☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(82వ రోజు)*
*(క్రితం భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*కృష్ణావతారం*
*వ్రేపల్లె వాసుడు శ్రీకృష్ణుడు*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ఇంకో సంగతి అంటూ మంత్రివర్గం మళ్ళీ కొన్ని మాటలు చెప్పింది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణువు ఉంటాడంటారు. గోవులు, బ్రాహ్మణులు, జపతపాలు, యజ్ఞయాగాలు, వేదపఠనం ఎక్కడ జరుగుతాయో అక్కడ ధర్మం ఉంటుంది కనుక, గోబ్రాహ్మణులను వధించడం, యాజ్ఞయాగాలను ధ్వంసం చేస్తే విష్ణువు బయటపడతారన్నారు. బయటపడితే విష్ణువుని ఇట్టే వధించవచ్చనీ, పగతీర్చుకోవచ్చనీ అన్నారు.*
*మంత్రుల బోధలు కంసునికి నచ్చాయి. వారు చెప్పినట్టుగానే విష్ణువుని వధించి, నిశ్చింతగా ఉండవచ్చనుకున్నాడతను. మంత్రవిద్యలు నేర్చినవారూ, మాయలు పన్నేవారూ, కామరూపులూ, బలాఢ్యులూ, దుర్మార్గులూ, రాక్షసులు ఎందరెందరో కంసుని అనుచరవర్గంలో ఉన్నారు. వారందరినీ కంసుడు ఆజ్ఞాపించాడు. అతడు ఆజ్ఞాపించినట్టుగానే వారంతా చెలరేగిపోయారు. సాధువుల్ని హింసించసాగారు.*
*గోబ్రాహ్మణులను వధించసాగారు. యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తూ, తాపసులను చిత్రహింసల పాల్జేశారు. స్త్రీలను చెరబట్టారు. విష్ణువుకి నిలయాలయిన పుణ్యస్థలాలను అపవిత్రం చేసి, ఆనందించసాగారు. కామరూపులయిన రాక్షసులు కోరుకున్న రూపంలో పల్లెల్లో, నగరాల్లో కనిపించిన బాలలందరినీ చంపడం మొదలుపెట్టారు. తల్లడిల్లిపోయారు తల్లులు. పిల్లలను కనడమే మహాపాపమయినట్టుగా రోదించారు. బాలలు బ్రతకడం కష్టం. వారి బ్రతుకు క్షణక్షణం ఓ గండం అయిపోయింది.*
*ఒకనాడు కంసుడికి కప్పం కట్టేందుకు నందగోపుడు మధురానగరానికి వచ్చాడు. కంసుడికి సామంతుడతను. ఏటేటా కంసునికి కప్పం కట్టాలి. కప్పం సొమ్మును మూటగా కట్టి మధురానగరానికి బయల్దేరుతూ, వ్రేపల్లెను జాగ్రతగా చూసుకోమని గోపాలురకు హెచ్చరించి వచ్చాడతను. కంసుణ్ణి దర్శించాడు. కప్పం చెల్లించి, కానుకలు కూడా సమర్పించాడతనికి.*
*వసుదేవునికి నందగోపుడు బంధువు. వసుదేవుని భార్య రోహిణీ, ఆమె కుమారుడు బలరాముడూ, ఇంకొందరు బంధువులూ అతని రక్షణలో వ్రేపల్లెలో ఉన్నారు. వారి క్షేమసమాచారాలు తెలుసుకునేందుకు నందుణ్ణి చూడవచ్చాడు వసుదేవుడు*.
*వసుదేవుణ్ణి చూస్తూనే గట్టిగా అతన్ని కౌగిలించుకున్నాడు నందుడు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. చాలా కాలానికి పుత్రసంతానం కలిగినందుకు నందుణ్ణి అభినందించాడు వసుదేవుడు. ఆ అభినందనలకు పొంగిపోలేదు నందుడు, దేవకీ వసుదేవులు కంసుని చెరలో హింసలపాలయినందుకు బాధపడ్డాడతను. కన్నీరు పెట్టుకున్నాడు. నందుడు అలా కన్నీరు పెట్టుకుంటుంటే అతన్ని గమనించక, ఏటో చూస్తూ ఆందోళనగా ఒక్కసారిగా లేచి నిల్చున్నాడు వసుదేవుడు. ఏమయిందేమయింది అన్నట్టుగా నందుడు కూడా లేచి నిల్చున్నాడు. భయాందోళనలతో వణికిపోతున్న వసుదేవుణ్ణి ఆశ్చర్యంగా చూడసాగాడు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి