21, మార్చి 2025, శుక్రవారం

ఉదంకకృత నాగస్తుతి-- నన్నయభట్టారకుడు.

 శు భో ద యం 🙏


ఉదంకకృత నాగస్తుతి-- నన్నయభట్టారకుడు.


              చ: బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణసరస్సరస్వతీ 


                    సహిత మహామహీ భరమజస్ర సహస్ర ఫణాళిఁ దాల్చి దు


                    స్సహతర శీలికిన్ జలధి శాయికిఁ బాయక శయ్యయైన య


                    య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁడయ్యెడిన్!


                     ఇది నన్నయగారి పద్యం .పౌష్యదేవేరి కుండలములను గురుపత్ని కొరకై దెచ్చుటకేగిన యుదంకుడు నాగుల వెన్నంటి పాతాళమున కేగిన సందర్భమున నాగరాజుల యనుగ్రహమును గోరుచు ప్రార్ధన చేయుచు ,ముందుగా ఆదిశేషుని యీపద్యమున ప్రస్తుతించు 

చున్నాడు.


              అర్ధములు:- బహువన- అనేకమైన యడవులు; పాదప--వృక్షములు ; అబ్ధి- సముద్రము లు;కులపర్వత- కులపర్వతములు;

                                  పూర్ణసరస్- నిండుగా నున్నచెఱువులు; సరస్వతీ--నదులు :మొ:వానిచే సహిత--కూడిన; మహామహీభరము--

గొప్పభూభారమును; అజస్ర-- ఎల్లప్పుడు; సహస్ర ఫణాళిన్-- వేయిపడగలపై ; దాల్చి-ధరించి ; దుస్సహతర మూర్తికిన్--భరింపశక్యముగాని యాకారముగల; జలధిశాయికిన్-- ఉదధి శయనుడగు విష్ణుమూర్తికి; పాయక-- విడువని; శయ్యయైన--సెజ్జగామారిన ; దుష్కృతాంతకుడు--దుర్మార్గుల నంతమొందించు; అనంతుడు--ఆదిశేషుడు; మాకు--మాకు;(మమ్ము) ప్రసన్నుఁడయ్యెడిన్--కరుణించుగాక! 


               భావము:- అనేక అరణ్యములతోను , వృక్షములతోను ,సముద్రములతోను ,కులపర్వతములతోను ,( నిండిన) సరస్సులు ,నదులతోను, కూడిన యీభూభారమును నింతరము తనపడగలపై మోయుచు, సకలవిశ్వగర్భుఁడై వెలుగొందుచు మోయ నసాధ్యుడై సాగరశయునుడై యొప్పు ఆశ్రీహరికి విడువని సెయ్యగానమరి ,దుర్మార్గులను మట్టుబెట్టు స్వభావముగల ఆ

ఆదిశేషుఁడు మాపై దయచూపుగాక! అనిభావము.


                విశేషాంశములు:- హృద్యమైన పద్యవిద్య కాద్యుడు నన్నయగారు. ఆయన భారతాంధ్రీకరణ విధానము అనుపమానమైనది. సంస్కృతమున వ్యాస మహామునిచే బహువిస్తారముగా వ్రాయబడిన భారత గ్రంధమును.భావానువాదమొనర్చి యాంధ్రసారస్వతమున కంకురార్పణము ను గావించెను. అక్షర రమ్యత ,ప్రసన్నకథ ,లోనారయుట, ఇతనికవితాగుణములు. పండితులు కధాగమన రీతులను వ్యంగ్యమర్యాదలను జూచి మెచ్చ ,తక్కురు అక్షర రమ్యత నాదరింప రుచిరార్ధ సూక్తి నిధానముగా భారత రచన మొనరించెను. ఈపద్యము అతని పద్యరచనాశిల్పానికి పట్టుగొమ్మ. అక్షరరమ్యత ననుసంధించుచు నన్నయ ప్రదర్శించిన వ్యంగ్య రచనావిధానమిందు మెచ్చదగినది.


                   ఆదిశేషుని ప్రాముఖ్యమును లేదా గొప్పతనమును చెప్పవలెనన్న నతడుచేయుచున్న మహత్తరమైన కార్యములను వెల్ల

డించవలసి యుండును. నన్నయచేసిన దదియే! సర్వభువన ముల తనలో మోయుచున్న శ్రీహరి నీతడు నిరంతరము మోయుట నీ

తడొనరించుకార్యము. దానితో బాటు భూభువన భారమునుగూడ వహించుచుండుటను సూచించు చున్నాడు. అడవులు వృక్షములు,సముద్రములు ,పర్వతములు ,సరస్సులు ,నదులు మొన్నగు వానితోగూడిన విశాల మైనది భూమి. ఆభూభారము నెల్లపుడు తన వేయిపడగలపై మోయుచుండుట.


                       ఇదిగాక దుష్ట శిక్షణమొకటి. కదిలెనా హరికి నిద్రచెడును.పడగలు వాల్చెనా ధరణిదడదడలాడును. ఎంత సహనము,ఎంత శక్తి ,ఎంతటి నేర్పుకావలెను? సందేహమేలేదు .ఇవియన్నియు ఉన్నవాడు అనంతుడే! ననువిషయమును

వ్యంగ్యముగా సూచించుచు, సరస్సరస్వతీ , అజస్రసహస్రఫణాళి ,మహామహీభరము , ఇత్యదిగా ప్రయోగములతో అక్షరరమ్యతను

పోషించుచు ,పద్యమును నడిపించిన నన్నయ బహుధా శ్లాఘనీయుడుగదా!


                                                            స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟🌷🌟🌟🌷🌷

కామెంట్‌లు లేవు: