*తిరుమల సర్వస్వం 184-*
*సప్తగిరులు -3*
అలా వారిరువురికి చాలాసేపు వాదోపవాదాలు జరుగుతుండగా, వారి సంభాషణలను అన్యాపదేశంగా విన్న విష్ణుమూర్తి తన పీఠం నుంచి తరలి ప్రవేశద్వారం వద్దకు వచ్చాడు. దాంతో కక్షిదారులిరువురు శ్రీమహావిష్ణువుకు తమ తమ వాదనలను వినిపించారు. అంతే కాకుండా, వారిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చి చెప్పవలసిందిగా శ్రీహరిని కోరారు.
ముల్లోక వాసులందరికీ ప్రాణాధారమైన తాను గొప్పవాణ్ణని వాయుదేవుడు; భూమండల మంతటినీ తన పడగలపై మోస్తున్నందున తానే గొప్పవాణ్ణని ఆదిశేషుడు ఇలా ఎవరికి వారు తమ గొప్పతనాన్ని శ్రీమహావిష్ణువుకు చెప్పుకున్నారు. శ్రీమన్నారాయణడు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. అదే అదనుగా ఆదిశేషువుకు తన స్థానం ఏమిటో తెలియబరచదలచుకున్నాడు. వారిరువురిని ఉద్దేశించి ఇరువురు తమ తమ స్థానాలలో, కర్తవ్య నిర్వహణలో తిరుగులేని వారేనని; వారిలో ఎవరు అధికులో తేల్చటం అత్యంత కష్టతరమని బోధపరచి, వారిరువురికి ఒక పరీక్ష పెట్టదలచుకున్నట్లుగా చెప్పాడు.
వైకుంఠంలో అల్లంత దూరాన ఉన్న 'ఆనందుడు' అనే పర్వతాన్ని చూపించి ఆదిశేషువు తన పడగలతో ఆ పర్వతాన్ని గట్టిగా చుట్టుకుని ఉండాలని; వాయుదేవుడు శక్తినంతా ఉపయోగించి తన వాయుతాడనంతో, ఆదిశేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నించాలని ఆదేశించాడు. పర్వతం కదిలితే వాయుదేవుడు గెలిచినట్లు, లేకుంటే విజయం ఆదిశేషువుదన్నమాట.
ఆ పందానికి అంగీకరించిన వారిరువురు ఈ పరీక్షకు సన్నద్ధమయ్యారు. అపరిమిత బలశాలి అయిన ఆదిశేషువు ఆనందపర్వతాన్ని చుట్టుకొని, పడగలతో గట్టిగా అదిమి పెట్టి, తన బలానికి తానే మురిసిపోయాడు. వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఏమాత్రం కదిలించలేడన్న ధీమాతో నిశ్చింతగా ఉన్నాడు.
ఆటు వాయుదేవుడు భారమంతా శ్రీమహావిష్ణువు పై వేసి, ఆ దేవదేవుని మనసులోనే స్మరించుకుంటూ, ఒక్క ఉదుటున ఉధృతమైన ప్రభంజనాన్ని సృష్టించాడు.
సాక్షాత్తు శ్రీమన్నారాయణుని మహిమ ముందు, అహంకారంతో విర్రవీగే ఆదిశేషుడి శక్తి ఏపాటిది? చండప్రచండంగా వీచిన వాయువు ధాటికి ఆనందుడు అనబడే ఆ పర్వతం ఆదిశేషువుతో సహా ఎగిరి; కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న, భూలోకం లోని సువర్ణముఖి నదీ తీరాన వచ్చి పడింది.
మరో కథనం ప్రకారం, ఈ పోటీ జరుగుతున్న సమయంలో శ్రీమన్నారాయణుని సంకేతాన్ననుసరించి; నారదమహర్షి వైకుంఠాని కేతెంచి, ద్వారం ముందు నిలిచి, తన వీణతో మృదుమధురమైన నాగస్వరం పలికించాడు. నాగులకు సహజమైన ప్రవృత్తితో ఆ నాగస్వరానికి మైమరచిన ఆదిశేషువు తన పట్టును కొద్దిగా సడలించి, తన్మయత్వంతో నాట్యం చేయసాగాడు. అదే అదనుగా వాయుదేవుడు విజృంభించి, తన ప్రచండమారుతంతో ఆదిశేషువుతో సహా ఆనందపర్వతాన్ని భూలోకంలోకి విసిరి వేశాడు. అలా ఎగరవేయబడ్డ పర్వతం స్వర్ణముఖి నదీతీరం వద్ద ప్రతిష్ఠితమైంది.
తిరుమలకొండపై ఇప్పుడు శ్రీనివాసుడు కొలువుదీరి ఉన్న 'ఆనందనిలయం' ఆ పర్వతం పైనే నెలకొని ఉన్నది.
2 **ఈ సంఘటన జరిగిన తర్వాత, వైకుంఠవాసి అయిన మేరుపర్వతం శ్రీమహావిష్ణువు వద్దకు వచ్చి వైకుంఠం నుండి భూలోకంలోకి వాయుదేవుని ద్వారా విసిరివేయ బడ్డ 'ఆనందుడు' అనే పర్వతం తన తనయుడని; ఆదిశేషునికి వాయుదేవునికీ మధ్య తగాదాలతో ఏమాత్రం సంబంధం లేని తన కుమారుడు, తనకూ వైకుంఠానికి దూరమై, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడని; తాను తన తనయుడు శ్రీహరిని యుగయుగాలుగా భక్తిశ్రద్ధలతో సేవించుకుంటున్నామని, ఎలాగైనా తన తనయుడిని అనుగ్రహించాలని మొరపెట్టుకుంది. మేరుపర్వతం మొరను ఆలకించిన శ్రీమహావిష్ణువు ఇదంతా తన సంకల్పమేనని, ముందు ముందు రాబోయే 28వ కలియుగంలో తాను శ్రీవేంకటేశ్వరునిగా భూలోకంలో అవతరిస్తానని, అప్పుడు తాను మేరుపర్వతం తనయుడైన ఆనందపర్వతం పైనే కొలువై ఉండి, కలియుగాంతం వరకు భక్తులను ఉద్ధరిస్తారని, తద్వారా ఆనందుని జన్మ సార్థకమై అజరామరమైన కీర్తిప్రతిష్ఠలతో వర్ధిల్లుతాడని శెలవిస్తాడు.**
ఆ విధంగా శ్రీనివాసుడు కొలువై ఉన్న శేషాచల పర్వతానికి 'ఆనందపర్వత' మనే మరో పేరు కూడా వచ్చింది. అలాగే, శ్రీనివాసుడు కొలువై ఉండే ఆలయానికి కూడా 'ఆనందనిలయం' అనే సార్థక నామధేయం ఏర్పడింది.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి