుకు సాగాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: